Super El Nino: ప్రపంచవ్యాప్తంగా.. వాతావరణ శాస్త్రవేత్తలను కలవరపెడుతున్న అతిపెద్ద సవానల్ ఇది. ఈ ఏడాది.. సూపర్ ఎల్ నినో సంభవించే అవకాశం ఉందనే హెచ్చరికలు.. భారత్ ఎదుర్కోబోయే సవాళ్లపై గుబులు పుట్టిస్తున్నాయ్. వాతావరణ విలయం ముంచుకొస్తోందా? అనే అంచనాలు.. టెన్షన్ పెంచుతున్నాయ్. ప్రకృతి ప్రకోపిస్తే.. మానవ మనుగడ ఎంతలా అతలాకుతలం అవుతుందో చూస్తూనే ఉన్నాం. అయితే, ఎల్‌నినో అనేది కేవలం ఓ సాధారణ వాతావరణ మార్పు కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను, వ్యవసాయాన్ని చిన్నాభిన్నం చేయగల శక్తిమంతమైన సహజ ప్రక్రియ. ఈ ఏడాది రాబోయేది సాధారణ ఎల్‌నినో కాదు, సూపర్ ఎల్‌నినో అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది భూగ్రహం అత్యంత శక్తిమంతమైన ఎల్‌నినో దశలోకి ప్రవేశించొచ్చనే అంచనాలు దడ పుట్టిస్తున్నాయ్. ఇటీవలి దశాబ్దాల్లో.. ఇదే అత్యంత శక్తిమంతమైనదని చెబుతున్నారు. వచ్చే జూన్ నుంచే ఈ దశ ప్రారంభం కావొచ్చంటున్నారు.
రాబోయే, ఎల్‌నినో ప్రభావం భారత్‌పై ఎక్కువగా ఉండబోతోందనే అంచనాలున్నాయ్. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం, వర్షపాతం తగ్గిపోవడం జరుగుతుంది. భారత్‌లో వేసవి తర్వాత వచ్చే రుతుపవనాలు.. ఎక్కువగా భూమి, సముద్రం మధ్య ఉండే ఉష్ణోగ్రతల మార్పులపై ఆధారపడి ఉంటాయి. ఈసారి రాబోయే సూపర్ ఎల్‌నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారొచ్చని, ఉష్ణోగ్రతలు భారీగా పెరగొచ్చని, రుతుపవనాలు అసాధారణంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ముందుగా, ఎల్‌నినో, లానినో అంటే ఏమిటో తెలిస్తే.. సూపర్ ఎల్‌నినో తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు.. అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్‌నినో అంటారు. ఇది జరిగినప్పుడు.. సముద్రంపై గాలి దిశలు మారి, ప్రపంచవ్యాప్తంగా వర్షపాత గమనాన్ని మారుస్తాయి.
ఎల్నినో సమయంలో.. ప్రపంచవ్యాప్తంగా వర్షపాతంలో మార్పులు వస్తాయ్. భారతదేశం సహా దక్షిణ, ఆగ్నేయాసియా ప్రాంతాలు తరచుగా కరువు లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయ్. ఫలితంగా.. భారత్ అంతటా వర్షపాతం తగ్గిపోతుంది. ఇది తరచుగా వడగాలులు, తక్కువ వ్యవసాయ ఉత్పత్తి, అధిక ఆహార ధరలు, మౌలిక సదుపాయాలపై ఒత్తిడికి దారితీస్తుంది. భారతదేశంపై దీని ఆర్థిక ప్రభావం చాలావరకు ప్రతికూలంగా ఉంటుంది. ఇది ప్రజల జీవనోపాధితో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 1950 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితులు.. 26 సార్లు నమోదయ్యాయ్. వీటిలో ప్రతి ఒక్కటి.. ఖండాలవారీగా వాతావరణ సరళిని మార్చేసింది.
ఇక.. లా నినా సాధారణంగా ఆసియా-పసిఫిక్‌లో అధిక వర్షపాతాన్ని కురిపిస్తుంది, దీనివల్ల సాధారణం కంటే ఎక్కువ రుతుపవనాలు, వరదలు సంభవిస్తాయి. 2025లో ఇండియాలో ఇవే పరిస్థితులు కొనసాగాయ్. ఎల్‍నినో వాతావరణాన్ని పొడిగా మార్చగా, లా నినా తేమను పెంచుతుంది. దీనివల్ల తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయ్. అదే, సూపర్ ఎల్‌నినో అంటే, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే, రెండు డిగ్రీల నుంచి రెండున్నర డిగ్రీల కంటే ఎక్కువ పెరిగితే, దానిని సూపర్ ఎల్‌నినోగా పరిగణిస్తారు. దీనివల్ల.. ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడితే, అమెరికా లాంటి దేశాల్లో భారీ వరదలు ముంచెత్తుతాయ్.
సూపర్ ఎల్‌నినో ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చకు వస్తోంది. ఎందుకంటే, భారత్ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. మన దేశ జీడీపీలో మెజారిటీ భాగం రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. సూపర్ ఎల్‌నినో వస్తే, భారత్ ఎదుర్కోబోయే సమస్యలు చాలానే ఉన్నాయ్. నైరుతి రుతుపవనాలు బలహీనపడటమే కాదు, వేసవి కాలం ముగిసినా.. ఉష్ణోగ్రతలు అస్సలు తగ్గవు. వచ్చే మే, జూన్ నెల్లలో.. ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల నుంచి 50 డిగ్రీల దాకా చేరే ప్రమాదం ఉంది. వర్షాలు తగ్గిపోవడం వల్ల.. జలశయాల్లో నీటి మట్టాలు తగ్గిపోతాయ్. ఇది తాగునీటికే కాకుండా, జలవిద్యుత్ ఉత్పత్తిపైనా దెబ్బకొడుతుంది. మరీ ముఖ్యంగా వ్యవసాయం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు దెబ్బతింటుంది. దిగుబడి తగ్గడం వల్ల ఆహార వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయ్. అందువల్ల.. రాబోయే సూపర్ ఎల్‌నినోతో భారతదేశానికి ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయ్.
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో నెలకొన్న ఉద్రిక్తతలు.. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా భారతదేశాన్ని కలవరపెడుతున్నాయ్. ఇంధన ధరల పెరుగుదల సరఫరా గొలుసులో ఆటంకాలు మనల్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో.. వాతావరణ మార్పులు కూడా తోడైతే.. మనం తట్టుకోగలమా? అనే ఆందోళనను రేకెత్తిస్తోంది. యుద్ధం వల్ల వచ్చే సంక్షోభం తాత్కాలికమే. కానీ, వాతావరణం ఒక్కసారిగా మారిపోతే వచ్చే విపత్తు శాశ్వత నష్టాన్ని మిగులుస్తుంది. గ్లోబల్ క్లైమేట్ మారిపోతే.. మనమంతా భీకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. యుద్ధం వల్ల దిగుమతులు ఆగిపోతే, వాతావరణ మార్పుల వల్ల అసలు ఉత్పత్తియే ఆగిపోతుంది.
భారత్ లాంటి వ్యవసాయాధారిత దేశాల్లో రుతుపవనాలే ప్రాణాధారం. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వర్షపాతంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు వస్తాయ్. అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు నాశనమై ఆహార కొరత ఏర్పడుతుంది. మితిమీరిన వేడి వల్ల భూమిలోని తేమ ఆవిరైపోతుంది. సాగు భూములు ఎడారులుగా మారతాయ్. గ్లోబల్ వార్మింగ్ వల్ల ధ్రువ ప్రాంతాల్లోని మంచు కరగడం ఇప్పటికే మొదలైంది. సముద్ర మట్టాల పెరుగుదలతో.. తీర ప్రాంత నగరాలు కూడా ప్రమాదం అంచునే ఉన్నాయ్. ఇక, ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటితే మానవ శరీరం అస్సలు తట్టుకోలేదు. అందువల్ల, ప్రకృతి ప్రకోపిస్తే దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. రాబోయే సూపర్ ఎల్ నినో వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చారిత్రక గణాంకాల ప్రకారం.. ఇలాంటి 15 సంవత్సరాల్లో.. 11 సంవత్సరాలు వ్యవసాయ రంగంలో క్షీణతకు దారితీశాయ్. వర్షపాతం దాదాపు 10 శాతం, ఆహార ధాన్యాల ఉత్పత్తి దాదాపు 6 శాతం తగ్గింది.
ఎల్ నినో ప్రపంచ వస్తు మార్కెట్లను పునర్నిర్మిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరువు ఆహార, ఇంధన ధరలను పెంచుతుండగా, ఇంకొన్ని ప్రాంతాల్లో.. వర్షపాతం పంటలకు ఊతమిస్తుంది. అయితే, ఈ పరిస్థితులను భారత్ తట్టుకోగలదా? అనేదే బిగ్ క్వశ్చన్. గతంతో పోలిస్తే ఇప్పుడు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, సూపర్ ఎల్‌నినో స్థాయి విపత్తును తట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. ప్రస్తుతం మన దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయ్. అయితే, భూగర్భ జలాలు అడుగంటితే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. సూపర్ ఎల్‌నినో అనేది కేవలం ప్రకృతి సిద్ధమైనదే కాదు, మాన ప్రేరిత గ్లోబల్ వార్మింగ్ వల్ల దీని తీవ్రత పెరుగుతోంది. మనం ఎంత త్వరగా కర్బన ఉద్గారాలను తగ్గిస్తే, భవిష్యత్తులో ఇలాంటి విపత్తుల తీవ్రతను తగ్గించగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇప్పటికైనా పునరుత్పాదక ఇంధనాల వైపు వేగంగా అడుగులు వేయాలనే సూచనలు వినిపిస్తున్నాయ్. అడవులను రక్షించుకోవడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించుకోవాలి. లేకపోతే, రాబోయే కాలం.. కేవలం సంక్షోభాల కాలంగానే కాకుండా, మనుగడ కోసం పోరాడాల్సిన విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఏడాది రాబోయే సూపర్ ఎల్‌నినో అనేది ఓ హెచ్చరిక మాత్రమే. ఇది కేవలం రైతుల సమస్యే కాదు, సామాన్యుడి జేబుపై, దేశ భద్రతపై ప్రభావం చూపే అంశం. ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టి, అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే తప్ప.. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కలేమనే వాదనలు వినిపిస్తున్నాయ్.
Also Read: హిస్టరీ రిపీట్స్.. ఇరాన్ విషయంలో ట్రంప్ చేస్తున్న పొరపాటు కెన్నెడీ నాటిదేనా?
Story by: Anup, Big Tv