Stray Dogs: వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయ్. జనసంచారం ఉన్న ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించాలని గతంలో సుప్రీం ఆదేశాలిచ్చింది. ఈ ఆర్డర్స్ మార్చాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ అభ్యర్థనలను తోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చేందుకు తిరస్కరించింది. పాఠశాలలు, ఆసుపత్రుల లాంటి బహిరంగ ప్రదేశాల నుంచి తరలించిన వీధి కుక్కలను.. తిరిగి మళ్లీ అవే ప్రాంతాల్లో వదిలేయొద్దని స్పష్టం చేసింది.
కుక్కల సంతానోత్పత్తిని నియంత్రించేందుకు, ప్రజలకు భద్రత కల్పించడంపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా.. రేబిస్ సోకిన, విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలకు.. కారుణ్య మరణం కల్పించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఎన్నో వీధి కుక్కలు.. చిన్నారులు, వృద్ధులపై చేసిన దాడుల ఘటనలను మర్చిపోలేమని తెలిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు రాష్ట్రాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది సుప్రీం ధర్మాసనం.
దేశంలో కుక్క కాటు ఘటనలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న క్రమంలో.. ప్రజల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా సర్వోన్నత న్యాయస్థానం గతేడాది కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటిని మరోసారి సమర్థించింది. జనం ఎక్కువగా తిరిగే బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలు సంచరించకుండా చేయాలని స్పష్టం చేసింది. ఆయా సంస్థల ప్రాంగణాల్లోకి చొరబడకుండా కంచెలు నిర్మించాలని తెలిపింది. నిరంతర తనిఖీలు చేపట్టి సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. ఎలాంటి కారణం చేతనైనా మళ్లీ వాటిని పట్టుకున్న చోటే వదిలేయొద్దని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల అమలు కోసం ప్రభుత్వాలకు కొంత గడువు కూడా ఇచ్చింది.
అయితే, సుప్రీం ఆదేశాలను అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టలేకపోయాయ్. అయితే, బహిరంగ ప్రదేశాల్లో బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న వాస్తవాలను న్యాయవ్యవస్థ మర్చిపోవద్దని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, ఎన్నో వీధి కుక్కలు అమాయక చిన్నారులపై దాడి చేశాయ్. వృద్ధులని కూడా కరిచాయ్. చివరికి.. విదేశీ పర్యాటకులు కూడా కుక్క కాట్లకు ప్రభావితులయ్యారు. అందువల్ల.. బలవంతుడే బతుకుతాడనే సిద్ధాంతం నిజమవుతున్నట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో.. దేశంలోని పౌరులందరికీ రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ బాధ్యతని గుర్తుచేసింది. ప్రభుత్వ చర్యలు లేని పక్షంలో పిల్లలను, వృద్ధులను వారి మనుగడ కోసం ఒంటరిగా వదిలేయొద్దని చెప్పింది. ప్రజల ప్రాణాలకు, భద్రతకు రక్షణ కల్పించడం ప్రభుత్వ విధి అని తెలిపింది.
Also Read: నోరు అదుపులో పెట్టుకో అరవింద్.. మాకూ మాట్లాడటం తెలుసు.. అడ్లూరి వార్నింగ్!
దేశవ్యాప్తంగా వీధి కుక్కల కాటు ఘటనలు పెరుగుతున్నాయ్. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో 3 నెలల్లో 1,483 కేసులు నమోదయ్యాయ్. ఉదయ్‌పూర్‌లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1,700కు పైగా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ఈ ఏడాది 2 లక్షల 40 వేల కేసులు నమోదయ్యాయి, వీటిలో మార్చి నెలలోనే 71 వేల కేసులు నమోదవగా.. అందులో 34 మంది చనిపోయారు. ఈ ముప్పు.. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంటి సున్నితమైన ప్రదేశాలకు కూడా పాకింది. అక్కడి టెర్మినల్స్‌లోనూ, రన్‌వేలపైనా వీధి కుక్కలు కనిపించడం, ప్రజా భద్రతా చర్యల్లో తీవ్రమైన వైఫల్యాన్ని బయటపెట్టింది. ప్రభుత్వం ప్రేక్షకుల్లా మిగిలిపోవద్దని తెలిపింది.
పిల్లలు, విదేశీ ప్రయాణికులు, వృద్ధులు కుక్కకాటు ఘటనలకు బాధితులవుతున్న కఠిన వాస్తవ పరిస్థితులను.. కోర్టు మర్చిపోదన్నారు. వీధి కుక్కల సమస్యను కేవలం జంతు సంక్షేమ అంశంగా కాకుండా.. ప్రజల ప్రాణభద్రతకు సంబంధించిన అంశంగానూ పరిగణించాలని సుప్రీం ధర్మాసం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్‌ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రతి జిల్లాలో.. పూర్తి స్థాయి ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ని ఏర్పాటు చేయాలని సూచించింది. అవసరమైతే జనాభాని బట్టి ఏబీసీ సెంటర్లని పెంచాలని చెప్పింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. దేశవ్యాప్తంగా యాంటీ రేబీస్ మందులు అందుబాటులో ఉండేలా రాష్ట్రాలు, కేంద్రం చర్యలు తీసుకోవాలి. కోర్టు ఆదేశాలు అమలులో పనిచేసే మున్సిపల్, రాష్ట్ర అధికారులకు తగిన రక్షణ కల్పించాలని ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. సంబంధిత శాఖల సమన్వయంతో.. సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, పశువైద్య సేవలను పెంచడం, ఆశ్రయ సౌకర్యాలను బలోపేతం చేయడం, టీకా ప్రోగ్రామ్ చేపట్టడంతో సహా సమగ్ర చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఇండియాలో వీధి కుక్కల సమస్య ఇప్పుడు కొత్తగా పుట్టిందేమీ కాదు. కాలనీల్లో నడుచుకుంటూ వెళ్లాలన్నా, రాత్రి పూట బైక్‌పై ప్రయాణించాలన్నా.. భయపడాల్సిన పరిస్థితులున్నాయ్. ఎంతోమంది అమాయక చిన్నారులు, వృద్ధులు వీధి కుక్కల దాడికి గురై.. ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయ్. ఈ క్రమంలో.. సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ధర్మాసనం మాత్రం ఒకే స్టాండ్‌పై ఉంది. మూగజీవాల పట్ల కారుణ్యం ఉండాల్సిందే కానీ, వీధి కుక్కల కంటే ప్రజారోగ్యం, మానవ ప్రాణాల రక్షణే అత్యంత ముఖ్యమని తేల్చేసింది. సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా.. క్షేత్రస్థాయిలో మార్పు కనిపిస్తోందా? రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆదేశాలను అమలు చేయడంలో చొరవ చూపుతున్నాయా? అనేదే ఇప్పుడు మేజర్ పాయింట్.
సుప్రీం ఆదేశాలు వెలువడ్డాక.. కుక్కలను హింసిండం చట్టవిరుద్ధమని, వాటిని చంపడం గానీ, వేరే ప్రాంతాలకు తరలించడం గానీ సమస్యకు పరిష్కారం కాదనే వాదనలు వినిపిస్తున్నాయ్. కానీ, కోర్టు స్పష్టమైన సంకేతాలిచ్చేసింది. మనుషుల ప్రాణాలను పణంగా పెట్టి.. జంతు సంరక్షణ చట్టాలు అమలు చేయలేమని తెలిపింది. ముఖ్యంగా రేబిస్ సోకిన, తీవ్రంగా గాయపడి కోలుకోలేని స్థితిలో ఉన్న, అత్యంత ప్రమాదకరంగా మారిన కుక్కలను చట్టప్రకారం కారుణ్య మరణం ప్రసాదించవచ్చనే నిబంధనలను కోర్టు ప్రస్తావించింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత స్థానిక సంస్థలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.
Also Read: హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ.. ప్రభుత్వానికి సీపీఐ గట్టి హెచ్చరిక
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి పరిశీలిస్తే.. ప్రభుత్వాల వైఖరి నత్తనడకన సాగుతోందనే విషయం ఇట్టే అర్థమవుతుంది. కుక్కల సంతానోత్పత్తి నివారణ కేంద్రాలు చాలా జిల్లాల్లో లేవు. ఉన్నచోట కూడా అరకొర వసతులతో నడుస్తున్నాయ్. కుక్కలకు యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ వేయడానికి, స్టెరిలైజేషన్ చేయడానికి స్థానిక సంస్థలు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించడం లేదు. మరీ ముఖ్యంగా.. మున్సిపల్ శాఖకు, పశుసంవర్ధక శాఖకు, స్వచ్ఛంద సంస్థలకు మధ్య సరైన సమన్వయం లేకుండా పోయింది. ఇక.. జంతు ప్రేమికుల నుంచి వచ్చే ఒత్తిడి, కోర్టు కేసుల భయంతో అధికారులు సైతం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో కుక్క కాటుతో ఎవరైనా మరణించినప్పుడే అధికారులు హడావుడి చేస్తున్నారు. ఇలా.. తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం రావడం లేదు.
సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు యాక్షన్ మోడ్‌లోకి రావాలి. కేవలం చట్టాలు చెబితే సరిపోదు. క్షేత్రస్థాయిలో చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. కుక్కల జనాభాని నియంత్రించడమే ఏకైక శాశ్వత మార్గం. ప్రతి మున్సిపాలిటీలో పారదర్శకంగా, శాస్త్రీయంగా కుక్కలకు ఆపరేషన్లు చేయాలి. వీధి కుక్కలన్నింటికీ రేబిస్ వ్యాక్సిన్ వేయాలి. వీధుల్లోనూ, మాంసాహారం అమ్మే షాపుల దగ్గర వ్యర్థాలను పడేయడం వల్ల.. కుక్కల్లో దూకుడు పెరుగుతుంది.
అందువల్ల.. వ్యర్థాల నిర్వహణని కఠినతరం చేయాలి. పెంపుడు కుక్కలను రోడ్లపై వదిలేసే వారిపై భారీ జరిమానాలు విధించాలి. మూగజీవాల పట్ల క్రూరత్వం ప్రదర్శించకూడదనేది ఎంత ముఖ్యమో.. వీధి కుక్కల దాడిలో ప్రజలు బలికాకూడదనేది అంతకంటే ముఖ్యం. అందువల్ల.. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో అలసత్వాన్ని వీడాలనే సూచనలు వినిపిస్తున్నాయ్. కోర్టు ఆదేశాలను గైడ్‌లైన్‌గా తీసుకుని, బడ్జెట్ కేటాయించి, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తేనే ఈ వీధి కుక్కల సమస్యకు తెరపడుతుంది. అప్పుడే.. జంతువుల హక్కులకు, ప్రజారోగ్యానికి పూర్తి భద్రత లభిస్తుంది.
కుక్క కాట్లు, వాటి దాడుల నుంచి ప్రజలను రక్షించడంలో తమ విధిని నిర్వర్తించడంలో విఫలమైనందుకు.. రాష్ట్రాల అధికారులను ధర్మాసనం తీవ్రంగా విమర్శించింది. కుక్క కాట్ల ముప్పు ఎయిర్‌పోర్టులు, నివాస ప్రాంతాలతో సహా కీలకమైన జన సంచార ప్రదేశాలకు కూడా విస్తరించిందని తెలిపింది. దేశంలో ఇటీవల జరిగిన కుక్కకాటు ఘటనలపై వచ్చిన వార్తా రిపోర్టులను కోట్ చేస్తూ.. ఇలాంటి ఘటనలు రిపీట్ కావడం వెనుక.. తమ ఆదేశాల అమలులో తీవ్రమైన లోపాలున్నాయని కోర్టు చెప్పింది. ఇలాంటి సంఘటనలు పదేపదే జరగడం స్థానిక అధికారుల నిర్లక్ష్యాన్ని, కోర్టు ఆదేశాలని సమర్థవంతంగా అమలు చేయడంలో వారి వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆదేశాలను అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. బాధ్యులపై కోర్టు ధిక్కరణ, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
Also Read: డ్యూటీలో ఉన్న భార్యపై కత్తితో విరుచుకపడ్డ భర్త.. కవాడీగూడలో ఘోరం!
Story by: Anup, Big Tv