తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు శుభవార్త చెప్పింది. మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహిస్తున్న ఇటుక తయారీ యూనిట్లను బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో వీటిని అనుసంధానం చేయాలని నిర్ణయించింది. వీటిలో ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళలకు స్థిరమైన ఉపాధి కల్పించడంతో పాటు.. గృహ నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని స్థానికంగానే సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
మహిళా సంఘాల ఇటుక తయారీ యూనిట్లు, పూర్తిస్థాయిలో నడిపిస్తే రోజుకు 2,500 వరకు ఇటుకలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు గ్యారెంటీ మార్కెటింగ్ కల్పించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన ఇటుకలను నేరుగా ఈ సంఘాల నుంచే కొనుగోలు చేయాలని గృహ నిర్మాణ శాఖతో సమన్వయం చేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో ఇటుకలను తక్కువ ధరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
మహిళా ఉద్యోగుల రక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం అమలులో భాగంగా.. తెలంగాణ సచివాలయ సాధారణ పరిపాలన శాఖలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జీఏడీలో పనిచేసే మహిళా ఉద్యోగుల నుంచి వచ్చే లైంగిక వేధింపుల ఫిర్యాదులను కమిటీ స్వీకరిస్తుంది. వాటిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను అందజేస్తుంది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలకు మరమ్మత్తులు చేసి, వాటిని వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ సూచనల మేరకు.. వీలైనంత త్వరగా పనులను వేగవంతం చేయాలని చెప్పారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ వారం సీఎం రివ్యూ నిర్వహించారు. ప్రాజెక్టు మరమ్మత్తుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. మరమ్మత్తులకు సంబంధించిన ఏజెన్సీలన్నింటిని అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్యర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను.. వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి పనిలో సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు ఉండేలా చూడాలన్నారు. మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లరే కాకుండా మొత్తం బ్యారేజీని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తవ్వడానికి సంబంధించి ప్రణాళికతో పాటు మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. పనుల్లో జాప్యం జరగడానికి వీల్లేదని, నిధుల విషయంలో ఇబ్బంది రానివ్వమని స్పష్టం చేశారు. మేడిగడ్డ దగ్గర బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు ప్రారంభమయ్యాక.. తానే వచ్చి స్వయంగా పరిశీలిస్తానన్నారు.
సమాజాభివృద్ధికి చేసే కార్యక్రమాలను ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ఈ వారం సీఎం సమావేశమయ్యారు. సీఎస్ఆర్ పేరిట చేస్తున్న ఖర్చుకు.. వంద శాతం సత్ఫలితాలు ఉండాలన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కంపెనీలు వీటిలో ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. విద్యపై పెట్టే వ్యయాన్ని.. తాము భవిష్యత్ తరాలపై పెట్టే పెట్టుబడిగా భావిస్తున్నామని సీఎం తెలిపారు. సీఎస్ఆర్ నిధుల వినియోగం కోసమే ప్రత్యేక అధికారిని నియమించామని. కంపెనీల ప్రతినిధులు అతనితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రహేజా గ్రూప్ 50 కోట్లు, రాంకీ గ్రూప్ 50 కోట్లు, యశోద ఫౌండేషన్ 10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయి. ఈ కంపెనీలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
ఈ వారం రిపబ్లిక్ ఆఫ్ ఘనా దేశ హైకమిషనర్‌తో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ-ఘనా పరస్పర సహకారంతో పనిచేయాలని ఆ దేశ హైకమిషనర్ క్వాసి ఒబిరి.. సీఎంని కోరారు. ఘనా హైకమిషనర్‌గా భారత్‌లో బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయన ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని ఘనా హైకమిషనర్ కోరగా.. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
అదేవిధంగా.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా కనబర్చారు.. టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఎండీ టిమ్ రైఫిల్. హైదరాబాద్ వచ్చిన ఆయన సీఎం నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ పెట్టుబడులపై చర్చించారు. అంతర్జాతీయ అవసరాల కోసం భారతదేశంలో ఎఫ్-16 యుద్ధ విమాన వింగ్స్‌ను ఉత్పత్తి చేసేందుకు తమ సంస్థ పనిచేస్తున్నట్లు వివరించారు. అలాగే, C-130J సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను స్థాపించడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాల గురించి చర్చించారు.
నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి 225 కోట్లతో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. దేవస్థానం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయడానికి ముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే.. తమ మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో తారతమ్యం లేకుండా, వివక్ష చూపించకుండా, రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల నియోజకవర్గాల తేడా లేకుండా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని వివరించారు.
ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 2034 నాటికి ఆదిలాబాద్ జిల్లా అత్యంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక వాడగా, పర్యాటక ప్రాంతంగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభించి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు సీఎం. బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని.. దేశంలోనే గొప్ప ఆలయంగా తీర్చిదిద్దుతామన్నారు. వచ్చే గోదావరి పుష్కరాల కోసం ఆలయాల అభివృద్ధి కార్యాచరణలో.. గూడెంలోని సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 30 వేల 149 స్వయం సహాయక సంఘాలకు 53 కోట్ల చెక్కును అందజేశారు.
దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒలింపిక్స్ హైదరాబాద్‌లో నిర్వహించే స్థాయిలో సదుపాయాలు ఉండాలన్నారు. క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికే రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని, అందుకనుగుణంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధిపై.. ఈ వారం తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమన్నారు. వచ్చే జూన్ 2న.. స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తానని స్పష్టం చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో హెలిప్యాడ్‌తో పాటు ప్రపంచస్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. భవిష్యత్తులోనూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. స్టేడియం అభివృద్ధి విషయంలో బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.
దేశ యువత మైదానాలను ఎందుకు వదిలేస్తున్నారనే అంశంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యువతను సరైన మార్గంలో పెట్టకపోతే దేశం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 74వ ఆలిండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. భారత ఫుట్‌బాల్ చరిత్రలో హైదరాబాద్.. నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్ అనే పేరు గడించిందన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. అందుకోసమే.. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం.. స్వయంగా మైదానంలో మ్యాచ్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఆ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబర్చిన టీమ్‌లకు ట్రోఫీలను అందించారు.
తెలంగాణ హైకోర్టు జోన్-2 భవన నిర్మాణానికి రాజేంద్రనగర్‌లో శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యారు. సీఎంతో కలిసి.. ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ అంకురార్పణ కార్యక్రమం తెలంగాణ చరిత్రలోనే ప్రత్యేకమైన రోజు అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. కోర్టు సముదాయాన్ని నిర్మించడమంటే.. కులమతాలకు అతీతంగా ప్రజల కోసం ఓ పవిత్ర స్థలాన్ని నిర్మించడమేనన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు చివరి ఆశ, నమ్మకం న్యాయస్థానమేనని, అలాంటి న్యాయస్థానాన్ని నిర్మించే అవకాశం తమ ప్రభుత్వానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
కొత్త హైకోర్టు భవనం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని, న్యాయం కోసం వచ్చే పేదలు, బలహీనులకు భరోసా ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. 2027 డిసెంబర్ నాటికి ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: పూలే సాక్షిగా కవిత శపథం.. కేంద్రానికి బీసీ సెగ, రాష్ట్రానికి విగ్రహం డెడ్ లైన్!
Story by: Anup, Big Tv