ఊర్లో ఎక్కడైనా జాతర ఉందంటే… ఇంట్లో ఓ సందడి మొదలయ్యేది. పిల్లలకు అంతులేని ఆనందం. పెద్దలకు ఓ చిన్న సంబరం. అందరూ కలిసి ఎడ్లబండి దగ్గరకు చేరేవారు. ఎద్దులకు అలంకరణ చేసేవారు. బండిపై కూర్చునేందుకు పిల్లలు పోటీ పడేవారు. ఎవరు ముందు కూర్చోవాలి… ఎవరు పక్కన కూర్చోవాలి… అంటూ చిన్న చిన్న గొడవలు. ఆ తర్వాత అందరూ కలిసి నవ్వుకునేవారు. బండి నెమ్మదిగా కదులుతుంటే… దారిలో కనిపించే పొలాలు… చెట్లు… పక్క ఊళ్ల మనుషులు… అన్నీ చూస్తూ ప్రయాణం సాగేది. అది కేవలం ప్రయాణం కాదు.. కుటుంబం మొత్తం కలిసి గడిపే ఓ సమయం.
సినిమాకు వెళ్లడం కూడా అప్పట్లో ఓ ప్రత్యేకమైన విషయం. ఇంట్లో ముందే ప్లాన్ చేసుకునేవారు. ఏ సినిమా చూడాలి… ఎప్పుడు వెళ్లాలి… అందరూ కలిసి బయలుదేరేవారు. ఎడ్లబండిపై వెళ్లే ఆ ప్రయాణం… సినిమా కంటే ముందే మొదలైన ఓ ఆనందం. పెళ్లిళ్లకు వెళ్లినా అంతే. బంధువులంతా కలిసి ఒకేసారి బయలుదేరేవారు. మార్గమధ్యలో కబుర్లు… నవ్వులు… పిల్లల అల్లరి… ఆ ప్రయాణంలోనే సగం వేడుక పూర్తయ్యేది. అప్పుడు ప్రయాణం నెమ్మదిగా సాగేది… కానీ మనుషుల మధ్య దూరాలు మాత్రం తక్కువగా ఉండేవి.
ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎక్కడికైనా వెళ్లాలంటే నిమిషాల్లో వాహనం సిద్ధంగా ఉంటుంది. బైకులు, కార్లు, బస్సులు, క్యాబ్‌లు… ప్రయాణం వేగంగా మారిపోయింది. కానీ… ఎడ్లబండిపై కుటుంబం మొత్తం కలిసి వెళ్లిన ఆ అనుభూతి… దారంతా మాట్లాడుకుంటూ నవ్వుకున్న ఆ క్షణాలు… పిల్లలు కిటికీ కోసం కాదు… బండి ముందు కూర్చోవడం కోసం చేసిన పోటీలు… అవి మాత్రం ఓ తరం గుండెల్లో చెరిగిపోని జ్ఞాపకాలు. అందుకే 80’s ట్రెండ్ అంటే… పాత కాలాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు… నెమ్మదిగా సాగినా… ప్రేమతో నిండిన ఆ ప్రయాణాలను మళ్లీ అనుభవించడం.
ఆ రోజులు వేరు… ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే వెంటనే వాహనం కోసం చూడాల్సిన అవసరం ఉండేది కాదు. చిన్న దూరం అయితే నడుచుకుంటూనే వెళ్లేవారు. సాయంత్రం వేళల్లో రోడ్లపై నడుస్తూ మాట్లాడుకునే మనుషులు కనిపించేవారు. పక్క ఇంటికి వెళ్లాలన్నా… బంధువుల ఇంటికి వెళ్లాలన్నా… నడకలోనే ఆప్యాయత ఉండేది. పిల్లలు స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్లేవారు… పెద్దలు పొలం బాట పట్టేవారు… నడక కేవలం ప్రయాణం కాదు… అది అప్పటి జీవితంలో ఓ భాగం.
ఇక దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులే ప్రధాన ఆధారం. బస్సు కోసం ఎదురుచూడటం… విండో సీటు కోసం పిల్లలు మారం చేయడం.. అవి కూడా ఓ మధురమైన జ్ఞాపకాలే. పల్లెల్లో ఎద్దుల బండ్లు ప్రయాణానికి, సరుకు రవాణాకు ఉపయోగపడేవి. వ్యవసాయంలో ట్రాక్టర్లు రావడం రైతులకు కొత్త మార్పు తీసుకొచ్చింది. అయినా కారు మాత్రం అందరి ఇంటి ముందు ఉండేది కాదు. కారు ఉన్న ఇల్లు అంటే ఊరిలో ప్రత్యేక గుర్తింపు. అది ఓ సౌకర్యం మాత్రమే కాదు… ఓ కల.
1983లో మారుతి 800 రావడంతో భారతీయుల ప్రయాణ ఆలోచన మారడం మొదలైంది. మధ్యతరగతి కుటుంబాలు కూడా సొంత కారు గురించి కలలు కనడం మొదలుపెట్టాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది… ఒక ఇంట్లో ఒకటి కాదు… అవసరానికి తగ్గట్టు అనేక వాహనాలు కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్లు, స్మార్ట్ ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీతో ప్రయాణం మరింత సులభమైంది. అప్పుడు నడుచుకుంటూ వెళ్లిన దారులు… ఇప్పుడు కార్లతో నిండిపోయాయి. వేగం పెరిగింది… సౌకర్యాలు పెరిగాయి… కానీ 80’sలో నడిచిన ఆ దారుల్లో ఉన్న ఆప్యాయత… ఆ ప్రయాణాల్లో ఉన్న ఆనందం మాత్రం ఓ తరం జ్ఞాపకంగా మిగిలిపోయింది. అందుకే 80’s ట్రెండ్ అంటే కేవలం పాత ఫొటోలు కాదు… అది మనం ఎలా జీవించామో గుర్తు చేసే ఓ అందమైన ప్రయాణం.
Also Read: ఒక్క ఫోటో కోసం ఎన్నో రోజులు ఎదురుచూపులు.. 80s స్టూడియో అనుభూతే వేరు!
Also Read: 80’s హీరోస్.. కొత్తతరం కథానాయకులకు యమ క్రేజ్, మహా నటులను వెనక్కి నెట్టి..