US–Iran Missile: ఒక్కసారి ఇరాన్ అమ్ములపొది ఈ సొరంగంలో ఉన్న క్షిపణులు చూడండి.. ఎన్ని ప్రయోగించినా.. అక్షయపాత్రలా కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయ్.. ఇంకా ఎన్ని రోజులు యుద్ధం చేసినా తరగని అస్త్రాలున్నాయ్. అమెరికాతో ఎప్పుడో ఒక రోజు గట్టిగా యుద్ధం వస్తుందని ఇరాన్ అన్ని రకాలుగా ముందు జాగ్రత్త పడింది. అందులో భాగంగానే లెక్కకు మిక్కిలి క్షిపణులు రెడీ చేసి పెట్టుకుంది. కానీ అమెరికా అలా కాదు.. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా అక్కడేమీ లేదు..
నెల రోజుల యుద్ధానికే అస్త్ర సన్యాసం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయ్.
ప్రముఖ అంతర్జాతీయ డిఫెన్స్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ -CSIS అలాగే అమెరికన్ మీడియా కథనాల ప్రకారం, ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌ను రక్షించే క్రమంలో అమెరికా తన ఆయుధాగారంలోని అత్యంత కీలకమైన రక్షణ క్షిపణులను భారీగా కోల్పోయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధాన్ని పొడిగించకుండా వెనక్కి తగ్గి, సీజ్‌ఫైర్ ను పొడిగించడానికి ఈ ఆయుధాల కొరత అత్యంత ప్రధాన కారణమని రక్షణరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కేవలం 6 నుంచి 7 వారాల పాటు జరిగిన పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా తన ఆయుధ నిల్వలను మెరుపు వేగంతో వాడేసింది. ఏదో ఇరాన్ ను పొడిచేస్తామనుకున్నారు. దిగి వస్తుందనుకున్నారు. కానీ అలా జరగలేదు. సీన్ కాస్తా రివర్స్ అయింది. బాలిస్టిక్ క్షిపణులను గాల్లోనే కూల్చేసే అత్యంత అధునాతన THAAD వ్యవస్థ క్షిపణులలో కనీసం 50% కి పైగా ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం పెంటగాన్ వద్ద కేవలం 200 థాడ్ క్షిపణులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలా జరగడానికి కూడా కారణం ఉంది. ఇరాన్ చిన్న డ్రోన్ ప్రయోగించినా చాలు.. థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి పెద్ద పెద్ద మిసైల్స్ ను ప్రయోగించారు. అంటే అది పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్న మాట. ఇలా ఎవరైనా ప్రయోగిస్తారా.. కానీ అమెరికా ప్రయోగించింది. ఇప్పుడు నిల్వలన్నీ అయిపోవడంతో తెల్లమొఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సో ఏ రకంగా చూసినా అమెరికా ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు. ఇది నిజం. ఇదే నిజం. ఇరాన్ పై అమెరికా 200కు పైగా థాడ్ క్షిపణులను ప్రయోగించింది. వీటితో పాటు మధ్యధరా సముద్రంలో మోహరించిన యుద్ధనౌకల నుంచి 100కు పైగా స్టాండర్డ్ మిసైల్-3, స్టాండర్డ్ మిసైల్-6లను వాడింది. దీంతో పెంటగాన్ వద్ద ఉన్న ఇంటర్‌సెప్టర్ నిల్వలు సగానికి పడిపోయాయి. అమెరికా దగ్గర ఇంకా 200 థాడ్ ఇంటర్‌సెప్టర్‌లే మిగిలి ఉన్నాయ్. ఇది పెంటగాన్ వర్గాల్లో కలవరంగా మారింది. నిజానికి యుద్ధం మొదలైన వారం పది రోజుల్లోనే క్షిపణి నిల్వలపై ట్రంప్ కు పెంటగాన్ అలర్ట్ చేసింది. కానీ ట్రంప్ వింటే కదా. ఎవ్వరి మాటా వినడు. కానీ ఇప్పుడు వినాల్సి వస్తోంది. ఆయుధాగారంలో ఆయుధాలే లేకపోతే యుద్ధమెలా చేసేది? అందుకే ఎవరూ అడగకపోయినా సీజ్ ఫైర్ పొడగించారు. కనీసం ఇరాన్ సహా ప్రపంచదేశాలేవీ డిమాండ్ కూడా చేయలేదు. కానీ ట్రంప్ మాత్రం వెనుకంజ వేశారు.
అమెరికా ఇంత భారీస్థాయిలో మిసైల్స్ వాడడంపై డిఫెన్స్ ఎక్స్ పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అమెరికా ఇజ్రాయెల్ ఆర్మీ కోఆర్డినేషన్ లోపాన్ని తెరపైకి తెచ్చిందంటున్నారు. ఇక యుద్ధంలో ఇజ్రాయెల్ 100 కంటే తక్కువ యారో ఇంటర్‌సెప్టర్‌లు, 90 డేవిడ్ స్లింగ్‌లను వాడింది. వీటిలో కొన్ని ఇరాన్‌కు సపోర్ట్ గా ఉన్న యెమెన్, లెబనాన్‌ల నుంచి వచ్చే మిసైల్స్ ను అడ్డుకోవడానికి ప్రయోగించింది. నిజానికి ఇజ్రాయెల్ కు ఆయుధ సహాయం కూడా అమెరికానే చేసింది. నిధులూ ఇచ్చింది.
ఓవరాల్ సీన్ చూస్తుంటే.. అమెరికా ఇరాన్ మధ్య పీస్ డీల్ పై క్వశ్చన్ మార్క్ అలాగే కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆ దేశంపై సైనిక చర్యకు దిగాలనుకుంటే.. అమెరికా క్షిపణి నిల్వలు మరింతగా తగ్గిపోతాయని పెంటగాన్ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. దూకుడు వద్దంటున్నారు. అమెరికా దగ్గర ఆయుధాలు అయిపోయాయంటే ఇతర దేశాలకు గ్యాప్ ఇచ్చినట్లే అంటున్నారు. మరోవైపు అమెరికా- ఇజ్రాయెల్ ఆర్మీ కోఆర్డినేషన్ ను పెంటగాన్ సమర్థించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో రెండు దేశాలు రక్షణ భారాన్ని సమానంగా మోశాయని పెంటగాన్ ప్రతినిధి చెబుతున్న మాట. రెండుదేశాల యుద్ధ విమానాలు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, లేటెస్ట్ మిసైల్ కెపాసిటీ అంతటినీ సమర్థవంతంగా వాడాయన్నారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దూకుడుగా వెళ్లకుండా దౌత్యపరమైన సీజ్‌ఫైర్ మార్గాన్ని ఎంచుకోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయ్. అమెరికా గగనతల రక్షణకు వెన్నెముక లాంటి పేట్రియాట్ మిసైల్స్ లో దాదాపు 50 శాతం వాడేశారు. అమెరికా ఏటా 600 పేట్రియాట్ క్షిపణులను తయారు చేస్తుండగా, ఈ యుద్ధంలో కేవలం రెండు నెలల్లోనే 1,200 కి పైగా మిసైల్స్ ను మెరుపు వేగంతో ప్రయోగించాల్సి వచ్చింది. అటు టోమ్ హాక్, JASSM అమెరికా దాడి కోసం వాడే ప్రెసిషన్ స్ట్రైక్ గైడెడ్ బాంబులు, టోమ్ హాక్ క్రూయిజ్ క్షిపణులలో 30% నుంచి 45% వరకు నిల్వలు కరిగిపోయాయి. వార్ షిప్స్ నుంచి ప్రయోగించే రక్షణ క్షిపణులలో 20% వరకు ఖాళీ అయ్యాయి.
ఇరాన్ తో చేసిన యుద్ధంలో అమెరికా టోమ్ హాక్ క్షిపణి నిల్వలు అత్యంత వేగంగా అయిపోయాయ్. నాలుగు వారాల యుద్ధంలో అమెరికా సుమారు 850కి పైగా టోమ్ హాక్ మిసైల్స్ ను ఇరాన్‌పై ప్రయోగించింది. ఇది అమెరికా ఏడాదికి కొనుగోలు చేసే సగటు క్షిపణుల సంఖ్య కంటే దాదాపు 9 రెట్లు ఎక్కువ. యుద్ధం ప్రారంభానికి ముందు అమెరికా వద్ద దాదాపు 3,100 నుంచి 4 వేల వరకు టోమ్ హాక్ క్షిపణులు ఉండవచ్చని అంచనా. ఇప్పటికే అందులో దాదాపు 45 శాతం నిల్వలు అయిపోయాయ్.
ప్రస్తుతం ఈ టోమ్ హాక్ మిసైల్స్ చాలా తగ్గిపోయాయని, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 మొదలైతే గనక.. మరికొద్ది రోజుల్లో గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ లలో నిల్వలు అయిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఒక టోమ్ హాక్ క్షిపణిని తయారు చేయడానికి సుమారు 2 ఏళ్ల టైం పడుతుంది. ఇరాన్ యుద్ధంలోనే ఇన్ని క్షిపణులు ఖర్చయితే, భవిష్యత్ లో ఇతర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తితే అమెరికా వద్ద తగినన్ని నిల్వలు ఉండకపోవచ్చన్న ఆందోళన పెంటగాన్ అధికారుల్లో కనిపిస్తోంది. బయటకు మాత్రం అధ్యక్షుల వారు ఏ ఆర్డర్ ఇచ్చినా రెడీ అంటున్నారు. ఆయుధ నిల్వలు అద్భుతంగా ఉన్నాయంటున్నారు. లోపల మాత్రం కథ వేరుగా ఉంది.
ఇరాన్ ప్రయోగించిన తక్కువ ఖరీదైన డ్రోన్లు, పాత మోడల్ మిసైల్స్ ను కూల్చడానికి అమెరికా ఒక్కోదానికి 40 కోట్ల రూపాయలకు పైగా ఖరీదైన పేట్రియాట్ క్షిపణులను వాడాల్సి వచ్చింది. కేవలం యుద్ధం ప్రారంభమైన మొదటి రెండు రోజుల్లోనే అమెరికా 5.6 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను కోల్పోయింది. అమెరికా మిసైల్స్ ఖాళీ అవుతున్నప్పటికీ, ఇరాన్ వద్ద ఇంకా భారీ సంఖ్యలో క్షిపణి నిల్వలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇది అమెరికాను కలవర పరిచే అంశమే.
మరోవైపు పేట్రియాట్ క్షిపణుల ఖర్చును 5 మిలియన్ డాలర్ల నుంచి 1 మిలియన్ డాలర్ల లోపుకు తగ్గించేలా కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేయాలని లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్ వంటి డిఫెన్స్ కంపెనీలను పెంటగాన్ ఆదేశించింది. అమెరికన్ డిఫెన్స్ ఫ్యాక్టరీలు రాత్రింబవళ్లు పనిచేసినప్పటికీ, ఇప్పుడు ఖాళీ అయిన క్షిపణి నిల్వలను యుద్ధానికి ముందున్న స్థాయికి తీసుకురావడానికి కనీసం 3 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతుందని డిఫెన్స్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
అమెరికా తన రక్షణ క్షిపణులన్నింటినీ మిడిల్ ఈస్ట్‌లోనే వాడేస్తే, ఫ్యూచర్ లో తైవాన్ విషయంలో చైనాతో యుద్ధం వస్తే తట్టుకోవడం అసాధ్యమని ట్రంప్ సైనిక అధికారులు హెచ్చరించారు. చైనా లాంటి బలమైన శత్రువును ఢీకొట్టడానికి ఇప్పుడు అమెరికా వద్ద తగినన్ని క్షిపణులు లేవు. ఇప్పటి లెక్క తీసినా చైనా ముందు అమెరికా ఏమాత్రం నిలబడలేని పరిస్థితి. ఇది ట్రంప్ కు కూడా తెలుసు. అందుకే ట్రంప్ తాజాగా చైనా పర్యటన చేసి వచ్చారంటున్నారు. అక్కడికి వెళ్లి చేసిందేమీ లేదు. జస్ట్ వెళ్లారు. వచ్చారంతే. పైగా చైనావాళ్లు ఇచ్చిన గిఫ్టులను ట్రాకింగ్ భయంతో అక్కడే పడేసి వచ్చారు. ఇదీ ట్రంప్ తీరు. ఇక భవిష్యత్ లో ఎవరైనా దాడి చేస్తే తట్టుకునేలా డొనాల్డ్ ట్రంప్ అమెరికా చుట్టూ ఐరన్ డోమ్ తరహాలో అంతరిక్ష ఆధారిత గగనతల రక్షణ కవచాన్ని నిర్మించడానికి 175 బిలియన్ డాలర్ల బడ్జెట్‌తో సరికొత్త ప్రాజెక్టును తీసుకొస్తున్నారు. అయితే ఇది ఇప్పుడయ్యే పని మాత్రం కాదు.
ఒకవైపు ఆయుధ నిల్వలు తగ్గుతున్న ఆందోళన అమెరికాలో కనిపిస్తుంటే.. మరోవైపు ఇజ్రాయెల్ తో మరో టెన్షన్ మొదలైంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన అమెరికా ఇజ్రాయెల్‌లు ఇప్పుడు ఆ విషయంపై తలోదారి ఫాలో అయ్యే సూచనలు కనిపిస్తున్నాయ్. తమ ఆయుధ పరిస్థితులు చూసుకున్న అమెరికా…, ఇరాన్‌తో చర్చలకు మొగ్గు చూపుతుండగా ఇజ్రాయెల్ మాత్రం అటాక్స్ చేయాల్సిందే అని కోరుకుంటోంది. అమెరికా తీరుపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య ఫోన్‌లో డైలాగ్ వార్ కూడా జరిగినట్లు ప్రచారమైతే జరుగుతోంది.
యుద్ధం చేయాల్సిందే అని నెతన్యాహు… వెయిట్ చేద్దాం అని ట్రంప్ అన్నట్లుగా చెబుతున్నారు. ఇదే ఫోన్ సంభాషణలో నెతన్యాహు నిర్మొహమాటంగా తన ఆక్షేపణల్ని వ్యక్తీకరించారని అమెరికా మీడియా సంస్థ వెల్లడించింది. మీరు తప్పు చేస్తున్నారు అని నెతన్యాహు ట్రంప్‌ను డైరెక్ట్ గానే డైలాగ్ బాంబ్ పేల్చారని అమెరికన్ మీడియా కథనాలు వచ్చాయి. ఇరాన్‌పై ఫాలో అవ్వాల్సిన విధానాన్ని గురించి ట్రంప్, నెతన్యాహుల మధ్య దాదాపు గంటపాటు వాడి వేడి వాదులాట జరిగిందంటున్నారు. సో ఈ విషయంలో ఎవరి బాధ వారిది అన్నట్లుగా మారింది. ఇప్పటికే ఇజ్రాయెల్ కోసం అమెరికా చాలా చేసింది. చాలా కోల్పోయింది. అనవసర తలనొప్పిని ముందేసుకుంది.
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0కు బదులు చర్చల వైపే తాను మొగ్గుతున్నట్టు ట్రంప్ నెతన్యాహుతో ఫోన్లో చెప్పారు. ఇరాన్‌పై దాడుల్ని వెంటనే మొదలు పెట్టడం ద్వారా ఆ దేశ సైనిక సామర్థ్యాన్ని తగ్గించి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని, టెహ్రాన్ ను మరింత వీక్ చేయాలని నెతన్యాహు గట్టిగా వాదించినట్టు తెలిసింది. ట్రంప్‌తో ఫోన్ కాల్ నెతన్యాహును మరింత ఆందోళనకు గురిచేసిందంటున్నారు. చర్చలకు ఒక అవకాశం ఇద్దామని, అవి విఫలమైతే తిరిగి దాడుల్ని రిపీట్ చేయడం మన చేతుల్లో పనే అని ట్రంప్ అన్నట్టు చెబుతున్నారు.
ఈ మాటల్లో నిజమెంత ఉందో గానీ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య డైలాగ్ వార్ అయితే పెరిగిందంటున్నారు. చర్చల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్, ఖతార్‌లు యుద్ధానికి ముగింపు పలికేలా ఒక ఉమ్మడి లేఖను రెడీ చేశాయని ఇజ్రాయెల్ ప్రధానికి ట్రంప్ చెప్పారంటున్నారు. అయితే ఇజ్రాయెల్‌తో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నట్టుగా ట్రంప్ బిహేవియర్ కొనసాగుతోంది. తాను ఏం చెబితే నెతన్యాహు అది చేస్తారని ప్రెస్ మీట్లలో ట్రంప్ చెప్పుకుంటున్నారు.
గల్ఫ్ దేశాల అభ్యర్థనతో ఇరాన్‌పై దాడుల్ని వాయిదా వేస్తున్నట్టు ఈనెల 16న ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో చర్చలు జరపడంపై నెతన్యాహుకు నమ్మకం లేదని ఇజ్రాయెల్ వర్గాలు చెబుతున్నాయ్. యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలన్న కోరిక ఇజ్రాయెల్ ప్రభుత్వ ఉన్నత వర్గాల్లో బలంగా ఉందని అమెరికన్ మీడియా సంస్థలు చెబుతున్నాయ్. చర్చల్లో ఇరాన్ శాంతి ఒప్పందంపై ఓకే చెప్పదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. సో ఏ విషయం ఎలా ఉన్నా…, సూపర్ పవర్ అయిన అమెరికాకు ఒక చిన్న దేశమైన ఇరాన్ తన డ్రోన్ వ్యూహంతో ఆయుధాల కొరత సృష్టించి గట్టి షాకే ఇచ్చింది. ప్రస్తుతానికి అమెరికా బలహీనత ఏంటో… ప్రత్యర్థి దేశాలైన చైనా, రష్యాలకు క్లారిటీగా తెలిసింది. ఈ వ్యూహాత్మక లోపాన్ని సరిదిద్దుకోవడానికి మరిన్ని మిసైల్స్ ను తయారు చేసుకోవడానికే ట్రంప్ ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం విషయంలో వెనకడుగు వేసి శాంతి మంత్రాన్ని జపిస్తున్నారంటున్నారు.
Also Read: మెదక్ జిల్లా తూప్రాన్ శివారులో భారీ అగ్నిప్రమాదం.. 8 కొత్త కార్లు దగ్ధం
Story by: Anup, Big Tv