Tarique Rahman: అవును బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. డార్క్ ప్రిన్స్ గా పేరున్న తారిఖ్ రెహ్మాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ పగ్గాలు చేపట్టబోతున్నారు. ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. సమస్యలెన్నో స్వాగతం పలుకుతున్నాయ్. అవామీ లీగ్ పార్టీ పోటీ లేకుండా బీఎన్పీ ఘన విజయం సాధించింది. షేక్ హసీనా ఈ ఎన్నికలను డమ్మీగా చెప్పినప్పటికీ 20 ఏళ్ల తర్వాత BNPకి బంగ్లాదేశ్ లో మంచి రోజులు వచ్చినట్లైంది.
తాజాగా జరిగిన ఎన్నికల్లో BNP పార్టీ బంగ్లాదేశ్ ఫస్ట్ అన్న స్లోగన్ తో ఎన్నికల బరిలోకి దిగింది. ఇది అక్కడి జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. I HAVE A PLAN FOR MY COUNTRY అని పిలుపునిచ్చాడు. మొత్తం 300 సీట్లలో సగానికి పైగా తారిఖ్ రెహ్మాన్ పార్టీ గెలుచుకుని బంగ్లాదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. తాజా ఎన్నికల ఫలితాల్లో 212 స్థానాల్లో విజయం సాధించినట్లు బీఎన్‌పీ ప్రకటించింది. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత కథ మొత్తం మారిపోయింది. నిజానికి బంగ్లా కొత్త ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఇన్నాళ్లూ దేశం విడిచి లండన్ లో ప్రవాస జీవితం గడిపారు. షేక్ హసీనా హయాంలో బంగ్లాదేశ్ లో విపరీతంగా కేసులు, మనీలాండరింగ్ లు, ఉగ్రవాద లింకులంటూ చాలా కేసులు చుట్టుముట్టాయి. అలాంటి పరిస్థితుల్లో 2008 నుంచి తారిఖ్ దేశ బయటే ఉంటున్నారు. గతేడాదే స్వదేశానికి తిరిగి వచ్చారు. చక్రం తిప్పారు. పీఠం ఎక్కుతున్నారు.
తారిఖ్ రెహ్మాన్ జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోయింది? ఒకప్పుడు ఖైదుగా ఉన్న తారిఖ్ ఇప్పుడు అదే దేశానికి ప్రధాని అవుతున్నారు. 60 ఏళ్ల తారిఖ్ రెహ్మాన్ మాజీ ప్రధాని ఖలేదా జియా, మాజీ అధ్యక్షుడు జియావుర్ రహ్మాన్ కుమారుడు. BNP పార్టీ వ్యవస్థాపకుడు జియావుర్ రహ్మాన్ 1981లో హత్యకు గురైనప్పుడు తారిక్‌కు 15 ఏళ్లు మాత్రమే. 1988లో BNPలో చేరి క్రమంగా పార్టీలో పై పొజిషన్స్ కు చేరుకున్నాడు తారిఖ్. పార్టీలో జియా వారసుడిగా పేరొందిన తారిఖ్.. 2001-2006 మధ్య BNP-జమాత్ కూటమి ప్రభుత్వంలో ఖలేదా జియా ప్రధానిగా ఉన్న టైంలో డార్క్ ప్రిన్స్ అని విమర్శలు ఎదుర్కొన్నాడు. 2007లో నాటి కేర్‌టేకర్ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసి 17 నెలలు జైల్లో ఉంచింది. ఆ తర్వాత షేక్ హసీనా ప్రభుత్వంలో రకరకాల కేసుల్లో ఇర్కుకున్నారు తారిఖ్. అప్పట్లో చాలా కేసుల్లో శిక్షలు కూడా పడ్డాయి. అయితే తాను జైళ్లల్లో హింసకు గురయ్యానని, రాజకీయ కారణాలతో కేసులు పెట్టారని తారిక్ అప్పట్లో వాదించాడు. 2008 నుంచి లండన్‌లోనే ఉండిపోయాడు.
2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా అధికారం పీఠం నుంచి వైదొలగారు. భారత్ లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. బంగ్లాదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే .. ఎవరైనా పీఠం దిగితే దేశం దాటి బతకాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. ఇప్పుడు షేక్ హసీనా.. మొన్నటిదాకా తారిఖ్ రెహ్మాన్. సేమ్ టూ సేమ్ సీన్లు. తాజాగా తారిఖ్ పై కేసులు రద్దయ్యాయి. 2025 డిసెంబర్‌లో ఆయన బంగ్లాదేశ్‌కు తిరిగి రావడం, తాజా ఎన్నికల్లో పార్టీ ప్రభంజనంతో ఆయన కథ మొత్తం మారిపోయింది. 18 నెలల మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి ముగింపు పలికారు. ఈ విక్టరీ షేక్ హసీనా, అవామీ లీగ్ ఆధిపత్యాన్ని ముగించి, BNPకు 20 ఏళ్ల తర్వాత అధికారం తెచ్చిపెట్టింది. అవినీతి కేసులతో 17 ఏళ్ల క్రితం దేశం నుంచి వెళ్లిపోయిన రెహ్మాన్ కు ఇది విజయం మాత్రమే కాదు. ఒక గొప్ప అవకాశం కూడా.
తారిఖ్ రెహ్మాన్ ప్రకటించిన 31 అంశాల సంస్కరణల ఎజెండా ఇప్పుడు బంగ్లాదేశ్ లో అత్యంత కీలకంగా మారబోతోంది. బంగ్లాదేశ్‌లో నియంతృత్వ ధోరణులకు అడ్డుకట్ట వేసేలా కొత్త ప్లాన్ రచించారు. జులై చార్టర్ లో భాగంగా ప్రస్తావించిన ఈ అంశాలు అమలైతే బంగ్లాదేశ్ రాత మారిపోవడం ఖాయమని చెబుతున్నారు. బంగ్లాదేశ్ లో ఎవరు గెలిచినా పాతుకుపోతున్నారు. అయితే ఈ పరిస్థితిని మార్చాలనుకుంటున్నారు. ఏ వ్యక్తి అయినా తన జీవితకాలంలో రెండు సార్ల కంటే ఎక్కువ ప్రధానమంత్రిగా ఉండకూడదనే నిబంధనను తారిఖ్ రెహ్మాన్ తీసుకురానున్నారు. అంతే కాదు ప్రధానమంత్రికి ఉన్న విశేష అధికారాలను తగ్గించి, ప్రధాని, రాష్ట్రపతి మధ్య అధికారాలను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ స్థానంలో, మేధావులు, వివిధ రంగాల నిపుణులతో కూడిన 100 మంది సభ్యుల ఎగువ సభను అంటే మన దగ్గర రాజ్యసభ మాదిరి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు గతంలో ఉన్న కేర్‌టేకర్ ప్రభుత్వ వ్యవస్థను రాజ్యాంగబద్ధంగా పునరుద్ధరించబోతున్నారు. ఎంపీలు తమ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేక ఓటు వేయకుండా అడ్డుకునే వివాదాస్పద ఆర్టికల్ 70ని సవరించి, పార్లమెంట్‌లో స్వేచ్ఛాయుత ఓటింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. దేశంలో కొత్తగా ఉపరాష్ట్రపతి పదవిని సృష్టించి, ఆ పదవికి ఎన్నికలను నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. అవినీతిపై పోరాడేందుకు, పారదర్శకత పెంచేందుకు రాజ్యాంగబద్ధంగా ఒక అంబుడ్స్ మెన్ ను నియమించనున్నారు. జులై చార్టర్ ద్వారా రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలలో మార్పులు చేసి, లౌకికవాదం స్థానంలో సమానత్వం, మానవ గౌరవం మత సామరస్యానికి పెద్దపీట వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజ్యాంగంలో అన్ని మతాల వారికి తగిన గౌరవం రక్షణ కల్పించేలా మార్పులు చేయనున్నారు. ఇవన్నీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన 180 రోజుల్లోపు ఆమోదించాల్సి ఉంది. సో ఒక మార్పు దిశగా బంగ్లాదేశ్ ను నడిపించడానికి తారిఖ్ రెహ్మాన్ రెడీ అవుతున్నారు. మరి అన్నీ అనుకున్నట్లుగా సాగే వాతావరణం బంగ్లాదేశ్ లో ఉందా?
బంగ్లాదేశ్ లో మారిన రాజకీయం.. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. తారిఖ్ రెహ్మాన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. 17 ఏళ్ల ప్రవాసం తర్వాత బంగ్లాదేశ్ ను ఎలా నడిపించబోతున్నారు? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. చెప్పాలంటే తారిఖ్ వస్తూనే బంగ్లాదేశ్ ఫస్ట్ అజెండాను ప్రకటించారు. ట్రంప్ ఎలాగైతే అమెరికా ఫస్ట్ అని ప్రకటించారో… అచ్చం అలాగే బంగ్లా ప్రయోజనాల తర్వాతే ఏదైనా అన్నట్లుగా డీల్ చేయబోతున్నారు. ఢిల్లీ కాదు.. అటు బంగ్లాదేశ్ కాదు.. ఇటు చైనా కాదు.. అందరికీ సమాన దూరం పాటిస్తామంటున్నారు. ఇదో సరికొత్త కీలక పరిణామం.
తాము ఎవరి చేతుల్లోనూ ఉండబోమంటున్న సిగ్నల్స్ ఇస్తున్నారు. సో ఇదొక పరిణామం అయితే 8 శాతం హిందువులపై దాడులను అరికట్టి, అందరికీ సురక్షిత బంగ్లాదేశ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు తారిఖ్. తీస్తా, పద్మా నదుల నీటి పంపకాలు, సరిహద్దుల్లో మారణహోం ఆపడం వంటి జాతీయ ప్రాధాన్యతలపై దృష్టి పెట్టడం, మతం వ్యక్తిగతం, దేశం అందరిదని చెప్పడం కొన్ని కీలకంగా మారబోతున్నాయ్. సో బంగ్లాదేశ్ ను ఎలా నడిపించాలో తనకు ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందని ఇప్పటికే ప్రకటించారు తారిఖ్ రెహ్మాన్. తాను అనుకున్న రూట్లో అంతర్జాతీయ సంబంధాలు నెరపబోతున్నారు. స్వతంత్రంగా దేశాన్ని నడిపించే ఆలోచనతో ఉన్నట్లుగా ఆయన చర్యలను బట్టి చూస్తే అర్థమవుతోంది.
సో ఇప్పుడు భారత్ కు ఈ పరిణామాలు చాలా కీలకంగా మారుతున్నాయ్. ఎందుకంటే పక్కనే బంగ్లాదేశ్ తో పరిస్థితులు ఇప్పుడంత ఏమీ బాగో లేవు. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇస్తోంది. ఇది బంగ్లాదేశ్ కు నచ్చడం లేదు. అదే సమయంలో బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువులపై హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి అధ్యాయం మొదలవుతుందన్న చర్చ నడుస్తోంది. BNPను భారత్ జమాత్ ఇ ఇస్లామీ కంటే లిబరల్, డెమోక్రటిక్ ఎంపికగా చూస్తోంది.
బంగ్లాదేశ్ లో ఎన్నికలు, తారిఖ్ రెహ్మాన్ పార్టీ గెలవడం ఈ పరిణామాలన్నిటినీ నిశితంగా పరిశీలిస్తోంది. ఏ లెక్కన చూసినా బీఎన్‌పీ విజయంతో భారత్-బంగ్లా బంధం మళ్లీ బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయ్. ఖలేదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో భారత్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో సంబంధాలు లేకపోయినా.. ప్రస్తుత పరిణామాలతో దాన్నో ప్రజాస్వామ్య పార్టీగా చూస్తోంది. ఆ పార్టీతో, బంగ్లాదేశ్ తో సంబంధాలు పునరుద్ధరించుకునే సంకేతాలు పంపుతోంది భారత్. ఆ మధ్య రెహ్మాన్ తల్లి ఖలేదా జియా తీవ్ర అనారోగ్యానికి గురికాగా.. ప్రధాని మోడీ కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆ తర్వాత ఖలేదా జియా సుదీర్ఘ అనారోగ్యం తర్వాత గతేడాది డిసెంబర్ 30న 80 ఏళ్ల వయసులో ఢాకాలో కన్నుమూశారామె. ఖలేదా జియా బంగ్లాదేశ్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా దేశాభివృద్ధిలో మరియు భారత్ బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేయడంలో పోషించిన పాత్రను మోడీ గుర్తు చేసుకున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ గతేడాది డిసెంబర్ 31న ఢాకాలో జరిగిన ఆమె అంత్యక్రియలకు హాజరై, ప్రధాని మోడీ పంపిన సంతాప లేఖను ఖలేదా జియా కుమారుడు, ప్రస్తుత బిఎన్‌పి నేత తారిఖ్ రెహ్మాన్‌కు స్వయంగా అందజేశారు. సో షేక్ హసీనా పార్టీ గైర్హాజరులో బంగ్లాదేశ్ లో BNP పార్టీదే హవా ఉండబోతోందని ముందుగానే గ్రహించి ఆ పార్టీతో సంబంధాలకు లైన్ క్లియర్ చేశారు.
ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ లో BNP ఘన విజయం నేపథ్యంలో మిగిలిన దేశాల కంటే ముందుగానే ప్రధాని మోడీ… బంగ్లాదేశ్ కు, తారిఖ్ రెహ్మాన్ కు ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని మోడీ హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్‌పీని ఘన విజయం దిశగా నడిపించిన తారిఖ్ రహ్మాన్ కు అభినందనలు అని, తారిఖ్ నాయకత్వంపై బంగ్లా ప్రజల విశ్వాసానికి ఈ గెలుపు నిదర్శనమని చెప్పారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని, ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతం, ఉమ్మడి లక్ష్యాలపై ముందుకువెళ్లేందుకు కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదొక కీలక పరిణామం.
అయితే ప్రధాని మోడీ అభినందన పోస్టుకు తారిఖ్ రెహ్మాన్ ప్రత్యక్షంగా రిప్లై ఇవ్వడానికి బదులుగా, ఆయన పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నుంచి రియాక్షన్ ఇప్పించారు. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ BNP నుంచి ప్రకటన విడుదల చేయించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ అభినందనలు తెలిపినందుకు భారత్ ప్రధానికి ధన్యవాదాలు అని, భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నామని పోస్ట్ చేయించారు. పాక్, చైనా, భారత్ మూడు దేశాలకు సమాన దూరం పాటిస్తామన్న అజెండాతో ఉన్న తారిఖ్… రియాక్షన్ విషయంలోనూ అదే ఆలోచనతో ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది.
సో ఇప్పుడు రెండు దేశాల మధ్య మ్యాటర్ ఏంటంటే.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఇది రెండు దేశాల మధ్య దౌత్య చిక్కుముడిగా మారవచ్చు. అటు బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో తారిఖ్ అందరికీ సమానత్వం అన్న అజెండాతో ఉండడంతో మైనార్టీలపై దాడులు ఆగిపోతాయన్న చర్చ నడుస్తోంది. తీస్తా వంటి కీలక సమస్యలపై భారత్ నుంచి స్పష్టమైన హామీలు పొందే వరకు తారిఖ్ భారత్‌తో కొంత దూరంగానే ఉండవచ్చంటున్నారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య 4 వేల కిలోమీటర్ల సరిహద్దు, వాణిజ్యం, విద్యుత్, కనెక్టివిటీ ఉన్నాయి. తారిక్ ఫాలో అవబోయే విధానాలు, భారత్ రియాక్షన్ ప్రకారమే కథ ఉండబోతోంది. గతంలో కేవలం అవామీ లీగ్‌కే మద్దతు ఇచ్చిన భారత్, ఇప్పుడు మారుతున్న రాజకీయాలకు తగ్గట్లు BNPతో సంబంధాలు పెంచుకోవడం ఖాయమే. మొత్తానికి, తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్… భారత్‌తో సంబంధాలను పూర్తిగా తెంచుకోకుండానే, తన జాతీయ ప్రయోజనాల విషయంలో మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.
Story by: Anup, Big Tv