E-Paper
Advertisement

Drugs Case: యువతకు నీతులు.. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీలు.. మన నేతల అసలు రంగు ఇదేనా?

Drugs Case: యువతకు నీతులు.. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీలు.. మన నేతల అసలు రంగు ఇదేనా?

Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు డ్రగ్స్ అనేది కేవలం ఓ క్రైమ్ న్యూస్ కాదు. అదొక.. సామాజిక క్యాన్సర్‌గా మారిపోయింది. చివరికి తెల్ల చొక్కాల మాటున కూడా సాగుతున్న.. ఈ నల్ల దందా అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఒకప్పుడు డ్రగ్స్ అంటే.. గోవాకో, ముంబైకో పరిమితమైన వ్యవహారం. కానీ, గత ఐదారేళ్లుగా తెలుగు రాష్ట్రాల నలుమూలలా ఈ పదం మార్మోగుతోంది. ఏకంగా.. ప్రజా ప్రతినిధులే నేరుగా డ్రగ్స్ కేసుల్లో దొరికిపోవడం చూస్తుంటే.. మన వ్యవస్థ ఏ పరిస్థితుల్లో ఉందో అర్థంచేసుకోవచ్చు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసే వాళ్లు, యువత డ్రగ్స్‌కు బానిసలు కావొద్దని.. చట్టసభల్లో గంభీరమైన ప్రసంగాలు చేసే నాయకులే, ఫామ్‌హౌస్‌ల్లో డ్రగ్స్ సంబంధిత కేసుల్లో పట్టుబడటం మరీ దారుణం. ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే.. మార్గం తప్పి ప్రవర్తిస్తుంటే.. రేపటి తరం ఎటువైపు వెళ్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్.

టీడీపీ రియాక్షన్ స్పీడ్.. ఎంపీకి షోకాజ్ నోటీసులు

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం రేపిందో చూశాం కదా! బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేశ్ కుమార్ యాదవ్ సహా.. మొత్తం 11 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. రోహిత్ రెడ్డి, పుట్ట మహేశ్ సహా.. మరో నలుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలడం సంచలనంగా మారింది. ప్రస్తుతం.. ఎంపీ పుట్ట మహేశ్ బెయిల్‌పై ఉండగా, ఫామ్‌హౌస్‌లో కాల్పులకు పాల్పడిన విషయంలో రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇప్పుడీ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ డ్రగ్స్ కేసు ఘటనని ప్రతిపక్ష పార్టీలు అస్త్రంగా మలచుకోకముందే.. తెలుగుదేశం అధిష్టానం కొన్ని గంటల్లోనే రియాక్ట్ అయింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎంపీ పుట్టా మహేశ్‌కు.. టీడీపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఆరోపణలపై 5 రోజుల్లో లిఖితపూర్వక వివరణ అందజేయాలని ఆదేశించింది. వివరణ ఆధారంగా అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని నోటీసులో తెలిపింది.

2 రోజుల ఆలస్యంపై బీఆర్ఎస్‌పై విమర్శలు

తెలుగుదేశం పార్టీ అధిష్టానం డ్రగ్స్ కేసు వ్యవహారం గురించి తెలిసిన కొద్ది గంటల్లోనే రియాక్ట్ అయితే, బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం.. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వివరణ అడిగేందుకు 2 రోజులు టైమ్ తీసుకుంది. డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి ఆయనకు పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీకి హాజరయ్యారనే మీడియా కథనాలను పార్టీ తీవ్రంగా పరిగణించిందని, ఈ పరిణామాలపై 7 రోజుల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలతో, సంబంధం కలిగి ఉండటం పార్టీ విలువలకు, ప్రతిష్టకు విరుద్ధమని.. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. వివరణ ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు, అధికారిక సమావేశాలకు దూరంగా ఉండాలన్నారు.

గడువులోపు సంతృప్తికరమైన వివరణ ఇవ్వని పక్షంలో.. ముందస్తు నోటీసు లేకుండానే పార్టీ రాజ్యాంగం, నిబంధనల ప్రకారం.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో స్పష్టం చేశారు. తమ పార్టీ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డికి.. బీఆర్ఎస్ షోకాజ్ నోటీసు జారీ చేసే లోపే, పొలిటికల్‌గా పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయం తెలిసిన కొద్ది గంటల్లోనే.. నోటీసులు జారీ చేసి ఉంటే.. రోహిత్ రెడ్డి విషయంలోనూ, డ్రగ్స్ విషయంలోనూ.. బీఆర్ఎస్ సీరియస్‌నెస్ ఏమిటో ప్రత్యర్థి పార్టీలతో పాటు ప్రజలకు కూడా అర్థమయ్యేది. కానీ, 2 రోజుల తర్వాత తేరుకొని షోకాజ్ నోటీసులివ్వడం చూశాక.. తలో రకంగా చర్చించుకుంటున్నారు.

డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయ్ ఆస్తుల డీల్..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారిన ఈ డ్రగ్స్ పార్టీ వెనుక.. దుబాయి ఆస్తుల పంచాయితీ ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. దుబాయ్‌లో టాలీవుడ్ నిర్మాత కేదార్ మరణం తర్వాత.. ఆస్తుల పంచాయితీ తేల్చుకునేందుకే.. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌ హౌస్‌లో పార్టీ పెట్టారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయ్. కొందరు రాజకీయ, సినీ ప్రముఖులు కేదార్ ద్వారా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలున్నాయ్. ఏడాది కిందటే అతను దుబాయ్‌లోని ఓ ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆ సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారనే ప్రచారం కూడా సాగింది.

ఇరాన్ దాడుల ఎఫెక్ట్..?

దుబాయ్‌పై ఇరాన్ దాడులతో.. తమ పెట్టుబడుల విషయంలో రోహిత్ రెడ్డితో చర్చించేందుకే మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ను వేదిక చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. అక్కడ డ్రగ్స్ పార్టీ జరగడం, పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో.. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇది.. బీఆర్ఎస్ పార్టీకి చేయాల్సినంత డ్యామేజ్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే ఈ డ్రగ్స్ వ్యవహారం రాజకీయంగా నలుగుతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచీ డ్రగ్స్ వ్యవహారంలో బీఆర్ఎస్‌ని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకే డ్రగ్స్ పాజిటివ్ రావడంతో.. గులాబీ పార్టీకి నెగటివ్‌గా మారిందనే చర్చ జరుగుతోంది. అధికార కాంగ్రెస్ కూడా.. బీఆర్ఎస్ డ్రగ్స్‌ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తోంది.

రోహిత్ రెడ్డి కేసులో కీలక మలుపు

పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసుకి సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు మూలాలను, ఇంటర్నేషనల్ లింక్స్‌ని చేధించేందుకు.. రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. డ్రగ్స్ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు? ఫామ్‌హౌస్‌ దాకా డ్రగ్స్ ఎలా వచ్చాయి? దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ జరపనున్నారు. ఈ డ్రగ్స్ దందాతో.. దుబాయ్‌కు ఉన్న లింకులపైనా సిట్ ఆరా తీయనుంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని, నమిత్ శర్మను కస్టడీలోకి తీసుకొని విచారించాలని సిట్ భావిస్తోంది.

కేటీఆర్ కూడా టెస్ట్ చేయించుకోవాలి

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలిన తర్వాత.. కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు. మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసుపై కేటీఆర్‌ బ్యాచ్ సమాధానం చెప్పాలని.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయం లేదని.. ఈగల్ టీమ్ తమ కర్తవ్యాన్ని నెరవేర్చిందన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ సహా ఇతర కాంగ్రెస్ నేతలు కేటీఆర్‌కు నేరుగా సవాల్ విసిరారు. రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీలో దొరకడంతో.. కేటీఆర్ కూడా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో.. డ్రగ్స్ విచ్చలవిడిగా సప్లై అయ్యాయని, కేటీఆర్ అనుచరులు, సన్నిహితులకు డ్రగ్స్ అలవాటు ఉందనే అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అవసరమైతే.. డ్రగ్స్ టెస్టులకు కేటీఆర్ సిద్ధం కావాలని, అసెంబ్లీ సమావేశాల సమయంలోనే.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం కలిసి టెస్టులు చేయించుకుందామన్నారు మహేశ్ కుమార్ గౌడ్.

కేటీఆర్ రియాక్షన్.. ఎప్పుడైనా టెస్ట్‌కు రెడీ

కేటీఆర్ కూడా ఈ ఆరోపణలపై రియాక్ట్ అయ్యారు. తాను ఎప్పుడైనా, ఏ రకమైన డ్రగ్ టెస్టుకైనా సిద్ధమని ప్రకటించారు. రోహిత్ రెడ్డి వ్యవహారంలోకి బీఆర్ఎస్ పార్టీని లాగడం.. రాజకీయ కక్ష సాధింపు అన్నారు. డ్రగ్స్ తీసుకున్న వారెవరైనా సరే.. కఠినంగా శిక్షించాలని ట్వీట్ చేశారు. అంతేకాదు.. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్ టెస్టు తీసుకోవాలన్న.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచనని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అనవసరంగా తన పేరుని డ్రగ్స్ కేసుల్లోకి లాగితే ఊరుకునేది లేదని, అసత్య ప్రచారాలు చేస్తే లీగల్ నోటీసులు ఇస్తానని హెచ్చరించారు. అయితే.. ఈ డ్రగ్స్ వ్యవహారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ.. పొలిటికల్ హీట్‌ని అమాంతం పెంచేసింది. శాసనమండలి వేదికగా.. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ డ్రగ్స్ ఇష్యూపై తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో.. గంజాయి, కొకైన్ విచ్చలవిడిగా దొరకడానికి పదేళ్ల బీఆర్ఎస్ పాలనే కారణమని మండిపడ్డారు. రాష్ట్రంలో బిస్కెట్లు, చాక్లెట్ల మాదిరిగా డ్రగ్స్ దొరుకుతున్నాయని, కొందరు నేతలే స్వయంగా డ్రగ్స్ దందా చేయడం సిగ్గుచేటన్నారు. డ్రగ్స్ టెస్టులకు.. సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించే బాధ్యత తనదని, ప్రతిపక్ష నేత కేసీఆర్, కేటీఆర్ డ్రగ్ టెస్టులకు వస్తారా? అని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

ధైర్యం ఉంటే టెస్టులకు రండి

కాంగ్రెస్ తరఫున బీ-ఫామ్స్ అందుకున్న వాళ్లందరినీ తాము టెస్టులకు తీసుకొస్తామని, ధైర్యం ఉంటే బీఆర్ఎస్ కూడా వారి సభ్యులందరినీ తీసుకురావాలని మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో పట్టుబడింది బీఆర్ఎస్ నాయకుడు కాదా? అని ప్రశ్నించారు. గతంలో టెస్టులకు భయపడి పారిపోయిన వారెవరో ప్రజలకు తెలుసన్నారు. ఇప్పటికే.. పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసు జారీ చేయడం, మరోవైపు మండలిలో మహేశ్ కుమార్ గౌడ్ విసిరిన డ్రగ్ టెస్ట్ ఛాలెంజ్.. తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది.

కేటీఆర్ మాటలేనా? టెస్టుల దాకా వస్తారా?

అప్పట్లో.. ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర కేసుతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన పైలట్ రోహిత్ రెడ్డి.. ఇప్పుడు డ్రగ్స్ పార్టీ ఆరోపణలతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో నైతికత, డ్రగ్స్ సంస్కృతి, ప్రజాప్రతినిధుల బాధ్యతపై పెను దుమారాన్ని రేపుతోంది. సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల ఓట్లతో గెలిచిన నేతలు ఇలాంటి వ్యసనాలకు బానిసలైతే, వారు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టగలరా? అనేది ప్రశ్న తలెత్తుతోంది. చట్టసభల్లో కూర్చునే నేతలు ఆదర్శంగా ఉండాలి. ఓ మాజీ ఎమ్మెల్యేకే డ్రగ్స్ పాజిటివ్ రావడమంటే.. వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం పోతుంది. అయితే.. తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్న ఈ డ్రగ్స్ వ్యవహారంపై.. తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు.. బీఆర్ఎస్ నాయకత్వం డ్రగ్ టెస్టులకు సై అంటుందా? లేదా? అన్నది ఆసక్తి రేపుతోంది. కేటీఆర్ చెప్పింది.. కేవలం మాటల వరకేనా? టెస్టుల దాకా వస్తారా? అనేది కూడా చర్చకు వస్తోంది. ఒకవేళ.. ప్రజాప్రతినిధులందరికీ.. అసెంబ్లీ వేదికగా డ్రగ్ టెస్టులు నిర్వహిస్తే, అది భారత రాజకీయాల్లోనే సంచలనంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో.. ఈ డ్రగ్ టెస్ట్ పాలిటిక్స్.. ఎక్కడి దాకా దారితీస్తాయన్నది ఉత్కంఠగా మారింది.

Also Read:అధిష్టానం సీరియస్.. నేతలు లైట్.. జనసేనలో అసలు ఏం జరుగుతోంది?

Story by: Anup, Big Tv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×