Narendra Modi: తెలంగాణకు చెందిన పార్టీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంత గుస్సా ఎందుకయ్యారు? ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, మరో ఎనిమిది మంది ఎంపీల స్థాయికి ఎదిగిన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో క్రమంగా ఎందుకు చతికిలపడుతోంది? ఇక అధికారంలోకి రావడమే తరువాయి అని తలపోసిన పార్టీ అగ్రనేతలకు తత్వం బోధపడిందా? లోపం పార్టీ రాష్ట్ర నాయకుల్లోనే కాకుండా కేంద్ర నాయకత్వంలో కూడా ఉందా?
తెలంగాణకు చెందిన పార్టీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల జరిగిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అధికారంలోకి రావడమే తరువాయి అని తలపోసిన పార్టీ అగ్రనేతలకు ప్రస్తుత పరిణామాలతో లోపం పార్టీ రాష్ట్ర నాయకుల్లోనే కాకుండా కేంద్ర నాయకత్వంలో కూడా ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయంట. తెలంగాణలో కొంత కాలంగా పార్టీ చల్లబడుతూ వస్తోంది. దాదాపు ఐదేళ్ల క్రితం జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠానికి చేరువగా వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, అప్పుడు ఒకటి రెండు కార్పొరేటర్ సీట్లకు పరిమితం చేసి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించింది.
ఆ తర్వాత బండి సంజయ్ నాయకత్వంలో మరింత దూకుడు ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో శాసనసభ ఎన్నికలకు ముందు బండి సంజయ్ నాయకత్వాన్ని మార్చారు. కారణం ఏమైనప్పటికీ అప్పటి నుంచి పార్టీ దూకుడు తగ్గింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా కారణంగా అధికార కాంగ్రెస్‌తో సమానంగా ఎనిమిది సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత నుంచి పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారైంది. ఇందుకు పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయాలు కొంత కారణం అయితే, పార్టీ రాష్ట్ర నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు మరొక కారణమంటున్నారు.
రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో వివిధ పార్టీలకు చెందిన బలమైన నాయకులను బీజేపీలో చేర్చుకున్నారు. దీంతో భవిష్యత్తుపై పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో శాసనసభకు ఎన్నికలు రావడం, పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించడం జరిగింది. దీంతో పాల పొంగుపై నీళ్లు చల్లినట్టయింది. సదరు పరిణామం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆరు నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి చెందిన బలమైన నాయకులను బీజేపీ కేంద్ర నాయకత్వం ఎన్నికల బరిలోకి దించింది. దీంతో కాంగ్రెస్‌తో సమానంగా ఎనిమిది స్థానాలను పార్టీ గెలుచుకోగలిగింది.
ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. నివురుగప్పిన నిప్పులా పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు పార్టీని దెబ్బతీశాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ మొదటి నుంచీ బలంగా ఉండేది. పటిష్ఠమైన కేడర్ ఉండేది. ఏ ఎన్నికలు జరిగినా గట్టి పోటీ ఇచ్చేది. కానీ కొన్ని రోజుల క్రితం జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏకంగా డిపాజిట్ కోల్పోయారు. దీంతో పార్టీ కేంద్ర నాయకత్వానికి తత్వం బోధపడినట్లు కనిపిస్తోంది. రెండేళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ని వెనక్కు నెట్టి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని బీజేపీ అగ్రనేతలు తలపోశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి వచ్చిన పొత్తు ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రాంతీయ పార్టీలు బలపడకూడదన్న పార్టీ విధానానికి అనుగుణంగా బీఆర్‌ఎస్ చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను సైతం తిరస్కరించారు.
అయితే అంతర్గత కుమ్ములాటలతో పార్టీ బలహీనపడుతున్న విషయాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం గుర్తించలేకపోయింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీతో పొత్తుకు బీఆర్ఎస్ సిద్ధపడిందని, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎప్పుడైనా కుదరవచ్చు అన్న ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాల్సిన తెలంగాణ బీజేపీ నాయకత్వం అక్కడ కూడా విఫలమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఈ ప్రచారం వల్ల లబ్ధి పొందాల్సిన పార్టీ ఆ దిశగా కృషి చేయలేదు. మరోవైపు కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయమని ప్రజలను నమ్మించే దిశగా బీఆర్ఎస్ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. మూడేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి పొత్తులు ఉంటాయా లేదా అన్నది పట్టించుకోకుండా సొంతంగా తన కాళ్ల మీద నిలబడడం కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పలు ఊహాగానాలు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా కేటీఆర్, హరీశ్ రావు ద్వయం పార్టీని ముందుకు నడిపించే బాధ్యత చేపట్టారు. కేసీఆర్ ఆరోగ్యం దెబ్బతినడం బీజేపీకి కలసి వచ్చే అంశమే. అయినప్పటికీ ఆ పార్టీ రాష్ట్ర నాయకులు తమకు అందివచ్చిన అవకాశాన్ని కూడా వదులుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని వ్యంగ్యంగా అంటూ ఉంటారు. బీజేపీలో అలా ఉండదని, ఆ పార్టీ క్రమశిక్షణకు మారు పేరని భావిస్తారు. అయితే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా తయారైంది. కాంగ్రెస్ నాయకుల వలే బహిరంగంగా ఒకరినొకరు విమర్శించుకోకపోయినా అంతర్గతంగా కత్తులు దూసుకోవడం మొదలెట్టారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది.
బీజేపీ సంస్కృతిని అర్థం చేసుకోలేక ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అయోమయానికి గురవుతున్నారు. క్షేత్ర స్థాయిలో బలం లేకపోయినా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారి మాట పార్టీలో చెల్లుబాటు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే కేంద్ర నాయకులు కూడా స్థానిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడంలో విఫలమయ్యారు. ఉత్తరాది రాష్ట్రాలలో అమలు చేసిన ఫార్ములానే తెలంగాణలోనూ అమలు చేశారు. దీంతో ప్రజా బలం ఉన్న నాయకులు పార్టీలో చేరినప్పటికీ సైలెంట్‌గా ఉండిపోయారు. ఈ నేపథ్యంలోనే బీసీ నాయకత్వం అంశం కూడా తెరపైకి వచ్చింది. పార్టీకి బీసీలే నాయకత్వం వహించాలన్న డిమాండ్ అంతర్గతంగా బలపడుతూ వచ్చింది. అలా అని బీసీ నాయకుల్లో ఐక్యత ఉందా అంటే అదీ లేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ కూడా బీజేపీ తన పట్టును ప్రదర్శించలేక పోయింది.
తాజాగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పనితీరు పేలవంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో పార్టీ బలపడింది అనేది పాల పొంగు వంటిదే అన్న అభిప్రాయం బలపడింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. నిజానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతోంది. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది. బీఆర్‌ఎస్ నుంచి సస్పెండైన కేసీఆర్ కుమార్తె, జాగృతి అధ్యక్షురాలు కవిత ఆ పార్టీకి తలపోటుగా మారారు. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి, అక్రమాలను ఆమె ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల చిట్టా విప్పడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సొంత సోదరుడు కేటీఆర్‌కు కూడా మినహాయింపు ఇవ్వడం లేదు. తాజాగా మరో అడుగు ముందుకేసి ఉద్యమ సమయంలో పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని కవిత ఆరోపించారు. ఆమె తన ఆరోపణలు, విమర్శలను పార్టీ నాయకులకే పరిమితం చేయకుండా కన్నతండ్రిని కూడా టార్గెట్ చేయడానికి వెనుకాడటం లేదు. తాజాగా ఆమె చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాన్ని అందిపుచ్చుకొని ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీజేపీ ఎందుకో స్తబ్దుగా ఉండిపోతోంది. ఇది గమనించడం వల్లనే కాబోలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. కవిత చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ఆసరాగా చేసుకొని బీఆర్ఎస్‌ని ఇరుకునపెట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి బీజేపీకి ఇది ఒక మహదావకాశం. అయితే కారణం తెలియదు గానీ, అలా జరగడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా భారత రాష్ట్ర సమితిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం జరగకపోవడం ఏమిటో కూడా తెలియదు.
మూడేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీతో పొత్తు కుదురుతుందన్న అభిప్రాయంతో బీజేపీ రాష్ట్ర నాయకులు సంయమనం పాటిస్తున్నారేమో తెలియదు. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ నిలదొక్కుకోవాలంటే కాయకల్ప చికిత్స అవసరం. పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా ఉన్న అంశాలను ముందుగా గుర్తించి విరుగుడు చర్యలు చేపట్టాలి. భవిష్యత్తులో భారత రాష్ట్ర సమితితో పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న విషయమై రాష్ట్ర స్థాయి నాయకులు, కార్యకర్తలకు పార్టీ కేంద్ర నాయకత్వం స్పష్టత ఇవ్వాలి. బీఆర్ఎస్ బలంగా ఉన్నంత కాలం తెలంగాణలో బీజేపీ బలపడలేదు. అధికార కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అన్న భావన ప్రజల్లో కల్పించకుండా ఏం చేసినా అది తమని తాము మోసం చేసుకోవడమే అంటున్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. అంతర్గత కుమ్ములాటలకు మారు పేరైన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పట్టును పెంచుకుంటుండగా, భారతీయ జనతా పార్టీలో ఆ స్థాయి నాయకుడు కనిపించకపోవడం పెద్దలోటుగా కనిపిస్తోందంటున్నారు.
Story By Ajay, Big Tv