CM Revanth Reddy: తెలంగాణ పల్లె ప్రజలు అందించిన ఆశీర్వాదం.. తమ ప్రభుత్వంపై మరింత బాధ్యత పెంచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలపై.. తెలంగాణ హక్కులకు సంబంధించి అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం. ఇందిరా మహిళాశక్తి పథకం కింద.. రాష్ట్రంలో వెయ్యి విజయ డెయిరీ పార్లర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చేయూతనివ్వనుంది. రైతుల యూరియా కష్టాలు తీర్చేలా.. సర్కార్ కొత్త యాప్‌ని అందుబాటులోకి తీసుకురానుంది.
రాష్ట్రంలో వెయ్యి విజయ డెయిరీ పార్లర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాడి ఉత్పత్తుల విక్రయాల పెంపుతో పాటు మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతనందించేందుకు మండలానికి ఒకటి, మున్సిపాలిటీల్లో రెండు చొప్పున అందుబాటులోకి తేవాలని పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య, సెర్ప్‌ని సర్కారు ఆదేశించింది. పాడి రైతుల నుంచి సేకరించే పాలతో వివిధ ఉత్పత్తులను తయారు చేస్తున్న విజయ డెయిరీ.. సేల్స్ డబుల్ చేసే సన్నాహాల్లో ఉంది. ఇందులో భాగంగా కొత్త డెయిరీ పార్లర్లను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లో నిరుద్యోగుల ద్వారా వంద కొత్త డెయిరీ పార్లర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం.. ఇందిరా మహిళాశక్తి పథకం కింద డెయిరీ పార్లర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 14 రకాల వ్యాపారాలకు చేయూతనిస్తున్న ప్రభుత్వం.. తాజాగా విజయ డెయిరీ పార్లర్లలోనూ అవకాశం కల్పించాలని భావించింది.
మెడిసిన్ చదివే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో చదివిన పేద వర్గాల పిల్లలకు ఇప్పుడు భారీగా ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు. వారు.. ఇంగ్లీష్ భాషతో ఇబ్బంది పడుతున్నారు. పాఠాలు అర్థం కాకపోవడంతో ఒత్తిడికి లోనవుతున్నారు. ఆత్మన్యూనత భావంతో చదువును మధ్యలోనే ఆపేయడం, టాలెంట్ ఉన్నా.. భాషాపరమైన ఇబ్బందులతో మెడికల్ టెర్మినాలజీని అర్థం చేసుకోకపోవడం, ఒత్తిడితో పరీక్షల్లో ఫెయిల్ అవడం లాంటివి జరుగుతున్నాయి. ఈ ఇబ్బందుల నుంచి విద్యార్థుల్ని బయటపడేసేందుకు.. వారికి స్పోకెన్ ఇంగ్లీష్‌లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలకు ఇంగ్లీష్ క్లాసులు చెప్పించాలని, ఇందుకు అవసరమైన టీచర్లను నియమించాలని నిర్ణయించారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల విధానంలో మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ఆరు నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన అందుబాటులో ఉంది. గురుకులాల్లో ఐదో తరగతి నుంచే క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. దాంతో.. అదే విధానాన్ని మోడల్ స్కూళ్లలోనూ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రపోజల్స్‌ని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే.. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి మోడల్ స్కూళ్లలో ఐదు, ఆరు తరగతుల్లో అడ్మిషన్ల కోసం ఒకేసారి ప్రవేశ పరీక్ష పెట్టేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడం లేట్ అయితే మాత్రం.. ఎప్పటిలాగే ఆరో తరగతి అడ్మిషన్ల కోసమే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇందుకు అనుగుణంగా జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అందించిన ఆశీర్వాదం.. ప్రభుత్వంపై మరింత బాధ్యత పెంచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా ఆశీర్వాదంతో.. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు. పంచాయతీ ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో, లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు.. ఎన్నికల యంత్రాంగానికి, అధికారులకు ప్రభుత్వం తరఫున సీఎం అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు.. ముఖ్యమంత్రి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో 12 వేల
702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. తమకు 7 వేల 527 పంచాయతీల్లో ప్రజలు అందించిన ఆశీర్వాదం మరింత బాధ్యత పెంచిందన్నారు. అదేవిధంగా.. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను సాధించడంపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. అన్ని పార్టీల అభిప్రాయం మేరకు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై నిర్ణయానికి వస్తామని తెలిపారు.
తమ ప్రభుత్వం క్రమపద్ధతిలో.. అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని సీఎం వివరించారు. ఆదాయాన్ని పెంచుకుంటూ.. దుబారాను తగ్గిస్తూ.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగకుండా.. ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ తాపత్రయమన్నారు.
ఈ వారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా.. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను.. ముఖ్యమంత్రి ఆర్బీఐ గవర్నర్‌కి వివరించారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగం పెంచే దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను.. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా.. తెలంగాణలో బ్యానింగ్ ఆఫ్ అన్‌రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్ యాక్ట్.. బడ్స్‌ని నోటిఫై చేయాలని సీఎంని కోరారు సంజయ్ మల్హోత్రా. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ విషయంలో.. ఆర్బీఐ తీసుకుంటున్న చొరవతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు డిపాజిట్ల క్లెయిమ్ క్యాంపెయినింగ్ అంశాలను సైతం ముఖ్యమంత్రికి వివరించారు.
యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిల్చునే కష్టాలకు ముగింపు పలకాలని.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం.. రైతులు ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునేలా ప్రత్యేక మొబైల్ యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానంతో యూరియా పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు సమయం, శ్రమ ఆదా కానున్నాయని ప్రభుత్వం చెబుతోంది. రైతులకు యూరియాను ఒకేసారి కాకుండా.. విడతల వారీగా సరఫరా చేయనున్నారు. 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రెండు విడతల్లో.. 5 నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతన్నలకు 3 విడతల్లో, 20 ఎకరాలకు మించిన భూమి ఉన్న రైతులకు.. నాలుగు విడతల్లో యూరియా బుక్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. యాప్‌లో రైతు పట్టాదార్పాస్బుక్ నెంబరు నమోదు చేయగానే.. లింక్ అయిన ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయగానే.. రైతుకు చెందిన భూమి విస్తీర్ణం, సాగు చేసిన పంటకు అవసరమైన యూరియా పరిమాణంలో.. బుకింగ్ ఆధారంగా రిటైలర్లు, సహకార సంఘాల ద్వారా యూరియా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. బుకింగ్ చేసుకున్న యూరియా కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. గడువులోగా యూరియా తీసుకోకపోతే.. తిరిగి స్టాక్‌లోకి వెళ్తుంది. రైతులకు అవసరమైన యూరియాని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. యాప్‌ద్వారా యూరియా పంపిణీ వల్ల ఎరువులు పక్కదారి పట్టకుండా, పంట పండించే అన్నదాతలకు మాత్రమే అందుతాయని చెబుతున్నారు.
రెండేళ్ల పాలనపై.. రేవంత్ రెడ్డి సర్కార్.. ప్రగతి నివేదికను విడుదల చేసింది. 24 నెలల ప్రజా పాలనలో.. వివిధ రంగాల్లో తీసుకున్న 240 కీలక నిర్ణయాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వ్యవసాయం, సంక్షేమం, మౌలిక వసతులు, పరిపాలన సంస్కరణలే లక్ష్యంగా.. అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది రేవంత్ ప్రభుత్వం. ఇక.. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌ని తీర్చేందుకు మూడో డిస్కం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. ఢిల్లీ టూర్‌లో భాగంగా.. కేంద్రమంత్రులను కలిసి.. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. త్వరలోనే.. పింఛన్ల మొత్తాన్ని పెంచే ఆలోచనతో ఉంది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.
రేవంత్ రెడ్డి సర్కార్ ఈ వారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరచడానికి, పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి.. మూడో డిస్కం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న రెండు డిస్కంలపై భారాన్ని తగ్గించి, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే దీని లక్ష్యం. ఈ కొత్త డిస్కం.. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థని మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యుత్ రంగాన్ని సంస్కరించడంలో సాయపడుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న TGSPDCL, TGNPDCL డిస్కంల పరిధి చాలా ఎక్కువగా ఉంది. విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరగడంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తో పాటు.. వ్యవసాయం, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు ఉచిత విద్యుత్ సరఫరా లాంటి పథకాలను ప్రవేశపెట్టింది. వీటి వల్ల.. ప్రస్తుతం ఉన్న డిస్కంలపై ఆర్థిక భారం పెరిగింది. దీనిని తగ్గించడంతో పాటు.. ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని సంస్కరించడం కోసం.. మూడో డిస్కం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త డిస్కం ఏర్పాటుతో.. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఆర్థిక సమస్యలు తగ్గడమే కాక.. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవకాశం లభిస్తుందని అంటున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఈ వారం ఢిల్లీలో పర్యటించారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయి కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ని.. నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. రాష్ట్రంలో విద్యారంగం సమగ్రాభివృద్ధికి 30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు పెట్టే ఖర్చును.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రాధాన్యాన్ని, లక్షలాది మంది విద్యార్థులకు చేకూరే ప్రయోజనాన్ని కేంద్రమంత్రి నిర్మలకు వివరించారు. విద్యారంగం అభివృద్ధిపై సీఎం రేవంత్ చూపుతున్న చొరవను ఆమె ప్రశంసించారు. రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రాజెక్ట్ డీపీఆర్‌ని కేంద్రానికి పంపాలని, దానిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. ఇక.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాలని కోరారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్‌లో.. ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతని.. కేంద్రమంత్రికి వివరించారు. ఐఐఎం ఏర్పాటుకు 200 ఎకరాల భూమిని హెచ్‌సీయూ క్యాంపస్‌లో గుర్తించామని తెలిపారు. వెంటనే క్లాసులు ప్రారంభించేందుకు.. ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అదేవిధంగా.. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా మరో 9 కేంద్రీయ, 16 జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు.. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న క్రమంలో.. తమ పనితీరుపై రేవంత్ రెడ్డి సర్కార్.. ఈ వారం ప్రగతి నివేదికను విడుదల చేసింది. ప్రజా పాలనలో భాగంగా 24 నెలల్లో.. వివిధ రంగాలకు సంబంధించి మొత్తం 240 కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. వ్యవసాయం, సంక్షేమం, మౌలిక వసతులు, పరిపాలన సంస్కరణలే లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉన్నాయి. ప్రధానంగా రైతు రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, రైతు భరోసాలాంటి అంశాలున్నాయి. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఉచిత బస్సు, 500కే గ్యాస్, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీలాంటి నిర్ణయాలను పొందుపరిచారు. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు జాబితాలో ప్రాధాన్యతనిచ్చారు. 61,379 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, గ్రూప్స్, డీఎస్సీ నిర్వహణ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు లాంటి అంశాలను ప్రస్తావించారు. పాలనాపరంగా కుల గణన సర్వే, ధరణి స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం, బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ లాంటి విధానపరమైన నిర్ణయాల గురించి కూడా ప్రభుత్వం ప్రగతి నివేదికలో ప్రస్తావించింది. హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా మార్చే దిశగా తీసుకున్న నిర్ణయాలను కూడా నివేదికలో చేర్చారు. మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, హైడ్రా ఏర్పాటు, ట్రిపుల్ఆర్, దావోస్ ఒప్పందాలు, పెట్టుబడుల ఆకర్షణ లాంటివన్నీ.. 240 నిర్ణయాల్లో భాగమని ప్రభుత్వం తెలిపింది. రెండేళ్లుగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. కొత్తగా రేడియల్, రింగ్ రోడ్లతో పాటు, హైస్పీడ్ కారిడార్లు రానున్నాయి. ప్రమాదాలు తగ్గించి, ప్రయాణాన్ని సురక్షితంగా మార్చేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రోడ్ సెక్టార్ పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా లక్షా 15 వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరగనుంది. 2030, 2035, 2047 వరకు దశలవారీగా ఈ పనులు జరగనున్నాయి. కొత్త రోడ్ల నిర్మాణంతో పాటు ఉన్నవాటిని విస్తరించేందుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాబోయే 20 ఏళ్లలో.. కేంద్రం సహకారంతో రాష్ట్రంలోని 21 స్టేట్ హైవేలను.. నేషనల్ హైవేలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రాల్లో ఉన్న రెండు వరుసల రహదారులను నాలుగు, ఆరు లేన్లుగా మార్చాలని నిర్ణయించారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, మండలం నుంచి మండల కేంద్రాలకు తప్పనిసరిగా 2 లేన్ల రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ఫార్మా కేంద్రాలు, సెజ్‌లు, స్మార్ట్ సిటీలు, టూరిజం స్పాట్‌లు, ఇండస్ట్రియల్ కారిడార్ల నుంచి హైదరాబాద్, పోర్టులు, ఎయిర్‌పోర్టులకు.. 4 లేన్ల రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ సహకారంతో.. తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాల రాజధానులకు వెళ్లేలా.. హైస్పీడ్ రోడ్ కారిడార్‌లను ప్రభుత్వం ప్రతిపాదించింది.
తెలంగాణ ప్రభుత్వం.. సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని పెంచే ఆలోచనతో ఉంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రకటించిన ఈ హామీని.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. పింఛన్లు ఎంత మేర పెంచాలన్న విషయంపై.. ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం అందుతున్న మొత్తానికి 500 పెంచాలా, 1000 వరకు పెంచాలా? అన్న అంశంపై లోతైన చర్చ సాగుతోంది. ఎన్నికల హామీలో భాగంగా.. సాధారణ పింఛన్లు 4 వేలకు, దివ్యాంగుల పింఛన్ 6 వేలకు పెంచాల్సి ఉంది. ఒకేసారి పూర్తి స్థాయిలో పెంపు సాధ్యం కాకపోతే.. దశలవారీగా అమలు చేయాలన్న ఆలోచన పరిశీలనలో ఉంది. ఇక.. బోగస్ పింఛన్లను అడ్డుకునేందుకు ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా ఆదా అయ్యే నిధులను పెరిగిన పింఛన్లకు వాడొచ్చనే అంచనాలున్నాయి. కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన క్రమంలో.. కొత్తగా అర్హత పొందినవారి నుంచి పింఛన్ దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెన్షన్లు ఎప్పటి నుంచి పెరగనున్నాయనే దానిపై.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.
Story by Anup, Big Tv