Tirumala Laddu: తిరుమల శ్రీవారి ప్రసాదమైన శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని ఉపయోగించారనే ప్రచారం ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేసింది. నేతల మధ్య డైలాగ్ వార్‌ను పెంచింది. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. దీంతో ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులను ఇన్‌వాల్వ్ చేసింది. ఈ సిట్ కూడా అనేక నెలల పాటు దర్యాప్తు జరిపి.. అనేక మంది సాక్షులను, నిందితులను విచారించి రెండు చార్జ్‌షీట్‌లను దాఖలు చేసింది. అయితే చాలా రోజులుగా ఈ చార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా? లేదా? అనే డౌట్స్ మొదలయ్యాయి. కానీ ఇప్పుడీ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ వేసింది నెల్లూరు ఏసీబీ కోర్టు. వాటిని పరిగణలోకి తీసుకుంది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమతించింది. దీంతో ఇప్పుడు కేసు విచారణకు సమాయత్తమైందని చెప్పాలి.
సిట్ తొలి చార్జ్‌షీటులో 15మంది నిందితులను.. రెండో దాంట్లో 21మంది నిందితుల పేర్లు చేర్చింది. తాజాగా చార్జ్‌షీట్లను పరిగణలోకి తీసుకోవడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడు డెయిరీ సంస్థల యాజమానులు, టీటీడీ ఉద్యోగులు విచారణకు హాజరుకానున్నారు. అత్యంత సున్నితమైన కేసు కావడంతో చార్జిషీట్లను నిశితంగా పరిశీలించడానికి కోర్టు దాదాపు 9 నెలల సమయం తీసుకుంది. ఎట్టకేలకు ఈ నెల 8న వాటిని పరిగణనలోకి తీసుకుంది. తొలి విడతగా చార్జిషీటులోని మొదటి 14 మందిని న్యాయస్థానం విచారణకు పిలువనుంది. ఆ తర్వాత రెండో చార్జిషీటులోని నిందితులను కోర్టు విచారిస్తుంది.
వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అక్రమంగా డబ్బు కూడబెట్టడం కోసం మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహారించారంటూ అనేక మంది వైసీపీ నేతల పేర్లు ప్రచారం జరిగాయి. దీంతో ఇది రాజకీయాంశంగా మారింది. ఈ పరిణామాలతో దర్యాప్తునకు సుప్రీంకోర్టు సీబీఐ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. నెయ్యి కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లు, కొన్ని ప్రైవేటు డెయిరీలు, కొంతమంది టీటీడీ ఉద్యోగులు, వైసీపీ నాయకులు అధిక లాభాలకు ఆశపడి, కుట్రపూరితంగా కల్తీ నెయ్యి సరఫరా చేశారని సిట్ తేల్చింది. మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చుతూ రెండు దఫాలుగా రెండు చార్జిషీట్లు దాఖలుచేసింది. గత ఏడాది సెప్టెంబరులో నెల్లూరు ఏసీబీ కోర్టులో రెండో చార్జ్‌షీట్ వేసింది.
12 వందల పేజీలతో దాఖలు చేసిన సిట్ నివేదికను పరిశీలించిన అనంతరం కోర్టు దీనిని క్రిమినల్ కేసుగా నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులోని నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో బోలే బాబా డెయిరీ యజమానులు, టీటీడీ మాజీ అధికారుల, ఇతర ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు కోర్టు ముందు హాజరవ్వాల్సిందే.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఇప్పుడు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. టీటీడీ ప్రొక్యూర్‌మెంటు జీఎంగా పనిచేసిన సుబ్రహ్మణ్యం, భోలేబాబా డెయిరీ అధికారిక ప్రతినిధి అజయ్ సుగంధి ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఇక ఇప్పుడు సిట్ సేకరించిన ఆధారాలను బట్టి.. ఒక్కో నిందితుడిపై ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలో నిర్ణయిస్తుంది. ఇక్కడే లీగల్ బ్యాటిల్ ప్రారంభం కానుంది. నిందితులను ఆరోపణలను అంగీకరిస్తారా? లేదా? అనేది కీలకం కానుంది.
నిందితులపై కేసులు నమోదు కావాలంటే సాక్ష్యాధారాలు పక్కాగా ఉండాలి. అందుకే సిట్ దాదాపు 300కు పైగా సాక్షుల జాబితాను సిద్ధం చేసింది. ఇందులో టీటీడీ ప్రస్తుత సిబ్బంది, ల్యాబ్ నిపుణులు, ఇతర కీలక వ్యక్తులు ఉన్నారు. వీరిని ప్రాసిక్యూషన్ విచారిస్తుంది. ఆపై నిందితుల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. నెయ్యిలో కల్తీ జరిగినట్లు నిర్ధారిస్తూ నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ ఇచ్చిన నివేదికలను కోర్టు సైంటిఫిక్ ఎవిడెన్స్‌గా పరిగణించనుంది. ఇది ఈ కేసులో కీలకంగా మారనుంది. నిందితులు వాడినట్లు చెబుతున్న సింథటిక్ కెమికల్స్, పామాయిల్, ఇతర పదార్థాల లభ్యతను నిరూపించడం ప్రాసిక్యూషన్‌కు కీలకం కానుంది.
ఓ వైపు ఈకేసులో కోర్టు విచారణ జరుగుతుండగానే.. మరో రెండు కీలక ప్రక్రియలు జరగనున్నాయి. టీటీడీ అంతర్గతంగా జరిగిన పరిపాలనా పరమైన వైఫల్యాలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక కమిటీ విచారణ చేస్తోంది. ఇది కోర్టు విచారణకు అడ్డంకి కాదని సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో క్లారిటీ కూడా ఇచ్చింది. మరోవైపు ఈ కేసులో 250 కోట్ల ఆర్థిక కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నందున, నిందితుల ఆస్తుల జప్తు, మనీలాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది.
మీకు గుర్తుందో లేదో.. తిరుమల లడ్డూ ప్రసాదంపై నెలకొన్న కల్తీ నెయ్యి వివాదం ఏపీ పాలిటిక్స్‌లో అగ్గి రాజేసింది. SIT చార్జ్‌షీట్ అప్పట్లో ఓ ప్రకంపన సృష్టించింది. ఎందుకంటే లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలు వైసీపీని ఇరుకున పెట్టాయి. అయితే చార్జ్‌షీట్‌లో వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది. దాంతో.. వైసీపీ నేతలు సిట్ రిపోర్ట్‌ని తమకు అనుకూలంగా మలచుకొని.. గట్టి కౌంటర్లు ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై తమపై తప్పుడు ప్రచారం చేసిందని వైసీపీ చెబుతూ వచ్చింది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో ఎక్కడా జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని నొక్కి చెప్పారు.
వైసీపీ వాదన ఇలా ఉంటే.. లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం.. సిట్ ఛార్జ్‌షీట్‌తో తేలిపోయిందని కూటమి నేతలు చెబుతూ వచ్చారు. లడ్డూ ప్రసాదం తయారీలో.. అసలు నెయ్యే లేదని సిట్ రిపోర్టులో ఉందని టీడీపీ చెబుతోంది. పామాయిల్, కెమికల్స్ కలిపి.. నెయ్యి ఫ్లేవర్ వచ్చేలా చేశారని విమర్శిస్తున్నారు.
ఏదేమైనా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఉత్తర్‌ప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న భోలే బాబా డెయిరీ కేంద్ర బిందువుని సిట్ నిర్ధారించింది. నిజమైన, నాణ్యమైన ఆవు నెయ్యి కిలో 320 రూపాయలకు సప్లై చేయడం సాధ్యం కాదని.. యూపీ భోలే బాబా డెయిరీ, దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ.. తిరుమలకు నాణ్యత లేని, కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు తెలుస్తోంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గడిచిన ఐదేళ్లలో.. భోలే బాబా డెయిరీ కనీసం పాలను కూడా సేకరించకుండానే.. 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని ఉత్పత్తి చేసిందని సిట్ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది.
తిరుమల కల్తీ నెయ్యి ఆరోపణలపై.. సిట్ ఛార్జ్ షీట్ రెండు విషయాలను స్పష్టం చేసింది. వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సిట్ నిగ్గు తేల్చింది. అదొక్కటే కాదు.. ఆ కల్తీ నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదనే విషయాన్ని కూడా సిట్ నిర్ధారించింది. ఈ రెండు అంశాలను.. వైసీపీ, కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా వాడేసుకుంటున్నాయి.
నిజమైన నెయ్యిలా కనిపించేందుకు.. నిందితులు రసాయనాలు, నూనెలను వాడినట్లు ల్యాబ్ రిపోర్టులు స్పష్టం చేశాయి. రిఫైన్డ్ పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ వాడినట్లు తెలిపాయ్. రంగు కోసం బీటా క్యారోటిన్, వాసన కోసం నెయ్యి ఫ్లేవర్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్స్ లాంటి కెమికల్స్ ఉపయోగించినట్లు తేల్చాయి. గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ ల్యాబ్ టెస్టుల్లో బ్యూటరిక్ యాసిడ్ అతి తక్కువగా ఉండటం, బీటా సిటోస్టెరాల్ ఉండటంతో ఈ కల్తీ బయటపడింది. కొన్ని నమూనాల్లో ఇతర కొవ్వు అవశేషాలని కూడా సిట్ గుర్తించింది. పాలు, వెన్న లాంటివి సేకరించకుండానే.. పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, పామోలిన్ ఆయిల్ అతి తక్కువ పరిణామంలో నెయ్యితో కలిపి.. కెమికల్స్ జోడించి.. ఈ కల్తీ నెయ్యి తయారుచేశారు. ల్యాబ్ టెస్టుల్లో పాస్ అయ్యేందుకు.. కల్తీ నెయ్యి వాసన వచ్చేలా.. ఈ కెమికల్స్ కలిపారు.
టీటీడీ సేకరించిన నెయ్యిలో.. ప్రధానంగా పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ ఉందని, అందులో నెయ్యి పరిమాణం చాలా తక్కువని స్పష్టం చేసింది సిట్. అంతేకాదు నెయ్యి సప్లై చేసిన ప్రైవేట్ డెయిరీ సంస్థలకు.. టెండర్లలో పాల్గొనే అర్హత లేకపోయినా.. నకిలీ పత్రాలతో టెండర్ చేజిక్కించుకున్నాయని తేల్చింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో.. ప్రతి నెయ్యి ట్యాంకర్‌కు కమీషన్లు వసూలు చేశారని సిట్ తెలిపింది.
మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ కుందూరు చిన్నప్పన్న.. కిలోకు 25 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు సిట్ తేల్చింది. ఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్ లాంటి నగరాల్లో.. హవాలా మార్గంలో నగదు లావాదేవీలు జరిగాయని సిట్ తన ఛార్జ్‌షీట్‌లో వివరించింది. ఒకే వాహన నెంబర్లను పదేపదే వాడటం, సరుకు పంపకుండానే.. ఖాళీ ఇన్వాయిస్‌లతో రికార్డులు సృష్టించడం లాంటి మోసాలకు పాల్పడ్డారని గుర్తించింది. డిలీట్ చేసిన వాట్సాప్ చాట్‌లను డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా రికవరీ చేసిన సిట్, నిందితుల మధ్య జరిగిన కుట్రను బట్టబయలు చేసింది. నకిలీ ల్యాబ్ రిపోర్టులు సృష్టించిన రవీంద్ర శర్మ పాత్రను కూడా ఛార్జ్‌షీట్‌లో వివరించారు. ఈ కేసులో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చారు సిట్ అధికారులు. ప్రధాన సూత్రధారులుగా భోలే బాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్‌లను గుర్తించారు. క్రిమినల్ కుట్ర, కల్తీ ఆహార విక్రయం, నమ్మక ద్రోహం, ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి.
తిరుమల లడ్డూ ప్రసాదం అనేది కేవలం ఓ స్వీట్ పదార్థం కాదు. అది కోట్లాది మంది హిందువుల విశ్వాసం. లక్షలాది మంది శ్రీనివాసుడి భక్తుల నమ్మకం. రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా.. నిజమైన విచారణతో.. దోషుల్ని తేల్చి, భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు తావు లేకుండా చూడాలని వేంకటేశ్వర స్వామి భక్తులు కోరారు. ఇప్పుడిది అతి త్వరలోనే సాకారం కానున్నట్టు అర్థమవుతోంది. ఒక్కసారి విచారణ ప్రారంభమైతే ఈ కేసులో మరిన్ని కొత్త వివరాలు, కొత్త పేర్లు బయటికి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైతే కొందరు టీటీడీ అధికారులు, కొందరు వైసీపీ నేతల మెడకు మాత్రం ఈ కేసు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. ఏసీ కోచ్‌లో సీటు ఇప్పిస్తానని నమ్మించి మహిళపై అఘాయిత్యం!
Story by: Anup, Big Tv