E-Paper
Advertisement

TG CM Progress Report: విద్య, టెక్స్‌టైల్స్‌పై ఫోకస్.. ప్యూచర్ సిటీ నుంచి గ్రామాభివృద్ధి వరకు సీఎం రేవంత్ బిగ్ స్టెప్స్!

TG CM Progress Report: విద్య, టెక్స్‌టైల్స్‌పై ఫోకస్.. ప్యూచర్ సిటీ నుంచి గ్రామాభివృద్ధి వరకు సీఎం రేవంత్  బిగ్ స్టెప్స్!
Advertisement

ఏప్రిల్ 3 విద్యా రంగంలో సంస్కరణలు

సునామీలా ముంచుకొస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ముప్పును ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు కోల్పోతే.. దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత ప్రమాదంలో పడుతుందని, ప్రత్యామ్నాయంగా బ్లూ కాలర్ ఉద్యోగాలకు అనుగుణంగా వాతావరణాన్ని మార్చుకోవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా నాణ్యమైన విద్య అందించేందుకు.. అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని వివరించారు. అందులో భాగంగానే, వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచే ప్రయోగాత్మకంగా వంద ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి విధానం తెస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. వీటికి తోడు బ్రేక్ ఫాస్ట్, లంచ్‌తో.. మంచి పోషకాహారాన్ని అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఏప్రిల్ 3 పోలీస్ హ్యాట్రిక్ విక్టరీ

ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో.. వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకొని.. హ్యాట్రిక్ సాధించిన తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయం రాష్ట్ర పోలీసుల నిరంతర కృషి, క్రమశిక్షణకు నిదర్శనమన్నారు. తెలంగాణ సీఐడీ పర్యవేక్షణలో నిరంతర శిక్షణ.. జాతీయ స్థాయిలో ఈ విజయానికి కారణమైందన్నారు. ఈసారి నాగ్‌పూర్‌లో జరిగిన డ్యూటీ మీట్‌లో తెలంగాణ ప్రతినిధి బృందం అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీతో పాటు యాంటీ-సాబోటేజ్ చెక్, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్‌నెస్ విభాగాల్లో విజేతగా నిలిచింది. శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు సహాయాలు, పోలీస్ ఫోటోగ్రఫీ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచింది.

ఏప్రిల్ 3 టెక్స్‌టైల్ క్యాపిటల్‌గా హైదరాబాద్

Advertisement

2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీతో కలిసి 13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి.. అటెక్స్‌కాన్-2026 రిపోర్ట్‌ని రిలీజ్ చేశారు. అత్యుత్తమ వస్త్రాలను తయారు చేసిన గొప్ప చరిత్ర భారతదేశానికి ఉందన్నారు. శతాబ్దాలుగా క‌ళలు, సంస్కృతి, సంప్రదాయాలు.. టెక్స్‌టైల్స్‌ రంగాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దాయన్నారు. నిజాం కాలంలో ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేశారు. టెక్స్‌టైల్స్ తెలంగాణ డీఎన్ఏలోనే ఉందన్నారు సీఎం. ప్రపంచంలోని ప్రతి దేశం తెలంగాణలో తయారైన దుస్తులను ధరించేలా చేయాలన్నదే తమ సంకల్పమన్నారు. సరికొత్త భవిష్యత్తుని నిర్మించేందుకు.. ప్రతి ఒక్కరూ తెలంగాణ రైజింగ్ జర్నీలో భాగస్వాములు కావాలని పెట్టుబడుదారులకు పిలుపునిచ్చారు.

ఏప్రిల్ 3 తుమ్మిడికుంటకు మహార్దశ

మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి ఈ వారం పరిశీలించారు. 14 ఎకరాలకు కుంచించుకుపోయిన చెరువు పరిసరాల్లో ఆక్రమణలను తొలగించి.. పునరుద్ధరణలో భాగంగా 28 ఎకరాలకు విస్తరించి అభివృద్ధి చేస్తున్నారు. తుమ్మిడికుంట పున‌రుద్ధర‌ణ కోసం ప్రభుత్వం 20 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది.

ఏప్రిల్ 2 వేగం పెంచండి

Advertisement

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో.. నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన భవన సముదాయాల నిర్మాణలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వారం పరిశీలించారు. ఫ్యూచర్ సిటీ అథారిటీ భవన నిర్మాణ పనులతో పాటు వాటి డిజైన్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అలాగే, స్కిల్స్ యూనివర్సిటీకి చెందిన భవనాలను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఏప్రిల్ 2 సర్కార్ సంకల్పం

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రమంతటా గ్రామ సభలు నిర్వహించిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సందేశం అందించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో.. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ, సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా పని చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలంటే కాగితాలపై కాదు. ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే తమ సంకల్పం అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అన్ని శాఖల సమన్వయంతో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉద్యమంలా సాగుతోందన్నారు. ఊరు-వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పని చేయాలని సీఎం సూచించారు. అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలపాలన్నదే తమ సంకల్పమని సీఎం స్పష్టం చేశారు. ఈ సంకల్పంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలన్నారు.

మార్చి 31 దిల్‌దార్ సీఎం

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోం గార్డు ఉద్యోగం ఇచ్చి.. నియామకపత్రాన్ని అందజేశారు. అదేవిధంగా శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రమాదవశాత్తు, ఇతర కారణాలతో.. హుస్సేన్ సాగర్‌‌లో పడిన ఎంతోమంది ప్రాణాలను శివ కాపాడారు. అయితే, కుటుంబ పోషణ భారమై ఆయన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిసి.. సీఎం స్పందించారు. శివకు అవసరమైన సాయం అందించాలని కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉపాధి కోసం ట్యాంక్‌బండ్ సమీపంలో ఓ స్విమ్మింగ్ పూల్‌ నిర్మించి ఇవ్వాలని శివ కోరారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సహృదయంతో స్పందించడమే కాకుండా ముఖ్యమంత్రి చేతుల మీదుగా సాయం అందుకోవడం సంతోషంగా ఉందని ట్యాంక్‌బండ్‌ శివ కుటుంబం తెలిపింది.

మార్చి 30 పేదోడికి సన్నబియ్యం అన్నం

ఈగల్, హైడ్రా తరహాలోనే.. రాష్ట్రంలో ఆహార కల్తీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ తెస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్ట చర్యలు చేపడుతామన్నారు. తెలంగాణలో కోట్లాది మందికి పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పథకం ప్రారంభమై ఏడాది పూర్తవడంతో.. ఈ వారం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు అసెంబ్లీ సెంట్రల్ హాలులో సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మండలి చైర్మన్, స్పీకర్ , డిప్యూటీ సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని భోజనం చేశారు. అన్ని రకాలుగా ఆలోచనలు చేసిన తర్వాతే.. పేదలు తినగలిగేలా సన్నబియ్యం అందించాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసమే క్వింటాలుకు 500 బోనస్ ప్రకటించి సన్నవడ్లు పండించాలని రైతులను ప్రోత్సహించామన్నారు. అడిగిన ప్రతి వారికి రేషన్ కార్డు జారీ చేశామన్నారు.

మార్చి 29 తల్లిదండ్రులకు భరోసా

సమాజంలో ఏ కుటుంబంలోనూ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోకూడదన్న సంకల్పంతోనే ప్రభుత్వం తల్లిదండ్రుల రక్షణ కోసం చట్టం తెచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన.. తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు.. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులకు రక్షణ కల్పించే దిశగా కీలక ముందడుగు అన్నారు. తల్లిదండ్రుల పట్ల భక్తి లేని వారికి భయం కలిగించేందుకే ఈ చట్టం తెచ్చామన్నారు. బతికున్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టని బిడ్డలు, చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం దురదృష్టకరమన్నారు సీఎం. తల్లిదండ్రులను చూసుకోలేని వారిని సమాజం బహిష్కరించాలన్నారు. ఈ చట్టంతో వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించడమే తమ ప్రయత్నమన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులే కాదు. ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలో చేర్చామన్నారు.

మార్చి 29 ఆకట్టుకున్న సాంస్కృతిక వేడుకలు

బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తిగా తిలకించారు. ప్రజాసేవలో తీరిక లేకుండా ఉండే ప్రజాప్రతినిధులు.. ఆటలు, వారు ప్రదర్శించిన కళలు రాష్ట్రంలోని లక్షలాది విద్యార్థినీ, విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు సీఎం. విద్యార్థులు, యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయాలనే ఉద్దేశంతోనే.. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలు నిర్వహించామన్నారు. చదువే కాదు, మైదానాల్లో రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు.. క్రీడలు, సాంస్కృతిక శాఖలను ముఖ్యమంత్రి అభినందించారు. ఇందులో భాగంగా.. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయ్. రెండు రోజుల పాటు నిర్వహించిన స్పోర్ట్స్, కల్చరల్ మీట్‌లో విజేతలకు సీఎం బహుమతులు ప్రదానం చేశారు. ఫుట్‍‌బాల్ మ్యాచ్‌లో రాణించిన సీఎం.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును.. మండలి ఛైర్మన్ చేతుల మీదుగా అందుకున్నారు.

మార్చి 29 గోదావరి పుష్కరాలపై రివ్యూ

2027 జూన్‌లో జరగబోయే గోదావరి పుష్కరాల యాక్షన్ ప్లాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆలయాలు, పుష్కరఘాట్ల అభివృద్ధి, పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తింపునకు ఇంజనీర్లతో టెక్నికల్ కమిటీ నియమించాలని ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇచ్చిన తర్వాతే.. గోదావరి పుష్కరాల సమగ్ర ప్రణాళికపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల నిర్మాణం, విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యాటకులకు ఇబ్బందులు రాకుండా ప్రాంతాల మధ్య కనెక్టివిటీ సరిగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పైనా సీఎం కీలక సూచనలు చేశారు.

మార్చి 29 గోవుల సంరక్షణకు చర్యలు

తెలంగాణలో గోవుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వారం ముఖ్యమంత్రి గారితో జంతు హక్కుల కార్యకర్త, పీపుల్ ఫర్ యానిమల్స్ అధ్యక్షురాలు మేనకా గాంధీ బృందం భేటీ అయింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణకు చేపట్టిన చర్యలను అధికారులు మేనకా గాంధీకి వివరించారు. ఎన్కేపల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో విశాలమైన ప్రదేశంలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ముఖ్యమైన ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం వివరించారు. జంతు సంరక్షణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read: టాయిలెట్లు లేక మహిళలు అవస్థలు.. కమిషనర్‌ గారూ, జర చూడండి సారూ!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×