అది 1980 సంవత్సరం. జూలై 18. ఉదయం 8 గంటల 4 నిమిషాలు… శ్రీహరికోట నుంచి ఓ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అది కేవలం ఓ ప్రయోగం కాదు. భారత్ కలలకు రెక్కలు ఇచ్చిన క్షణం. SLV-3 రాకెట్ ద్వారా రోహిణి RS-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది భారత్. ఆ ప్రయోగంతో… సొంతంగా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపగల దేశాల జాబితాలో భారత్ ఏడో దేశంగా నిలిచింది. ఆ విజయం వెనుక… ఎన్నో ఏళ్ల కష్టం… ఎంతోమంది శాస్త్రవేత్తల శ్రమ… ముఖ్యంగా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నాయకత్వం ఉంది. ఆ సమయంలో ఇస్రోకు నాయకత్వం వహించిన సతీష్ ధావన్ మార్గదర్శకత్వం ఉంది. ఆ రోజు ఆకాశంలోకి వెళ్లింది ఓ రాకెట్ మాత్రమే కాదు… భారత్ ఆత్మవిశ్వాసం కూడా.
1984… భారత్ చరిత్రలో మరో మైలురాయి. ఏప్రిల్ 2… సోయుజ్ టీ-11 అంతరిక్ష నౌకలో భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. భూమిని అంతరిక్షం నుంచి చూసినప్పుడు… “భారత్ ఎలా కనిపిస్తోంది..?” అప్పటి ప్రదాని ఇందిరాగాంధీ అడిగితే… సారే జహాన్ సే అచ్చా…” అంటూ రాకేష్ శర్మ సమాధానం ఇచ్చాడు. ఆ మాట ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపింది. ఒక సాధారణ భారతీయుడు… అంతరిక్షం నుంచి దేశాన్ని చూస్తున్న క్షణం… ఓ తరం కలలను నిజం చేసిన క్షణం. అప్పటి పిల్లలకు అది ఓ అద్భుతం… ఆకాశం వైపు చూసి… “మనమూ అక్కడికి వెళ్లగలమా..?” అనే కలలు మొదలైన సమయం.
80’sలో మార్పు కేవలం ఆకాశంలోనే కాదు… మన చేతుల్లోకి కూడా వచ్చింది. అప్పుడు ఒకరితో మాట్లాడాలంటే… లేఖలు రాయాలి… దూర ప్రాంతాలకు ఫోన్ చేయడం అంత సులభం కాదు. అలాంటి సమయంలో… 1984లో సి-డాట్ ఏర్పాటైంది. ఆ తర్వాత 80’s చివర్లో… దేశవ్యాప్తంగా STD, PCO బూత్‌లు… ప్రజల జీవితాల్లో ఓ కొత్త మార్పు తీసుకొచ్చాయి. ఇప్పుడు వీడియో కాల్స్… ఇంటర్నెట్… స్మార్ట్‌ఫోన్లు… మన జీవితంలో భాగమయ్యాయి. కానీ… ఆ సౌకర్యాల వెనుక మొదటి అడుగులు వేసింది 80’s భారత్. అంతరిక్షంలోకి పంపిన రాకెట్ నుంచి… వీధి మూలలో కనిపించిన STD బూత్ వరకు… 80’s అంటే కేవలం పాత జ్ఞాపకాలు కాదు… భారత్ భవిష్యత్తుకు పునాది వేసిన ఓ మార్పుల కాలం.
Also Read: ఎండ్ల బండిపై హయ్.. హయ్.. మారుతీ కారులో రయ్ రయ్.. 80’s జర్నీ మరపురానిది!
Also Read: 80ల్లో సైకిల్ ఉంటే అదో గొప్ప.. అప్పటి నిబ్బాలు చేసే విన్యాసాలకు నిబ్బీలు ఫిదా!