CM Revanth Reddy: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.. ఇప్పుడు టెక్ వరల్డ్‌ని శాసిస్తున్న టెక్నాలజీ. ఏఐ విషయంలో పాలకులకు ఉండాల్సింది విజన్ మాత్రమే కాదు, ప్రభుత్వాలు తక్షణమే చేపట్టాల్సిన అంశాలను.. దేశ రాజధాని వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్‌గా వివరించారు. ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొని, కీలకమైన విషయాలు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్‌లో ఉన్న కంటెంట్‌కు అక్కడున్న ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. భారత ప్రభుత్వ సహకారంతో తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్, హైదరాబాద్‌లో ఏఐ వార్‌రూమ్ ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఏఐ రంగంలో ఇండియా పవర్ హౌస్‌గా మారాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వంలో.. ఏఐ కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఏఐ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత లాంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు.. ప్రత్యేక వ్యవస్థ అవసరమన్నారు. ఈ రంగంపై చర్చలు, భాగస్వామ్యాల కోసం అందరినీ తెలంగాణకు ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో పనిచేసేందుకు ముందుకు రావాలని, జాతీయ, అంతర్జాతీయ సంస్థలను కోరారు. ఈ రంగంలో కలిసి పనిచేసేందుకు వీలుగా.. నేషనల్ లెవెల్‌లో ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఎట్టి పరిస్థితుల్లో.. ఇండియా ఏఐ రెవల్యూషన్‌ని కోల్పోవద్దన్నారు. స్పష్టమైన విధానాలు, బలమైన సంస్థలు, వ్యూహాత్మక పెట్టుబడులతో.. భారతదేశం నామమాత్రపు పాత్రలో కాకుండా కృత్రిమ మేధస్సు రంగంలో వరల్డ్ లీడర్‌గా అవతరించగలదని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ నిర్వహించింది. ఈ సమావేశంలో.. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గం అంతా ఈ సమావేశానికి హాజరైంది. తెలంగాణలో ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై.. ఈ మీటింగ్‌లో చర్చించారు. రాష్ట్రంలో సుమారు 80 శాతం మంది ప్రజలు.. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆస్వాదిస్తున్నారని, మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని.. కాంగ్రెస్ అగ్రనేతలు కొనియాడారు. ఇప్పటివరకు అన్ని సానుకూలంగా సాగాయని, భవిష్యత్‌లోనూ ఇదే పట్టుదలతో మంచి ఫలితాలు సాధించాలని నాయకత్వానికి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో.. మంత్రులు తమ శాఖల పనితీరు, అమలు చేస్తున్న కీలక పథకాలను కాంగ్రెస్ హైకమాండ్‌కు వివరించారు.
సమ్మక్క సారలమ్మ జాతరను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా.. విజయవంతంగా నిర్వహించిన తీరును మంత్రి సీతక్క వివరించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ, వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిపోర్ట్ ఇచ్చారు. పేదలకు ఇళ్ల నిర్మాణం, భూ-భారతి కార్యక్రమం ద్వారా చేపట్టిన భూసర్వే వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పామాయిల్ తోటల పెంపకం, రైతులకు కలిగే ప్రయోజనాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. గిగ్ వర్కర్స్ కోసం ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త విధానం గురించి మంత్రి వివేక్ వివరించగా, ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలని.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచించారు. ముఖ్యంగా.. తెలంగాణ రైజింగ్ 2047 విజన్, రాబోయే సంవత్సరాల్లో చేయాల్సిన పనులపై రోడ్ మ్యాప్‌పై చర్చించారు. కీలక హామీల అమలు, పాలనా ప్రాధాన్యతలు, అభివృద్ధి పురోగతి, ప్రజా-కేంద్రీకృత ప్రచార కార్యక్రమాలు, నిర్మాణాత్మక సంస్కరణలు, సామాజిక న్యాయం లాంటి వాటికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రైతులు, యువత సాధికారత, పురోగతి, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల్లో.. కాంగ్రెస్ ప్రభుత్వానికి విస్తరిస్తున్న ప్రజా మద్దతు గురించి.. అధినాయకత్వానికి వివరించారు.
తెలంగాణ అంటే వ్యాపారమని, తెలంగాణ ఎదుగుదలలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న నగరాన్ని.. ప్రపంచ జీవవైజ్ఞానిక రాజధానిగా హైదరాబాద్ ఎదుగుతోందన్నారు. ప్యూర్ జోన్‌ని.. దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి.. చైనా ప్లస్ వన్ ఆల్టర్నేట్‌గా తెలంగాణని నిలబెట్టడమే.. ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌ని కాలుష్యరహిత గ్రీన్, నెట్ జీరో సేవల కేంద్రంగా అభివృద్ధి చేసి, పట్టణాభివృద్ధిలో హైదరాబాద్ నగరాన్ని దేశానికే ఓ మోడల్‌గా నిలబెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని, రాబోయే ఐదేళ్లలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లో కాలుష్య కారక పరిశ్రమలు ఉండవని స్పష్టం చేశారు. ఈ వారం ముంబైలో జరిగిన ముంబై క్లైమేట్ వీక్ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నగరాభివృద్ధి, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపై తెలంగాణ విజన్‌ని వివరించారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోనూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయన్నారు. రీజినల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్‌కు మధ్య ఉన్న ప్రాంతాన్ని PURE జోన్‌గా మార్చి.. దేశంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసి చైనా ప్లస్ వన్ ఆల్టర్నేట్‌గా తెలంగాణని నిలబెట్టడమే.. తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం.
డాటా సెంటర్ల ఏర్పాటు విషయంలో మిగతా రాష్ట్రాలు కొనసాగిస్తున్న రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డాటా సెంటర్లకు భూ కేటాయింపులో హేతుబద్ధత ఉండాలని సూచించారు. రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలు, వారికి అవసరమైన భూమి, ఇతర వసతులపై.. ఈ వారం సచివాలయంలో సమీక్షించారు. భూ పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా ఉండాలని సూచించారు. రైతులతో మాట్లాడి, వారు సంతృప్తి చెందేలా పరిహారం నిర్ణయించాలన్నారు. కంపెనీలకు సకాలంలో భూమి, ఇతర వసతులు అందుబాటులో ఉంచితే త్వరగా పనులు పూర్తి చేసుకుంటారన్నారు సీఎం.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి నగర పాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పరిశుభ్రత విషయంలో క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలన చేస్తానని, ఎక్కడైనా చెత్త కనపడితే సహించనని హెచ్చరించారు. మూడు నగర పాలక సంస్థల కమిషనర్లు.. ఉదయం ఆరు గంటలకే క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలని ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై.. ఈ వారం సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. గ్రేటర్ కార్పొరేషన్ల పరిధిలో ప్రకటనల ఆదాయం పెంపు పాలసీపై సమీక్షించారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రకటనలకు 10 శాతం బోర్డులు కేటాయించాలని సూచించారు. నెక్లెస్ రోడ్డుతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలన్నారు.
లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి హైదరాబాద్‌లో పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే నగరంలో అనేక సంస్థలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశాయని పారిశ్రామిక వేత్తలకు వివరించారు. బయోఏషియా 2026 సదస్సులో భాగంగా.. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ఈవారం సీఎం భేటీ అయ్యారు. జీవవైజ్ఞానిక రంగంలో జీసీసీలు, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు అనుగుణంగా.. భారత్ ఫ్యూచర్ సిటీలో స్పెషల్ జోన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. త్వరలోనే.. ఒపెలా హెల్త్‌కేర్ జీసీసీ ఏర్పాటు చేయనుంది. ఇండొనేషియాకు చెందిన వాక్సిండో ఎనిమల్ హెల్త్‌కేర్ విభాగం జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ట్రిడెన్స్ ఇన్‌కార్పొరేషన్, ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ కంపెనీలు.. త్వరలోనే హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నాయి.
వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్.. జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు దిగ్గజ కంపెనీలు, శాస్త్రవేత్తలు, నిపుణులు భాగస్వాములు కావాలని.. బయోఏషియా-2026 సదస్సు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో.. తెలంగాణ పోటీ పడుతోందన్నారు. ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు గమ్యస్థానంగా మారిన నగరాన్ని, జీవవిజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదామని కోరారు. గడిచిన రెండేళ్లలో జీవవిజ్ఞాన రంగంలో 73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు సీఎం. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో.. తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించామని, జినోమ్ వ్యాలీని విస్తరించామని తెలిపారు. ప్రపంచ స్థాయి పరిశోధనలు, ఆవిష్కరణల కోసం వన్-బయో ప్రారంభించామన్నారు.
రాష్ట్రంలోని రైతులకు.. ప్రజా ప్రభుత్వం ఈ వారం శుభవార్త చెప్పింది. సన్నవడ్ల బోనస్ కోసం 514 కోట్లు విడుదల చేసింది. తెలంగాణలో సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తామన్న మాటకు కట్టుబడి.. ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వానాకాలంలో సన్నవడ్లు అమ్మిన 2 లక్షల 17 వేల మంది రైతులకు బోనస్ డబ్బులు విడుదల చేసింది. కొంతకాలంగా బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన రైతులకు ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చింది. పంట పెట్టుబడి పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్న రైతులకు బోనస్ డబ్బులు ఆసరాగా నిలవనున్నాయి.
బంజారాల ఆరాధ్య దైవం, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించుకునేలా, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యద్భుతంగా పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామన్నారు.
రాష్ట్రంలోని అన్ని తండాలు, గూడాలకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలని, అందుకోసం స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. కనెక్టివిటీ కోసం బీటీ రోడ్డుతో పాటు ప్రతి పంచాయతీలో పాఠశాల, పంచాయతీ భవనం ఉండాలని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో, పునర్నిర్మాణంలో లంబాడా సోదరుల పాత్ర మరువలేనిదన్నారు. వారికి సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంలో సముచిత స్థానం, గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.
Story by: Anup, Big Tv