BIG Shock To TDP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీకి పెద్ద దిక్కెవరు? క్యాడర్ ఫుల్ నాయకులు నిల్ అన్నట్టుగా నియోజకవర్గ పరిస్థితి తయారవ్వడానికి కారణమేంటి? టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు ఈ నియోజకవర్గంపై ఫోకస్ చేయడం లేదు? గెలిపించుకున్న జనసేన ఎమ్మెల్యేపి అక్కున చేర్చుకుందాం అనుకున్న తెలుగు తమ్ముళ్లు ఆయనతో అంటి ముట్టినట్లుగానే ఎందుకు ఉంటున్నారు? అసలు పి.గన్నవరం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల బాధేంటి? అక్కడ టీడీపీ అధిష్టానం క్యాడర్‌ను పట్టించుకోకుండా టూ మెన్ కమిటీతోనే ఎందుకు సరిపెడుతోంది? ఒకవైపు చూస్తే ఉన్ననలుగురు నాయకులు వర్గాలుగా విడిపోయారు.. ఈ పరిస్ధితుల్లో తెలుగు తమ్ముళ్లు ఆ నలుగురిపైనే ఆధారపడాలా? .. అసలు పి.గన్నవరం టీడీపీలో జరుగుతున్న రాజకీయం ఏంటి?
పి. గన్నవరంలో టీడీపీకి బలమైన క్యాడర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కేడర్ ఫుల్లుగా ఉన్నప్పటికీ వారిని నడిపించే నాయకుడు మాత్రం కరువయ్యాడు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో పి గన్నవరం ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా ఏర్పడింది. అక్కడ మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి పాముల రాజేశ్వరి దేవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులపర్తి నారాయణమూర్తి గెలుపొందారు. 2019లో వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు గెలుపొందారు.
పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడంపై దృష్టి పెట్టని టీడీపీ అధిష్టానం
పి.గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు నదీ పరివాహక ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ వరదలు వచ్చినప్పుడు లంక వాసులు బ్రతుకు జీవుడా అంటూ జీవనం గడుపుతుంటారు. అలాంటి సెగ్మెంట్‌లో పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడంపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టడం లేదన్న అభిప్రాయం ఉంది. 2019 నుండి ఇప్పటివరకు టిడిపి ఇన్చార్జిని నియమించకుండా, కమిటీలను వేసి అగ్రవర్ణ నేతలతో తమపై పెత్తనం చేయిస్తున్నారని, ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో ఆ నాయకుల పెత్తనం ఏంటని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.
బలమైన ఎస్పీ అభ్యర్ధిని ఇన్చార్జ్‌గా నియమించాలని వినతులు
నాయకత్వలోపంతో తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చీలికలు ఏర్పడి, క్యాడర్ తలోదిక్కుకు చెదిరిపోతున్న పరిస్థితి నెలకొంది. బయట వారి నాయకత్వంలో పని చేయలేమని, బలమైన ఎస్సీ అభ్యర్థిని ఇన్చార్జిగా నియమించండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ గోడు పట్టించుకునే నాధుడే కరువయ్యాడని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు. 2024 ఎన్నికల సమయంలో తెలుగుదేశం అభ్యర్థిగా మహాసేన రాజేష్‌ను అధిష్టానం ప్రకటించింది. అయితే సోషల్ మీడియాలో వివిధ వర్గాల మనోభావాలు దెబ్బతినేలా పెట్టిన పోస్టులతో మహాసేన రాజేష్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాజేష్ అభ్యర్ధిత్వంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవ్వడంతో టీడీపీ ఆ సీటు వదులుకుని .. చివరి నిముషంలో జనసేనకు కేటాయించింది.
ఇన్చార్జ్‌ని నియమింయకపోవడంతో బయట నేతల పెత్తనం
పి.గన్నవరంలో జనసేన నుండి పోటీ చేసిన గిడ్డి సత్యనారాయణ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆయన విజయానికి టీడీపీ శ్రేణులు ఎంతో కృషి చేశాయి. అయితే అప్పటివరకు ఒక రకంగా నడిచిన తెలుగుదేశం రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్‌కు కొత్త కష్టాలు మొదలయ్యాయంట. పి. గన్నవరం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలనునిర్వహించే నాయకుడు లేక, ఇన్చార్జి లేక బయట నాయకులపెత్తనమే ఎక్కువ అవటంతో, ఇటు జనసేన ఎమ్మెల్యే దగ్గర వారి బాధను చెప్పుకోలేక తెలుగు తమ్ముళ్లు సతమతమవుతున్నారంట. ఎమ్మెల్యే మిత్రధర్మం పాటిస్తూ ఎంత దగ్గరకు తీసుకుంటున్నా.. జనసేన నాయకుడిని ఓన్ చేసుకోలేక టీడీపీ క్యాడర్ అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారంట.
గ్రూపులతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్న టీడీపీ నేతలు
ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థలు ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం కార్యకర్తలు వాపోతున్నారు. మహానాడు అయిన వెంటనే పి. గన్నవరం నియోజకవర్గానికి తెలుగుదేశం ఇన్చార్జి నియామకం విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే ప్రకటన చేయిస్తామన్న టీడీపీ నాయకులు గ్రూపులుగా ఏర్పడి, వారి మనుగడ కోసం పాకులాడుతున్నారు తప్ప, తమ గోడు పట్టించుకునే వారే కరువయ్యారని తెలుగుతమ్ముళ్లు గోడు వెళ్లబోసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఎన్నికల సమయంలో నియమించినబూత్ కమిటీ నాయకులు గ్రూపులుగా ఏర్పడి తమ మనుగడ కోసం పార్టీ క్యాడర్‌ను చీలుస్తున్నారంట, వేరే నియోజకవర్గాల్లోని నాయకులు ఇక్కడ పెత్తనం చేస్తుండటం నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదంట.
Also Read: టీటీడీలో ఎస్టేట్ దందా! వెనుక ఉన్నది ఎవరు?
పూర్వవైభవం గత చరిత్రలా మిగిలిపోతుందని ఆందోళన
తెలుగుదేశం అధిష్టానం ఇప్పటికైనా పి.గన్నవరంపై దృష్టి పెట్టి, సమర్ధుడైన నాయకుడ్ని ఇన్చార్జ్‌గా నియమించాలని.. లేకపోతే క్యాడర్ చిన్నాభిన్నమై.. పార్టీ పూర్వ వైభవం గత చరిత్రగా మిగిలిపోతుందని తెలుగు తమ్ముళ్లు మొత్తుకుంటున్నారు.నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం నుండి నలుగురైదుగురు ఆశావాహులు ఉన్నా అధిష్టానం వారిని కూడా పట్టించుకోవటం లేదని, ఆ క్రమంలో బయట నేతలు ఏది చెప్తే అదే నడుస్తోందని.. వారిదే ఇష్టారాజ్యంగా తయారైందని పి.గన్నవరం టీడీపీ క్యాడర్ ఆరోపిస్తోంది. మరి బలమైన క్యాడర్ ఆ సెగ్మెంట్‌పై టీడీపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Story By Rami Reddy, Bigtv