RED BOOK: ఏపీ లిక్కర్ స్కామ్‌లో రాజ్ కేసిరెడ్డి, మరో కేసులో ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టులతో.. ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయ్. ఈ అరెస్టుల తర్వాత.. నారా లోకేశ్‌పై తెలుగు తమ్ముళ్లు ప్రశంసల జల్లు కురిపించేస్తున్నారట. అన్నా.. నువ్వు మామూలోడివి కాదని ఆకాశానికెత్తేస్తున్నారట. ముఖ్యంగా.. ఆంజనేయులు అరెస్ట్.. రెడ్ బుక్ చాప్టర్ వన్‌లో భాగమనే చర్చ జరుగుతోంది. ఇకముందు చూడాల్సిన సినిమా చాలానే ఉందని తెలుగుదేశం శ్రేణులు సోషల్ మీడియాలో కాస్త గట్టిగానే చెబుతున్నారట. అసలు.. ఆంజనేయులుపై తమ్ముళ్ల ఆగ్రహం దేనికోసం?
ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్
చేసుకున్నోళ్లకు.. చేసుకున్నంత అనే మాట.. అప్పుడప్పుడు ఇలాంటి పరిణామాలను చూస్తే గుర్తొస్తుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ తర్వాత.. ఏపీ పాలిటిక్స్‌లో మళ్లీ రెడ్ బుక్ సౌండ్ గట్టిగా వినిపిస్తోంది. వైసీపీ హయాంలో తెలుగుదేశం నాయకులపై నమోదైన కేసుల్లో.. అప్పుడు ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఆంజనేయులే కీలకపాత్ర పోషించారని.. టీడీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయ్.
కూటమి అధికారంలోకి వచ్చాక కొందరు ఐపీఎస్‌లపై చర్యలు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ వెనుక కూడా ఆంజనేయులు పాత్ర ఉందనే ఆరోపణలున్నాయ్. దాంతో.. ఆంజనేయులు పేరుని.. నారా లోకేశ్ ఎప్పుడో రెడ్ బుక్‌లోకి ఎక్కించారనే టాక్ ఉంది. కూటమి అధికారంలోకి వచ్చాక.. కొందరు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆంజనేయులుతో సహా 16 మందిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. ఇప్పుడు.. నటి జత్వానీ కేసులో ఆంజనేయులిని అరెస్ట్ చేయడంతో.. తెలుగు తమ్ముళ్లంతా ఫుల్ ఖుషీ అయిపోతున్నారట.
టీడీపీ నేతలను వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు
ఆంజనేయులు.. వైసీపీ హయాంలో టీడీపీ నేతలను వేధింపులకు గురిచేశారనే ఆరోపణలున్నాయ్. రవాణా శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు కోడెల శివప్రసాదరావుని వేధింపులకు గురిచేశారని కూడా టీడీపీ కార్యకర్తలు ఆవేదన చెందుతుంటారు. అలా.. ఆంజనేయులు సేవలను మెచ్చి.. ఇంటలిజెన్స్ చీఫ్ పోస్టు ఇచ్చారనే టాక్ ఉంది. చంద్రబాబుపై రాళ్ల దాడులు, టీడీపీ నేతలపై దాడులన్నీ.. ఆంజనేయులు కనుసన్నల్లోనే జరిగాయని చెబుతారు.
ఫోన్ ట్యాపింగ్‌లు, ప్రతిపక్ష నేతలపై వేధింపుల్లో కీలకమనే ఆరోపణలు
వైసీపీ నేతల అక్రమ వ్యవహారాల్లోనూ ఆయనదే కీలకపాత్ర అని కూటమి నేతలు ఆరోపిస్తుంటారు. ఫోన్ ట్యాపింగ్‌లు, ప్రతిపక్ష నేతలపై వేధింపుల్లో ఆంజనేయులు కీలకంగా వ్యవహరించారని.. నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం మారగానే ఆయన సీఎం చంద్రబాబును కలిసేందుకు విశ్వప్రయత్నం చేశారు. మరో ఏడాదిన్నర సర్వీస్ ఉండగానే.. వీఆర్ఎస్ తీసుకుంటాననే ప్రతిపాదన కూడా పెట్టారట. కానీ.. సర్కార్ అందుకు ఒప్పుకోలేదు. పైగా.. ఆయనపై వచ్చిన ఫిర్యాదులతో సస్పెండ్ చేసి.. విచారణకు ఆదేశించింది.
ఏపీ లిక్కర్ కేసులోనూ పీఎస్ఆర్ పాత్ర ఉందనే చర్చ
ఏపీ లిక్కర్ కేసులోనూ పీఎస్ఆర్ పాత్ర ఉందనే చర్చ కూడా సాగుతోంది. లిక్కర్ స్కాం నిందితుల్ని కాపాడేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను పోలీసులు గుర్తించారనే గుసగుసలు కూడా ఉన్నాయ్. ఆంజనేయులు డైరెక్షన్‌లోనే.. నిందితులు తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దాంతో.. 3 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆంజనేయులిని అరెస్ట్ చేశారు. ఈ పరిణామం.. ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: ఈటల VS బండి.. బీజేపీ, చీఫ్ ఎవరంటే?
అరెస్ట్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!
ఆంజనేయులు అరెస్ట్‌ని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా దీనినో విజయంగా చిత్రీకరిస్తున్నారట తెలుగుదేశం సానుభూతిపరులు. ఏదేమైనా.. రెడ్ బుక్‌లో ఎక్కిన ప్రతి పేరు.. ప్రతి వ్యక్తి.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారట.