E-Paper
Advertisement

ఫ్యూచర్ సిటీ రద్దు? హరీష్ రావు సంచలన వ్యాఖ్యల వెనుక అసలు కథ ఇదేనా!

ఫ్యూచర్ సిటీ రద్దు? హరీష్ రావు సంచలన వ్యాఖ్యల వెనుక అసలు కథ ఇదేనా!
Advertisement

Future City: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అతి కీలక నిర్ణయాల్లో ఒకటి ఫ్యూచర్ సిటీ నిర్మాణం. ప్రస్తుత హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించేలా.. సరికొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచనతో ఫ్యూచర్‌ సిటీకి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే పలు కీలక నిర్మాణాలకు శంకుస్థాపనలు కూడా జరిగాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయం.. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్.. అంతర్జాతీయ స్థాయిలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్‌కు పునాది రాళ్లు కూడా పడ్డాయి. ఇవి కాకుండా.. ఇండస్ట్రియల్ పార్క్.. ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ పేరుతో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం, ఇతర స్పోర్ట్స్ సిటీల ఏర్పాటుకు సంబంధించి కూడా భూకేటాయింపులు, డిజైన్లు దాదాపు పూర్తయ్యాయి. అంతేకాద కనెక్టివిటీ పనులకు కూడా అంకురార్పణ జరిగింది.

సంచలన సృష్టించిన హరీష్ రావు వ్యాఖ్యలు

Advertisement

సరిగ్గా ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఓ సంచలనం అనే చెప్పాలి. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన, భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని వంద శాతం రద్దు చేస్తామని, దాని స్థానంలో తాము ప్రతిపాదించిన ఫార్మా సిటీని యథావిధిగా కొనసాగిస్తామంటున్నారు. మరి హరీష్‌రావు ఏదో నోటిమాటగా ఇలా చేస్తున్నారా? అంటే కాదని చెప్పాలి. దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నట్టు ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిని పక్కనపెట్టి, ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు హరీష్‌ రావు.

లీగల్ పాయింట్స్ తెరపైకి తీసుకొచ్చిన హరీష్ రావు

Advertisement

హరీష్‌రావు ఇందులో ఒక లీగల్‌ పాయింట్‌ను తెరపైకి తీసుకొస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం దాదాపు 16 వేల 500 ఎకరాల భూమిని సేకరించి, కేంద్ర పర్యావరణ శాఖ నుండి ప్రత్యేక అనుమతులు తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం.. సేకరించిన భూమిలో 75 శాతం ఫార్మా పరిశ్రమలకు, 25 శాతం నివాస, విద్య, వైద్య అవసరాలకు వాడాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనిని తలకిందులు చేసి 75 శాతం ల్యాండ్‌ను ఇతర వాణిజ్య అవసరాలకు కేటాయించి, కేవలం 25 శాతం మాత్రమే ఫార్మాకు ఉపయోగిస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ చేసిన భూసేకరణ చట్టం ప్రకారం.. రైతుల దగ్గర నుండి సేకరించిన భూమిని ఏ ఉద్దేశంతోనైతే తీసుకున్నారో, దానికి కాకుండా వేరే ప్రయోజనాలకు ఉపయోగిస్తే ఆ భూములను తిరిగి రైతులకే ఇచ్చేయాల్సి ఉంటుంది. సో.. ఫ్యూచర్ సిటీ ల్యాండ్ పూలింగ్ జిమ్మిక్కులు కోర్టుల ముందు నిలబడవనేది ఆయన చేస్తున్న వార్నింగ్.

హైదరాబాద్‌ను విస్తరించిన టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు

నిజానికి గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు… హైదరాబాద్‌ను విస్తరించాయి. తన హయాంలోనే సైబరాబాద్‌కు అంకురార్పణ జరిగిందని.. హైదరాబాద్‌ అభివృద్ధికి తానే కారణమని ఇప్పటికే చంద్రబాబు అనేక సార్లు ప్రకటిస్తూ ఉంటారు. సీఎం రేవంత్ కూడా ఇప్పుడు ఫ్యూచర్‌ సిటీకి శంకుస్థాపన చేసి.. హైదరాబాద్‌ను మరింత విస్తరించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. సరిగ్గా ఇప్పుడు ఇదే కారణం బీఆర్ఎస్ నేత చేత ఇలాంటి కామెంట్స్‌ చేయించిందనే చర్చ జరుగుతోంది.

ఫ్యూచర్ సిటీపై హరీష్‌రావు కామెంట్స్

హరీష్‌రావు ఇలాంటి స్టేట్‌మెంట్‌ వెనక పొలిటికల్ రీజన్ కూడా ఒక కారణమై ఉండొచ్చు. బీఆర్ఎస్ హయాంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా గ్రీన్ ఫార్మా సిటీని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే బీఆర్ఎస్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఈర్ష్యతోనే, కాంగ్రెస్ దాన్ని పక్కనబెట్టి రీ-బ్రాండింగ్ పేరుతో ఫ్యూచర్ సిటీని తెరపైకి తెచ్చిందనే కారణం కావొచ్చు. ఇక ఇలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చి అధికార పక్షం మెగా ప్రాజెక్టులపై అనుమానాలు రేకెత్తించి ప్రజల్లో, ఇన్వెస్టర్లలో ప్రభుత్వంపై నమ్మకం తగ్గించడం మరో వ్యూహమై ఉండొచ్చు. కారణం ఏదైనా.. ఒక్క స్టేట్‌మెంట్‌తో భవిష్యత్‌ నగరంపై ఒక్క స్టేట్‌మెంట్‌తో అనుమానాలు వచ్చేలా చేశారు హరీష్‌రావు. ఇప్పుడిదే విషయంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

హరీష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం

ఈ ఇద్దరు నేతలు మాత్రమే కాదు.. అనేక మంది కాంగ్రెస్ నేతలు ఇప్పుడు హరీష్‌ రావు తీరుపై మండిపడుతున్నారు. ఈ స్టేట్‌మెంట్‌ కారణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని, పెట్టుబడిదారులు వెనకడుగు వేసే ప్రమాదం ఉందంటూ ఫైర్ అవుతున్నారు. పాత ఫార్మా సిటీ వల్ల కాలుష్య సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే, తాము దేశంలోనే మొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని వివరణ ఇస్తున్నారు. ఇందులో కూడా కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ జోన్లు ఉంటాయని క్లారిటీ ఇస్తున్నారు.

ఫ్యూచర్ సిటీ చుట్టూ క్రెడిట్ వార్

ఇక్కడ హరీష్‌రావు టెక్నికల్ అంశాలను తెరపైకి తీసుకొస్తున్నా.. ఇక్కడ క్రెడిట్ వార్ అనేది క్లియర్ కట్‌గా కనిపిస్తోందని పొలిటికల్ అనలిస్ట్‌లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ మొదలైంది. బీఆర్ఎస్‌ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారిందని.. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజలు బీఆర్ఎస్‌ను క్షమించరంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.

19 వేల ఎకరాల్లో బీఆర్ఎస్ డ్రీమ్ ప్రాజెక్ట్

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫార్మాసిటీని తెరపైకి తీసుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా దీనిని డిజైన్ చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో సుమారు 19 వేల 333 ఎకరాల భారీ విస్తీర్ణంలో దీనిని ప్రతిపాదించారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం దీనికి నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ హోదాను కూడా కల్పించింది. దీనివల్ల కేంద్రం నుండి ప్రత్యేక నిధులు, అనుమతులు లభించాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 64 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని, లక్షన్నర మందికి ప్రత్యక్షంగా, మరో 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలని అప్పట్లో టార్గెట్‌గా పెట్టుకుంటారు.

కాలుష్య రహిత ఫార్మా హబ్ లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్

అంతేకాదు ఫార్మా కంపెనీల వల్ల వచ్చే కాలుష్యాన్ని అరికట్టేందుకు జీరో లిక్విడ్ డిస్చార్జ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. అంటే ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయన వ్యర్థ జలాలు బయటకు రాకుండా అక్కడికక్కడే శుద్ధి చేసేలా 3 వేల 500 కోట్లతో భారీ కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ప్లాన్ చేశారు. పరిశ్రమలకు కావాల్సిన నిపుణులను తయారు చేయడానికి ఇక్కడే ఒక ప్రత్యేక ఫార్మా యూనివర్సిటీ.. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్లను ప్రతిపాదించారు.

మెగా ఫార్మాసిటీపై కాంగ్రెస్ కొత్త వ్యూహం

నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్‌ను కొనసాగించింది. అనేక కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ మెగా ఫార్మా సిటీ ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చింది. నిజానికి నిలిపివేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిజం కాదనే చెప్పాలి. అయితే ఈ నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి కొన్ని కారణాలను ఒకే చోట 19 వేల ఎకరాల్లో వందలాది ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీలు ఏర్పాటు చేయడం అనేది ఒక రిస్క్. ఇలా చేస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలపై దీర్ఘకాలంలో తీవ్రమైన పర్యావరణ భారం పడుతుందని ప్రభుత్వం భావించింది. జీరో లిక్విడ్ డిస్చార్జ్ అన్నప్పటికీ.. భూగర్భ జలాలు, గాలి కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందనేది ఓ ఆందోళన.

ప్రతి జిల్లాకు ఉపాధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్లాన్

అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించడం ఎందుకు అనేది సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్న ప్రశ్న. అంతేకాదు కాలుష్య కారక పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. 19 వేల ఎకరాల్లో ఒకే మెగా ఫార్మా సిటీ పెట్టే బదులు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 1,000 నుండి 2,000 ఎకరాల చొప్పున 10 ఫార్మా విలేజెస్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల కాలుష్యం ఒకే చోట పేరుకుపోకుండా ఉండటంతో పాటు, వివిధ జిల్లాల యువతకు ఉపాధి లభిస్తుందనే ఆలోచన చేసింది.

గ్రీన్ ఫార్మా సిటీగా కొత్త రూపంలో ప్రాజెక్ట్

అంతేకాదు ఫార్మా సిటీ భూసేకరణ సమయంలో స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బలవంతపు భూసేకరణ జరిగిందంటూ వందలాది మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కోర్టు స్టేలు, చట్టపరమైన చిక్కుల వల్ల ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం లేదు. ఇది కూడా ప్రభుత్వం వెనకడుగు వేయడానికి మరో కారణం. మరి అసలు ఫార్మా కంపెనీలనే నిర్మించడం లేదా? అంటే అదీ కాదు. సేకరించిన భూమిలో గ్రీన్ ఫార్మా సిటీ, అంతర్జాతీయ స్థాయి లైఫ్ సైన్సెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో పర్యావరణానికి హాని కలిగించే కెమికల్, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు ఉండవు. కేవలం కాలుష్య రహిత, అధునాతన ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ సంస్థలకు మాత్రమే అనుమతి ఉంటుంది.

ఏఐ, డిజిటల్ హబ్‌లతో ఫోర్త్ సిటీ ప్లాన్

ఇక్కడ హరీష్‌రావు చెబుతున్నట్టు కేవలం ఫార్మా సిటీ భూముల్లోనే భారత్‌ ఫ్యూచర్ సిటీని నిర్మించడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఫార్మా సిటీ భూములకు అదనపు ల్యాండ్‌ను కలిపి సమగ్రంగా ఫోర్త్ సిటీ లేదా ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తూ.. అందులో ఏఐ, డిజిటల్ సిటీ, స్పోర్ట్స్ హబ్‌లతో పాటు ఈ లైఫ్ సైన్సెస్ జోన్‌ను కూడా ఒక భాగంగా ఉంచారు.

ఎవరి విజన్ కరెక్ట్?

సో బీఆర్ఎస్‌ ఫార్మా సిటీ అంటోంది.. కాంగ్రెస్ ఫ్యూచర్ సిటీ అంటోంది.. ఫార్మా సిటీ వస్తే వరల్డ్ వైడ్‌గా ఉన్న ఫార్మా కంపెనీల పెట్టుబడులన్నీ ఇక్కడికే వచ్చేవని, ఇది రాష్ట్ర జీడీపీని భారీగా పెంచేదని బీఆర్ఎస్ అంటోంది.. హైదరాబాద్ చుట్టుపక్కల కెమికల్ హబ్ పెడితే కాలుష్య నగరంగా మారుతుందని, దానికి బదులు లండన్, న్యూయార్క్ తరహాలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తే గ్లోబల్ బ్రాండ్ వస్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. సో..ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.

ఫ్యూచర్ సిటీకి లీగల్ చిక్కులున్నాయా?

నిజానికి హరీష్‌రావు చెప్పినట్టు ఇక్కడ కొన్ని లీగల్ చిక్కులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణలో పారదర్శకత, పరిహారం, పునరావాస హక్కు చట్టం-2013 ప్రకారం కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం ఏ ప్రభుత్వమైనా ఒక నిర్దిష్ట ఉద్దేశం కోసం రైతుల నుంచి భూమిని సేకరిస్తే, ఆ ఉద్దేశానికే దాన్ని వాడాలి. ఒకవేళ ఐదేళ్ల వరకు ఆ భూమిని ఉపయోగించకపోయినా, లేదా సేకరించిన ఉద్దేశాన్ని పూర్తిగా మార్చేసి రియల్ ఎస్టేట్ లేదా ఇతర వాణిజ్య ప్రయోజనాలకు వాడితే.. ఆ భూములను తిరిగి అసలు యజమానులకు లేదా ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్‌కు బదిలీ చేయాల్సి ఉంటుంది.

ఫ్యూచర్ సిటీకి కొత్త లీగల్ ట్విస్ట్

అంతేకాదు గత ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుండి ప్రత్యేక అనుమతులు సాధించింది. ఇప్పుడు ప్రాజెక్ట్ స్వభావాన్ని మార్చి, అక్కడ లేఅవుట్లు, స్పోర్ట్స్ సిటీలు, నివాస ప్రాంతాలు నిర్మిస్తే.. పాత పర్యావరణ అనుమతులు వర్తించవు. గతంలో కోర్టుకు సమర్పించిన ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లలో మేము ఫార్మా సిటీని రద్దు చేయడం లేదు, కొనసాగిస్తున్నామని చెప్పింది. ఒకవేళ క్షేత్రస్థాయిలో ఫార్మా సిటీని పూర్తిగా పక్కనబెట్టి ఫ్యూచర్ సిటీ పనులు చేపడితే, కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారనే అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ హోదా ఇచ్చింది. ఇప్పుడు ఇతర నిర్మాణాలను చేపడితే ఈ హోదాను, దానికి ఇచ్చే నిధులను రద్దు చేసే అవకాశం ఉంటుంది.

లీగల్ చిక్కులకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ కొత్త వ్యూహం

అయితే వీటన్నింటిని తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఫార్మా సిటీని రద్దు చేయలేదని, అందులోనే కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా & లైఫ్ సైన్సెస్ జోన్‌ను ఉంచుతున్నామని, దానికి అదనంగా ఐటీ, ఏఐ జోన్లను కలుపుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు చట్టపరమైన లూప్‌హోల్స్ లేకుండా ఉండటానికి ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి, పారిశ్రామిక జోన్ల శాతాన్ని చట్టబద్ధంగా మార్చేస్తోంది. ఈ నిర్ణయాలతో బీఆర్ఎస్‌ కానీ.. బీఆర్ఎస్‌ తరపున ఎవరైనా న్యాయపోరాటానికి దిగినా.. విజయం సాధించేలా అన్ని చర్యలు తీసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం.

నోయిడా మోడల్‌తో తెలంగాణకు కొత్త నగరం

నిజానికి భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అనేది అత్యవసరం అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని మరింత పెంచేలా, భవిష్యత్ తరాలు ఇబ్బందులు పడకుండా కొత్త నగరాన్ని అందించడమే ఈ నిర్ణయం వెనక అసలైన కారణం. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్ వే పట్టణాల నమూనాల నుంచి స్ఫూర్తి పొంది.. సౌత్ కొరియాలోని ఇంచియాన్ ఫ్రీ ఎకనమిక్ జోన్ సూచనలతో.. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటినీ స్థాపించింది ప్రభుత్వం.

765 చదరపు కిలోమీటర్లలో ఫ్యూచర్ సిటీ

మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని పరిధిలోకి.. మహేశ్వరం, ఆమనగల్‌, కడ్తాల్‌, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాలు రానున్నాయి. ఈ 7 మండలాల్లోని 56 గ్రామాలతో.. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు కానుంది. ఆమనగల్లులో 2 గ్రామాలు, మహేశ్వరం నుంచి 2, మంచాల నుంచి 3, ఇబ్రహీంపట్నంలోని 8 గ్రామాలు, కడ్తాల్‌లో 6, యాచారం నుంచి 17 , కందుకూరు నుంచి 18 గ్రామాలు.. ఇకపై ఫ్యూచర్‌ సిటీ పరిధిలోకి రానున్నాయి.

ఏఐ నుంచి లైఫ్ సైన్సెస్ వరకు..

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, హెల్త్ కేర్, విద్య, స్పోర్ట్స్, లైఫ్ సెన్సెస్ లాంటి అత్యాధునిక రంగాలన్నింటిని ఒకే చోటుకు తెస్తూ.. ఓ డైనమిక్ ఇండస్ట్రియల్ హబ్‌ని సృష్టించడమే లక్ష్యంగా.. ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రంగాలతో పాటు ఫ్యూచర్ సిటీలోని ప్రాంతాల్లో.. మౌలిక సదుపాయాల అభివృద్ధి పైనా ఫోకస్ పెట్టారు. ఇది.. దక్షిణ తెలంగాణలో అర్బన్ డెవలప్‌మెంట్‌కు ఓ వేదికగా మారనుంది. మొత్తం లక్షన్నర ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయనున్నారు.

హైదరాబాద్ విస్తరణకు కొత్త బ్లూప్రింట్

హైదారాబాద్.. విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు సిటీలో పెట్టుబడులు పెట్టాయి. దాంతో.. హైదరాబాద్‌ని గ్లోబల్ డెస్టినేషన్‌గా మార్చేందుకు.. సిటీ డెవలప్‌మెంట్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారనే చెప్పాలి. అందులో భాగంగానే.. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ మ్యాప్ చూస్తుంటే.. కేవలం ఆ ఒక్క ప్రాంతంలోనే కాదు నగరం 4 వైపులా అభివృద్ధి జరగనుంది. ఉత్తరం వైపు.. శంషాబాద్, తుక్కుగూడ, రావిర్యాల, బొంగుళూరు వరకు.. ఫ్యూచర్ సిటీ ఇంపాక్ట్ ఉండనుంది. అదేవిధంగా.. దక్షిణం వైపు.. ఆమనగల్, అప్పారెడ్డిపల్లి, కుర్మేడు వరకు నగరం విస్తరించనుంది. హైదరాబాద్ ఈస్ట్ వైపు.. సాగర్ రోడ్డులో.. ఇబ్రహీంపట్నం, యాచారం, కుర్నేడు వరకు.. ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్ ఉంటుంది.

రేవంత్ సర్కార్ భారీ ప్లాన్

ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేసేలా మెట్రో రైల్‌ని కూడా విస్తరిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రోని కనెక్ట్ చేస్తామని ఇప్పటికే.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా.. అక్కడ గ్రీన్ ఫీల్డ్ రహదారిని కూడా నిర్మించనుంది ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. అందువల్ల.. భవిష్యత్ ప్రణాళికలు, ట్రాఫిక్ అవసరాలను అనుసరించి.. కొత్తగా రోడ్ల కనెక్టివిటీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న ఓఆర్ఆర్ నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వరకు 40 కిలోమీటర్ల పొడవునా.. గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని నిర్మించనున్నారు. ఇది గనక పూర్తయితే.. ఆ ప్రాంతాల్లో గణనీయమైన అభివృద్ధి జరగనుంది.

30 నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్..

ఈ ఫ్యూచర్ సిటీకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్.. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇక్కడి నుంచి.. కేవలం 30 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. దీనికి దగ్గరలోనే ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు ఉన్నాయి. ఈ రెండూ.. నగరం దక్షిణం వైపు మంచి కనెక్టివిటీని అందించనున్నాయి. కొత్తగా సృష్టించబోయే ఫ్యూచర్ సిటీ.. కాలుష్యరహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలన్నదే ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగానే.. ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ఫోర్త్ సిటీని.. కాలుష్యరహిత నగరంగా రూపొందించేందుకు.. అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో.. మెట్రో రైల్‌తో పాటు గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర వహించనున్నాయి.

అభివృద్ధిపై ప్రభుత్వం ధీమా

హైదరాబాద్ ఓ పవర్ జెనరేషన్ హబ్. ఈ సిటీకి సూపర్ పవర్ ఉంది. స్టామినా బలంగా ఉంది. నెక్ట్స్ జెనరేషన్ పాజిటివ్ వే ఉంది. సో దీన్ని సరైన దిశలో కంటిన్యూ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది కూడా అదే. హైదరాబాద్ డెవలప్ మెంట్ కోసం నయా యాక్షన్ ప్లాన్ ను సర్కార్ రెడీ చేసింది. ఇలాంటి టైమ్‌లో హరీష్‌రావు చేసిన కామెంట్స్‌ ఏకంగా కలకలం సృష్టించాయనే చెప్పాలి. ఏదేమైనా ఎవరెన్ని విమర్శలు చేసినా రాష్ట్రాభివృద్ధి కోసం ఈ అంశంలో ప్రభుత్వం ముందడుగు మాత్రమే వేస్తుందని నేతలు చెబుతున్నారు.

Also Read: భీమిలి తీరంలో.. వడ దెబ్బ ముసుగు వేసి, చున్నీతో భర్త గొంతు బిగించి

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×