Karimnagar Politics: అధికార పార్టీ అంటేనే నేతల్లో ఉత్సాహం వెల్లువెత్తుతుంటుంది. జోష్ కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. వచ్చిపోయే కార్యకర్తలను కలుస్తూ నేతలు ఎప్పుడూ ఫుల్ బిజీగా కన్పిస్తుంటారు. అదేం చిత్రమో కానీ, కరీంనగర్ కాంగ్రెస్‌లో మాత్రం ఆ హుషారు కన్పించడం లేదట. దీంతో.. కేడర్ మొత్తం అయోమయంగా ఉందట. స్థానిక సంస్థల ఎన్నికలకు ఓ వైపు పార్టీలు సన్నద్ధమవుతున్న వేళ పవర్‌లో ఉన్న పార్టీలో ఈ సైలెన్స్ దేనికి సంకేతం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయట.
ఉత్తర తెలంగాణలో కీలకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా
తెలంగాణలో పొలిటికల్ యాక్టివిటీ ఎక్కువగా కన్పించే జిల్లాల్లో కరీంనగర్ చాలా ప్రధానమైనది. ఎంతో మంది పేరున్న నేతలు ఇక్కడి నుంచి వివిధ పార్టీల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. పొలిటికల్‌గా ఇంతటి ప్రాధాన్యం ఉన్న చోట.. అదీ చేతిలో పవర్ ఉన్న కాంగ్రెస్‌లో అంతా అయోమయ పరిస్థితులు నెలకొన్నాయట. కీలక నేతలు ఎవరికి వారుగా తమ తమ బిజీ షెడ్యూల్‌లో ఉండడంతో ఇతర పార్టీల నుంచి వచ్చి హస్తంలో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదట.
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతున్న పార్టీలు
ఇదేదో ఆషామాషీగా చెబుతోంది కాదు. ఓవైపు అన్ని పార్టీలు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. మరో రెండు నెలల్లో జరుగుతాయని భావిస్తున్న లోకల్ బాడీ ఎన్నికలకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేయడమే కాదు.. క్షేత్రస్థాయిలో ఉన్న కీలక నాయకులను, కేడర్‌ను తమ వైపు ఆకర్షించడంలో బిజీగా ఉన్నాయి. బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ ఈ విషయంలో ఆయా పార్టీల నుంచి కీలక పాత్ర పోషిస్తున్నారట. బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రంలో పవర్‌లో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో కొంత వెనుకడుగులో ఉందన్న అభిప్రాయాన్ని జిల్లా నాయకులే చెబుతున్నారట. ఇదే ఇప్పుడు అత్యంత ప్రాధాన్య అంశంగా మారిందట.
లోకల్ బాడీ ఎన్నికల్లో పైచేయి కోసం పార్టీల ఆరాటం
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకుంటే.. ఇక్కడ సుమారుగా 3 లక్షలా 70 వేల ఓట్లు ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎక్కువగా ఇక్కడే స్థిరపడుతున్నారు. ఇక్కడ పట్టుపెంచుకున్న పార్టీలు.. ఈ నియోజకవర్గం ప్రభావం..జిల్లాలోని ఇతర కేంద్రాలపైనా పడుతుంది. అందుకే జిల్లాపై పైచేయి సాధించేందుకు పొలిటికల్ పార్టీలు తహతహలాడుతుంటాయి. ఇంతటి కీలకమైన చోట అధికార కాంగ్రెస్‌లో మాత్రం పరిస్థితి సైలెంట్‌గా ఉందన్న మాట విన్పిస్తోంది. అసలు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇక, హస్తం అభ్యర్థి శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు. ఉన్న కొంత మంది నేతల మధ్య విభేదాలు సైతం తీవ్రస్థాయిలో ఉన్నాయని ప్రచారం సాగుతోంది. బయటకు అంతగా కన్పించకపోయినా అంతర్గతంగా రగులుతున్నాయట.
రాష్ట్ర కేబినెట్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు
నిజానికి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచీ ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయినా సరే వారి బిజీ షెడ్యూల్ కారణంగా ఇక్కడ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టలేకపోతున్నారనే మాట విన్పిస్తోంది. ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఉత్తర తెలంగాణలోనే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అతి పెద్దది. ఇక్కడ మొత్తం 66 డివిజన్‌లు ఉన్నాయి. దీంతో.. ఇక్కడ జెండా ఎగురవేయడం అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకం. దీంతో.. ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమైంది. కీలకమైన, బలమైన నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించే పనిని ముమ్మరంగా చేపడుతున్నారు. కానీ, అధికార కాంగ్రెస్‌లో మాత్రం ఇప్పటి వరకు అలాంటి హడావిడి, జోష్ ఏదీ కన్పించడం లేదని కేడర్ గుసగుసలాడుతోందట. సహజంగానే ఒక పార్టీ అధికారంలో ఉందంటే.. ఎలాంటి ఎన్నికలు వచ్చినా సంబంధిత పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు క్యూకడుతుంటారు. బడా నేతలను ప్రసన్నం చేసుకొని ఎలాగైనా టికెట్ సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, కరీంనగర్ కాంగ్రెస్‌లో అలాంటి ఛాయలేవీ కన్పించడం లేదన్నది సామాన్య కార్యకర్త సైతం చెప్పే మాట.
Also Read: మళ్లీ రానివ్వం.. జగన్‌కు పవన్ షాక్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్‌లో ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నారు. హుస్నాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్..కీలక శాఖలు నిర్వహిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. దీంతో ఆయన జిల్లాపై పెద్దగా దృష్టి పెట్టలేని పరిస్థితి. మరో మంత్రి శ్రీధర్ బాబుది సైతం ఇదే పరిస్థితి. ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ అణుక్షణం సీఎం రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారాయన. ఏదైనా కొంత తీరిక సమయం దొరికితే తన నియోజకవర్గంతోపాటు పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకుంటున్నారాయన. ఇక, కొత్తగా మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి ఆయన ఫోకస్ ఎక్కువగా తన నియోజకవర్గంతోపాటు జగిత్యాల జిల్లాపైనే ఉందని చెప్పాలి.
మంత్రుల బాధ్యతల్లో ముగ్గురూ ఫుల్ బిజీ
ఇలా ఉన్న ముగ్గురు మంత్రులూ ఊపిరి సలపలేనంత బిజీగా ఉన్నారు. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ.. మానకొండూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎక్కువగా తన నియోజకవర్గంపైనే ఫోకస్ చేసే పరిస్థితి నెలకొందట. దీంతో.. ఇప్పుడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎవరైనా ఇతర పార్టీల నాయకులు భావిస్తే తమకు అండగా ఎవరు ఉంటారు.. ఎవరిని నమ్ముకొని హస్తం కండువా కప్పుకోవాలో తెలియడం లేదని గుసగుసలాడుతున్నారట. ఫలితంగానే జిల్లా కాంగ్రెస్‌లోకి పెద్దగా చేరికలు లేవన్న టాక్ విన్పిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయాలని నేతలకు ఇప్పటికే సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇకనైనా ఆయా మంత్రులు జిల్లా రాజకీయలపై గట్టిగా ఫోకస్ చేయాలని కోరుతున్నాయి పార్టీ శ్రేణులు.