E-Paper
Advertisement

Flex Fuel: ఇక పెట్రోల్‌కు బై బై చెప్పె రోజులొచ్చాయ్.. మార్కెట్లోకి హీరో ఫ్లెక్స్ బైకులు, మారుతీ కారు..!

Flex Fuel: ఇక పెట్రోల్‌కు బై బై చెప్పె రోజులొచ్చాయ్.. మార్కెట్లోకి హీరో ఫ్లెక్స్ బైకులు, మారుతీ కారు..!

Flex Fuel: భారత ఆటోమొబైల్ రంగంలో కొత్త రెవల్యూషన్ మొదలైంది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాల తర్వాత.. ఇప్పుడు అందరి ఫోకస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వైపు మళ్లింది. భారత మార్కెట్‌లోకి హీరో మోటోకార్ప్ తన పాపులర్ బైకులైన స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్లని రిలీజ్ చేసింది. అదేవిధంగా మారుతీ సుజుకీ తన వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారుని లాంఛ్ చేసింది. దీంతో దేశంలో సరికొత్త ఇంధన శకం మొదలైంది. దీంతో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక మైలురాయిని దాటింది. చమురు దిగుమతుల్ని తగ్గించడం, ఇంధనాన్ని పొదుపు చేయడం, ఇథనాల్ వినియోగాన్ని పెంచి కాలుష్యాన్ని వీలైనంతగా నివారించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా.. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు మార్కెట్‌లోకి వచ్చేశాయ్. ఇండియాలో మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ వ్యాగన్-ఆర్‌ని మారుతీ సుజుకీ పరిచయం చేసింది. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ సహా హర్‌దీప్ సింగ్ పూరీ ఈ కారుని ఆవిష్కరించారు. ఇక ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని.. హీరో మోటోకార్ప్ రెండు ఫ్లెక్స్ ఫ్యూయెల్ మోడల్ మోటార్ సైకిళ్లను లాంఛ్ చేసింది.

ప్రారంభ ధర..

ఈ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారులో.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో సాధారణ పెట్రోల్‌‌తో పాటు వంద శాతం ఇథనాల్‌నే ఇంధనంగా వాడుకునేలా తీర్చిదిద్దారు. అదేవిధంగా బ్లెండ్ చేసిన E85 ఫ్యూయెల్‌తోనూ నడుస్తుంది. ఇది డిజైన్ పరంగా E20 మోడల్‌ని పోలి ఉంటుంది. ఇందులో అనేక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయ్. మెరుగైన ఫ్యూయల్ డెలివరీ కాంపోనెంట్‌లు, ఇథనాల్‌కు అనుకూలమైన మెటీరియల్స్, అప్‌డేటెడ్ ఇంజిన్ క్యాలిబ్రేషన్ సిస్టమ్ లాంటివి ఉన్నాయి. ఈ కారులోని సరికొత్త ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ పెట్రోల్‌లో ఇథనాల్ పర్సంటేజ్ ఎంత ఉన్నా.. పూర్తిగా ఇథనాల్‌నే ఇంధనంగా వాడినా అందుకనుగుణంగా ఇంజిన్ పనితీరుని సొంతంగా మార్చుకుంటుందని కంపెనీ తెలిపింది. దీని ధర ఎనిమిదిన్నర లక్షల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ భారత్ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని భారీగా తగ్గిస్తుందని కేంద్రం చెబుతోంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రాకతో భారత ఇంధన రంగంలో కొత్త చాప్టర్ మొదలైందని కార్ల కంపెనీలు చెబుతున్నాయ్. అంతేకాదు బ్యాటరీ ఈవీ, హైబ్రిడ్, సీఎన్‌జీ, ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ఆవిష్కరణలకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.

ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్..

భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 85 శాతానికి పైగా ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. దీనికోసం ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఈ పరిస్థితుల్ని పూర్తిగా మార్చేయగలదని చెబుతున్నారు. దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే, ముడి చమురు దిగుమతులు తగ్గి దేశంపై బడ్జెట్ భారం భారీగా తగ్గుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా బిగ్ బూస్ట్ ఇస్తుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో భారత్ మల్టీ ఫ్యూయల్ దేశంగా మారుతుంది. రాబోయే రోజుల్లో ఒకే ఇంధనంపై ఆధారపడకుండా తక్కువ దూర ప్రయాణాలకు ఎలక్ట్రిక్ వాహనాలు, భారీ రవాణాకు డీజిల్, బడ్జెట్ ప్రయాణాలకు సీఎన్‌జీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను ఉపయోగించే మిశ్రమ ఇంధన వ్యవస్థగా అవతరించబోతోంది. ఇందుకు తగ్గట్లుగానే దేశవ్యాప్తంగా ఇథనాల్‌ బంకుల నెట్‌వర్క్‌ విస్తరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. తొలి దశలో ఢిల్లీ, పుణె, ముంబై, నాగ్‌పూర్ లాంటి నగరాల్లో.. 50 నుంచి వంద ఇథనాల్ స్టేషన్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ నెట్‌వర్క్‌ని 500 స్టేషన్లకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 చివరికి దేశవ్యాప్తంగా 5 వేల ఇథనాల్ బంకులను అందుబాటులోకి తీసుకురావాలనే ప్లాన్‌తో ఉన్నారు.

Also Read: వేసవిలో పెరుగుతున్న అగ్నిప్రమాదాల సంఖ్య.. ఇంట్లో ఫైర్ సేఫ్టీ కోసం ఇవి తప్పనిసరి

ఇదో విప్లవాత్మక అడుగు..

దేశంలో కొత్తగా వచ్చే వాహనాల్లో సగం ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌కు మారితే, దేశీయంగా 312 కోట్ల లీటర్ల అదనపు ఇథనాల్ డిమాండ్ ఏర్పడుతుంది. దీనివల్ల రైతులకు అదనంగా 12 వేల కోట్లకు పైగా అదనపు ఆదాయం లభిస్తుందని కేంద్రమంత్రులు చెబుతున్నారు. ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ని కలుపుతున్నారు. దీనివల్ల.. ఇప్పటివరకు 302 మెట్రిక్ టన్నుల ముడిచమురు దిగుమతులు తగ్గి లక్షా 84 వేల కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది. ఇంకా ముడిచమురు దిగుమతులపై ఆధారపడటం మంచిది కాదని, ఇథనాల్ లాంటి స్వచ్ఛమైన, చౌకైన ఇంధన వ్యవస్థలను అభివృద్ధి చేయడమే ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు ఏకైక మార్గమని కేంద్రం బలంగా నమ్ముతోంది. సాధారణ పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే.. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గుతుంది. ఇంధనం ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. భారతదేశ ఆటోమొబైల్స్ రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఎంట్రీ ఓ విప్లవాత్మక అడుగుగా కనిపిస్తోంది. ఇది కేవలం వాహనాల ఇంధనాన్ని మార్చడమే కాదు. దేశ ఆర్థిక భద్రతను, పర్యావరణాన్ని, రైతుల జీవితాలను మార్చే ఓ అద్భుతమైన వ్యూహం. భారతదేశ ఇంధన భవిష్యత్తు ఇప్పుడు స్వచ్ఛంగా మారబోతోందనడానికి ఫ్లెక్స్ ఫ్యూయల్ బిగ్ ఎగ్జాంపుల్.

లీటరుకు ఏడు రూపాయలు..

ఫ్లెక్స్ ఫ్యూయల్ వల్ల కలిగే మేలేంటో తెలుసుకునే ముందు.. ఇండియాలో ఇంధన అవసరాలు, క్రూడ్ ఆయిల్ కోసం మనం పడుతున్న పాట్లు ఎలా ఉన్నాయో బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కొంతకాలంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో.. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయ్. దాంతో దేశీయంగా చమురు కంపెనీలన్నీ ఆ భారాన్ని భరించలేక పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోతున్నాయ్. గత నెలలో దశలవారీగా రేట్లు పెంచడంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఏడు రూపాయలపైనే పెరిగాయ్. మన దేశం ప్రధానంగా క్రూడ్ ఆయిల్ దిగుమతులపైనే ఆధారపడుతున్నందు వల్ల.. ఇలా రేట్లు పెంచాల్సి వస్తోంది. అందుకోసమే చమురు వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో కేంద్రం చర్యలు ప్రారంభించింది. ప్రధాని నరేంద్రమోడీనే ఇంధన వినియోగం తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ ఆదా చేయాలని, వీలైనంత వరకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దీనిని బట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే ఫ్లెక్స్ ఫ్యూయల్, ఇథనాల్ గురించి ఇప్పుడింత చర్చ జరుగుతోంది. ఈ టెక్నాలజీ.. ఇండియా ఇంధన అవసరాలను ఎలా తీర్చగలుగుతుందో అందరికీ ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది.

20 శాతం ఇథనాల్..

ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ అంటే.. ఒకే వాహనంలో ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనాలను, మిశ్రమాలను ఉపయోగించి నడపగలికే టెక్నాలజీ. సాధారణంగా ఇది.. పెట్రోల్, ఇథనాల్ మిశ్రమాన్ని సూచిస్తుంది. వాహనాల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లతోనే.. ఇది సాధ్యమవుతుంది. ఈ అధునాతన ఇంజిన్లు వంద శాతం పెట్రోల్‌తోనైనా, వంద శాతం ఇథనాల్‌తోనైనా నడుస్తాయ్. పెట్రోల్, ఇథనాల్‌ను ఏ నిష్పత్తిలో బ్లెండ్ చేసినా.. ఇంజన్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయి ఇంజిన్ తీసుకోగలుగుతుంది. ఇంజిన్‌లో ఉండే ప్రత్యేక సెన్సార్ ఇంధనంలో ఇథనాల్ ఎంతుందో గుర్తించి.. దానికి తగ్గట్లుగా ఫ్యూయల్ సప్లైని కంట్రోల్ చేస్తుంది. మన దేశంలో ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలుపుతున్నారు. కానీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు 20 శాతం నుంచి 85 శాతం, వంద శాతం స్వచ్ఛమైన ఇథనాల్‌తోనూ నడవగలవు.

Also Read: హ్యుందాయ్ కార్లపై భారీ ఆఫర్లు.. క్రెటాపై ఏకంగా రూ.1 లక్ష డిస్కౌంట్!

రైతులకు మేలు..

ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో పాటు ఇథనాల్ గురించి తెలుసుకోవాలి. ఇదొక రకమైన బయో ఫ్యూయల్. దీనిని చెరకు రసం, మొక్కజొన్న, పాడైపోయిన ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారుచేస్తారు. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ మండలం వల్ల కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ లాంటి హానికరమైన వాయువులు.. చాలా తక్కువగా విడుదలవుతాయ్. ఫలితంగా కాలుష్యం తగ్గి.. పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. పెట్రోల్ ధరలతో పోలిస్తే.. ఇథనాల్ రేటు తక్కువగా ఉంటుంది. కాబట్టి వాహనదారులకు ఇంధన ఖర్చు తగ్గుతుంది. ఇథనాల్‌ని పంట వ్యర్థాలు, చెరకు నుంచి తయారుచేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. అప్పుడు అన్నదాతలు.. ఇంధన ప్రదాతలుగానూ మారిపోతారు. ఇప్పటికీ భారత్ తన అవసరాల కోసం ఇతర దేశాల నుంచి ముడిచమురుని భారీగా దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా ఇథనాల్ వాడకం పెరిగితే, విదేశాలపై ఆధారపడటం తగ్గి.. దేశ ఆర్థిక భారం తగ్గుతుంది.

పెట్రోల్ వాడకం తగ్గముకం..

పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. లీటర్ ఇథనాల్‌తో వచ్చే మైలేజ్, లీటర్ పెట్రోల్‌తో వచ్చే మైలేజ్ కంటే కొంత తక్కువగా ఉంటుంది. అయితే, ఇథనాల్ రేటు తక్కువగా ఉండటం వల్ల వినియోగదారుడికి పెద్దగా నష్టం జరగదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇథనాల్ బంకులు తక్కువగా ఉన్నాయ్. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5 వేల ఇథనాల్ బంకులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ, ఈవీలు, సీఎన్‌జీ వాహనాల వాడకం చూస్తుంటే.. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గిపోతుందనిపిస్తుంది. కానీ, భారత్ లాంటి దేశంలో.. ఇది రాత్రికి రాత్రి సాధ్యం కాదు. ఇంకొన్నేళ్ల పాటు పెట్రోల్, డీజిల్ వాహనాలు మార్కెట్‌లో ఉంటాయ్. కాకపోతే, రాను రాను స్వచ్ఛమైన పెట్రోల్ వాడకం తగ్గిపోయి అది పూర్తిగా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌గా మారుతుంది.

ఇథనాల్ కలపడం వల్ల..

పెట్రోల్‌లో ఇథనాల్ కలిపితే రేట్లు తగ్గాలి కదా! మరి ఎందుకు తగ్గలేదు? ఇథనాల్ ఇష్యూ వస్తే కామన్ మ్యాన్‌కు వస్తున్న కామన్ డౌట్ ఇది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలుపుతున్నా సామాన్యుడి జేబుకు మాత్రం చిల్లు పడుతూనే ఉంది. ఇంధన ధరల ఈ విషయంలో సామాన్యుడికి అస్సలు ఊరట దక్కడం లేదు. ఇందుకు అంతర్జాతీయ స్థాయి కారణాలున్నాయ్. ఎస్ మిడిల్ ఈస్ట్ సంక్షోభం, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో పెట్రోల్, డీజిల్ రేట్లు అస్సలు తగ్గడం లేదు. ఇథనాల్ కలిపినా ఇందులో ఎలాంటి మార్పు ఉండట్లేదు. పైగా పెట్రోల్ అసలు ధర కంటే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ లాంటి పన్నులే చాలాఎక్కువ. ఇథనాల్ కలపడం వల్ల చమురు సంస్థలకు లీటరుకు కొన్ని రూపాయలు ఆదా అవుతున్నా, ఆ ప్రయోజనాన్ని ప్రభుత్వాలు పన్నుల రూపంలో సర్దుబాటు చేస్తున్నాయే తప్ప వినియోగదారుడికి బదిలీ చేయడం లేదు. గతంలో చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచకుండా నష్టాలను భరించాయ్. ఇప్పుడు ఇథనాల్ వల్ల వస్తున్న లాభాలను ఆ పాత నష్టాలను పూడ్చుకునేందుకు వాడుకుంటున్నాయ్. అందుకే ఈ20, ఈ30, ఈ85, ఈ100 ఇంధనాల ధరలపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్య‌ర్‌..జ‌ట్టులోకి వైభవ్ సూర్య‌వంశీ

స్వచ్ఛమైన ఇథనాల్‌తో..

ప్రస్తుతం ఉన్న బైకులు, కార్లు గరిష్ఠంగా 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ని మాత్రమే తట్టుకోగలవు. అంతకంటే ఎక్కువ కలిపితే ఇంజిన్లు పాడైపోతాయ్. కానీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికిల్స్ అలా కాదు. వీటిని ప్రత్యేక టెక్నాలజీతో తయారుచేశారు. ఇవి 20 శాతం నుంచి మొదలుపెడితే వంద శాతం వరకు స్వచ్ఛమైన ఇథనాల్‌తోనూ నడవగలవు. ఈ దిశగా పడిన అడుగుల్లో భాగంగానే హీరో కంపెనీ నుంచి రెండు బైకులు, మారుతీ సుజుకీ నుంచి ఓ కారు వచ్చాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం మార్కెట్‌లోకి రాబోయే ఇథనాల్ రేట్లు సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం పెట్రోల్ రేటు 115 దాటింది. అదే వంద శాతం ఇథనాల్ లీటరు 80 నుంచి 90 రూపాయల మధ్య ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మైలేజీ తక్కువ..

ఇథనాల్‌ కొనుగోలు ఖర్చు సగటున లీటరుకు 72 రూపాయలు పడుతోంది. ప్రభుత్వం అత్యాశకు పోయి సుంకాల పేరిట అదనంగా బాదకపోతే ఇథనాల్‌ని 80 రూపాయలు కూడా విక్రయించడం సాధ్యమేనని చెబుతున్నారు. ఇథనాల్‌తో నడిచే వాహనాల మైలేజీ తక్కువగా ఉంటుంది. ఈ వెహికిల్స్ రేట్లు కూడా మామూలు వాహనాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. ధర ఎక్కువ, మైలేజీ తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు వినియోగించే ఇంధనం ధరలను వీలైనంత తక్కువగా ఉంచితేనే ప్రజలకు ప్రయోజనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. పైగా ఇథనాల్ పూర్తిగా మన దేశంలోనే తయారవుతుంది కాబట్టి, అంతర్జాతీయ యుద్ధాలతో గానీ, డాలర్ హెచ్చుతగ్గులతో గాని దీని ధరకు సంబంధం ఉండదు. కాబట్టి రేట్లు స్థిరంగా ఉంటాయని చెబుతున్నారు.

పెట్రోల్ కంటే తక్రువ ధర..

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రాకతో భారతదేశానికి ఆర్థిక, పర్యావరణ, వ్యూహాత్మక రంగాలలో విప్లవాత్మకమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే, ముడి చమురు కోసం ఏటా లక్షల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది భారత్. అయితే, దేశీయంగా దొరికే వంద శాతం ఇథనాల్‌తో నడిచే ఫ్లైక్స్ వాహనాల వాడకం పెరిగితే ఈ దిగుమతుల భారం గణనీయంగా తగ్గి, దేశ సంపద దేశం దాటి పోకుండా ఉంటుంది. దీనివల్ల లీటరు ఇంధనం ధర సాధారణ పెట్రోల్ కంటే 15 నుంచి 20 రూపాయల వరకు తక్కువకే లభించే అవకాశం ఉంది. దాంతో వినియోగదారులకు కాస్త ఊరట దక్కుతుంది. అంతేకాదు, ఇథనాల్‌ని వ్యవసాయ ఉత్పత్తుల నుంచే తయారు చేస్తారు కాబట్టి, మన దేశ రైతాంగానికి ఇదొక అదనపు ఆదాయ వనరుగా మారి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది. పర్యావరణ పరంగా చూస్తే, పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ నుంచి వచ్చే హానికర ఉద్గారాలు 40 నుంచి 50 శాతం తక్కువగా విడుదలవుతాయ్. ఇది నగరాల్లో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి, అంతర్జాతీయ వేదికలపై భారత్ పెట్టుకున్న నెట్-జీరో కార్బన్ లక్ష్యాలను చేరుకోవడానికి అద్భుతంగా దోహదపడుతుంది. ముడిచమురు కోసం అరబ్ దేశాలపై ఆధారపడే అవసరం నుంచి భారత్‌కు విముక్తి కలిగించి స్వయం సమృద్ధిని సాధించడంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ అత్యంత కీలకమైన మైల్ స్టోన్ కాబోతోంది.

Storey By : Appa Rao Big Tv

Also read: క‌విత నిల‌దీత‌ల ప‌ర్వం..! అధికార పార్టీతో స‌హా, బీఆరెస్‌, బీజేపీపైనా ఆరోప‌ణాల అస్త్రం..! ఎవ‌రెలా స్పందించ‌నున్నారు?

Related News

Youth Movement: బొద్దింకలు ఎప్పటికీ చావవు.. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దద్దరిల్లిన స్లోగన్స్!

అమెరికాలో భారతీయుల శకం ముగిసిందా? టెకీలను వెంటాడుతున్న కొత్త భయాలు!

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Ameenpur Lake: డేంజర్ బెల్స్.. మాయమైపోతున్న అమీన్‌పూ‌ర్ పెద్ద చెరువు..?

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

Big Stories

×