E-Paper
Advertisement

అమెరికాలో భారతీయుల శకం ముగిసిందా? టెకీలను వెంటాడుతున్న కొత్త భయాలు!

అమెరికాలో భారతీయుల శకం ముగిసిందా? టెకీలను వెంటాడుతున్న కొత్త భయాలు!

Indian Techies: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక తెలుగు జంట ముందు ఓ అమెరికన్ కారు ఆపి, వారిపై తీవ్రమైన జాత్యహంకార, వివక్ష పూరిత వ్యాఖ్యలు చేశాడు. మీరు ఇండియా నుంచేనా అని అడిగాడు. ఇండియాలోనే ఉండొచ్చుగా? అమెరికాకు ఎందుకు రావాలని ప్రశ్నించాడు. మీరు ఇక్కడ ఉండడం మాకు ఇష్టం లేదు. వెంటనే మా దేశం విడిచి వెళ్లిపోండి అని కోపంగా అన్నాడు. ఆ అమెరికన్ వ్యక్తి అంతలా రెచ్చిపోయి, బూతులు తిడుతున్నప్పటికీ మనోళ్లు ఏమాత్రం సహనం కోల్పోలేదు. వారు అతనితో వాదనకు దిగకుండా, ప్రశాంతంగా, హుందాగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారు. సదరు అమెరికన్ ఇండియన్లను కించపరిచే ఉద్దేశంతో ఈ వీడియోను తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే అది కాస్తా అతనికి రివర్స్ అయి అతడి జాత్యహంకార బుద్ధిని బయటపెట్టింది.

అమెరికాలో ఇండియన్స్ టార్గెటా?

ఇది టెక్సాస్ లోనే మరో ఘటన. అమెరికా అతివాద గ్రూప్ కు చెందిన కొందరు.. ఇండియన్ ఫ్లాగ్ ను చించే ప్రయత్నం చేశారు. ఇవి భారతీయ కమ్యూనిటీపై అమెరికాలో పెరుగుతున్న అసహనానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మన వాళ్లతో పోటీ పడలేక, కీలక రంగాల్లో ఉద్యోగాలు సాధించలేక అక్కడి వాళ్లు మాటల యుద్ధానికి దిగుతున్నారు. వీటికి తోడు ట్రంప్ విధానాలు, ఏఐ తీవ్రత, H1B వీసా ఇష్యూస్ మధ్య మన టెకీలు నలిగిపోతున్నారు. జాబ్ గ్యారెంటీ రోజురోజుకూ తగ్గిపోతోంది కూడా.టెన్షన్లు పెరుగుతున్నాయ్.

అమెరికాలో ఇండియన్ టెకీల ఆవేదన

అమెరికాలో ఉండే ఒక ఇండియన్ టెక్ ఇంజనీర్ గత నెల చివర్లో రెడిట్ లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అయింది. అందులో తాను గత కొన్ని నెలలుగా 1,500కు పైగా ఉద్యోగాలకు అప్లై చేసుకున్నా ఒక్క కాల్ లెటర్ కూడా రాలేదని ఆ యూజర్ రాసుకొచ్చాడు. గత మూడేళ్లుగా హెచ్-1బీ వీసాపై ఉన్న ఆ డేటా ఇంజనీర్ కు ప్రస్తుత కంపెనీ దరఖాస్తును పునరుద్ధరించకూడదని నిర్ణయించింది. ఈ పోస్ట్ తర్వాత చాలా మంది ఇండియన్ టెకీలు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అక్కడ మనోళ్ల పరిస్థితి ఎలా ఉందో ఇవి కళ్లకు కట్టాయి.

H-1Bలో ఇండియన్లదే హవా!

అమెరికా ప్రతి సంవత్సరం బయటి దేశాల ప్రజలకు మూడేళ్ల కాలానికి 85 వేల H-1B వీసాలను జారీ చేస్తుంది. ఇందులో ఎక్కువ శాతం ఇండియన్లకే దక్కాయి. స్కిల్డ్ ఎక్స్ పర్ట్స్ కోసం ఉద్దేశించిన ఈ వర్క్ పర్మిట్ వీసాను, కంపెనీ అనుమతిస్తే మరో మూడేళ్లపాటు పునరుద్ధరించుకోవచ్చు. ఈ ప్రకారం అలాగే వర్క్ చేసుకుంటూ వెళ్తే గ్రీన్ కార్డ్, చివరికి అమెరికా పౌరసత్వం లభిస్తాయి. 2025లో సుమారు 78% H-1B వీసాలు భారతీయులకే దక్కాయి. ఇది 2024తో పోలిస్తే 7 శాతం ఎక్కువ.

Also Read: చిమిర్యాల స్కూల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన విద్యార్థుల రికార్డులు!

టెక్ డ్రీమ్ కష్టాల్లో పడిందా?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ అధిపతి సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, క్లౌడ్ నెట్‌వర్కింగ్ కంపెనీ అరిస్టా నెట్‌వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాస్‌తో సహా అమెరికా టెక్ పరిశ్రమలోని చాలా మంది టాప్ లీడర్స్ ఈ రూట్ లోనే అమెరికాలో కీలక శక్తులుగా మారారు. ఈ టెక్ దిగ్గజాల బాటను ఫాలో అవ్వాలనుకోవడం మన నిపుణుల తప్పు కాదు. కానీ ట్రంప్ ప్రభుత్వ కఠినమైన వలస విధానాలు, టెక్ దిగ్గజాలు ఏఐని ఎక్కువగా వాడడం, కార్పొరేట్ పునర్‌వ్యవస్థీకరణ, బలహీన ఎకానమీతో చాలా మంది యువ, మధ్యస్థాయి ఇంజనీర్లు ఇతర నిపుణులు ఇప్పుడు ఉద్యోగ అనిశ్చితితో ఉన్నారు.

అమెరికన్ డ్రీమ్‌కు గుడ్‌బై..?

ఇప్పటికే వందలాది మంది భారతీయ టెక్ ఇంజనీర్లు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇంకా చాలా మంది డేంజర్ జోన్ లో ఉన్నారు. దీంతో అమెరికాలోని వారి కుటుంబాలకు, భారత్ లో వారిపై ఆధారపడిన వారికి సమస్యలు తప్పట్లేదు. టెక్ కన్సల్టింగ్ సంస్థ అయిన ఎక్స్‌ఫెనో ప్రకారం 2025లో 15 వేల మందికి పైగా భారతీయ టెక్ నిపుణులు అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి రాగా, ఈ ఏడాది ఇప్పటికే 7,300 మంది తిరిగి వచ్చారు. పరిస్థితి మరింత దిగజారుతోందని, అమెరికాలో ఇటీవల జరుగుతున్న హెచ్-1బి వీసా మార్పుల ఫలితంగా, అమెరికాకు వెళ్లే వారితో పోలిస్తే తిరిగి వచ్చేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇండియన్ టెక్ నిపుణులు అమెరికన్ డ్రీమ్‌కు దూరమవుతున్నారన్న టాక్ పెరుగుతోంది.

H-1Bపై ట్రంప్ కఠిన వైఖరి

గతేడాది సెప్టెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్-1బి వీసా ఫీజును 50 రెట్లు పెంచి 1 లక్ష డాలర్లకు చేర్చినట్లు ప్రకటించి టెక్ ప్రపంచాన్ని, లక్షలాది మంది ఇండియన్లను షాక్ కు గురి చేశారు. ఈ వీసా ప్రోగ్రామ్ దుర్వినియోగం కాకుండా ఈ కొత్త ఫీజు అవసరమని చెప్పారు. కొన్ని అమెరికన్ కంపెనీలు తక్కువ వేతనాలు తీసుకునే విదేశీ వర్క్ ఫోర్స్ ను నియమించుకోవడం ద్వారా అమెరికన్ల వేతనాలను తగ్గిస్తున్నాయని ఆయన అన్నారు. అమెరికన్ ఉద్యోగాలను ఇండియన్లు లాక్కుంటున్నారని ఆరోపించే ట్రంప్ MAGA సపోర్టర్స్ లో ఇది కామన్ కంప్లైంట్ గా మారింది. ఈ లక్ష డాలర్ల వీసా ఫీజు, అమెరికా కంపెనీలు విదేశీయులకు బదులుగా అమెరికన్లను నియమించుకునేలా ఒత్తిడి చేస్తుందన్నది ట్రంప్ ప్లాన్. అది ఇప్పుడు క్రమంగా వర్కవుట్ అవుతున్నట్లే కనిపిస్తోంది.

Also Read: తెలంగాణ కొత్త పవర్ సెంటర్.. ఇకపై పాలనంతా అక్కడి నుంచే.. సీఎం మెగా స్కెచ్!

ట్రంప్ చూడనిది ఇదేనా?

ఈ భారీ పెంపు కొన్ని కంపెనీలకు స్థానికంగా నియామకాలు చేపట్టడానికి సహాయపడవచ్చు. అయితే ఇండియన్ టెకీలను వారి స్కిల్స్ ఆధారంగానే కంపెనీలు హైర్ చేసుకుంటున్నాయన్నది నిజం. ఇది కాస్తా అమెరికన్లలో అసూయ, ఈర్ష్యను సృష్టించింది. నిజానికి ప్రతి H1B వీసాపై వచ్చే ఇండియన్ టెకీ.. కంపెనీ ఎదుగుదలకు, ఆ తర్వాత మరిన్ని ఉద్యోగావకాశాలను పెంచడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడుతున్నారని అమెరికాలోని లాభాపేక్షలేని సంస్థ ఐజెడ్ఏ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లేబర్ ఎకనామిక్స్ 2024లో జరిపిన ఒక స్టడీలో గుర్తించింది. సో లాభం తప్ప నష్టం లేదు. ఈ విషయాన్ని ట్రంప్ గుర్తించడం లేదు. ఇప్పుడు అమెరికన్లలో కనిపిస్తున్న ఆవేశాలను మాత్రమే పట్టించుకుంటున్నారు

ట్రంప్ విధానాల ప్రభావమా?

అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం 2025లో హెచ్-1బి వీసా అప్లికేషన్లు 7% పెరిగినప్పటికీ, ఆమోదాలు దాదాపు 18% తగ్గాయి. ఈ సంవత్సరం అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ వీసా కేటగిరీ కోసం ఇప్పటివరకు 2,86,000 దరఖాస్తులను స్వీకరించింది. 2025లో ఈ సంఖ్య 4,56,725గా ఉండేది. హెచ్-1బి వీసా ఫీజును భారీగా పెంచాలన్న ట్రంప్ నిర్ణయం ప్రభావం చూపుతోందనడానికి తగ్గిన అప్లికేషన్లు నిదర్శనం. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీలు, ఇప్పటికే హెచ్-1బి వీసా ఉన్నవారి కంటే ఫీజు చెల్లించే అవసరం లేని కేటగిరీలలో ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సో ఇది యువ భారతీయ టెక్ ఇంజనీర్లకు చేదు వార్తే.

టెక్ కంపెనీల్లో భారీ లేఆఫ్స్..

చాలా మంది మధ్య స్థాయి ఇండియన్ ఎక్స్ పర్ట్ ఫ్యూచర్ అయోమయంలో పడింది. AI వాడకం పెరగడం, ఈ సంస్థలలో జరుగుతున్న రీ స్ట్రక్చర్ తో టెక్ పరిశ్రమలో ఉద్యోగాలు వేగంగా పోతున్నాయ్. ఇప్పటిదాకా 160కి పైగా టెక్నాలజీ కంపెనీలు కనీసం 1,16,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ అయిన మెటా, తన ఉద్యోగులలో 10 శాతాన్ని, అంటే సుమారు 8 వేల మందిని తొలగించింది. మెటా లాగే, కాయిన్‌బేస్ బ్లాక్ కూడా ఇటీవలి వారాల్లో తమ సిబ్బందిలో 10% మందిని తొలగించాయి. సోషల్ మీడియా యాప్ స్నాప్‌చాట్‌ తన సిబ్బందిలో 16% మందిని తొలగించింది. సిస్కో ఒరాకిల్ కూడా వేలాది ఉద్యోగాలను తగ్గించాయి. మైక్రోసాఫ్ట్ యునైటెడ్ స్టేట్స్‌లోని తన ఉద్యోగులలో సుమారు 7% మందికి ముందస్తుగా రిటైర్ చేసింది. గత ఐదేళ్లలో అత్యధిక H-1B వీసాలను పొందిన అమెజాన్ 30 వేల మంది ఉద్యోగులను లేఆఫ్ చేసింది.

H-1B ఉద్యోగులకు పెను సవాలు

ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది అమెరికన్లే అన్నది నిజమే అయినా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అమెరికా జనంతో పోలిస్తే ఇప్పటికే నెగెటివిటీ ఎదుర్కొంటున్న మన వాళ్లకు ఇది పెద్దగా ఊరటనివ్వదు. అమెరికాలోనే కొనసాగాలంటే ఒక హెచ్-1బీ ఉద్యోగి 60 రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోవాలి. అమెరికా ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం, H-1B వీసాపై ఉన్న ఉద్యోగి ఉద్యోగం కోల్పోతే, కేవలం 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే దొరుకుతుంది. ఈ 60 రోజుల గడువు ఇండియన్ నిపుణులకు ఒక లీగల్ ట్రాప్ లాగా మారింది. వేలాది కంపెనీలు ఒకేసారి ఉద్యోగులను తీసివేస్తుండటంతో, అంత తక్కువ టైంలో కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవడం అసాధ్యంగా మారుతోంది. చాలా మంది సమయం పొడిగించుకోవడానికి B-2 టూరిస్ట్ వీసాకు మారుతున్నప్పటికీ, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇప్పుడు ఈ అప్లికేషన్లను కూడా చాలా కఠినంగా పరిశీలిస్తున్నారు. సో ఇవన్నీ టెన్షన్లే.

అమెరికాలో భారతీయుల ఆవేదన

ఇటీవలి లేఆఫ్ ల తర్వాత కొత్త ఉద్యోగాలు అందుబాటులో లేకపోవడం అమెరికాలో మనోళ్లకు మరింత కష్టంగా మారింది. ఉద్యోగాలు లేకపోతే అమెరికన్లకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంది. కానీ మన వాళ్ల పరిస్థితి అలా కాదు. తమ రంగంలో ఉద్యోగం దొరికే వరకు ఎదురుచూస్తూ, తమ కుటుంబాలను పోషించుకోవడానికి మనోళ్లు చాలా తక్కువ జీతాలున్న పనులు చేయాల్సి వస్తోంది.

టెక్ కంపెనీల కొత్త వ్యూహం

అమెరికాలోని చాలా టెక్ కంపెనీలు ఇప్పుడు ఓ మాట అంటున్నాయ్. AI కోసం నిధులు సమకూర్చుకునేందుకు ఉద్యోగుల్లో కోత విధిస్తున్నామంటున్నారు. ఏఐ ఇన్ ఫ్రాపై కంపెనీ కేటాయిస్తున్న బడ్జెట్ ను బ్యాలెన్స్ చేయడానికే లేఆఫ్ లు అని మెటా తెలిపింది. ఈ సంవత్సరం, ప్రధానంగా ఏఐ డేటా సెంటర్లను నిర్మించడం, చిప్ ల అభివృద్ధికి కంపెనీ 145 బిలియన్ డాలర్ల వరకు మూలధన వ్యయం చేయాలని యోచిస్తోంది. కంప్యూటర్లను ఉపయోగించేలా తన ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇవ్వడంలో సహాయపడటానికి, మెటా ఉద్యోగుల కీస్ట్రోక్‌లను మౌస్ క్లిక్‌లను ట్రాక్ చేస్తోంది. ఈ విధంగా, ఉద్యోగులు తమ అవసరాన్ని తామే తొలగించుకోవడానికి ఏఐని రెడీ చేస్తున్నారన్న మాట.

Also Read: సీఎం ఫ్యూచర్ కే దిక్కులేదు.. ఫ్యూచర్ సిటీ కడతావా? ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

AI పేరుతో టెక్ కంపెనీల గేమ్?

మెటా, బ్లాక్ సహా ఇతర టెక్ సంస్థలు కేవలం ఖర్చులను తగ్గించుకుని, లాభాలను పెంచుకోవడం కోసం, కోవిడ్ టైంలో నియమించుకున్న ఉద్యోగులను తొలగించడానికి ఏఐని ఒక సాకుగా వాడుకుంటున్నాయని కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఏఐకి చోటు కల్పించడం కోసం ఉద్యోగాలను తగ్గించడం ఒక సాకు మాత్రమే అని అంటున్నారు. ఇంటర్నెట్ సేవలను అందించే క్లౌడ్‌ఫ్లేర్ 30% కంటే ఎక్కువ వృద్ధి సాధించినప్పటికీ, ఇటీవల తన ఉద్యోగులలో 20% మందిని తొలగించింది. వ్యాపారం మారుతోంది కాబట్టే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ అంటోంది. సో ఈ పరిణామాలతో చాలా మంది ఇండియన్ టెక్ ఇంజనీర్లు AI సేవలను అందించడానికి ట్రైనప్ అవుతున్నారు. స్కిల్స్ అప్ గ్రేడ్ చేసుకుంటున్నారు.

అమెరికా విద్యా కలకు బ్రేకులు..

అమెరికా విశ్వవిద్యాలయాలకు భారత విద్యార్థుల రాక మొదటి నుంచీ ఉంది. 2024-25లో కూడా, దాదాపు 31% మంది విద్యార్థులు ఇండియాకు చెందినవారే, చైనా రెండో స్థానంలో ఉంది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి మారవచ్చు. అంతర్జాతీయ విద్యా రంగానికి సంబంధించిన మార్కెట్ డేటాను సేకరించే ICEF మానిటర్ ప్రకారం, గత సంవత్సరం 60% తక్కువ మంది భారతీయులకు F-1 విద్యార్థి వీసాలు మంజూరయ్యాయి.

USA చదివినా జాబ్ గ్యారెంటీ లేదా?

ఆఫ్రికన్లు, పాకిస్తానీలు బంగ్లాదేశీయులకు వీసా తిరస్కరణలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ తాజా లెక్కలు కూడా ఇండియన్లకు నిరాశ కలిగించేవే. సో అమెరికన్ వర్శిటీల్లో చదువుకోవడానికి వీసాలు పొందిన వారికి కూడా ఉద్యోగావకాశాలు అంత హోప్ ఫుల్ గా లేవు. ట్రంప్ ప్రభుత్వం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ -OPT కార్యక్రమాన్ని పరిమితం చేయడానికి లేదా రద్దు చేయడానికి ఆలోచిస్తోంది. హెచ్-1బి వీసా పొందడానికి, మంచి జీతం ఉన్న ఉద్యోగం సంపాదించి అమెరికాలో స్థిరపడటానికి ఎన్నో ఏళ్లుగా చాలా మంది భారతీయ యువత ఈ మార్గాన్నే అనుసరిస్తున్నారు.

ఇండియన్ స్టూడెంట్లకు మరో షాక్!

టెక్ దిగ్గజాలు, ఇతర కంపెనీలు విదేశీ విద్యార్థులను పని అనుభవం కోసం నియమించుకుంటున్నాయి. ఆ ఎక్స్ పీరియన్స్ ను ఉపయోగించి వారు ఈ ప్రోగ్రామ్ కింద తమ వర్క్ పర్మిట్ల కోసం అప్లై చేసుకుంటున్నారు. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం, విదేశీ విద్యార్థులను గరిష్టంగా నాలుగేళ్లపాటు మాత్రమే దేశంలో ఉండేందుకు అనుమతిస్తారు. దీనివల్ల అమెరికా విదేశీ విద్యార్థుల ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయ్.

Also Read: ఢిల్లీలో హైడ్రామా.. ఎయిర్‌పోర్టులోనే ‘సీజేపీ’ అధినేత అరెస్ట్? రంగంలోకి పారామిలటరీ!

H-1Bపై మరో ఎదురుదెబ్బ

అన్ని విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ఏజెన్సీలు కొత్త H-1B వీసా అప్లికేషన్ల ప్రాసెసింగ్‌ను నిలిపివేయాలని జనవరిలో టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఆదేశించారు. ట్యాక్స్ పేయర్ల నిధులతో నడిచే సంస్థలలో విదేశీ వర్కర్లు ఉండటానికి ఎలాంటి కారణం కనిపించడం లేదన్నారు. కాలిఫోర్నియా తర్వాత అమెరికాలో రెండో అతిపెద్ద H-1B వర్కర్స్ జనాభా టెక్సాస్‌లోనే ఉండడంతో అమెరికాలోని భారతీయ టెక్ కమ్యూనిటీకి ఇది షాక్ గా మారింది. వీటికి తోడు తాజాగా హెచ్‌-1బీ వీసాలకు సంబంధించి అమెరికా కాంగ్రెస్‌ ముందుకు ఓ కీలక ముసాయిదా బిల్లు వచ్చింది.

గ్రీన్ కార్డ్ డ్రీమ్‌కు బ్రేక్ పడుతుందా?

గ్రీన్‌ కార్డు పొందేందుకు హెచ్‌1బీ వీసాను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ.. దీనికి గుడ్ బై చెప్పాలని కోరుతూ ఓ రిపబ్లికన్ నేత బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికన్‌ వైట్‌-కాలర్‌ వర్కర్‌ జాబ్స్‌ పేరుతో ఈ డ్రాఫ్ట్ బిల్లును తీసుకొచ్చారు. విదేశీ విద్యార్థులు పట్టభద్రులైన తర్వాత పరిమిత కాలం పాటు అమెరికాలో పనిచేసేందుకు అనుమతించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్ ను కూడా రద్దు చేయాలని ఇందులో కోరారు. తక్కువ జీతాలకు వచ్చే విదేశీ వర్కర్లను తీసుకుని నిపుణులైన అమెరికన్లను పక్కన పెడుతున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. అటు ఈ బిల్లుకు యూఎస్‌ టెక్‌ వర్కర్స్‌, ఇమిగ్రేషన్‌ అకౌంటబిలిటీ ప్రాజెక్ట్‌, ఫెడరేషన్‌ ఫర్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్ రిఫార్మ్‌ మద్దతు తెలిపాయి.

ఇండియన్ టెకీలకు మరో పెద్ద షాక్!

అటు ట్రంప్ ప్రభుత్వం H1B వీసా హోల్డర్లకు గ్రీన్ కార్డ్‌లను పొందడాన్ని మరింత కష్టతరం చేస్తోంది. ఈ వీసాల వల్ల ఎక్కువ బెనిఫిట్ ఇండియన్లకే కావడంతో అది మనోళ్లపైనే తీవ్ర ప్రభావం చూపుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన 3,50,120 గ్రీన్ కార్డ్‌లలో, కేవలం 15,460 మాత్రమే ఇండియన్లకు దక్కాయి. దీంతో వారు చైనా తర్వాత ఐదో స్థానంలో నిలిచారు. అమెరికా ప్రభుత్వ లెక్కల ప్రకారం 18 లక్షల గ్రీన్ కార్డ్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ వెయిటింగ్ లిస్టులో 60% కంటే ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. సో పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో భారతీయుల మాదిరిగానే, చాలా మంది చైనీస్ టెక్ నిపుణులు కూడా స్వదేశానికి తిరిగి వెళ్తున్నారు. వారిలో కొందరిని వారి టెక్నాలజీ కంపెనీలు నియమించుకున్నాయి.

టెకీలకు ఎటు చూసినా టెన్షనే!

చైనాతో పోలిస్తే భారత్ లో ఐటీ ఇండస్ట్రీ సందిగ్ధంలో ఉంది. ట్రంప్ సుంకాలు, ఇరాన్‌తో యుద్ధం కూడా ఈ ఐటీ ఇండస్ట్రీని తీవ్రంగా దెబ్బతీశాయి. అయినప్పటికీ, గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి అమెరికా టెక్ దిగ్గజాల నుండి కొంత ఆశ ఉంది. ఈ సంస్థలు ఇటీవలి నెలల్లో భారతదేశంలో పెట్టుబడులను పెంచాయి. కానీ, అమెరికా నుండి తిరిగి వస్తున్న పెద్ద సంఖ్యలోని టెక్ నిపుణులను అవి చేర్చుకోలేవు. సో చాలా రకాల సమస్యలతో ఎంతో మంది విసిగిపోయి రివర్స్ మైగ్రేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు.

Also Read: కాలేశ్వరం వద్దు.. సిద్ధేశ్వరం ముద్దు.. సీమ ప్రాజెక్టులపై మాధవ్ క్లారిటీ

Story by: Anup, Big Tv

Related News

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Ameenpur Lake: డేంజర్ బెల్స్.. మాయమైపోతున్న అమీన్‌పూ‌ర్ పెద్ద చెరువు..?

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

Big Stories

×