Naga Babu Vs SVSN Varma: పిఠాపురం కూటమి పార్టీల్లో ఏం జరుగుతోంది? డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో టీడీపీ పట్టు తప్పుతోందా? అక్కడ సోలో పవర్‌గా ఎదగడానికి జనసేన స్కేచ్ గీస్తోందా? అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి.. పవన్ కోసం టీడీపీ నేత వర్మ 2024 ఎన్నికల్లో తన సీటు త్యాగం చేసారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ సీటు పైన హామీ దక్కింది. అయితే, పది నెలలు పూర్తయినా ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు. ఇక జనసేన సభలో నాగబాబు చేసిన కామెంట్స్ వర్మ మద్దతు దారులు, టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి.. ఆ క్రమంలో తాజాగా ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు పిఠాపురం ఎంట్రీతో వినిపిస్తున్న టాక్ ఏంటి?
వర్మ ఫ్యూచర్ ఏంటి?
వర్మకు ప్రాధాన్యత లేకుండా జనసేన కార్యక్రమాలు
పిఠాపురంలో వర్మకు చెక్ పెడుతున్నారా? నాగబాబు ఎమ్మెల్సీ హోదాలో పిఠాపురంలో ఎంట్రీ ఇచ్చి హడావుడి చేస్తుండటంతో టీడీపీ కేడర్‌లో ఈ సందేహం మొదలైంది. నాగబాబు పిఠాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ప్రాధాన్యత లేకుండా జనసేన నేతలు వ్యవహరిస్తున్న తీరు వర్మ టీడీపీ కేడర్ కు నచ్చటం లేదంట. దీంతో, పార్టీకి అనుకూలంగా కాకుండా జై వర్మ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. నాగబాబు పర్యటన సమయంలో వర్మ మద్దతు దారుల నినాదాలకు కౌంటర్‌గా జనసేన కేడర్ జై జనసేన అంటూ నినాదాలు చేసారు. పిఠాపురం కేంద్రంగా రోజు రోజుకీ ముదురుతున్న ఈ వివాదం ఇప్పుడు రెండు పార్టీల శ్రేణులకు అంతు పట్టకుండా తయారైందంట.
జనసేన ప్లీనరీలో నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల పిఠాపురంలో జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు చేసిన వ్యాఖ్యలతో రెండు పార్టీ శ్రేణుల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటం.. మంత్రిగానూ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించటం టీడీపీ కేడర్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. పిఠాపురంలో పవన్ గెలుపులో వర్మ కీలక పాత్ర పోషించారు.
నాగబాబు వ్యాఖ్యలపై మండి పడుతున్న టీడీపీ శ్రేణులు
ఎన్నికల తరువాత క్రమేణా వర్మ – జనసేన శ్రేణుల మధ్య గ్యాప్ పెరుగుతోంది. స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు ఎవరైనా పవన్ విజయం వెనుక ఉన్నామని భ్రమ పడితే అది వారి ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పైన టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
Also Read: ఆ ఫోటోలు, వీడియోలన్నీ ఫేక్.. హెచ్‌సీయూ వివాదంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే..?
వర్మ చెబితేనే పవన్‌కు ఓటు వేసామంటున్న టీడీపీ క్యాడర్
ఇటీవల పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్‌తో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. వర్మకు ప్రాధాన్యత ఇవ్వకపోవటంపైన నిలదీసిన కార్యకర్తలు.. వర్మ చెబితేనే పవన్‌కు ఓటు వేసామని తేల్చి చెప్పారు. ఆ క్రమంలో వర్మ ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ స్థానికులు కోరుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు రెండు రోజుల పాటు పిఠాపురంలో పర్యటనకు వచ్చారు. నియోజకవర్గం పెత్తనం తన సోదరుడు చేతిలో పెట్టేలా పవన్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.
పిఠాపురం బాధ్యతలు నాగబాబుకి అప్పజెప్తారా?
ఇక నుంచి పిఠాపురం బాధ్యతలు నాగబాబు చూస్తారని జనసేన వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆ సెగ్మెంట్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతన నిర్మాణాలను నాగబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. త్వరలోనే నాగబాబు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నాగబాబు ఎంట్రీతో నియోజకవర్గంలో రెండు పార్టీల కేడర్ మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపించింది. జనసైనికులు పార్టీ నినాదాలతో హోరెత్తిస్తే, టీడీపీ శ్రేణులు వర్మ అనుకూల నినాదాలతో మోత మోగిస్తున్నాయి. ఆ క్రమంలో పిఠాపురం కేంద్రంగా వర్మ లక్ష్యంగా చోటు చేసుకునే రాజకీయంగా పై ఉత్కంఠ కొనసాగుతోంది.