కేటీఆర్ ఈ వాస్తవాన్ని తాము ఓడిపోయిన వెంటనే తెలుసుకుని ఉంటాడు. అప్పటి వరకు గెలుస్తామనే ధీమాతో ఉన్న కేటీఆర్‌కు ఓటమి ఫలితాలు తత్వం బోధపడేలా చేసినట్టున్నవి. అందుకే ఓటమి వైరాగ్యంతో వెంటనే అన్నాడు. జనం మీద కోపం కూడా దీనికి తోడైంది. మేము ప్రతీ జిల్లాకు ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకోగలిగామే తప్ప… ఓ 30 యూట్యూబ్ చానెళ్లు పెట్టుకోవాలనే సోయి మాకు లేకుండెననన్నాడు.
అంటే కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు విపరీతంగా చేసిందని, దీనికి సోషల్ మీడియా కూడా అండగా నిలిచిందనేది కేటీఆర్ వాదన. ఆరోపణ. ఇందులో నిజం కూడా ఉంది. పదేళ్ల పాలనపై జనాలకు అసంతృప్తి, కోపం. నియంతృత్వ పోకడలపై కన్నెర్ర. కుటుంబ పాలనపైనా విసుగు.. ఇచ్చినోడికే మళ్లీ మళ్లీ టికెట్లు.. ఆ ఎమ్మెల్యే అవినీతి పరుడైనా, జనాలు చీధరించుకున్నా బలవంతంగా రుద్దిన వైనం.. ఇవన్నీ జనాలకు విసుగు తెప్పించాయి. పక్కన పెట్టేశారు కేసీఆర్‌ను కూడా.
ఇక రేవంత్ హామీలు, కాంగ్రెస్‌కూ ఓ సారి అవకాశం ఇద్దాం.. ఈ ఆలోచనలు కూడా బీఆరెస్ ఓటమికి చెప్పుకోదగ్గ రీజన్సే. ఇప్పుడు ఇది కాదు ముచ్చట. కేటీఆర్ ఇవాళ అన్నాడు మీడియా శకం ముగిసిందని, సోషల్ మీడియాదే ఇప్పుడు రాజ్యమని. అవును .. ఆయన చెప్పడమే కాదు.. పాటిస్తున్నాడు కూడా. ఓటమి చెందిన దగ్గర నుంచి.. అంటే దాదాపు రెండున్నరేండ్లుగా కేటీఆర్ పూర్తిగా సోషల్ మీడియాకే పరిమితమయ్యాడు.
జనాలు దేనీకి ఎట్రాక్ట్ అవుతున్నారు? ఏది నమ్ముతున్నారు..? త్వరగా వారికి చేరవేసేలా ఎలా వార్తలు, స్పాట్లు ప్రచారం చేయాలి.. ప్రసారం చేయాలి..? వీటన్నింటిలో ఆయన రాటుదేలిపోయాడు. పనిలోపనిగా మెయిన్ మీడియాను కూడా లైట్ తీసుకుంటున్నాడునుకో. ఇక తమ సొంత పేపర్ నమస్తే తెలంగాణను కూడా అసలు పట్టించుకోవడమే లేదట. వారి జీతాల పెంపుపై అడిగి అడిగి అరణ్యరోదనతో విసిగి వేసారి ఉన్నారంటా ఆ పత్రిక ఉద్యోగులు. అయినా డోంట్ కేర్. ఇప్పుడు కావాల్సింది కేటీఆర్‌కు సోషల్ మీడియా.
ఈ ముచ్చటను ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. ఆయన ప్రసంగాల్లో కూడా సోషల్ మీడియా భాషనే వస్తుంది ఎక్కువగా. సినిమాల్లో సన్నివేశాలు, డైలాగులను తరుచూ వాడటానికి కారణం.. జెన్-జీకి తొందరగా చేరుతాయని. యువతే టార్గెట్. ఇందిరాపార్క్ వద్ద జరిగిన బీఆరెస్‌వీ ధర్నాలో ఆయన బీజేపీ సోషల్ మీడియాను అంధ్ భక్తులతో పోల్చాడు. వారిది వాట్సాప్ యూనివర్సిటీ అని కూడా అన్నాడు.
జెన్-జీది ఇన్‌స్టాగ్రాం జనరేషన్ అని.. వారంతా వాట్సాప్ యూనివర్సిటీతో పోటీ పడుతున్నారన్నాడు. చివరకు వాట్సాప్ యూనివర్సిటీపై జెన్-జీ ఇన్‌స్టాగ్రాం యూనివర్సిటీయే గెలుస్తుందన్నాడు. మీకు మీడియా అక్కర్లేదని కూడా జెన్-జీని ఉద్దేశించి అన్నాడు కేటీఆర్. ఢిల్లీలో ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ఓ ఒక్క మీడియా కూడా పట్టించుకోలేదని, చివరకు మొన్న వచ్చిన మీడియాను జెన్-జీ నిలదీసిందన్నాడు. ఇకపై మీడియా కోసం చూడకండి.. మీకు సోషల్ మీడియా ఉందిగా.. అది చాలు.. ప్రపపంచానికి మీ వార్తలు ప్రసారం చేస్తుంది.. అని తన మనసులోని మాట బయటపెట్టుకున్నాడు.
అంతేకాదు… మెయిన్ మీడియా అక్కడ ఢిల్లీలో మోడీకి లొంగిపోయిందన్నాడు. ఐటీ, ఈడీ,సీఐడీ దాడులకు భయపడి ఏ మీడియా మోడీకి వ్యతిరేకంగా పోజాలరని కుండబద్దలు కొట్టాడు కేటీఆర్. అందుకే సోషల్ మీడియాను నమ్ముకోమన్న కేటీఆర్.. తను కూడా ఇక్కడ తెలంగాణలో మెయిన్ మీడియాను నమ్ముకోవడం లేదనే హింట్ ఇచ్చాడు.
అంటే అధికార పార్టీకే ప్రదాన మీడియా వత్తాసు పలుకుతున్నదననేది ఆయన ఉవాచ. ఎందుకంటే.. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆరెస్ చేసింది అదే కదా! అందుకే కేటీఆర్ కు బాగా తెలుసు. ఈ రెండున్నరేండ్లు తనను మెయిన్ మీడియా కాపాడలేదని, సోషల్ మీడియానే శ్రీరామ రక్షని. అందుకే వాటికే నెలకు పది కోట్లకు తగ్గకుండా వెచ్చిస్తున్నాడట.