Telangana Politics: రోజులు గడుస్తున్నాయ్.. నోటీసులు వెళ్తున్నాయ్.. విచారణ మీద విచారణ జరుగుతోంది. కానీ.. ఎటూ తేలట్లేదు. ఇటీవలే.. సుప్రీంకోర్టు కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై ఏదో ఒకటి తేల్చాలని.. 4 వారాల గడువిచ్చింది. దాంతో.. తెలంగాణలో మళ్లీ ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ.. కోర్టు చెప్పినట్లు స్పీకర్ గనక ఒక డెసిషన్ అంటూ తీసుకోవాల్సి వస్తే.. ఎంతమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది? స్పీకర్ ముందున్న ఆప్షన్లు ఏంటి?
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం కీలకంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ఈ వివాదం మొదలైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ.. బీఆర్‌ఎస్ చేసిన ఫిర్యాదులు, న్యాయపోరాటం తర్వాత, ఇటీవల సుప్రీంకోర్టు స్పీకర్‌కు నాలుగు వారాల గడువు విధించడంతో.. మళ్లీ ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందున్న కీలక అంశాలు, ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఆ తర్వాత వచ్చే పరిణామాలపై అనేకరకాల చర్చ జరుగుతోంది.
ఇదే విషయంలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని.. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీలోగా సమాధానాలను అఫిడవిట్ రూపంలో స్పీకర్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. గత ఆగస్టులో ఫిర్యాదులొచ్చిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన ఎనిమిది మంది తమ సమాధానాలను అఫిడవిట్ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి దాఖలు చేశారు.
స్పీకర్ నోటీసుల నేపథ్యంలో.. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గడువుకు ముందే స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిశారు. వివరణ ఇచ్చేందుకు.. తనకు ఇంకొంత సమయం ఇవ్వాలని కోరారు కడియం. దీనిపై.. స్పీకర్ సానుకూలంగా స్పందించారు. మరోవైపు.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా త్వరలోనే స్పీకర్‌ని కలవనున్నారు. ఆయన కూడా తనకు కొంత సమయం ఇవ్వాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. 23న దానం నాగేందర్ స్పీకర్ ముందు హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. స్పీకర్ కోరినట్లు వివరణ ఇస్తారా? లేక రాజీనామా చేస్తారా? అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఈ క్రమంలో.. ఎంతమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందనేది చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఆరోపణలతో.. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. వారిలో.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
స్పీకర్ తీసుకోబోయే నిర్ణయమే.. ఈ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యాన్ని తేల్చనుంది. నిబంధనల ప్రకారమైతే.. స్పీకర్ 10 మందిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. వారిలోనూ.. దానం నాగేందర్.. కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. దాంతో.. ఆయనపైనే ముందుగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దానం సంగతి పక్కనబెడితే.. మిగతా వారి విషయంలో స్పీకర్ ఏం చేయబోతున్నారనేదే ఇప్పుడు మోస్ట్ ఇంట్రస్టింగ్‌గా మారింది.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం.. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. అయితే.. ఆ పార్టీకి చెందిన మొత్తం సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు.. మరో పార్టీలో విలీనమైతే.. అది ఫిరాయింపు కిందకు రాదు. ఈ వ్యవహారంలో.. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీఆర్ఎస్ నుంచి పక్కకు జరిగారు. ఇది.. ఇప్పుడు బీఆర్ఎస్‌కు ఉన్న 36 మంది ఎమ్మెల్యేల బలంలో.. మూడింట రెండొంతుల కన్నా తక్కువ. కాబట్టి.. ఇది విలీనం కిందకు రాకపోగా.. ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుంది. సుప్రీంకోర్టు కూడా 4 వారాల డెడ్‌లైన్ విధించడంతో.. స్పీకర్ ముందు కొన్ని ఆప్షన్లు కనిపిస్తున్నాయ్. ఒకటి.. పదో షెడ్యూల్‌ని అనుసరించి.. వారిపై అనర్హత వేటు వేయడం. ఫలితంగా.. ఎమ్మెల్యేలు తమ పదవిని కోల్పోతారు. అప్పుడు.. ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది.
అదే జరిగితే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ అవుతుంది. లేనిపక్షంలో.. విచారణలో ఫిర్యాదుదారుల వాదనల్లో పస లేదని, ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని తేల్చి.. అనర్హత పిటిషన్లు కొట్టేసే అవకాశం ఉంటుంది. దాంతో.. ఎమ్మెల్యేల సభ్యత్వం కొనసాగుతుంది. ఈ నిర్ణయం తీసుకుంటే.. స్పీకర్‌పై రాజకీయంగా బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంటుంది. మరోసారి.. సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ రెండూ కాకుండా.. విచారణ ఇంకా పూర్తి కాలేదని.. స్పీకర్ సుప్రీంకోర్టు ముందు మరింత గడువు కావాలని కోరితే.. ఇంకొన్నాళ్ల పాటు ఇదిలాగే కంటిన్యూ అవుతుంది. అయితే.. ఇప్పటికే పరిస్థితులు కోర్టు ధిక్కార నోటీసుల దాకా వచ్చాయ్ కాబట్టి.. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది.
మొదట్లో కంటోన్మెంట్ బైపోల్ వచ్చింది.. ఇటీవలే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కూడా జరిగింది.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ నిర్ణయం తీసుకుంటే.. మరో చోట ఉపఎన్నిక వస్తుందా? లేక.. 10 స్థానాల్లో బైపోల్స్ వస్తాయా? లేక.. ఒక్క దానం నాగేందర్ దగ్గరే.. ఈ కేసు ఆగిపోతుందా? అంతేకాదు.. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు.. రాజ్యాంగ పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్లకు కూడా వర్తిస్తుందా? అసలేం జరగబోతోంది?
10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు.. ఇటీవలే స్పీకర్‌కు ఇచ్చిన ఆదేశాలు.. తెలంగాణ రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ కేసులో స్పీకర్ తీసుకునే నిర్ణయం ఉపఎన్నికలకు దారి తీస్తుందా? ఎంతమందిపై అనర్హత వేటు పడుతుంది? రాజ్యాంగ పదవుల గడువు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుల ప్రభావం ఏమిటి? అనేది ప్రధానంగా చర్చకు వస్తోంది. ప్రస్తుతానికి 10 మంది ఎమ్మెల్యేల సంగతి పక్కనబెడితే.. అనర్హత పిటిషన్లు దాఖలైన వారిలో ఒక్క దానం నాగేందర్ మాత్రమే.. కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. టెక్నికల్‌గా అయితే.. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ.. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అందువల్ల.. స్పీకర్ గనక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే.. మొదట దానం నాగేందర్‌పైనే చర్యలు తీసుకుంటారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
అందువల్ల.. దాన నాగేందరే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు మరో ప్రచారం సాగుతోంది. అనర్హత వేటు పడితే.. మళ్లీ ఆరేళ్ల దాకా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదు కాబట్టి.. వేటు పడే దాకా వేచి చూస్తే నష్టమనే ఆలోచనలో ఉన్నారట. తన విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ముందే.. రాజీనామా చేస్తే మంచిదనే ఆలోచనలో దానం ఉన్నారని చెబుతున్నారు. ఇక్కడ.. కీలకమైన అంశం ఏమిటంటే.. స్పీకర్ నిర్ణయం కేవలం దానం నాగేందర్‌కు మాత్రమే పరిమితమయ్యే అవకాశం లేదు. సుప్రీంకోర్టు మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అందువల్ల.. మిగతా వారి విషయంలో స్పీకర్ ఏం చేయబోతున్నారు? అన్నది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో.. 8 మంది ఇప్పటికే స్పీకర్‌కు తమ వివరణ ఇచ్చారు. కేవలం.. కండువా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్లు కాదనే వాదన వినిపిస్తున్నారు. ఒక్క దానం నాగేందర్ మాత్రమే.. సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు కాబట్టి.. ఆయనొక్కరిపైనే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కాబట్టి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. తన విచారణలో ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని, కండువా కప్పుకోవడం ద్వారా పార్టీ మారినట్లు రుజువు చేయలేమని చెప్పి.. వారు పార్టీ మారలేదని నిర్ణయిస్తే.. వారికి అనర్హత వేటు నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది. అప్పుడు.. కేవలం దానం నాగేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న.. ఖైరతాబాద్‌లో మాత్రమే ఉప ఎన్నిక వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఇక.. మొన్నటికి మొన్న.. రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో గడువు విధించలేమని.. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇదే తీర్పు.. అసెంబ్లీ స్పీకర్‌కు కూడా వర్తిస్తుందా? అనేది ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న. ఎందుకంటే.. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైనది. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అయితే.. పార్టీ ఫిరాయింపుల కేసులలో స్పీకర్‌కు గడువు విధించవచ్చా? అనే విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన వైఖరిని ప్రదర్శించింది. గవర్నర్, రాష్ట్రపతి రాజ్యాంగ విధుల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవద్దనేది.. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కేసులో సుప్రీంకోర్టు ముఖ్య ఉద్దేశం. అయితే, ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయం తీసుకునే అధికారాన్ని ట్రిబ్యునల్ ఛైర్మన్ హోదాలో వినియోగిస్తారు. ఈ ట్రిబ్యునల్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి.
Also Read: ఐ బొమ్మ రవి కేసు కథ రివర్స్.. షాక్‌లో పోలీసులు..
ఇప్పుడు కూడా.. సుప్రీంకోర్టు ఫిరాయింపు పిటిషన్ల విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కావొద్దనే ఉద్దేశంతోనే.. స్పీకర్‌కు గడువు విధించింది. ఈ కేసులో మొదట.. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గడువు ముగిశాక కూడా జాప్యం చేయడంతో, స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. అందువల్ల.. సుప్రీం విధించిన 4 వారాల గడువులోగా.. స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేసి.. నిర్ణయాన్ని ప్రకటిస్తారా? లేక.. మళ్లీ సుప్రీంకోర్టుని గడువు కోరతారా? అనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా.. ఈ కేసు స్పీకర్ నిర్ణయంతో ముగుస్తుందా? మళ్లీ.. బీఆర్ఎస్ న్యాయపోరాటానికి దారితీస్తుందా? అనేది.. త్వరలోనే తేలిపోతుంది. ఈ పరిస్థితుల్లో.. స్పీకర్ తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అంతకంటే ముందే.. దానం నాగేందర్ రాజీనామా చేస్తే.. ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉంది. లేనిపక్షంలో.. సుప్రీంకోర్టు మళ్లీ జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత గడువులోగా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తిగా మారింది.
Story By Anup, Bigtv