DBT Salaries: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో కీలక మార్పునకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటివరకు మధ్యవర్తులుగా ఉన్న ప్రైవేటు ఏజెన్సీల ద్వారా జీతాల చెల్లింపులు జరుగుతుండగా, ఇకపై ఆ విధానానికి ముగింపు పలికేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సంక్షేమ పథకాల మాదిరిగానే అవుట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాలను కూడా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకే వేసే డీబీటీ పద్ధతిని అమలు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇప్పటివరకు ప్రభుత్వం ఏజెన్సీలకు నిధులు విడుదల చేస్తే, వారు కమిషన్లు మినహాయించుకుని ఉద్యోగులకు వేతనాలు చెల్లించేవారు. ఈ క్రమంలో నెలల తరబడి జీతాలు రాక ఉద్యోగులు అల్లాడిపోయేవారు. కొన్ని ఏజెన్సీలు పీఎఫ్, ఈఎస్ ఐ సొమ్మును మినహాయించుకుని కూడా సకాలంలో డిపాజిట్ చేయకపోవడం, ఉద్యోగుల వేతనాల్లో అక్రమ కోత విధించడం లాంటి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నేరుగా డీబీటీ పద్ధతి తెస్తే ఏజెన్సీల వేధింపులు, మధ్యవర్తుల ప్రాబల్యానికి పూర్తిగా చెక్ పడనుంది.
ప్రభుత్వం ప్రతీ నెల నిర్ణీత తేదీన డీబీటీ ద్వారా నేరుగా ఉద్యోగస్తుల బ్యాంక్ ఖాతాలకే డబ్బులు జమ చేస్తుంది. దీనివల్ల ప్రతీ నెల 1వ తేదీ లేదా మొదటి వారంలోనే వేతనాలు అందే వెసులుబాటు కలుగుతుంది. కుటుంబ పోషణ, ఇళ్ల అద్దెలు, పిల్లల చదువుల ఖర్చుల కోసం నెలల తరబడి నిరీక్షించే పరిస్థితి తప్పుతుందని అవుట్‌సోర్సింగ్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవే అంశాలను ఉన్నత స్థాయి కమిటీ ప్రభుత్వానికి వివరించినట్లు తెలిసింది. ఉద్యోగుల ఆధార్, బ్యాంక్ ఖాతాలు అనుసంధానించి ‘డీబీటీ’ ద్వారానే వేతనాలు అందించనున్నారు. అంతేగాక పారదర్శకత కోసం ఒక డిజిటల్ పోర్టల్ ద్వారా హాజరు, వేతనాల పర్యవేక్షించనున్నారు.
Also Read: రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీలపై గతంలో ప్రభుత్వం ఆడిటింగ్ నిర్వహించింది. దీని పర్యవేక్షణకు ఆరుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సుమారు 5 వేల ప్రైవేట్ ఉద్యోగ ఏజెన్సీలపై ఆడిటింగ్ నిర్వహించి ప్రభుత్వానికి ఓ రిపోర్టును అందజేసినట్లు సమాచారం. ఆయా ఏజెన్సీలు చేసే అక్రమాలను పూర్తిగా స్టడీ నివేదించినట్లు తెలిసింది. తప్పుడు లెక్కలతో బిల్లులు క్లెయిమ్ చేయడం, సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం, ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న బిల్లులకు ఉద్యోగులకు అందజేసే జీతాలకు పొంతన లేకపోవడం వంటి వివరాలను ఆధారాలతో సహా క్రోడీకరించి సర్కార్ కు అందజేసినట్లు సమాచారం. రాష్ట్రంలో సెక్రటేరియట్ , వివిధ శాఖల్లో సుమారు 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నట్లు అంచనా.
Also Read: ఇంజినీరింగ్ విద్యార్థుల చదువు క్రిమినల్ వేస్ట్.. గోడలకు సున్నాలేసుకుని బతికిన రేవంతు..!