TMC Revolt: ముందు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఎంపీలు అదే బాట ఎంచుకున్నారు. ఇంకొందరు ఎటూ కాకుండా సైలెంట్‌గా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయాక. మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్. పేకముక్కల్లా కూలిపోతోంది. ఎమ్యెల్యేల్లో చీలిక తర్వాత టీఎంసీ ఎంపీల్లోనూ చీలిక వచ్చింది. ఆ పార్టీకి చెందిన 28 మంది లోక్‌సభ ఎంపీల్లో 20 మంది ప్రత్యేక వర్గంగా ఏర్పడి ఎన్డీయేకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తీదార్ తమని ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని, తాము ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్నామని స్పీకర్ ఓం బిర్లాకు 20 మంది ఎంపీల సంతకాలతో లేఖ కూడా రాశారు. ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ శాసనసభాపక్షంపై నియంత్రణ కోల్పోయిన మమతా బెనర్జీకి ఇది పెద్ద దెబ్బ. టీఎంసీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే ఇంకొందరు తృణమూల్ రాజ్యసభ ఎంపీలు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిణామాలన్నీ ఢిల్లీలో ఇండియా కూటమి సదస్సుకు మమతా బెనర్జీ హాజరైన రోజునే జరిగాయ్.
కాకోలీ ఘోష్ నేతృత్వంలోని తిరుగుబాబాటు వర్గం తమకు 20 మంది ఎంపీల మద్దతు ఉందని చెప్పుకుంటోంది. వీరిలో 14 మంది కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో బెంగాల్ సీఎం సువేందు అధికారితో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. అదే రోజు శతాబ్దిరాయ్ ఇంట్లోనూ సమావేశమయ్యారు. ఈ రెండు మీటింగుల్లోనూ 14 మంది ఎంపీలు పాల్గొన్నారు. కాకోలీ ఘోష్ తనతో లేని ఎంపీల పేర్లని కూడా చెప్పారు. లోక్‌సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 20 మంది ఎంపీలు బయటికి వస్తే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లోని రూల్ ప్రకారం అనర్హత వేటు నుంచి తప్పించుకుంటారు. పైగా తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని స్పీకర్‌కు లేఖ ఇచ్చి గుర్తింపు పొందే వీలు కూడా ఉంది. టీఎంసీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది ఎంపీల్లో మెజారిటీ సభ్యులు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. వాళ్లలో ఒక్కొక్కరితో రాజీనామా చేయించే దిశగా బీజేపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయడం, వెంటనే ఆమోదించడం జరిగిపోయాయ్. ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ఆయన్ని బీజేపీ నుంచి ఎన్నుకోనున్నారు.
Also read: ఆ డాక్యుమెంటరీ చూసి ఎమోషనల్ అయిన ధనుష్.. ‘ఎప్పటికీ నువ్వే GOAT’ అంటూ..’
ప్రస్తుతం టీఎంసీ రెండుగా కాకుండా.. మూడు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఎంపీల్లో ఒక వర్గం కాకోలీ ఘోష్ దస్తీదార్ వైపు ఉండగా, మరో వర్గం ఎంపీలు మమతా బెనర్జీతోనే ఉన్నారు. మూడో వర్గం ఎటూ కాకుండా మౌనంగా ఉంది. వాళ్లు రెబల్ గ్రూప్‌లోనూ, మమతా బెనర్జీతోనూ ఉన్నట్లు కనిపించడం లేదు. వీరి నుంచి ఎలాంటి ప్రకటనలు రాకపోవడంతో.. వారి భవిష్యత్ రాజకీయ అడుగులపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయ్. టీఎంసీలో చీలిక ఉన్నా పార్టీ ఎంపీల్లోని ఓ వర్గం మమతా బెనర్జీకి మద్దతుగా నిలుస్తోంది. మమతకు అండగా నిలుస్తున్న ఎంపీల్లో అభిషేక్ బెనర్జీ, సయానీ ఘోష్, కీర్తి ఆజాద్, మహువా మొయిత్రా లాంటి వాళ్లున్నారు. నిజానికి, ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనల నుంచి తప్పించుకోవాలంటే కాకోలీ ఘోష్ వర్గానికి కనీసం 19 మంది ఎంపీల మద్దతు అవసరం.
మమతా బెనర్జీ వర్గం చెబుతున్న దాని ప్రకారం, తిరుగుబాటు వర్గానికి మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు లేదు. 20 మంది ఎంపీల మద్దతనేది కేవలం పుకార్లే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి కోల్‌కతా వరకు టీఎంసీ నుంచి ఎవరు విడిపోతారు? దీదీతో ఎవరు ఉంటారు? అనే దానిపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయ్. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా చేస్తున్న పదునైన ట్వీట్స్ కూడా బెంగాల్‌లో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయ్. లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసిన టీఎంసీ ఎంపీల్లో.. యూసుఫ్ పఠాన్ కూడా ఉన్నారని కాకోలీ ఘోష్ చెబుతున్నారు. దాంతో మహువా మొయిత్రా యూసుఫ్ పఠాన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఎంపీ యూసుఫ్ పఠాన్ ఎవరి వైపు ఉన్నారనేది కూడా ఇప్పుడు అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది.
తృణమూల్ ఎంపీలను ఎన్డీయే వైపు తిప్పే ఆపరేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో టీఎంసీ ఎంపీలతో సమావేశం ముగిశాక మిగతా ఎంపీలతో మీట్ అయ్యేందుకు ఆయన కోల్‌కతా వెళ్లినట్లు తెలుస్తోంది. చర్చలు కొలిక్కి వచ్చాక అంతా ఒకేసారి బహిరంగ ప్రకటన చేసే అవకాశముంది. అయితే, ఎంపీ సీఎం రమేశ్‌ని టార్గెట్ చేస్తూ టీఎంసీ మహువా మొయిత్రా చేసిన ట్వీట్ హీట్ రేపుతోంది. సీఎం రమేశ్ దల్లాగిరి చేస్తున్నారని విమర్శించారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాల్లో అలజడి అయితే రేగింది. టీఎంసీ ఎమ్మెల్యేల చీలిక, ఎంపీల తిరుగుబాటు మమతా బెనర్జీ కంచుకోట గోడలను బద్దలుకొట్టేశాయ్. దాంతో చివరికి దీదీతో మిగిలేదెవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also read: లక్ష ఇందిరమ్మ ఇండ్లు! జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ నమ్ముకున్న కీలక పథకమిదే!