E-Paper
Advertisement

టీజీ ఆర్టీసీ విలీనంలో భారీ ట్విస్టులు.. ఏపీ మోడల్ ఫాలో అయితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

టీజీ ఆర్టీసీ విలీనంలో భారీ ట్విస్టులు.. ఏపీ మోడల్ ఫాలో అయితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
Advertisement

RTC Merger: ప్రభుత్వంలో తమ సంస్థను విలీనం చేయాలి.. ఇది తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్. గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ డిమాండ్‌తో పోరాటాలు చేశారు.. నిరసనలు చేశారు.. సమ్మెకు దిగారు. కానీ ఇవేవీ సక్సెస్ కాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ డిమాండ్ నెరవేరేందుకు అడుగులు పడ్డాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. 32 డిమాండ్లలో ప్రధానమైన విలీనం డిమాండ్‌పై కూడా సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ఓ కమిటీని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. దీంతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి తొలి అడుగు పడినట్టైంది.

ఏపీ మోడల్‌నే తెలంగాణ ఫాలో అవుతుందా?

విలీనం చేస్తారు సరే.. దానికి అనుసరించే విధానం ఏంటి? ఇదే ఇప్పుడు అసలైన ప్రశ్న. అయితే దీనికి సమాధానం ఏపీ మోడల్ అని చెబుతున్నాయి ప్రభుత్వ, కార్మిక వర్గాలు. నిజానికి ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం వల్ల వారి జీతాలు కాస్త పెరుగుతాయి. కానీ ఇది అందరికి కాదు. ఈ జీతాల పెరుగుదల డిపో మేనేజర్‌ స్థాయి నుంచే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు ఇదే జరిగింది. ఆ మోడల్‌నే తెలంగాణ ప్రభుత్వం కూడా ఫాలో అయితే ఇక్కడ కూడా అలానే జరిగే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణలో ఆర్టీసీ విలీనం

Advertisement

అసలు తెలంగాన ప్రభుత్వం ఏపీ మోడల్‌ను ఎందుకు ఫాలో అవ్వాలి? ఇది అసలైన క్వశ్చన్. తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్‌ ఆర్టీసీ ఒకప్పుడు ఉమ్మడిగా ఉండేవి. వీటి రెండింటి పని తీరు ఒకటే. రెండు ఆర్టీసీల్లో పెద్ద తేడా కూడా లేదు. అందుకే ఈ కష్టతరమైన విలీన ప్రక్రియకు ఏపీ మోడల్‌ను తీసుకుంటే తప్పేముందనే ఆలోచన ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

పోస్టుల మ్యాపింగ్ ఎలా ఉంటుంది?

ఇక తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం జరిగితే.. అధికారుల పోస్టులకు సరిసమానమైన ప్రభుత్వ పోస్టుల్లో అధికారులను కలిపేయనున్నారు. ఒకవేళ సమాన పోస్టు లేనప్పుడు కాస్త అటూ ఇటూగా ఉన్న కేడర్‌తో అనుసంధానం చేస్తారు. ఆర్టీసీలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ తర్వాత పెద్ద పోస్టు అంటే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌దే. ఈ పోస్టును అదనపు కమిషనర్‌ కేడర్‌గా మార్చారు. రీజినల్‌ మేనేజర్‌ పోస్టును జాయింట్‌ కమిషనర్‌ స్థాయిగా, డివిజినల్‌ మేనేజర్‌ పోస్టును డిప్యూటీ కమిషనర్‌ స్థాయిగా, డిపో మేనేజర్‌ పోస్టును అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయిగా ఖరారు చేశారు. అసిస్టెంట్‌ మేనేజర్‌ స్థాయి నుంచి ఆ పైస్థాయి పోస్టులకు గెజిటెడ్‌ హోదా కల్పించారు. ప్రభుత్వంలో డ్రైవర్‌ పోస్టు ఉన్నందున ఆర్టీసీ డ్రైవర్‌ను డ్రైవర్‌ స్థాయిగానే పరిగణిస్తున్నారు. కానీ ప్రభుత్వంలో కండక్టర్‌ పోస్టు లేనందున, కండక్టర్‌ పోస్టును జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయిగా గుర్తించారు. ఇది ఏపీలో జరిగిన విధానం. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే జరిగే అవకాశం కనిపిస్తోంది.

విలీనం తర్వాత జీతాల్లో ట్విస్ట్

Advertisement

ఇక జీతాల విషయానికి వస్తే కొందరి జీతాలు పెరుగుతాయని ముందే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా ఆయా పోస్టులకు అనుగుణంగాప్రభుత్వ స్కేల్‌కు సమానంగా ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. ఆర్టీసీలోని ఈడీ, ఆర్‌ఎం, డీవీఎం, చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌, చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్, చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, విజిలెన్స్‌ డైరెక్టర్, డిప్యూటీ మెకానికల్‌ ఇంజినీర్, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్, అకౌంట్స్‌ ఆఫీసర్స్, విజిలెన్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి వరకు జీతాలు ప్రస్తుతం ప్రభుత్వంలోని సమానమైన స్థాయి పోస్టుల కంటే ఎక్కువ ఉన్నాయి.

హై సాలరీ పోస్టులకు షాక్ లేదు

సో.. వారి జీతాలు పెరగవు. ప్రస్తుతం ఎంత ఉన్నాయో అంతే ఉంటాయి. కానీ ఆ తర్వాత ఉన్న డిపో మేనేజర్‌ పోస్టు నుంచి జీతాల పెరుగుదల ఉంటుంది. తక్కువ స్కేల్‌తో ఉన్న ఆర్టీసీ పోస్టుల జీతాలను ప్రభుత్వ స్కేల్‌కు సమానంగా పెంచుతున్నప్పుడు, ఎక్కువ జీతాలున్న పోస్టులను ప్రభుత్వ స్కేల్‌కు సమానం చేయాలంటే తగ్గించాల్సి ఉంటుంది. కానీ ఏపీలో అలా తగ్గించకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉంచేశారు. తెలంగాణలో కూడా అదే జరిగే అవకాశం కనిపిస్తోంది. పీఆర్‌సీలతో ప్రభుత్వ కేడర్‌ స్కేల్‌ పెరిగి ఆర్టీసీ అధికారుల జీతాల కంటే ఎక్కువైనప్పుడే పెంచుతారు. అప్పటి వరకు కేవలం ఇంక్రిమెంట్లను మాత్రమే జత చేస్తారు.

ఏపీఎస్‌ ఆర్టీసీ జీతాల పెంపు

ఒక్కసారి ఏపీఎస్ ఆర్టీసీలో జీతాలు ఎలా పెరిగాయో చూద్దాం. ఏపీఎస్‌ఆర్టీసీ విలీన సమయంలో డిపో మేనేజర్‌ సాలరీ 57,000 నుంచి 1,42,500గా ఉంది. దాన్ని 57,100 నుంచి 1,47,760గా మార్చారు. గ్రేడ్‌-1 డ్రైవర్‌ ప్రారంభ జీతం 25,480 నుంచి రూ.29,980కు, గ్రేడ్‌–2 డ్రైవర్‌ ప్రారంభ జీతం 21,390 నుంచి 27,500కు, గ్రేడ్‌–1 కండక్టర్‌ ప్రారంభ జీతం 21,670 నుంచి 28,280కు, గ్రేడ్‌2 కండక్టర్‌ ప్రారంభ జీతం 19,580 నుంచి 25,220కి పెరిగింది. గ్రేడ్‌2 మెకానిక్‌ ప్రారంభ జీతం 20,300 నుంచి 25,220కి పెరిగింది. ప్రభుత్వ అధికారులతో పోలిస్తే ఆర్టీసీ ఉన్నతాధికారుల గ్రాట్యుటీ చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వ అధికారుల గ్రాట్యుటీపై సీలింగ్‌ ఉంది. ఉన్నతాధికారుల గ్రాట్యుటీ దాదాపు 50 లక్షలు, అంతకంటే ఎక్కువగానే తగ్గుదల నమోదు కావాల్సి ఉంటుంది. దీంతో దాన్ని ప్రొటెక్ట్‌ చేయాలని ప్రతిపాదించడం తప్పదనే చెప్పాలి. ప్రస్తుతం ఆర్టీసీలో గ్రేడ్‌ పే విధానం ఉంది. జీతానికి అదనంగా వారి పోస్టు స్థాయిని బట్టి ఈ మొత్తం జోడిస్తున్నారు. ఇది అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ స్థాయి నుంచి మొదలవుతుంది. ప్రభుత్వంలో గ్రేడ్‌ పే విధానం లేనందున దీన్ని తొలగిస్తారు.

38 వేల ఉద్యోగులకు గుడ్ న్యూస్!

తెలంగాణలో విలీన ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం, నిపుణుల కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ తర్వాత ఆర్టీసీ ప్రజా రవాణా విభాగంగా మారనుంది. దేశంలో పంజాబ్‌, హరియాణా, ఆంధ్రప్రదేశ్‌ తర్వాత నాలుగో రాష్ట్రంగా తెలంగాణలో ఈ విలీనం జరగనుంది. దీంతో 38 వేల 300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు. ఇదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, పదవీ విరమణ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ విలీనంతో ప్రభుత్వంపై ఏటా దాదాపు వెయ్యి కోట్ల భారం పడనుంది. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైనా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆర్టీసీ ఆస్తులన్నీ సంస్థ ఆధీనంలోనే ఉంటాయి. వాటిని ప్రభుత్వం ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు నిర్ణీత కాలానికి లీజుకు ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఉద్యోగులకు వచ్చిన కీలక మార్పులు

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వంలో విలీనమైంది . 2020 జనవరి 1 నుండి కొత్తగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ మార్పుతో వారికి పూర్తి ఉద్యోగ భద్రత లభించింది. అయితే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్ల నుండి 60 ఏళ్లకు పెంచారు. సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు కార్మికులు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. విలీనం తర్వాత ప్రభుత్వ ట్రెజరీ ద్వారా నేరుగా జీతాలు అందుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పే-స్కేల్ , కారుణ్య నియామకాలు, ఇతర సౌకర్యాలు వీరికి కూడా వర్తిస్తాయి.

లాభాలే కాదు.. ఆర్టీసీ విలీనంలో నష్టాలూ!

అయితే అన్నీ లాభాలు మాత్రమే కాదు.. కొన్ని నష్టాలు కూడా ఎదుర్కొన్నారు ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు. విలీనానికి ముందు ఉన్న ఓవర్‌టైమ్ డ్యూటీలు, నైట్ హాల్ట్ అలవెన్సులు, కొన్ని ఇతర ప్రోత్సాహకాలు రద్దయ్యాయి. గతంలో ఆర్టీసీ హాస్పిటల్స్ ద్వారా మెరుగైన ఉచిత వైద్యం అందేది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కిందకు మారడం వల్ల కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అంతేకాదు ప్రమోషన్లలో జాప్యం ఏర్పడుతోందంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు మారడం వల్ల ప్రమోషన్లు పొందడం కొంత కష్టతరంగా మారిందని చెబుతున్నారు.

జీతాల భారంతో బడ్జెట్‌పై ఒత్తిడి పెరిగిందా?

ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి కూడా కొన్ని ప్రయోజనాలు చేకూరాయి. ఆర్టీసీకి ఉన్న విలువైన భూములు, భవనాలు, ఇతర ఆస్తులు ఇప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణలోకి వచ్చాయి. రవాణా వ్యవస్థను ప్రభుత్వం నేరుగా నియంత్రించే అవకాశం లభించింది. అయితే ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు తప్పలేదు. దాదాపు 52 వేల మంది ఉద్యోగుల జీతాల భారం ఇప్పుడు ప్రభుత్వంపై పడింది. ఏడాదికి దాదాపు 3 వేల 600 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తోంది. అంతేకాదు ఆర్టీసీకి ఉన్న వేల కోట్ల రూపాయల అప్పులు, వడ్డీల బాధ్యత కూడా ప్రభుత్వంపై పడింది. ఇది రాష్ట్ర బడ్జెట్‌పై అదనపు భారాన్ని పెంచింది.

టికెట్ ధరలపై ఫుల్ కంట్రోల్… ఎవరికీ లాభం?

ఇక చార్జీల నియంత్రణ కూడా ఆర్టీసీ నుంచి ప్రభుత్వం చేతుల్లోకి చేరింది. ఆర్టీసీ స్వతంత్రంగా చార్జీలు పెంచుకునే అవకాశం తగ్గింది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకే చార్జీలు ఉంటున్నాయి. కానీ ఈ విలీనం తర్వాత ప్రైవేటీకరణ ముప్పు అయితే తప్పింది. విలీనం జరగకపోతే సంస్థను ప్రైవేటీకరించే అవకాశం ఉండేది, అది ప్రయాణికులపై మరింత భారం మోపేది.

ఏపీ నుంచి కీలక హెచ్చరికలు

ఈ విషయాలన్నింటిపై ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఫోకస్ పెంచాయి. ఇప్పటికే తెలంగాణ అధికారులు.. ఏపీ అధికారుల నుంచి డేటాను సేకరించారు. ఏపీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నుంచి నుంచి తెలంగాణ ఉద్యోగ సంఘాలు కూడా డేటాను తీసుకున్నారు. అయితే ఇక్కడ కొన్ని తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కొన్ని సూచనలు చేస్తున్నారు ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వల్ల ఉద్యోగ భద్రత ఉంటుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదన్నారు. అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ వస్తుందని ఆశించామని.. కానీ ఏపీలో రాలేదంటున్నారు. తెలంగాణలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్షంగా విలీనం చేశాయని.. తెలంగాణలో అలా జరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

వైద్య సదుపాయాల్లో నష్టం

విలీనం అనంతరం ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు కొన్ని విషయాల్లో నష్టపోయారని చెబుతున్నారు. వైద్య సదుపాయాల విషయంలో తీవ్రంగా నష్టపోయామంటున్నారు. విలీనం అనంతరం ఉద్యోగికి అందే కొన్ని వైద్య సదుపాయాలు తొలగించారని.. తెలంగాణలో ఆ తప్పు జరగకుండా ఉండాలని సూచిస్తున్నారు.

ఉద్యోగ సంఘాల రద్దుపై భయం

తెలంగాణలో విలీన ప్రక్రియకు ఓ కమిటీ వేయడం శుభసూచకమని చెబుతున్నారు. విలీన ప్రక్రియ ప్రారంభంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏపీలో విలీనం అనంతరం ఉద్యోగ సంఘాలను రద్దు చేశారని.. కానీ తెలంగాణలో అలా జరిగే అవకాశం లేదని చెబుతున్నారు. విలీనం జరగక ముందు ఆర్టీసీకి ఎండీనే సుప్రీంగా ఉంటారని.. విలీనం తర్వాత ఎండీ నిర్ణయంతో పాటు అనేక మంది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీని వల్ల కొన్ని విషయాల్లో అనుమతి రావడం ఆలస్యమవుతుందంటున్నారు.

విలీనం తర్వాత పే రివిజన్ నత్తనడకనా?

విలీనం తర్వాత జీతాల పెంపు విషయంలో మాత్రం తాము కాస్త నష్టపోయామని చెబుతున్నారు ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు. ఆర్టీసీలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వేతన సవరణ జరిగేదని.. ప్రభుత్వంలో ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ జరుగుతుందన్నారు. ఏపీలో విలీనం తర్వాత వేతన సవరణ ఇంకా చేయలేదని గుర్తు చేస్తున్నారు.

లాభనష్టాల మధ్య కీలక నిర్ణయం

నిజానికి ప్రతి ప్రతి నిర్ణయం వెనక లాభ నష్టాలుంటాయి. ఏ నిర్ణయం కూడా పూర్తిగా అందరికి ఆమోదయోగ్యంగా ఉండదని చరిత్ర చెబుతున్న సాక్ష్యం. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో కూడా ఇటు ప్రభుత్వానికి, ఇటు కార్మికులకు కొన్ని లాభనష్టాలుంటాయి. కానీ అంతిమంగా కార్మికులకు మాత్రం ఎక్కువ లాభం ఉండటంతో ఈ డిమాండ్‌ను వెంటనే అమలు చేయాలని చెబుతున్నారు. మరి ముందు ముందు కమిటీ, కార్మికులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి.

Also Read: డిచ్‌పల్లిలో పట్టపగలే భారీ చోరీ.. 12 తులాల బంగారం, నగదు మాయం!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×