TG CM Progress Report: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో.. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్ట్ అగ్రనేత దేవ్‌జీకి చెందిన దళం ప్రభుత్వం ముందు సరెండర్ అయింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కి చెందిన 130 మంది దళ సభ్యులు లొంగిపోయారు. పదుల సంఖ్యలో ఆయుధాలు, తుపాకులు, మందుగుండు సామాగ్రిని.. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జన జీవనంలోకి వచ్చిన మావోయిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి పునరావాసం కల్పించే బాధ్యత తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. జేఎన్‌టీయూ ఆడిటోరియంలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నామని తెలిపారు. వారు ఆర్థికంగా బలపడాలనే ఆలోచనతోనే.. మహిళాశక్తి పథకం తీసుకొచ్చామని తెలిపారు. మహిళలపై ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలే యజమానులని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని తెలిపారు. సోషల్ మీడియాలో మహిళలను వేధించే ఘటనలు కట్టడి చేయాలని సూచించారు.
దశాబ్దాల కాలంలో పాలకుల నిర్లక్ష్యం, కబ్జాదారుల స్వైరవిహారంతో కుంచించుకుపోయి, కనుమరుగైపోయిన హైదరాబాద్ చెరువులకు తిరిగి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రకృతి వనరులను మన స్వార్థానికి బలి చేస్తే, భవిష్యత్ తరాలకు తీరని ద్రోహం చేసినవాళ్లమవుతామన్నారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో చెరువుల పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోన్న హైడ్రాకు, సహకరిస్తున్న నగర ప్రజలకు అభినందనలు తెలిపారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో.. నిర్వాసితులకు నష్టం జరగకుండా అందరినీ ఆదుకుంటామని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో ఎవరినీ అనాధలను చేయబోమన్నారు. భూమి పోయినా, ఇండ్లు పోయినా ప్రభుత్వం మంచి నష్టపరిహారమిచ్చి ఆదుకుంటుందన్నారు. నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. బుద్వేల్ లేఅవుట్‌తో కలిపే రేడియల్ రోడ్-2 ఇంటర్‌చేంజ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కొత్వాల్‌గూడలో ఎకో పార్క్‌ను ప్రారంభించారు.
భవిష్యత్‌కు అనుగుణంగా మహానగరానికి ప్రణాళికలు మార్చుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఎవరూ మురికిలో బతకాలనుకోరని, విధిలేక మురికికూపాల్లో నివసిస్తున్నారని చెప్పారు. ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలన్నారు. పేదల గురించి ఆలోచించి, అందరినీ మెప్పించి, ఒప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఎక్కడ ఉన్న వాళ్లకు అక్కడే ఇండ్లు కట్టించడానికి ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్ చేసి.. నైట్ టూరిజంకు శ్రీకారం చుడతామన్నారు. ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి ఆయా నియోజకవర్గాల్లోనే ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. చిన్న కాలనీలు కాకుండా.. పెద్ద నగరమే నిర్మించాలన్న లక్ష్యంతోనే భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో అర్హులైన పేదవారందరికీ సంక్షేమ పథకాలు చేర్చాలనే లక్ష్యంతోనే.. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దళిత, గిరిజన, ఆదివాసీ, వెనుకబడిన బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో మేలు చేయడానికే.. ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందన్నారు. ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన క్రమంలో.. మాదిగ ఉద్యోగుల కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో.. ఈవారం సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ నిర్వహించారు. ఎంతో అభిమానంతో.. ఈ సభ ఏర్పాటు చేసినందుకు.. సీఎం సంతోషం వ్యక్తం చేశారు. దళితుల హక్కులను కాపాడటానికి, వాటిని చట్టబద్ధం చేసి రక్షణ కల్పించడానికి.. ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. వచ్చే అంబేద్కర్ జయంతిలోపు మాదిగల ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామన్నారు. ఇక.. రాజకీయపరమైన ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ మాదిగలకు అండగా నిలిచానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన ప్రయత్నంలో మంత్రివర్గ సహచరులు, అధికారులు అండగా నిలిచారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణే అన్నారు. సమస్యలను పరిష్కరిస్తున్న సమయంలో.. వెనకనుంచి జరిగే దాడులను ఆపాలి.. అండగా నిలవాలన్నారు. దళితజాతి ముందుకు నడవాలంటే విద్య అవసరం అన్నారు. విద్య ఒక్కటే అందరి జీవితాల్లో మార్పు తెస్తుందన్నారు సీఎం.
రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళల సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మంది డ్వాక్రా మహిళలకు.. 30 రకాల అత్యవసర వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేస్తారు. రాబోయే ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల ఆరోగ్యంపై పూర్తి అవగాహన పెంచుకోవడంతో పాటు.. వారికి శాశ్వత డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‍ని తయారుచేస్తారు. తొలి విడతలో ప్రతి జిల్లా నుంచి ప్రాధాన్యత కలిగిన 5 మండలాలను ఎంపిక చేస్తారు. రెండో విడతలో 10 మండలాలు, చివరి విడతలో రాష్ట్రంలోని మిగిలిన అన్ని మండలాల్లోని మహిళలకు స్క్రీనింగ్ పూర్తి చేసి, వైద్య సేవలు అందిస్తారు. కేవలం మహిళలే కాకుండా.. చిన్నారుల ఆరోగ్యంపైనా సర్కార్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. మార్చి 6 నుంచి 26వ తేదీ వరకు అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా విద్యార్థుల్లో రక్తహీనత సమస్యను గుర్తించి, వారికి అవసరమైన చికిత్స, పౌష్టికాహార సలహాలను అందించనున్నారు.
ఈ వారం ఢిల్లీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశారు. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ ఆలస్యంగా 2025లో జరిగిందని గుర్తుచేశారు. అప్పుడు కూడా కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని తెలిపారు. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని.. హోంమంత్రికి వివరించారు సీఎం. గ్రేటర్ సిటీలో భారీగా జనాభా పెరుగుతున్న క్రమంలో.. పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందన్నారు. మూడో క్యాడర్ రివ్యూని.. ఈ ఏడాదిలోనే చేపట్టాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 83 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారని, ఈ సంఖ్యను 103కి పెంచాలని కోరారు. అదేవిధంగా.. మావోయిస్టుల అగ్ర నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం అంశాలపై.. అమిత్ షాతో చర్చించారు సీఎం. తెలంగాణలో 591 మంది మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సహకరించాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ ఆలోచనను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని చెప్పారు. 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై.. ఈ వారం కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ 3 నెలలు జిల్లా కలెక్టర్ల పనితీరుకు కొలమానమని, వారి సర్వీస్.. కెరీర్‌కు పునాదిగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జిల్లా కలెక్టర్లు వారధిగా పని చేయాలని చెప్పారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులేనని, క్షేత్రస్థాయిలో పర్యటించకపోతే ప్రజా సమస్యలు అర్థం కావని చెప్పారు. నెలలో కనీసం 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు.
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులందరి సమన్వయం, భాగస్వామ్యంతో 99 రోజుల ప్రణాళిక అమలు చేయాలన్నారు. శాఖల వారీగా 10 వారాలు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, ముందుగా నిర్వహించే కార్యక్రమాలన్నీ వేడుకలా జరగాలని సూచించారు. గ్రామ, వార్డు సభల్లో నూతనంగా ఇచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలన్నారు. అర్హులకే లబ్ధి చేకూర్చేలా ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుల ఫేషియల్ రికగ్నైజేషన్‌తో చేపట్టాలన్నారు. జూన్ 12న అన్ని స్కూళ్లలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. భూభారతి దరఖాస్తులన్నీ గడువులోగా పరిష్కరించాలన్నారు సీఎం. ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. యుద్ధ వాతావరణంలో.. ఇరాన్, దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారు ఎప్పటికప్పుడు ఆయా దౌత్య కార్యాలయాల గైడ్‌లైన్స్ పాటించాలని కోరారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఈ అత్యవసర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో.. తెలంగాణ పౌరులు, వారి కుటుంబాలకు సాయం చేసేందుకు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర పౌరులకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సకాలంలో సాయం అందించడానికి అవసరమైన ప్రతి చర్య తీసుకుంటోంది.
Also Read: పవన్ శాఖలో గందరగోళం.. తిరుపతిలో ఫారెస్ట్ అధికారుల హడావిడి
Story by: Anup, Big Tv