BigTV English

Tricky Deaths of Great Kings: గొప్ప రాజులు.. గమ్మత్తు మరణాలు..!!

Tricky Deaths of Great Kings: గొప్ప రాజులు.. గమ్మత్తు మరణాలు..!!

Tricky Deaths of Great Kings: చరిత్రలో ఎందరో రాజులు యుద్ధభూమిలోనే ఆఖరి శ్వాస వదిలారు. మరికొందరు వయోభారంతో, విషప్రయోగాలతో, అనారోగ్యంతో కన్నుమూశారు. వీరి సంగతి కాసేపు పక్కనబెడితే.. ఈ ప్రపంచాన్ని ఏలిన కొందరు రాజులు తమ అత్యుత్సాహం కారణంగా, అతి తెలివితేటల కారణంగా, తమ అనుచిత ప్రవర్తన కారణంగానూ అసహజ మరణాల పాలయ్యారు. వీరి మరణాల గురించి తెలుసుకుంటే.. ‘ఔరా.. విధి ఎంత చిత్రమైనది’ అని ఎవరికైనా అనిపించక మానదు. అలాంటి కొందరు రాజులు.. వారి అసహజ మరణాల ముచ్చట్లు మీకోసం..


రాజు ఛార్లెస్-II

క్రీ.శ 14వ శతాబ్దంలో యూరప్‌లోని నవార్రె ప్రాంతపు రాజు ఛార్లెస్-II (54) అనారోగ్యంతో మంచం పట్టాడు. అతడిని పరిశీలించిన రాజవైద్యులు.. రాజుగారి అరికాలు నుంచి తలవరకు మద్యంలో నానబెట్టిన వస్త్రాన్ని చుట్టాలని తీర్మానించి, ఆ పనిని అక్కడి ఒక ఆయాకు అప్పగించిపోయారు. ఆమె వారు చెప్పినట్లే వస్త్రం చుట్టి.. అది ఊడిరాకుండా.. ఓ దారంతో ముడివేసి, కిందికి వేలాడుతున్న దారంపోగులు కత్తెరిద్దామని కత్తెర కోసం చూసింది.కనబడకపోవటంతో చీకటిగా ఉన్న స్టోర్ రూమ్‌‌కి పోయి.. కొవ్వొత్తి వెలిగించి, కత్తెరను తీసుకుని వస్తూ వస్తూ.. రెండోచేత్తో కొవ్వొత్తినీ తెచ్చి.. రాజుగారి మంచం మీద పెట్టి దారం కత్తిరించబోయింది. అంతే.. మద్యంలో నానిన వస్త్రానికి మంటలు అంటుకుని అందరూ వచ్చే లోగానే రాజుగారు మాడి మసైపోయాడు.


కిన్‌ షి హుహాంగ్‌

క్రీ.పూ 247 నుంచి 221 మధ్య చైనా మొత్తాన్ని పాలించిన కిన్‌ షి హుహాంగ్‌ అనే చక్రవర్తికి ఓ వింతకోరిక కలిగింది. చావు అనేదే లేకుండా.. ఎప్పటికీ తానే రాజుగా ఉండాలని అనుకున్నాడు. దీనికోసం ఏదైనా ఔషధం సూచించమని వైద్యులను కోరగా.. ఎవడో దిక్కుమాలిన వైద్యుడు.. ‘పాదరసం సేవించండి ప్రభూ.. ఇక మీకు చావే ఉండదు’ అని పనికిమాలిన సలహా ఇచ్చాడు. ఇంకేముంది.. ఒక మంచి మహూర్తంలో మన చక్రవర్తి గారు.. పీకలదాకా పాదరసం పట్టించేశాడు. అలా.. లేని అమరత్వం కోసం ఉన్న జీవత్వాన్ని పోగొట్టుకొన్నాడు.

1917లో గ్రీసును పాలిస్తున్న 24ఏళ్ల అలెగ్జాండర్‌ (అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ కాదు) అనే రాజుగారు గొప్ప జంతుప్రేమికుడు. రాజైన మూడేళ్లకు (1920, అక్టోబరు 2న) తన పెంపుడుకుక్కతో రాజుగారు వాకింగ్‌కు బయలుదేరాడు. అయితే.. దారి తప్పి వచ్చిన ఓ పెద్ద కోతి వారికి ఎదురైంది. రాజుగారి చేతిలో ఉన్న కుక్క.. ఒక్క ఉదుటన ఆ కోతిమీదికి దూకటంలో ఆ రెండూ ఫైట్ చేసుకునే క్రమంలో గాయాలై రక్తం కారుతోంది. అయ్యో.. పాపం అనుకుంటూ మన రాజుగారు వాటిని విడదీసే పనికి పూనుకోగా, ఆ కోతి రాజుగారి కాలిని గట్టిగా కొరికేసింది. దీంతో కాలికి పెద్దగాయమైంది. రాజుగారు దాన్ని పట్టించుకోకపోవటంతో అది కాస్తా సెప్టిక్ అయి.. అదే నెల 25న కన్నుమూశారు.

సిగర్డ్‌ ఆఫ్‌ మైటీ

ఉత్తర స్కాట్లాండ్‌లో క్రీ.శ 875 – 892 మధ్య సిగర్డ్‌ ఆఫ్‌ మైటీ అనే గొప్ప వీరుడికి, అక్కడి మరోవర్గపు వీరుడు మీల్‌బ్రిగ్డ్‌‌కు తగాదా వచ్చింది. ఇద్దరూ చెరో 40 మందితో బరిలో దిగి కొట్టుకొని.. ఎవరు గొప్ప వీరులో తేల్చుకుందామని ఒప్పందానికొచ్చారు. అయితే.. సిగర్డ్ ఆ పోటీలో తొండిచేసి.. 40కి బదులుగా 80 మందితో యుద్ధానికి దిగి, ప్రత్యర్థి మీల్ బ్రిగ్డ్‌ తలనరికి చంపేశాడు. ఆ తలను గుర్రానికి కట్టి ఉత్సాహంగా ఇంటికి వస్తుండగా, గుర్రం కాలు మెలికపడి ముందుకు తూలటంతో.. సిగర్డ్ కాలు.. గుర్రానికి, దానికి వేలాడుతున్న మీల్‌ బ్రిగ్డ్‌ తలకు మధ్య ఇరుక్కుంది. దాంతో మీల్ బ్రిగ్డ్ పన్ను అతని కాలికి గుచ్చుకుంది. అదికాస్తా..విషపూరిత గాయంగా మారి వారంలోనే సిగర్డ్‌ చనిపోయాడు.

జేమ్స్‌-II

1437 – 1460 వరకు స్కాట్లాండ్‌ను పాలించిన జేమ్స్‌-IIకు ఫిరంగులంటే భలే ఇష్టం. సైన్యం కోసం ఆర్డర్ చేయగా వచ్చిన కొత్త ఫిరంగుల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆగస్టు 3, 1460న బయలుదేరాడు. ఈ క్రమంలో ఓ ఫిరంగిలో మందుగుండు పెట్టి పేల్చగానే అది వెనక్కి పేలి అక్కడున్న రాజుగారి తొడ రెండు ముక్కలైంది. తీవ్ర రక్తస్రావం కావటంతో ఆ ఫిరంగి దగ్గరే పడి ఆ రాజుగారు మరణించాడు.

చార్లెస్-VIII

క్రీ.శ 1483లో ఫ్రాన్స్ దేశానికి 13 ఏళ్ల చార్లెస్-VIII రాజుగా ప్రకటించబడ్డాడు. తన 21వ ఏట గద్దెనెక్కి రాజ్యాపాలన చేస్తున్న ఈ రాజుగారికి టెన్నిస్ అంటే చచ్చేంత ఇష్టం. సమీపంలో ఎవరో టెన్నిస్ ఆడుతున్నారని సేవకులు చెప్పగా విని.. మంచం మీది నుంచి ఒక్క అంగలో దూకి అక్కడికి వెళ్లాలని ప్రయత్నించాడు. కానీ.. ఆ ఊపులో అతని తల.. అక్కడ మూసిఉన్న ఓ పెద్ద తలుపుకు గుద్దుకుంది. అయినా.. పట్టించుకోకుండా వెళ్లి ఆట చూసి సంతోషంగా రాజమందిరానికి వచ్చాడు. ఆట గురించి చెబుతూ.. కుప్పకూలి గంటల వ్యవధిలోనే ప్రాణం విడిచాడు.

హంగేరిని క్రీ.శ 1060లో బెలా-I అనే రాజు పాలించేవాడు. ఆయన గద్దెనెక్కిన మూడేళ్లకు.. ఏదో ముఖ్యమైన అంశం చర్చించాల్సి వచ్చి.. సభకు వచ్చారు. రోజూలాగే.. ఆ రోజూ తన సింహాసనం మీద కూర్చున్నాడు. అంతే.. క్షణాల్లో అది విరిగి ముక్కలై రాజుగారు కిందపడ్డారు. తల నేరుగా నేలకు గుద్దుకోవటంతో తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ కొన్ని రోజులకు కన్నుమూశాడు.

విలియమ్‌-II

క్రీ.శ 1087 – 1100 మధ్య ఇంగ్లాండ్‌ను పాలించిన విలియమ్‌-II అనే రాజుకు వేట అంటే ప్రాణం. 1100 ఆగస్టు 2న బ్రోకన్‌హర్ట్స్‌ సమీపంలోని ఓ దట్టమైన అడవికి వేటకని మందీమార్బలంతో వెళ్లాడు. తలోదిక్కు నుంచి జింకలను వేటాడేపనిలో బిజీగా ఉన్నారు. ఇంతలో అవతలి వైపు నుంచి ఆయన సైనికుడొకడు వేసిన బాణం నేరుగా రాజుగారి గొంతులో దిగబడి, ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×