KCR: తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. సాగునీటి కేటాయింపుల విషయంలో అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు ప్రచారం జరిగింది. కేసీఆర్‌కు దీటుగా సమాధానం చేప్పేందుకు అధికార పక్షం కూడా సన్నద్ధమైంది. తీరా చూస్తే గులాబీబాస్ అలా అసెంబ్లీకి హాజరై ఇలా వెళ్లిపోయారు. తర్వాతైనా ఆయన అసెంబ్లీ సెషన్స్‌లో పాల్గొంటారా?.. అసలు మాజీ ముఖ్యమంత్రి లెక్కలేంటి?
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ వింటర్ సెషన్స్ ముందు నుంచి తెలంగాణ రాజకీయాలను హీటెక్కించాయి. ఈసారి సమావేశాలు హాట్ హాట్‌గా జరగబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగింది. రెండేళ్ళ పాటు సైలెంట్ గా ఉన్నాను. ఇక ఆగేది లేదు, తగ్గేది అంతకంటే లేదు అని రీసెంట్ గా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గర్జించారు. అంతే దీటుగా అధికార పక్షం కూడా సభలోనే తేల్చుకుందామంటూ సవాలు విసిరింది. దీంతో తెలంగాణ పాలిటిక్స్ హిటెక్కాయి.
సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ యాక్టివ్ అయిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోతున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెగ ప్రచారం చేసుకున్నారు. ఈ అంశంపై బీఆర్‌ఎస్ అధికారిక ప్రకటన వెలువరించనప్పటికి…కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని ఆ పార్టీ నేతలు భరోసాతో కనిపించారు. పార్టీ నేతలతో కేసీఆర్ నిర్వహించిన కీలక సమావేశంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్లు గులాబీ నేతలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లి బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చర్చ నడిచింది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని…అసెంబ్లీ వేదికగా నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నారని పార్టీ నేతలు భావించారు. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్‌ఎస్‌పైనే ఉందని కేసీఆర్ మాట్లాడుతున్నారు. అసెంబ్లీ వేదికగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని గులాబీ శ్రేణులు ఊదరగొట్టాయి.
ఆ క్రమంలో అసెంబ్లీకి ప్రారంభంకాకముందే అధికార, ప్రతిపక్షం మధ్య అసెంబ్లీ బయటనే సవాళ్లు…ప్రతిసవాళ్లు నడిచాయి. సాగునీటి కేటాయింపులు, ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును…ఇప్పటికే నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే సాగునీటి విషయంలో జనం లోకి వెళ్తాం, తేల్చుకుంటామని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణాలో మూడు భారీ సభలను కూడా కొత్త ఏడాది మొదట్లోనే నిర్వహించాలని కూడా ఆయన నిర్ణయించారు. ఇక మరోవైపు సాగునీటి ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు జనవరి 1న ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. బీఆర్ఎస్ హయంలో నీటిపంపకాలు, సాగునీటి ప్రాజెక్టు విషయంలో జరిగిన అన్యాయాన్ని ప్రజాప్రతినిధులు వివరించనున్నారు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్. సాగునీటి ప్రాజెక్టులు,నీటి కేటాయింపులో సభలో చర్చకు ముందే ప్రజాప్రతినిధులను వివరాలు తెలియజేసి..సభలో బీఆర్ఎస్‌ను కార్నార్ చేసేందుకు అధికార పక్షం వ్యూహారచన చేసింది.
ఇక కేసీఆర్ సభకు హాజరై ఏకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ తోనే సభలో బీఆర్ఎస్ వాదన వినిపిస్తారు అన్నారు. మరో వైపు చూస్తే ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరు అయ్యే విషయంలో మాత్రం ఒక స్పష్టత రావాల్సి ఉన్నా ఆయన హాజరు అయితేనే బాగుంటుందని అంతా అనుకున్నారు. అందరి అంచనాలకు తగ్గట్లే మాజీ మఖ్యమంత్రి తొలి రోజు శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. అయితే సభ ప్రారంభమైన 3 నిమిషాల్లోనే బీఆర్‌ఎస్ అధినేత బయటకు వెళ్లిపోయి సొంతపార్టీ వారికి షాక్ ఇచ్చారు.. సంతాప తీర్మానాలు ముగిసిన వెంటనే కేసీఆర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. దానికి ముందు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి నందినగర్‌లోని నివాసం నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎంకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఆపై కేసీఆర్‌ను ఎమ్మెల్యేలు సభలోకి తీసుకెళ్లారు. కేసీఆర్ వెళ్లిన కాసేపటికే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మిగతా సభ్యులు అందరికంటే ముందుగానే కేసీఆర్ వెళ్లి తన చైర్‌లో కూర్చున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు. అలాగే సీఎం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. ఆపై సభ ప్రారంభం కాగానే కొద్దిసేపు మాత్రమే సభలో ఉన్నారు కేసీఆర్. తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బయటికి వచ్చారు. అనంతరం అసెంబ్లీ నుంచి తిరిగి నందినగర్ నివాసానికి గులాబీ బాస్ వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం అయిదు రోజులు జరగనున్న ఈ సెషన్స్‌కు కేసీఆర్ తిరిగి హాజరవుతారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అదే టైంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ తొలి రోజు అసెంబ్లీకి వచ్చి వెళ్లిపోవడాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు హాజరు కోసమే ఆయన హజరయ్యారన్న విమర్శలు వచ్చాయి. ఈ సారి కూడా హాజరు లెక్కలతోనే కేసీఆర్ సభకు వచ్చి వెళ్లారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.. వెళ్లారు.
Story by Ajay, Big Tv