E-Paper
Advertisement

State Elections 2026: మే 4న అసలు సిసలు తీర్పు.. స్టాలిన్ ‘డబుల్ ధమాకా’ కొడతారా? పినరయి ‘హ్యాట్రిక్’ సాధ్యమేనా?

State Elections 2026: మే 4న అసలు సిసలు తీర్పు.. స్టాలిన్ ‘డబుల్ ధమాకా’ కొడతారా? పినరయి ‘హ్యాట్రిక్’ సాధ్యమేనా?
Advertisement

State Elections 2026: భారత్ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. సౌత్‌లో తమిళనాడు, కేరళ.. నార్త్‌లో బెంగాల్, అస్సాం అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయ్. దాంతో.. దేశం మొత్తం ఇంట్రస్టింగ్ పొలిటికల్ డిబేట్ మొదలైంది. అదేమిటంటే.. తమిళనాడులో డీఎంకే డబుల్ ధమాకా సాధ్యమా? కేరళలో.. పినరయి విజయన్ హ్యాట్రిక్ కొడతారా? వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ వరుసగా నాలుగోసారి గెలిచే అవకాశాలున్నాయా? అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయమా? పుదుచ్చేరిలో ఈసారి ఎలాంటి సీన్ కనిపించబోతోంది? అనే అంశాలపై.. రకరకాల అభిప్రాయాలు, వాదనలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. మరి.. ఏ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులున్నాయ్? ఎవరికి గెలుపు అవకాశాలున్నాయ్? గత ఎన్నికల ట్రెండ్ ఎలా సాగిందనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ముందుగా తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే.. అందరి చూపు డీఎంకే, టీవీకే పార్టీలపైనే ఉంది. అధికార డీఎంకే.. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుందా? విజయ్ టీవీకే పార్టీ ఏమైనా మ్యాజిక్ చేస్తుందా? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన పార్టీలపై దృష్టి

గత రెండు ఎన్నికల్లో.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో ఓసారి పరిశీలిస్తే.. ఈసారి పబ్లిక్ మూడ్ ఎలా ఉండబోతోందనే దానిపై కొంత క్లారిటీ వస్తుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో.. ప్రధాన పార్టీలుగా డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, విజయ్ టీవీకే పార్టీ పోటీలో ఉన్నాయ్. 2016 ఎన్నికల్లో డీఎంకే 89 స్థానాల్లో గెలవగా, 2021 ఎన్నికల్లో 133 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ 2016లో 8 స్థానాల్లో విజయం సాధించగా, గత ఎన్నికల్లో 18 స్థానాల్లో గెలుపు జెండా ఎగరేసింది. ఇక.. అన్నాడీఎంకే 2016లో 134 సీట్లలో జయకేతనం ఎగరేయగా, గత ఎన్నికల్లో 66 స్థానాలకే పరిమితమైంది. ఇక.. బీజేపీ 2016 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. గత ఎన్నికల్లో మాత్రం 4 స్థానాల్లో గెలుపు జెండా ఎగరేసింది. ఈసారి.. తమిళనాడు పొలిటికల్ రేసులోకి టీవీకే రావడంతో.. ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. టీవీకే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది? అనే దానిపై తమిళనాడుతో పాటు దేశమంతటా ఆసక్తి నెలకొంది.

మంత్రులపై అవినీతి ఆరోపణలు

Advertisement

తమిళనాడులో డీఎంకే ఫ్రంట్‌కు ఉన్న గెలుపు అవకాశాలను ఓసారి పరిశీలిస్తే.. ప్రభుత్వంపై ప్రజల్లో ఉండే సహజ వ్యతిరేకతను అధిగమించేందుకు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌‌ని తీసుకొచ్చారు. బూత్ లెవెల్‌లో పటిష్టంగా ఉన్న డీఎండీకే లాంటి పార్టీలను కూడా ఇందులోకి తీసుకోవడం.. సానుకూల అంశంగా కనిపిస్తోంది. ఇక, ప్రజా సంక్షేమ పథకాలు, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేయడం లాంటివి స్టాలిన్ సర్కార్‌కు బిగ్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. మహిళలు, విద్యార్థులు, గిగ్ వర్కర్లు.. ఇలా అన్ని వర్గాలకు ఎంతో కొంత మేలు చేశారనే టాక్ ఉంది. అదనంగా.. మైనార్టీల నుంచి కూడా సపోర్ట్ దొరుకుతుందనే చర్చ ఉంది. అయితే, కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉండటం, ప్రజల్లో కొంత సహజ వ్యతిరేకత కనిపిస్తుండటం, సీట్ల పంపకాల విషయంలో కూటమిలో కనిపిస్తున్న లోపాలు.. డీఎంకేకు కొంత మైనస్‌గా మారే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే, విజయ్ టీవీకే పార్టీ ఎంట్రీ.. డీఎంకేకు కలిసొస్తుందంటున్నారు. యాంటీ డీఎంకే ఓట్లని విజయ్ చీల్చగలరనే చర్చ జరుగుతోంది. అయితే, యువ ఓటర్లు, జెన్ జీ ఓటర్లని తమవైపు తిప్పుకోవడమే ఇప్పుడు సవాల్‌గా మారనుంది. సీనియర్ నేతలపై ఈడీ విచారణ.. ప్రచారంపై కొంత ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉంది.

ప్రజల్లో డీఎంకే వ్యతిరేకత

అన్నాడీఎంకే, బీజేపీ ఫ్రంట్‌కు ఉన్న అతిపెద్ద బలం.. అమ్మ జయలలితే. ఆవిడ.. భౌతికంగా లేకపోయినా, తమిళనాడు ప్రజల్లో ఆమె పేరుకు, చేసిన మంచికి ఓట్లు పడే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయ్. గ్రామీణ ప్రాంతాలు, పశ్చిమ తమిళనాడులో.. అన్నాడీఎంకేకు ఉన్న గట్టి పట్టు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. బీజేపీతో ఉన్న పొత్తు కూడా రాజకీయంగా కొంత మేలు చేస్తుందంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అనే స్లోగన్‌తో.. అన్నాడీఎంకే, బీజేపీ ప్రచారం చేస్తాయి. కేంద్ర పథకాలు, అన్నాడీఎంకే గెలిస్తే.. కేంద్రం నుంచి అందే సహకారం లాంటివి.. ప్రచారాస్త్రాలుగా పనిచేస్తాయి. మరోవైపు, శశికళ పార్టీ పెట్టడం, పన్నీర్ సెల్వం డీఎంకేలో జాయిన్ అవడం.. అన్నాడీఎంకేని కొంతమేర దెబ్బతీసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా.. బీజేపీతో ఉన్న పొత్తు తమిళ ఆత్మగౌరవం, అస్థిత్వానికి సంబంధించిన కమిట్మెంట్‌పై ప్రశ్నలు లేవనెత్తే ఆస్కారముంది. ప్రధానంగా.. అధికార డీఎంకే పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకేకు మాత్రమే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. అయితే, టీవీకే దెబ్బ ఇటు కూడా పడే అవకాశం ఉందంటున్నారు. మార్పు కోరుకునే వాళ్లు, యంగ్ ఓటర్లంతా.. విజయ్ వైపు చూసే ఛాన్స్ ఉంది. ఇది.. అన్నాడీఎంకేకు మైనస్ అవుతుంది.

కరూర్ తొక్కిసలాట CBI దర్యాప్తు

Advertisement

తమిళగ వెట్రి కజగంతో.. హీరో విజయ్ తమిళనాడు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటిసారి ఎన్నికల బరిలో దిగుతున్నా.. కుంభస్థలాన్ని కొట్టాలనే లక్ష్యంతో ఉన్నారు. విజయ్ అప్పీల్.. యూత్‌కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. న్యూట్రల్ ఓటర్లను, మార్పు కోరుకునే వాళ్లకు.. విజయ్ తననొక మూడో ప్రత్యామ్నాయంగా ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది. అయితే, కొత్త పార్టీ కావడం, బూత్ లెవెల్లో రాజకీయంగా బలహీనంగా ఉండటం, ద్వితీయ శ్రేణి నాయకత్వంలో తక్కువ అనుభవం ఉండటం.. కొంత మైనస్‌గా మారే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ.. డీఎంకే, అన్నాడీఎంకేపై తమిళనాడు ప్రజల్లో, యంగ్ ఓటర్లలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునే పరిస్థితులున్నాయి. అయితే.. కరూర్ తొక్కిసలాట ఘటనపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తు కొంతమేర ప్రతికూల ప్రభావం చూపొచ్చంటున్నారు. ముఖ్యంగా.. రాజకీయాల్లో అనుభవం లేకపోవడం, తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటుండం కూడా విజయ్ పార్టీకి ఉన్న విజయావకాశాలపై కొంత ఎఫెక్ట్ చూపే అవకాశాలున్నాయి. అందువల్ల.. ఈసారి తమిళనాడు ప్రజలు ఎలా ఆలోచిస్తారు? ఎవరిని ఆదరిస్తారు? అనేది.. ఆసక్తి రేపుతోంది.

చివరి తీర్పు ఎవరికీ? పుదుచ్చేరి ఓటర్ల ఆసక్తి

తమిళనాడు పక్కనే ఉన్న పుదుచ్చేరిలోనూ రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకసారి.. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే.. పుదుచ్చేరి మూడ్ ఎలా ఉందో అర్థమవుతుంది. 2016లో ఎన్ఆర్ కాంగ్రెస్‌ 8 సీట్లు గెలిస్తే.. గత ఎన్నికల్లో 10 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ గత ఎన్నికల్లో కేవలం 6 స్థానాలు మాత్రమే సాధించగలిగింది. కాంగ్రెస్ 2016లో 15 సీట్లు గెలిస్తే.. గత ఎన్నికల్లో 2 స్థానాలకే పరిమితమైంది. 2016లో 2 సీట్లు గెలిచిన డీఎంకే.. గత ఎన్నికల్లో 6 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. ఇక.. అన్నాడీఎంకే 2016లో 4 సీట్లు గెలిస్తే.. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక.. ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత.. ఎన్. రంగస్వామి నాలుగోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం.. రెండోసారి బీజేపీతో భాగస్వామ్యం కోసం చూస్తున్నారు. అయితే, లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యంపై.. సీఎం అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పొత్తు సజావుగా సాగలేదు. ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ పుదుచ్చేరిలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. కానీ, రాష్ట్ర హోదా అంశం మాత్రం పెండింగ్‌లో ఉంది. దీనిపై.. ఎటూ తేలట్లేదు. డీఎంకే, కాంగ్రెస్ ఈసారి తమకే అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. అయితే, విజయ్ టీవీకే పార్టీ, ఎన్ఆర్ కాంగ్రెస్‌తో పొత్తు కోరుతుందనే చర్చ.. ఈ ఎన్నికలను ఆసక్తికరంగా మార్చేసింది. మరి.. ఈసారి పుదుచ్చేరి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

గత ఎన్నికల ఫలితాల విశ్లేషణ

కేరళం పాలిటిక్స్ అంటేనే అంత! ఎప్పుడూ.. ఇంట్రస్టింగ్‌గానే కనిపిస్తాయ్. 2021లో వరుసగా రెండోసారి గెలిచి.. 40 ఏళ్ల రికార్డును తిరగరాసిన పినరయి విజయన్, ఇప్పుడు హ్యాట్రిక్ టార్గెట్‌గా ముందుకు సాగుతున్నారు. కానీ.. గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితులు చూస్తుంటే.. అది అంత సులభం కాదనిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల గురించి తెలుసుకునేకంటే ముందు.. ఇంతకుముందు ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఓసారి చూద్దాం. కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2016 ఎన్నికల్లో.. సీపీఎం 58 స్థానాలు గెలిచింది. అదే, గత ఎన్నికలకు వచ్చేసరికి.. 62 స్థానాల్లో విజయంతో బిగ్గెస్ట్ పార్టీగా అవతరించింది. 2016లో సీపీఐ 19 సీట్లు గెలిస్తే.. గత ఎన్నికల్లో 17కే పరిమితమైంది. 2016లో కాంగ్రెస్ 22 సీట్లలో విజయం సాధిస్తే.. 2021 ఎన్నికల్లో మాత్రం 21 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ 2016లో 18 స్థానాల్లో గెలిస్తే.. గత ఎన్నికల్లో మాత్రం 15 సీట్లు మాత్రమే గెలిచింది. బీజేపీ పరిస్థితి కేరళంలో మరీ దారుణంగా ఉంది. 2016లో ఒక్క సీటు గెలిస్తే.. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ రిజల్ట్స్ చూశాక.. ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయన్నది కేరళంలోనే కాదు దేశమంతటా ఆసక్తి రేపుతోంది.

ప్రభుత్వ విజయాలను ప్రజలకు చూపే అవకాశం

సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఫ్.. గత పదేళ్ల పాలనలో.. తమ హయాంలో జరిగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాలనే ప్రధానంగా నమ్ముకుంది. నవ కేరళం నినాదంతో.. మళ్లీ పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా.. క్రమశిక్షణ కలిగిన కేడర్ బలం ఎల్డీఎఫ్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా కనిపిస్తోంది. అంతేకాదు.. సీఎం పినరయి విజయన్‌కు ఉన్న ఆకర్షణ, రాష్ట్రంపై ఆయనకు ఉన్న పట్టు.. సానుకూలంగా కనిపిస్తోంది. బూత్ లెవెల్లో.. ఎల్డీఎఫ్ స్ట్రాంగ్‌గా ఉంది. క్యాడర్ కూడా కమిటెడ్‌గా ఉండటంతో.. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమాన్ని.. ప్రజలకు విడమరిచి చెప్పే అవకాశాలున్నాయి. అంతేకాదు, లబ్ధిదారులను, మద్దతుదారులను ఏకం చేయగల సత్తా ఉంది. తమ ప్రభుత్వంలో మంచి జరిగిన వాళ్లందరి మద్దతు కూడగట్టడంలో.. ఎల్డీఎఫ్ కూటమి సక్సెస్ అవగలదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. అయితే, వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో.. ప్రజల్లో మొదలైన వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎల్డీఎఫ్‌లో అంతర్గత దిద్దుబాటు యంత్రాంగం కూడా బలహీనపడిందనే చర్చ ఉంది. వామపక్ష భావజాలం ఉన్న మేధావులతో సంబంధాలు కూడా తగ్గినట్లు కనిపిస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకులకు ఉన్న తక్కువ ప్రజాదరణతో.. ఎల్డీఎఫ్ ఎలా గట్టెక్కుతుందనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

పినరయి విజయన్ సవాళ్లను ఎలా అధిగమిస్తారు?

ఎల్డీఎఫ్‌ కూటమిని, సీపీఎం పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలహీనపరిచేందుకు ప్రతిపక్ష పార్టీల దగ్గర సరైన వ్యూహం లేకపోవడమే.. పినరయి విజయన్‌కి కలిసొస్తుందని చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం వల్ల.. ఎల్డీఎఫ్ ఇప్పటికీ బలంగా కనిపిస్తోందంటున్నారు. బీజేపీ కూడా పోటీలో ఉండటంతో.. త్రిముఖ పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఇది.. అల్టిమేట్‌గా ఎల్డీఎఫ్‌కే బెనిఫిట్ చేస్తుందని, లెక్కలన్నింటిని తారుమారు చేస్తుందనే చర్చలు జరుగుతున్నాయ్. వీటితో పాటు ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంలో తక్కువ అంతర్గత కుమ్ములాటలు, ప్రభుత్వ పాలనకు సంబంధించిన రికార్డులు.. ప్రయోజనం చేకూరుస్తాయని చెబుతున్నారు. అయితే.. శబరిమల ఆలయం బంగారు ఆభరణాలు దొంగతనం ఆరోపణలు, సంబంధిత వివాదాలు.. కొంత మేర మైనస్‌గా మారే అవకాశాలున్నాయి. ఆరోగ్య సిబ్బందిలో అసంతృప్తి, మైనారిటీల మద్దతు లేకపోవడం.. ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపనుంది. హిందూ ఓట్ బ్యాంక్‌ని విభజించే బీజేపీ సామర్థ్యం కూడా ఎల్డీఎఫ్‌పై దెబ్బకొట్టే అవకాశాలున్నాయి. వీటన్నింటిని.. సీఎం పినరయి విజయన్ ఎలా అధిగమిస్తారన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

మార్పు కోరుకునే ఓటర్లకు మద్దతు

ఇక.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా సెంట్రల్ కేరళంలోని కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా, బలంగా కనిపిస్తోంది. కూటమి లెక్కల్లో భాగంగా.. మైనారిటీల ఓట్లు యూడీఎఫ్‌ వైపే మళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, కాంగ్రెస్ పనితీరు కూడా.. ఈ ఎన్నికల్లో బూస్టర్‌గా పనిచేయనున్నాయి. కానీ.. యూడీఎఫ్‌లో ఉన్న గ్రూప్ తగాదాలు ఇప్పటికీ టెన్షన్ పెడుతున్నాయ్. ఊమెన్ చాందీ లాంటి మాస్ లీడర్ ఇప్పుడు లేకపోవడమే.. ఇందుకు కారణమనే చర్చ జరుగుతోంది. పైగా.. సీపీఎం కంటే బలహీనమైన బూత్ లెవెల్ యంత్రాంగం ఉండటం మరో మైనస్. ఇటీవల జరిగిన స్టేట్ ఎలక్షన్లలో.. కాంగ్రెస్ పార్టీ చూపిన పేలవమైన ప్రదర్శన కొంత ప్రతికూల ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఇది.. పార్టీపై ప్రజల్లో విశ్వసనీయతను, క్యాడర్‌ శక్తిని ఎఫెక్ట్ చేస్తుంది. అయితే.. ఎల్డీఫ్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సహజ వ్యతిరేకతే.. యూడీఎఫ్‌కు మేలు చేసే అవకాశం ఉంది. అర్బన్, సెమీ అర్బన్ స్థానాల్లో.. యూడీఎఫ్ మార్పు సెంటిమెంట్‌ని రగిలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ప్రభుత్వ వైఫల్యాలు, పాలనలో తలెత్తిన వివాదాలను ఎత్తి చూపడంతో పాటు ఆర్థికపరమైన, ఉద్యోగాల పరమైన అంశాల్లో సాధించిన తక్కువ ఫలితాలను.. ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంది. ఇక.. కూటమి భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయం, ప్రచారాస్త్రాలు.. కాంగ్రెస్‌కు లాభం చేకూర్చే ఛాన్స్ ఉంది.

టగ్ ఆఫ్ వార్ సీట్లలో బీజేపీ దూకుడు

ఎల్డీఎఫ్ క్యాడర్ బూత్ లెవెల్‌లో చేసే మైక్రో మేనేజ్‌మెంట్‌ కెపాసిటీ.. యూడీఎఫ్‌లో కనిపించడం లేదు. టగ్ ఆఫ్ వార్ ఉంటుందనుకుంటున్న స్థానాల్లో.. బీజేపీ దూకుడుగా కనిపిస్తోంది. ఇలాంటి సీట్లలో.. ఎన్డీయే.. ఎల్డీఎఫ్ వ్యతిరేక ఓట్లను చీల్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కేవలం.. పినరయి విజయన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతనే నమ్ముకోవడం కూడా మైనస్‌గా మారే ఛాన్స్ కనిపిస్తోంది. బలమైన సిద్ధాంతం లేకుండా.. బలమైన భావజాలంతో ఉండే ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడం అంత ఈజీ కాదనే టాక్ కూడా వినిపిస్తోంది. కేరళంలో ప్రస్తుతం.. యూడీఎఫ్‌కు కొంత సానుకూల పవనాలు వీస్తున్నప్పటికీ.. పోలింగ్ నాటికి వీటన్నింటిని ఎలా అధిగమిస్తుంది, మొత్తం వేవ్‌ని తమ వైపునకి ఎలా తిప్పుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది.

కొత్త ఇంపాక్ట్ కోసం ప్రయత్నాలు

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూడా.. ఈసారి కేరళంలో ఎంతో కొంత ఇంపాక్ట్ చూపాలనే కసితో కనిపిస్తోంది. కేరళంలో పాగా వేయాలనే బీజేపీ నిరంతర ప్రయత్నాలు.. ఆ పార్టీ తమది కాదనే ఆలోచనని ఆ రాష్ట్ర ప్రజల మెదళ్లలో నుంచి తొలగిపోనున్నాయి. ఇది.. పెరుగుతున్న ఓట్ షేర్, క్యాడర్‌లో పెరుగుతున్న కాన్ఫిడెన్స్‌లో కనిపిస్తోంది. ఎన్డీయేకి ఓట్లు సాధించేందుకు నరేంద్రమోడీ లాంటి లీడర్.. సిద్ధంగా ఉన్నారు. అయితే, రాష్ట్ర నాయకత్వం బలహీనంగా ఉండటం వల్ల.. కిందిస్థాయిలో బీజేపీకి ఉన్న మద్దతు ఓట్లుగా మారలేకపోతోందనే విశ్లేషణలు కూడా ఉన్నాయ్. డబుల్ ఇంజిన్ సర్కార్ స్లోగన్, హిందూ సంస్కృతి, గుర్తింపుపై పెరుగుతున్న ఒత్తిడి కలిసొచ్చే అవకాశాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా బీజేపీలో జోష్ పెంచాయ్. బలమైన హిందుత్వ సిద్ధాంతం అనేది.. కేరళ లాంటి సోషల్ మిక్స్ కనిపించే రాష్ట్రంలో ఎదురుదెబ్బ తగిలేలా చేస్తుందనే చర్చ కూడా ఉంది. సంప్రదాయ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఓట్ బ్యాంక్‌లను తట్టుకొని.. ఎన్డీయే ఎంతమేరకు బెటర్ రిజల్ట్స్ సాధిస్తుందనే ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×