Kollikpudi Srinivasarao: మొన్నటి వరకు కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం మాటలు లెక్క చేయలేదు… తాజాగా ఎంపీ కేశినేని చిన్ని , ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కూడా పార్టీ అధినేత ముఖ్యమంత్రి మాటను లెక్కచేస్తున్నట్లు కనిపించడం లేదంటున్నారు .. టీడీపీ క్రమశిక్షణ సంఘం హెచ్చరించినా, సీఎం ఫైర్ అవుతున్నా తమ సొంత రాజకీయ జెండానే అమలు చేస్తూ ఇటు పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ అధినేతకే సవాల్ విసురుతున్నారంట… అసలు విజయవాడ ఎంపీ, తిరువూరు ఎమ్మెల్యేల లెక్కలేంటి?
తిరువూరు టీడీపీలో మార్ఫింగ్ ఫోటోల పంచాయతీ వివాదాలకి కేంద్రం అవుతుంది. తిరువూరు టీడీపీ నేతలు వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యేగా సదరు వివాదం రాజుకుంటోంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మహిళతో ఉన్న మార్ఫింగ్ ఫోటోలను తిరువూరు టీడీపీ నేతలు బుడ్డయ్య, చెరుకూరి రాజేశ్వరరావు వాట్సప్ గ్రూపుల్లో పెట్టి రచ్చ చేస్తున్నారు. AIతో ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన సొంత పార్టీ నేతలకు అదే మార్ఫింగ్ ఫోటోలతో ఎమ్మెల్యే కొలికపూడి కౌంటర్ ఇచ్చారు.
తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి మార్ఫింగ్ ఫోటోలతో కొలికపూడి శ్రీనివాస్ వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నా అధిష్టానం దృష్టి పెట్టలేదు. ఆ క్రమంలో తమ వాగ్యుద్దం కొనసాగిస్తూ టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడికి సొంత పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి , ఎంపి చిన్నిలు పరోక్షంగా సవాల్ విసురుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేశినేని చిన్ని, కొలికపూడి మధ్య కొంతకాలంగా తీవ్ర వివాదం నెలకుంది. వీళ్లిద్దరి వివాదం బజారుకెక్కడంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
ఇద్దర్నీ మీడియాతో విభేదాలపై మాట్లాడొద్దని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మరీ ముఖ్యంగా కొలికపూడిని రెండుమూడు సార్లు చంద్రబాబు పిలిపించుకుని, తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఆ మధ్య కూడా పార్టీ నచ్చకపోతే, నిరభ్యంతరంగా బయటికి వెళ్లొచ్చని కొలికపూడిని ఉద్దేశించి చంద్రబాబు హెచ్చరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయినా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. వాట్సప్ స్టేటస్లో పెట్టిన పోస్టులు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిపోయాయి..
కొలికపూడి శ్రీనివాసరావు సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వాట్సాప్ స్టేటస్‌లు పెట్టడం మరోసారి టీడీపీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావుపై పేకాట ఆడిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇది పార్టీలో కొత్త వివాదానికి దారితీసింది. గతంలోనూ పలుమార్లు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ క్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు ఎపిసోడ్ మరోసారి టీడీపీకి తలనొప్పి మారింది. తన వాట్సాప్ స్టేటస్‌లతో సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేశారు. ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి ??? పేకాట క్లబ్ కా ???.. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే …నువ్వు నిజంగా రాయల్.. కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్’ అంటూ టీడీపీ నేతలపైనే వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు.
తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు టార్గెట్‌గా ఈ స్టేటస్‌లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాయల సుబ్బారావు చాలా కాలంగా పేకాట ఆడిస్తున్నారంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించినట్లు తెలుస్తోంది. రాయల సుబ్బారావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్గమని ప్రచారం జరుగుతోంది. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్‌ల ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది.
మొత్తమ్మీద కొలికపూడి వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గతంలో తిరువూరు బెల్ట్ షాపుల విషయంలో, స్థానిక టీడీపీ నేతల అంశంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అప్పుడే టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేను పిలిచి మందలించింది. ఆ తర్వాత కొలికపూడి శ్రీనివాసరావు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎయిర్‌పోర్ట్‌లో కలవడం దుమారం రేపింది.. అయితే ఎమ్మెల్యే ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. పెద్దిరెడ్డి విమానాశ్రయంలో కనిపిస్తే పలకరించానని.. అంతకమించి రాజకీయ ప్రాధాన్యం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తాను అధిష్టానం పెద్దలకు కూడా చెప్పానన్నారు.
ఆ వివాదం సమసిపోయిందనుకుంటున్న సమయంలో కొలికపూడి ఇటీవల మరో వివాదానికి తెర తీశారు.. ఈసారి ఏకంగా సొంత పార్టీ ఎంపీపై ఆరోపణలు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరువూరు టికెట్ కోసం కేశినేని చిన్ని తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు బ్యాంక్ స్టేట్‌మెంట్ల పేరుతో సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెట్టారు. ఈ ఎపిసోడ్ కొద్దిరోజులు నడిచింది.. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీకి డ్యామేజ్ చేసేలా నేతలు వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొలికపూడి పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరించారని అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొలికపూడిని పిలిచి వివరణ కూడా తీసుకున్న సంగతి తెలిసిందే.. కేశినేని చిన్నిని కూడా పిలిచి విచారణ చేశారు. అయితే ఆ వివాదం కూడా అంతటితో ముగిసింది అనుకున్నారు.
కొలికపూడి వ్యవహారంలో కూడా తాను చెప్పే వరకు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించినా గాని నేతల తీరులో.మార్పు రాలేదనే చర్చ పార్టీలో నడుస్తుందట. నియోజకవర్గంలో వనభోజన కార్యక్రమానికి వెళ్లిన కొలికపూడి మరో వివాదానికి ఆజ్యం పోశారు. ఆ తర్వాత కొలికికపూడి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ వివాదాన్ని రాజేస్తున్నారు. ఎంపీ వ్యవహార శైలి పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఎమ్మెల్యే లకి తలనొప్పిగానే మారిందని విమర్శలు గుప్పిస్తున్నారు. లోకేష్ మనిషిని అంటూ ప్రచారం చేసుకోవటంతో ఎంపీపై బహిరంగంగా మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు నిరాకరిస్తున్నారంట.
ఇంతలో మరోసారి కొలికపూడి సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేయడం హాట్‌టాపిక్ అయ్యింది. ఇలా వరుస వివాదాలు రావడంతో.. ఈసారి టీడీపీ అధిష్టానం శ్రీనివాసరావు .. ఎంపీ చిన్ని అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Story By Ajay, Big Tv