క్షుద్రపూజల అంశాన్ని రేవంత్ వదలడం లేదు. ప్రతి వేదికపైనా ఈ పూజల స్మరణ చేస్తూ వస్తున్నాడు. దీనిపై హరీశ్ వేదన, వార్నింగ్ అరణ్య రోదనే అవుతోంది. మొన్నటికి మొన్న పరువు నష్టం దావా వేస్తానని బెదిరించాడు. చివరకు ఆ గుడులకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో.. వెళ్లిన సందర్భంగా అక్కడ కొందరు తనను గుర్తించి ఫోటోలు దిగిన విషయాన్నీ బయటపెట్టాడు.
అలాంటిదేమీ లేదు. కేవలం పూజల వరకేనని. దీంట్లో రహస్యమెక్కడిదీ అని చెప్పే ప్రయత్నమూ చేశాడు. అయినా వదిలేలా లేడు రేవంత్. తన పేరు తీసుకుని మాట్లాడితే.. లీగల్‌గా ఇబ్బందులు వస్తాయనే పేరు లేకుండా తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడని హరీశ్ విమర్శిస్తున్నాడు.
ఒకటి మాత్రం క్లియర్‌గా అర్ధమైందేమిటంటే.. వచ్చే సాధారణ ఎన్నికల దాకా ఈ పాటను వదిలేలా లేడు రేవంత్. పాడిందే పాటరా పాసుపండ్ల దాసరి అన్నట్టుగా.. దీన్ని ప్రతీ వేదిక మీద ఓసారి టచ్ చేసి జనం వద్ద కేసీఆర్, హరీశ్ రావులు ఇద్దరూ మంత్రగాళ్లు అని నమ్మించే ప్రయత్నం చేసి.. కేటీఆర్ కూడా ఇందులో భాగస్వామి అని ఇరికించి.. ఆ కుటుంబాన్ని మానసికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెట్టి.. రాజకీయంగా లబ్ది పొందేదాకా రేవంత్ వదలడు.
ఈ విషయం ఆ కుటుంబానికీ అర్థమైపోయింది. అందుకే ఇకపై దీని గురించి ఎంత తక్కువగా స్పందిస్తే అంత మంచిదని డిసైడ్ అయినట్టున్నారు. హరీశ్ నోటి వెంట పూజలు అనే మాట కూడా రావడం లేదు. కేటీఆర్ ఓసారి అని వదిలేశాడు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో ఉండి అన్నీ గమనిస్తున్నాడు.
దీనికి విరుగుడు యాగాలేమైనా ఉన్నాయా? అని సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు కాబోలు. మరోసారి అయుత చండీయాగం చేస్తే ఎలా ఉంటుంది..? అని కూడా ఆలోచిస్తున్నాడేమో బహుశా. ఇవాళ ఈ క్షుద్రపూజల్లో ఓ కొత్త అంశాన్ని టచ్ చేయడం ద్వారా తెలంగాణ రాజకీయాలను మరింత దివాళతనం దిశగా తీసుకెళ్లాడు రేవంత్.
చేతబడులు చేసేవాళ్లను చెట్టుకు కట్టి కొడుతారు తెలుసు కదా? అని ప్రజలకు ఓసారి గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ బీఆరెస్‌ను ఎన్నికల్లో బండకేసి కొట్టాలని రేవంత్ ఉద్దేశ్యం కావొచ్చు. కానీ జనాలకు సీఎం హోదాలో ఏం మెసేజ్ ఇస్తున్నాడు రేవంత్..?
ముందే ఊర్లలో లేనిపోని అనుమానాలు.. ఎవరి మీదైనా కోపం, పగలు ఉంటే.. వారి మీద ఈ చేతబడుల పూజల ముద్రేసి చెట్టుకు కట్టి కొట్టినా కొడతారు. వాళ్లు చచ్చినా చస్తారు. గతంలో ఇలాంటివి జరిగిన ఉదంతాలున్నాయి. ఈ మధ్యే తగ్గుముఖం పడుతున్నాయి.
రేవంత్ రాజకీయాల పుణ్యమా అని.. అవి మళ్లీ తెలంగాణలో రెక్కలు విప్పుకుంటే.. ధర్మ ప్రభువులు.. ఈ కాంగ్రెస్ నాయకులే దానికి కారకులు. బాధ్యులు..! కాదంటారా?