BigTV English

AP Politics: వైసీపీ నేతలకు భయం.. భయం..

AP Politics: వైసీపీ నేతలకు భయం.. భయం..

AP Politics: అధికారంలో ఉన్నంత కాలం శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ సీనియర్ నేతలు ఒక వెలుగు వెలిగారు. కీలక పదవులు చేపట్టి తమ మాటకు ఎదురు లేకుండా చెలాయించారు. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి ప్రస్తుతం విచారణలు జరుగుతుండటంతో ఆ సీనియర్ నేతలను ఇపుడు పోలీస్ కేసులు వెంటాడుతున్నాయి. వరుస కేసులతో ఆ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారంట. దాంతో బయటకు వచ్చి మాట్లాడాలంటేనే భయపడిపోతున్నారంట. ఇంతకీ ఆ నేతలెవరు? వారిపై ఉన్న అభియోగాలేంటి?


శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలకు కేసు భయం

2024 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలు తర్వాత అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది. అప్పటి వరకు మంత్రులు, ఇతర కీలక పదవుల్లో చలామణి అయిన నేతలంతా మాజీలయ్యారు. పార్టీ ఓటమిపాలైంది, నేతల పదవులు పోయాయి. ఇక చేసేది లేక ఎలాగోలా నెట్టికొద్దాం అనుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఆ నేతలకి కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయంట. జిల్లా వైసీపీలో సీనియర్ లీడర్స్‌గా ఉన్న ఆ నేతలకు ఇపుడు కేసులు భయంపట్టుకుందంట. ఒకదాని తర్వాత ఒకటిగా వరుసగా కేసులు నమోదవుతుంటుడటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారంట.


సిదిరి అప్పలరాజుపై 4 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

అలా జిల్లాలో కేసులు వెంటాడుతున్న నాయకుల లిస్టుల్లో టాప్ పొజిషన్ లో ఉన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈయన పై 4 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అందులో ఒక క్రిమినల్ కేసు కూడా ఉంది. వైసీపీ ప్రభుత్వ హయంలో భూ వివాదానికి సంబంధించి పలాస మండల టీడీపి అధ్యక్షుడు కె.లక్ష్మణరావుపై అక్కడి జాతీయ రహదారిపై దాడి జరిగింది. అప్పటి మంత్రి సిదిరి అప్పలరాజు ప్రోద్భలంతో ఇచ్ఛాపురం కి చెందిన వైసిపి నేత అనుచరులే తనపై దాడి చేసినట్లు లక్ష్మణరావు అప్పట్లో ఆరోపించారు.

అప్పట్లో తూతూ మంత్రంగా కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రత్యర్థుల దాడిలో లక్ష్మణరావుకి తీవ్ర గాయాలు కాగా పోలీసులు తూ తూ మంత్రంగా కేసు నమోదు చేశారంటూ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష అప్పట్లో మండిపడ్డారు. దానికి సంబంధించి బాధితుల నుంచి వత్తిడి రావడంతో ఇటీవల సిదిరి అప్పలరాజుపై పోలిసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యాలు చేస్తున్నారని సిదిరిపై కేసు

ఇక పలాసలోని వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్‌పై దాడి చేసి హాస్పిటల్ నేమ్ బోర్డు లోని వైఎస్ఆర్ పేరును తొలగించారంటూ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే సిదిరి అప్పలరాజు మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు. అయితే ఎన్నికల కోడ్‌లో భాగంగా అధికారులే ఆ పేరును తొలగిస్తే.. దానిపై అప్పలరాజు ప్రజల్ని తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు చేపట్టిన ఆందోళనల్లో భాగంగా కాశీబుగ్గ బస్టాండ్ వద్ద అప్పలరాజు ధర్నా చేపట్టారు. అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమం చేపట్టారని ఆయనపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ముందు అప్పలరాజు హడావుడి

ఇటీవల పలాస మండల పౌరహక్కుల నేత ఢిల్లీరావు అనుమానస్పద మృతి కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతుందని మాజీ మంత్రి అప్పలరాజు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత నెలాఖరున మృతుడి భార్యతో కలిసి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి హడావుడి చేశారు. ఆ ధర్నాపైనా పోలిసులు కేసు నమోదు చేశారు. గుంపుగా వచ్చి పోలీసుల విధులకు ఆటంకం కల్పించారంటూ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

తమ్మినేని సీతారాంను వెంటాడుతున్న నకిలీ సర్టిఫికెట్ల కేసు

శాసనసభ మాజీ స్పీకర్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడు తమ్మినేని సీతారాంను నకిలీ సర్టిఫికెట్ల కేసు వెంటాడుతోంది. తమ్మినేని సీతారాం తెలంగాణలో డిగ్రీ అర్హత ఉన్నవారికి మాత్రమే ప్రవేశార్హత ఉన్న .. లా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోగా తెలంగాణ టీడీపీ నేత నర్శిరెడ్డి దాన్ని గుర్తించి వివాదాన్ని తెర మీదకు తెచ్చారు. ఎన్నికల అఫిడవిట్ లో తన విద్యార్హత ఇంటర్ అని చెప్పిన తమ్మినేని డిగ్రీ అర్హత కలిగిన లా కోర్సు ప్రవేశం ఎలా పొందుతారని ప్రశ్నించారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో లా కోర్సులో ప్రవేశం పొందారని ఆరోపించారు.

తమ్మినేనిపై ఫిర్యాదు చేసిన కూన రవికూమార్

దాంతో గత వైసిపి ప్రభుత్వ హయాంలోనే ఆమదాలవలస ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే కూన రవికుమార్ తమ్మినేని డిగ్రీ నకిలీ సర్టిఫికెట్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం వచ్చాక కదలిక వచ్చింది. తన ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ దానిపై విచారణ చేపట్టాల్సిందిగా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు కిందటి నెలలోనే ఆదేశాలిచ్చినట్లు కూన రవికుమార్ ఇటీవల మీడియాకు తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై తమ్మినేని సీతారాం మాత్రం నోరు విప్పటం లేదు.

ధర్మాన కృష్ణదాస్‌పై రెండు కేసులు

మాజీ డిప్యూటీ సీఎం, శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పైనా రెండు కేసులు ఉన్నాయి. వైసీపీ పాలనలో చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ద్వారా భారీగా అవినీతికి పాల్పడ్డారని , నిధులను పక్కదారి పట్టించారని మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణ దాస్‌లపై కబడ్డీ మాజీ క్రీడాకారుడు ఆర్డీ ప్రసాద్ గత ఏడాది జూన్ లో ఫిర్యాదు చేశారు. ఆడుదాం ఆంధ్రాపై విచారణ జరిపి , వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దానిపై కేసు నమోదు చేయాలంటూ సీఐడీ అధికారులు ఎన్టీఆర్ జిల్లా సీపీని అప్పట్లోనే ఆదేశించారు.

ధర్మాన కృష్ణదాస్‌పై అమరావతి రైతు ఫిర్యాదు

అదలా ఉంటే…గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని పెదపరిమికి చెందిన కర్నాటి శ్రీనివాసరావు అనే రైతు గత ఏడాది నవంబర్ లో ధర్మాన కృష్ణ దాస్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ పాలనలో డిప్యూటీ సీఎంగా ఉన్న కృష్ణ దాస్ అమరావతి రాజధాని రైతులను పెయిడ్‌ కూలీలని, అమరావతి ఉద్యమాన్ని కించపరుస్తూ రైతుల మనోభావాలు దెబ్బతినేలా అసభ్యకర పదజాలంతో మాట్లాడారని, ఆయనపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ దువ్యాడ శ్రీనుపై వరుస కేసులు

ఇక జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై ఇంటా బయట కేసులే అన్నట్లు తయారైంది పరిస్థితి. దువ్వాడ శ్రీనుకి, అతని భార్య వాణికి మధ్య కుటుంబ వివాదం ఓ వైపు కోర్టులో నడుస్తుండగా..మరోవైపు రాజకీయ వివాదాలు ఆయన్ను పోలీసు కేసుల వరకు తీసుకు వెళ్ళాయి. YCP ప్రభుత్వ హయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చారని టెక్కలి నియోజకవర్గ జనసైనికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: ఎలాన్ మస్క్ సీక్రెట్ ప్లాన్ లీక్.. పిల్లలను కనేందుకు.. ఏం చేశాడో తెలిస్తే..

రాష్ట్రంలోని పలు పోలీస్‌స్టేషన్‌లలో దువ్వాడపై ఫిర్యాదులు

టెక్కలి పోలీసులు గత డిసెంబర్ లో దువ్వాడకి 41 నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. మళ్ళీ తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. ఆ కేసు ఉండగానే ఇటీవల మoడలి సమావేశాల సందర్భంగా పవన్ కళ్యాణ్ కి నెలకు చంద్రబాబు రూ.50 కోట్లు ప్యాకేజీ ఇస్తున్నారని దువ్వాడ తీవ్ర ఆరోపణలు చేశారు. దానిపై మండిపడ్డ జనసైనికులు శ్రీకాకుళం జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్ లలో దువ్వాడ పై ఫిర్యాదులు చేసారు.

వైసీపీతో సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్న ధర్మాన ప్రసాదరావు

ఇలా శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు వరుస కేసులతో ఎప్పుడేం జరుగుతుందా అని ఆందోళన చెందుతున్నారంట. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యి జైళ్ళు చుట్టూ తిరుగుతుండటంతో… తమ వంతు ఎప్పుడు వస్తుందో అని సీనియర్ నేతలు బెంబేలెత్తుతున్నారంట. అయితే ఈ కేసులన్నీ రాజకీయ కక్షతోనే అక్రమంగా తమపై పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమపై పెట్టే కేసులకు తరువాత మళ్ళీ తమ ప్రభుత్వం వచ్చాక తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అటు పోలీసులను, ఇటు టీడీపీ నేతలను మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుహెచ్చరిస్తున్నారు.

అయితే జిల్లాలోని పలువురు నాయకులు అనువుగాని చోట అధికులమనరాదు అన్న సూత్రాన్ని ఫాలో అయిపోతూ మౌన వ్రతం పాటిస్తున్నారు. అందులో భాగంగానే మాజీ మంత్రి ,సీనియర్ నేత అయిన ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండే పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వైసీపీకి, తనకి ఏ సంబంధం లేదు అన్నట్టుగా ధర్మాన వ్యవహరిస్తుండటం ఆ పార్టీ వర్గాలనే షాక్‌కు గురిచేస్తోందంట.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×