కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పరిచిత్ మెహ్రా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఇంజినీర్లు, నిపుణులతో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసింది. మూడు బ్యారేజీల రిపేర్లకు కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపేర్ పనులు స్పీడప్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రుతుపవనాలు రాక ముందే జియో టెక్నికల్ పరిశీలనలు పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ సూచించింది. మే 30వ తేదీలోగా పరిశీలనలు పూర్తిచేయాలని డెడ్‌లైన్ పెట్టింది. రోజువారీగా పురోగతి రిపోర్టులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది. సీడబ్ల్యూసీ- ఎన్డీఎస్ఏ అనుమతులతో పనులు, డిజైనింగ్ పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజువారీ యాక్షన్ ప్లాన్‌తో పనులు చేపట్టాలని తెలంగాణ సర్కార్ సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో కాళేశ్వరం నష్టాలను తగ్గించే ఆలోచనతో ఉన్నారు.
ప్రస్తుత యాసంగి సీజన్‌లో తెలంగాణ నుంచి 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో శుక్రవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ ఉండడంతో సప్లై పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తెలంగాణలో యాసంగి సీజన్‌లో 90లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని, ఈ ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుందని చెప్పారు.
ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్, 5 లక్షల టన్నుల ముడి బియ్యం సరఫరా చేసేందుకు రెడీ ఉన్నామన్నారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సానుకూలత వ్యక్తం చేశారు. అదే సమయంలో 2014 – 15 వర్షాకాలం సీజన్‌లో అదనపు లెవీ సేకరణకు సంబంధించిన 1468కోట్ల బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. అటు పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు అమలు చేసిన పోషణ్ అభియాన్ పథకాన్ని ఇటీవల నిలిపివేశారని, దాన్ని వెంటనే పునః ప్రారంభించాలని కోరారు.
తెలంగాణ గనుల శాఖ ఆదాయార్జనలో రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బొగ్గు మినహా ఇతర ఖనిజాల ద్వారా 3,300 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది గతేడాదితో పోలిస్తే ఏకంగా 33 శాతం వృద్ధి. అటు బొగ్గు గనుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపితే మొత్తం 5,650 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి. ఇన్ కమ్ పెరగడానికి కేవలం ఖనిజాల వెలికితీత మాత్రమే కాకుండా, ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు కూడా తోడయ్యాయి. సీనరేజ్ ఫీజును 20 శాతం మేర సైంటిఫిక్ గా సవరించడం వల్ల అదనంగా 100 కోట్ల ఆదాయం లభించింది. పర్యావరణ పరిరక్షణ కోసం విధించిన ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఫీజుతో కూడా మంచి ఆదాయం సమకూరుతోంది.
వీటికి తోడు జీరో టాలరెన్స్ తో ఇసుక అక్రమ నిల్వలు, ఓవర్ లోడింగ్‌పై స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోంది. కలెక్టర్లు ఎస్పీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం ద్వారా క్షేత్రస్థాయిలో అక్రమాలకు చెక్ పడింది. ఆదాయం పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , శాటిలైట్ ఇమేజరీ ఆధారిత చేంజ్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా గనుల సరిహద్దుల్లో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్రమాలు జరిగితే ఫైన్స్ వేసే వ్యవస్థ తీసుకొచ్చింది. ఖనిజాలను మోసుకెళ్లే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ పెట్టారు. అటు క్వారీలు, క్రషర్ల వద్ద ఏఎన్పీఆర్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుతో అక్రమాలకు చెక్ పడి ఆదాయం పెరిగింది.
తెలంగాణ రైజింగ్ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఒక విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించి భారత్ ఫ్యూచర్ సిటీలో రెండ్రోజుల సదస్సు, మూడుసార్లు సీఎం దావోస్ పర్యటనల్లోనూ సదస్సులు నిర్వహించింది. ప్రతి వేదికపైనా సీఎం రేవంత్, మంత్రులు 2047 విజన్‌లో భాగంగా మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలపడమే లక్ష్యంగా చెబుతూ వస్తున్నారు. ఆ ప్రకారం తాజా పరిశ్రమల శాఖ రిపోర్ట్ చూస్తే వివిధ కంపెనీలతో 3,82,000 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోగా.. వాటిలో 40 శాతానికి పైగా ఇన్వెస్ట్ మెంట్స్ గ్రౌండింగ్ అయ్యాయంటున్నారు. వివిధ సదుస్సుల్లో పలు కంపెనీలతో కుదిరిన ఎంఓయూల పురోగతిపై లేటెస్ట్ గా ప్రభుత్వం సమీక్షించింది. కంపెనీల వారీగా పురోగతి ఏ దశలో ఉందో పరిశ్రమలశాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లు, డేటా సెంటర్ ప్రాజెక్టులు ఇప్పటికే కొన్ని ప్రారంభం కాగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని, ఇంకొన్నిటిలో వేగం పెరిగిందని పరిశ్రమల శాఖ రిపోర్ట్ పేర్కొంది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024, 2025లో వచ్చిన దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన వాటా 34 శాతంగా ఉంది. వీటిలో ప్రధానంగా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన ప్లాంట్లు ఉన్నాయి. మిగిలిన ప్రాజెక్టుల అనుమతులు, భూకేటాయింపుల ప్రక్రియను ప్రభుత్వం స్పీడప్ చేస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025లో కుదిరిన మొత్తం 75 అవగాహన ఒప్పందాల ద్వారా వచ్చిన భారీ పెట్టుబడులను అమల్లోకి తీసుకురావడంలో రాష్ట్రం స్పీడ్ గా అడుగులు వేస్తోంది. గత నాలుగు నెలల్లో 14 ఒప్పందాలు అమల్లోకి వచ్చాయి. 30,230 కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చడానికి అవసరమైన 255.97 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇందులో మరీ ముఖ్యంగా డేటా సెంటర్ల రంగంలో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా దూసుకెళ్తోంది.
తెలంగాణలో కులాల వివరాలన్నింటినీ రేవంత్ సర్కారు బహిర్గతం చేసింది. గతేడాది ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం బుధవారం రాత్రి ప్రతి కులం, జనాభా, వారి ఆర్థిక స్థితిగతులు ఎంతో స్పష్టంగా తెలిపే సమాచారాన్ని రిలీజ్ చేసింది. కులగణనలో సేకరించిన ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ రంగాల్లో ఏ కులం ఏ స్థానంలో ఉందో స్పష్టం చేసే లెక్కలను ప్రజల ముందు ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం జనాభాలో బీసీలు 56.33 శాతం ఉన్నారు. ఇందులో 10.08 శాతం వెనకబడిన ముస్లింలు ఉన్నారు. ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45, ఓసీలు 15.79 శాతం ఉన్నట్లు తెలిపింది. ఓసీల్లో జనాభా పరంగా రెడ్లదే అగ్రస్థానంగా ఉన్నట్లు తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో సమాన విలువ, గౌరవం కల్పించిన నాయకుడు అంబేద్కర్ అని, అయితే ప్రస్తుత పాలకులు మాత్రం మహిళా రిజర్వేషన్లతో నియోజకవర్గాల పెంపును ముడిపెట్టి కలగాపులగం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.
మంచి పనికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు ఆచరణలోకి రావాలంటే మన సీట్లను సాధించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో అత్యధికంగా దళితులకు ఇచ్చామని, 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తే అందులో 87 శాతం ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఉద్యోగాలొచ్చాయని సీఎం గుర్తు చేశారు. సివిల్ సర్వీసెస్ లో ప్రోత్సహించాలని రాజీవ్ గాంధీ అభయహస్తం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఒకవైపు అప్పులు, తప్పులను సవరిస్తూనే రాష్ట్రంలో పరిపాలనను చక్కబెడుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు సీఎం.
ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో ఈనెల 13న కలిసి ఏజెన్సీ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణంపైన దృష్టి సారిస్తామని సీఎం రేవంత్ వారికి హామీ ఇచ్చారు. వీటి ద్వారా తాగు, సాగునీటి అవసరాలను తీర్చవచ్చని అన్నారు. చెక్ డ్యాంలు, రోడ్ల నిర్మాణం కోసం అటవీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివాసీ, గిరిజన రైతులు సాగు చేస్తున్న భూముల్లో బోర్లు వేయడానికి అనుమతులు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంచే విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేసి ఆదివాసీలు, గిరిజనులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు.
నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ కొత్త ఫార్ములాను కేంద్రం ముందు పెట్టారు. దేశంలో నియోజకవర్గాల సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ జీఎస్‌డీపీ ఆధారిత హైబ్రిడ్ మోడల్‌లో జరగాలన్నారు. మహిళా బిల్లుకు, డీలిమిటేషన్ లింకు సరికాదన్నారు. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లో 50 శాతం అంటే 272 స్థానాల్లో 136 సీట్లను ప్రొరేటా ప్రకారం, మిగిలిన 136 సీట్లను జాతీయ స్థూల ఉత్పత్తి ప్రాతిపదికన విభజించి అత్యధిక శాతం అందిస్తున్న రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వాలని ప్రతిపాదించారు.
మహిళా చట్టం అమలు కోసం హడావుడిగా సవరణ బిల్లు తేవడాన్ని ప్రశ్నించారు. జనగణన కోసం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున అవి పూర్తయ్యే లోగా అందరి అభిప్రాయాలు తీసుకుని నియోజకవర్గాల పెంపు, పునర్విభజన ప్రాతిపదికను నిర్ణయించాలని, 2028 నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని, అనవసరమైన గందరగోళానికి తెరలేపొద్దన్నారు సీఎం. ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా బిల్లులు పెడితే ఉపయోగం లేదన్నారు. ఆయన అన్నట్లుగానే రాజ్యాంగ సవరణ బిల్లులు వీగిపోయాయి.
పేరెంట్స్, పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్లకుండా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. ప్రైవేట్ కంటే మెరుగ్గా పనితీరు ఉండేలా.. 2026-27 విద్యాసంవత్సరం నుంచే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన బడుల్లో ఏ రకమైన వసతులు అవసరమో క్షేత్రస్థాయిలో యంత్రాంగం పరిశీలిస్తోంది. ఇప్పుడు వచ్చే విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని డిసైడ్ చేశారు. ఎంపికైన స్కూళ్లల్లో 1,500 మంది విద్యార్థులకు సరిపడా గదుల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అలాగే సబ్జెక్టుల వారీగా టీచర్ల నియామకం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ స్కూళ్లలో ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదివే అవకాశం ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటులోనే చదివించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. అప్పులు చేసి మరీ ప్రైవేటువైపు పంపిస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం మొదటగా సెగ్మెంట్ కు ఒక టీపీఎస్‌ను ఏర్పాటు చేయాలని డిసైడ్ చేసింది.
Also Read: 2029లో మళ్లీ రేవంత్ రెడ్డి సీఎం.. రాసి పెట్టుకోండి.. మంత్రి లక్ష్మణ్ ధీమా
Story by: Anup, Big Tv