మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చర్చకు దారితీస్తోంది. మద్యం దుకణాల టెండర్ల విషయంలో మునుగోడు నియోజకవర్గంలో ప్రత్యేకంగా రూల్స్ అంటూ కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ దూమారాన్ని రేపాయట. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అటు మద్యం వ్యాపారుల్లోను…ఇటు ఎక్సైజ్ అధికారుల్లో గందరగోళానికి గురిచేస్తున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకోవాల్సి రావడం చర్చినీయంశంగా మారిందట.
మునుగోడులో మద్యం విక్రయాల అంశం అధికార పార్టీలో చిచ్చు రాజేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే బెల్టు షాపులను నిర్మూలిస్తున్నామని మద్యం నియంత్రణ కోసం మునుగోడులో ముందడుగు పడిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. ఇక కొత్త పాలసీ పై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా వైరల్ అయ్యాయి. సాయింత్రం 4 నుంచి రాత్రి 9 వరకే వైన్స్ షాపుల సమయపాలన, పర్మిట్ రూమ్ నిషేధం, స్థానికులే టెండర్ లు వేయాలని… మునుగోడు ఎమ్మెల్యే ఇలా కొత్త కండీషన్లు పెట్టారు.
అయితే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారడంతో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి వివరణ ఇవ్వాల్సి రావడం హాట్ టాపిక్‌గా మారింది. మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తరుచూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టో లోనే బెల్టు షాపులను నిర్మూలిస్తామని చెప్పారని అందుకు అనుగుణంగా నే ముందుకు వెళ్తున్నానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. తానేమి పూర్తిగా మద్యపాన నిషేధం చేయడం లేదని మద్యాన్ని నియంత్రించేందుకు ప్రయత్నo చేస్తున్నానేది రాజగోపాల్ రెడ్డి వర్షన్.
మద్యానికి బానిసై ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయని ఆర్థికంగా నష్టపోతున్నారని పలు సందర్భాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ పాలనలో మద్యం ఏరులై పారిందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చక కూడా మేనిఫెస్టో లో పెట్టిన ప్రకారం బెల్టు షాపులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదాయం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సరైంది కాదని రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపుల నిర్మూలన ఉద్యమానికి సిద్దంగా ఉన్నట్టు రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. తన నియోజకవర్గ పరిధిలో మద్యం దుకాణాలు కేవలం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే విక్రయాలు జరపాలని, అలాగే పర్మిట్ రూమ్స్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వబోమని రాజగోపాల్‌రెడ్డి ఇటీవల బహిరంగంగా ప్రకటించారు.
ఎమ్మెల్యే విధించిన ఈ ఆంక్షలు స్థానిక మద్యం వ్యాపారులలో తీవ్ర అయోమయాన్ని, భయాన్ని సృష్టించాయి. ఈ కారణంగానే కొందరు వ్యాపారులు కొత్త లైసెన్స్‌ల కోసం టెండర్లు వేయడానికి కూడా వెనుకంజ వేశారు. పరిస్థితిని గమనించిన ఎక్సైజ్ శాఖ అధికారులు మునుగోడులో నెలకొన్న ఈ ప్రత్యేక పరిస్థితులపై ప్రభుత్వంలోని కీలక నేతలకు నివేదిక అందించారట. దీంతో ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
మద్యం విక్రయాలపై మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పెట్టిన షరతులు విధించడంపై ఎక్సైజ్ శాఖకు కూడా సీరియస్‌గానే స్పందించిన పరిస్ధితి. రాష్ట్రమంతా ఒక పాలసీ ఉంటే మునుగోడు లో అందుకు భిన్నంగా ఉండదని ఎవరికి వారే పాలసీ లు డిసైడ్ చేయరని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి మాట్లాడారు. దీంతో ఇదే వార్త సోషల్ మీడియా లో ఇపుడు హల్చల్ చేస్తుంది. ప్రభుత్వంలో ఉండి ఇలా వ్యాఖ్యలు చేయడం ఎక్సైజ్ శాఖ మంత్రి కి మింగుడు పడటం లేదనే చర్చ నడిచింది.
ఓ వైపు రాష్ట్రమంతా ఒక పాలసీ నడుస్తుంటే మునుగోడులో మాత్రం అందుకు భిన్నంగా ఉండదని ఎక్సైజ్ శాఖ నుంచి గట్టిగా చేప్పిన పరిస్ధితి. ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు సొంతంగా రూల్స్ పెడితే కుదరదని, రాష్ట్రం మొత్తం ఒకే పాలసీ ఉంటుందని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అనవసరంగా భయపడకుండా షాపులకు దరఖాస్తు చేసుకోండి. డ్రా ద్వారా లైసెన్స్ పొందిన వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటుందనే భరోసా ఇచ్చినట్లు టాక్.
మంత్రి పదవి రాలేదనే అక్కసుతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నట్లు విమర్శలున్నాయట. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఇలా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా, పాలసీకి విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ అక్కసు ఉందని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోందట. మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తున్న పరిస్ధితి. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి మంత్రి పదవులు ఇచ్చి పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని కష్టపడిన తనను విస్మరించడం సరికాదని రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే బహిరంగంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి వ్యవహార శైలి…చేస్తోన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పూర్తి స్థాయి నివేదిక పంపినట్లుగా పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఇప్పటికే ప్రతి విషయం లో కాంట్రవర్సీ గా ఉన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇపుడు మద్యం పాలసీ విషయం ఎక్కడికి దారితీస్తుందనే చర్చ నడుస్తోందట.
ఎదేమైనా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది.ప్రతిపక్షాలు కూడా రాజగోపాల్ రెడ్డి మునుగోడు లో సొంత రాజ్యాంగం నడుపుతున్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారని మీడియా ముందే బహిరంగంగా చెబుతున్నారు.చూడాలి మరి రాజగోపాల్ రెడ్డి విషయం లో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Story by Adinarayana , Big Tv