Supreme Court: ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా.. పార్టీలు ఉచిత పథకాలను అనౌన్స్ చేయడం ఇప్పుడు కామన్‌గా మారింది. మీరు ఇంట్లో ఖాళీగా కూర్చొండి… డబ్బు మీ చెంతకే వస్తుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి కొన్ని పార్టీలు. కొన్ని అనడం కంటే.. అన్ని పార్టీలు ఇదే రూల్‌ను ఫాలో అవుతున్నాయని చెప్పవచ్చు. సరిగ్గా ఇదే పాయింట్‌ను రేయిజ్ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. తమిళనాడుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిపే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది (Supreme Court) సుప్రీంకోర్టు. ఆర్థిక స్థోమత ఉందా? లేదా? అనేది కూడా చూడకుండా.. అడిగిన వారికి.. అడగని వారికి.. కనీస విచక్షణ లేకుండా ఇలా పథకాల పేరుతో డబ్బులను పంచుకుంటూ పోతే.. దేశాభివృద్ధి జరిగేది ఎలా? అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.
సరిగ్గా ఎన్నికల ముందే కొత్త ఉచిత పథకాలను ప్రకటించి.. ప్రజల అకౌంట్స్‌లోకి నేరుగా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయడాన్ని ఏమనాలి.. ఇలా చేస్తే ప్రజలు పనులు చేస్తారా? అని సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అసలు ఈ కల్చర్‌ని ఎందుకు మనం ప్రోత్సహిస్తున్నాం.. విద్యుత్ బిల్లులు, లోన్స్ చెల్లించే సామర్థ్యం ఉన్నవారికి.. లేని వారికి మధ్య తేడాలను గుర్తిస్తున్నారా? అవసరమైన వారికి ఇవ్వడంలో తప్పు లేదు కానీ.. అవసరం లేని వారికి కూడా ఇవ్వడాన్ని ఎలా చూడాలి..? సర్ ప్లస్ స్టేట్ అయినా కూడా ఆ డబ్బును డెవలప్‌మెంట్ కోసం, రోడ్లు, హాస్పిటల్, స్కూల్స్‌ను డెవలప్‌చేయడానికి ఖర్చు చేయవద్దు కదా.. దానికి బదులు ఉచితంగా తిండి, బట్టలు పంచితే ఎలా? అంటూ నిలదీసింది.
ప్రజలను నేరుగా సంపాదించుకునే మార్గాన్ని సూచించాలి.. వారి గౌరవాన్ని కాపాడుకునేలా ఉపాధి కల్పించే మార్గాలను చూడాలి.. అంతేకాని ఉచిత ఆహారం, ఉచిత గ్యాస్, ఉచిత విద్యుత్ ఇస్తూ.. నేరుగా అకౌంట్స్‌లోకి డబ్బులు వేస్తే.. ఇక పని చేయాల్సిన అవసరం ఏం ఉంటుంది.. ఇది భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడం కాదా? అనేది సుప్రీంకోర్టు ప్రశ్న. నిజానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలను గమనిస్తే.. ఇక్కడ మనకు కొన్ని విషయాలు క్లియర్‌కట్‌గా అర్థమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఎక్కడా ఉచిత పథకాలను పూర్తిగా వ్యతిరేకించడం లేదు. కానీ ఆ పథకాల అమలులో ఉన్న లోపాలను మాత్రం ప్రశ్నిస్తోంది. నిజానికి చాలా రాష్ట్రాల బడ్జెట్‌లను పరిశీలిస్తే.. ఈ ఉచితాల కోసం భారీగా అప్పులను చేస్తున్నాయి. వాటిని చెల్లించేందుకు కొత్త అప్పులను చేస్తున్నాయి. ఇలా ఓ చైన్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ డిజాస్టర్ వైపు రాష్ట్రాన్ని నడిపిస్తోంది.
Also Read:
నిజానికి సంక్షేమం, ఉచితం మధ్య తేడా చాలా మందికి తెలియడం లేదు. అక్కడే అసలు సమస్య వచ్చింది. పేదలకు రేషన్ ఇవ్వడం.. విద్య, వైద్యం ఉచితంగా అందించడం అనేది రాజ్యాంగ కల్పించిన ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తాయి. ఇవీ కాకుండా.. మిగతావన్ని కూడా ఉచితాల కిందకే వస్తాయి. నిజానికి దీనిని షార్ట్‌కట్ పాలిటిక్స్ అనవచ్చు కూడా. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఇలా సీరియస్ అవ్వడం ఇదే తొలిసారి కాదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా.. ఆ ఎన్నికల ముందు పార్టీలు, ప్రజలను హెచ్చరిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది అత్యున్నత న్యాయస్థానం. కానీ ఏ పార్టీ కూడా వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు అన్నది కఠోర వాస్తవం. పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు.. వాటి అమలుకు అయ్యే ఖర్చుకు సంబంధించి ఎలాంటి లెక్కలు వేసుకోవు. అందలం ఎక్కడానికి.. అధికారాన్ని దక్కించుకోవడానికి అలవి కాని హామీలు ఇస్తూనే ఉంటాయి. వాటిని అమలు చేయడానికి ఖజానాపై… ఇన్‌డైరెక్ట్‌గా ప్రజలపై భారం మోపుతూనే ఉంటాయి.
ప్రస్తుతం భారత్‌లో ఈ ఉచితాల కారణంగా కొన్ని రాష్ట్రాల పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని రాష్ట్రాల అప్పులు వాటి జీడీపీలో 30 నుంచి 40 శాతానికి చేరుకున్నాయి. మార్కెట్‌లోకి నగదు రావడంతో.. వస్తువుల దరలు పెరగడం.. ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడానికి రాయితీలు ఇవ్వలేకపోవడం.. అన్నింటి కంటే ముఖ్యంగా ఇప్పుడు ఉచితాలు ఇవ్వడం కోసం రేపటితరంపై అప్పుల భారం మోపడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. మరి సుప్రీంకోర్టు ఇన్నిసార్లు అభ్యంతరం తెలిపినా.. పార్టీలు పట్టించుకోవడం లేదు సరే. కానీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉందనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. అయితే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలు సంబంధిత పార్టీకి చెందిన విధానపరమైన నిర్ణయాలేనని ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఉచిత పథకం అమలు సాధ్యాసాధ్యాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పట్ల వాటి ప్రభావంపై ఆయా రాష్ట్ర ఓటర్లే నిర్ణయం తీసుకోవాలనేది ఈసీ చెబుతున్న మాట. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా చెప్పింది ఈసీ. ఎన్నికల్లో గెలిచిన పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు తీసుకొనే నిర్ణయాలు, రాష్ట్రాల విధానాలను తాము నియంత్రించలేమని తేల్చి చెప్పింది. అలా చేయాలంటే చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుందని తెలిపింది.
ఓ రకంగా ఈసీ చెప్పింది కూడా నిజమే. రాజకీయ పార్టీల నిర్ణయాలు, విధానాల్లో జోక్యం చేసుకుంటే చట్టాన్ని అతిక్రమించడమే అవుతుంది. అందుకే ప్రజల నిర్ణయమే ఫైనల్ అని తెలిపింది. మరి ఆ ప్రజలు ఉచితాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఇక్కడ సాధారణ ఓటర్లను అవమానించడం, వారి నిర్ణయాలను అనుమానించడం అనేది పక్కన పెడితే.. ఉచితంగా వస్తుంటే వద్దని చెప్పడం ఎందుకు అనేది వారి ఆలోచన. నిజానికి వారిని తప్పు పట్టాల్సిన పరిస్థితి అయితే లేదు. అధికారం కోసం ప్రాకులాడే పార్టీలదే ఇక్కడ అసలు తప్పు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కాదు.. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉచిత పథకాలకు, సబ్సిడీలకు బడ్జెట్‌లో ఉండే కేటాయింపులు ఎంతో తెలుసా? ఆ లెక్కలు చూస్తే మీరు షాక్‌కు గురికాక తప్పదు.
Also Read: Vishnu vinyasam: భారీ ధరలకు విష్ణు విన్యాసం థియేట్రికల్ రైట్స్… సేఫ్ జోన్ లో శ్రీ విష్ణు సినిమా!
సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఒక లక్షా 4 వేల 329 కోట్లు. అంటే అటు ఇటుగా 35 శాతం. ఇందులో ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల కోసమే 56 వేల 84 వేల కోట్లను కేటాయించింది. ఇందులో రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు ఉన్నాయి.ఇక ఏపీ విషయానికి వస్తే.. 2026-27 బడ్జెట్‌ను 3.48 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పొందించారు. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా సూపర్ సిక్స్ హామీల అమలు, సంక్షేమానికి భారీగా కేటాయింపులు చేశారు.
బడ్జెట్‌లో 18 శాతం అప్పులు కట్టడానికి.. 17 శాతం సంక్షేమానికి.. జీతభత్యాలు, పెన్షన్లకే 8 శాతం.. ఈ మూడింటికే 43శాతం నిధులను కేటాయించారు. ఇక మిగిలింది కేవలం 57 శాతం మాతమ్రే. మరి ఈ డబ్బుతో చేయగలిగే అభివృద్ధి ఎంత? అనేది ఇప్పుడు ఓ చిక్కు ప్రశ్న. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉచిత హామీలు ఉన్నాయి. సూపర్ సిక్స్, ఆరు గ్యారంటీల పేరుతో ఉచిత పథకాల వర్షాన్ని కురిపించాయి. దీంతో రాష్ట్రాల అప్పుల ఊబిలోకి తీసుకెళ్తున్నారు. కొన్ని సార్లు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఓపెన్‌గానే కొన్ని విషయాలను చెబుతున్నారు. కొత్తగా అప్పు పుట్టే పరిస్థితులు లేవని.. ఎక్కడికి వెళ్లినా నమ్మడం లేదంటున్నారు. కానీ మళ్లీ అవే ఉచిత పథకాల కోసం వేల కోట్ల ప్రజాధనాన్ని కేటాయించక తప్పని పరిస్థితి ఉంది. ముందు ముందు ఈ అప్పులు భవిష్యత్తరాల వారికి ఓ గుదిబండగా మారడం ఖాయం.
మరి సంక్షేమ పథకాలు నిజంగా వృథానా అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే విద్య, వైద్యం, రోడ్లు వంటి వాటికి ప్రభుత్వం నిధులు కేటాయించాలి. వాటివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పేదలకు విద్య అందుతుంది. అవసరమైన వారికి వైద్యం అందుతుంది. వీటితో ఏ సమస్యా లేదు. కానీ ఓటర్లను అంటే.. కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకొని అమలు చేసే సంక్షేమ పథకాలతోనే అసలు సమస్య. సమాజంతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు నేరుగా లాభం చేకూరుస్తాయి ఈ పథకాలు. ఉచిత పథకాలు ఎక్కువైతే ఎంత ప్రమాదమో.. వెనిజుయెలా పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్న వెనిజుయెలా సంక్షేమ పథకాల పేరిట లెక్కకు మించి ఖర్చు చేసింది. దీంతో దివాళా తీయాల్సిన పరిస్థితి నెలకొంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఒక్కసారి ఒక దేశం కానీ.. రాష్ట్రం కానీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది అంటే.. అక్కడ అస్థిరత, అనిశ్చితి మొదలవుతుంది. అరాచకాలు మొదలవుతాయి. వెనిజుయెలా మాత్రమే కాదు.. గ్రీసు కూడా ఇదే లిస్ట్‌లో ఉంది. మితిమీరిన సంక్షేమ పథకాలు అమలు చేసి ఈ దేశం కూడా దివాలా తీసింది. ఇక పొరుగు దేశం శ్రీలంకది కూడా అదే పరిస్థితి.
నిజమైన సంక్షేమం అంటే కేవలం అర్హతను చూడకుండా డబ్బును పంచిపెట్టడం కాదు. నిజమైన అర్హులను గుర్తించి వారికి అవసరమైన ఆసరా ఇవ్వడం. చేపలను నేరుగా చేతికి అందించడం కాదు.. చేపలను ఎలా పట్టాలో నేర్పించాలి అంటారు మేథావులు. సుప్రీంకోర్టు కూడా అదే చెబుతోంది. సంక్షేమ పథకాలను కేవలం అత్యంత వెనుకబడిన వర్గాలకు, దివ్యాంగులకు, వృద్ధులకు పరిమితం చేసి, మిగిలిన ప్రజాధనాన్ని విద్యా, వైద్యం, పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పనకు వెచ్చించాలని చెబుతోంది. కానీ ఇండియాలో అది సాధ్యమవుతుందా? అధికారం కోసం దేనికైనా రెడీ అనేలా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. చట్టం అనుమతించడకపోవడంతో ఎలక్షన్ కమిషన్ చేతులు కూడా కట్టేసినట్టైంది. ఇప్పటికైనా దీనికి అనుగుణంగా చట్టాలు మారాలి. నిజానికి రాజకీయ పార్టీలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలంటూ 2016 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి 47 ప్రతిపాదనలు చేసింది ఎలక్షన్ కమిషన్. పార్టీల రిజిస్ట్రేషన్, డీ–రిజిస్ట్రేషన్‌ను క్రమబద్ధం చేసేందుకు వీలుగా అవసరమైన ఉత్తర్వులు ఇవ్వాలంటూ కేంద్ర న్యాయ శాఖకు సిఫారసు కూడా చేసింది. కానీ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా చట్టంలో దీనికి అనుగుణంగా మార్పులు చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ఒక జాతీయ విధానాన్ని రూపొందించుకుని, ఓట్ల కోసం ఉచితాలు అనే ధోరణిని పక్కన పెట్టాలి. అప్పుడే భారత దేశానికి అసలైన మంచి రోజులు వచ్చినట్లు లెక్క.
Story by: Anup, Big Tv