E-Paper
Advertisement

Venezuela Sensation: ట్రంప్ కు బిగ్ షాక్! వెనెజుయెలా సెలబ్రేషన్‌కి రీజనేంటి?

Venezuela Sensation: ట్రంప్ కు బిగ్ షాక్! వెనెజుయెలా సెలబ్రేషన్‌కి రీజనేంటి?

Venezuela Sensation: వెనెజుయెలా అధ్యక్షుడు నికోలస్ మదురోని.. అమెరికా అదుపులోకి తీసుకోవడంతో ప్రపంచం మొత్తం అగ్రరాజ్యాన్ని నిందిస్తోంది. కానీ.. వెనెజుయెలా ప్రజలు మాత్రం.. అదే అమెరికాని కీర్తిస్తున్నారు. తమ దేశంలోకి వచ్చి.. తమ దేశాధినేతను కస్టడీలోకి తీసుకొని దేశం దాటించినా.. వెనెజుయెలా ప్రజలు అస్సలు బరస్ట్ కాలేదు. కాకపోగా.. ఈ ఘటనని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు.. వెనెజుయెలా సెలబ్రేషన్‌కి రీజనేంటి? అసలేంటి.. వెనెజుయెలా స్టోరీ?

కానీ.. వెనెజుయెలాలో కనిపిస్తున్న సీన్.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోని అదుపులోకి తీసుకొని.. అమెరికాకు తీసుకెళ్లిపోయినా ఆ దేశ ప్రజలు సీరియస్‌గా రియాక్ట్ కావట్లేదు. పైగా.. తమ అధ్యక్షుడిని అమెరికా బంధించిందని చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అగ్రరాజ్యం ప్రెసిడెంట్ ట్రంప్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు. వెనెజువెలా ప్రజల సంబరాలకు.. కొన్ని దశాబ్దాలుగా వారు అనుభవిస్తున్న ఆర్థిక కష్టాలు, రాజకీయ అణచివేతే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయ్.

నికోలస్ మదురో 2024లో ఎలక్షన్లలో విజయం.. ప్రతిపక్షాల ఆందోళన”

నికోలస్ మదురో 2013 నుంచి వెనెజుయెలా అధ్యక్షుడిగా ఉన్నారు. 2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మదురోని విజేతగా ప్రకటించారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం తమ అభ్యర్థి ఎడ్ముండో గోంజాలెజ్‌.. ఓట్ల లెక్కింపులో భారీ మెజారిటీతో గెలిచారని తెలిపాయ్. అంతేకాదు.. ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోపై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది మదురో ప్రభుత్వం. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి, న్యాయబద్ధమైన, శాంతియుత పరివర్తన కోసం ఆమె చేసిన పోరాటానికి గాను మచాడోకు గతేడాది నోబెల్ శాంతి బహుమతి లభించింది. నెలల తరబడి అజ్ఞాతంలో ఉన్న ఆమె.. ప్రయాణ ఆంక్షలను ధిక్కరిస్తూ, నోబెల్ అవార్డును స్వీకరించడానికి ఓస్లోకు వెళ్లారు. మచాడో బయటకు రాకుండా చేసింది మదురోనే అనే భావన అక్కడి ప్రజల్లో ఉంది. అమెరికా కూడా 2024లో జరిగిన ఎన్నికలు స్వేచ్ఛాయుతంగానూ, న్యాయసమ్మతంగానూ జరగలేదన్న కారణంతో.. నికోలస్ మదురోను వెనెజుయెలా చట్టబద్ధ అధ్యక్షుడిగా అమెరికా గుర్తించడం లేదు. అంతేకాదు.. వెనెజుయెలా నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు రావడానికి మదురోనే కారణమని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అమెరికాలో పెరుగుతున్న డ్రగ్స్ సప్లైని, ఫెంటానిల్, కొకైన్‌ని అరికట్టడంపైనా ట్రంప్ ఫోకస్ పెట్టారు. మదురో ఇంటర్నేషనల్ ఇల్లీగల్ డ్రగ్ నెట్‌వర్క్‌కు నేతృత్వం వహిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను మదురో ఖండించారు. తమ దగ్గరున్న అపారమైన చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతోనే.. అమెరికా కుట్ర పన్నుతోందని వెనెజుయెలా ప్రభుత్వం ఆరోపించింది.

దేశ సంపదను దోచుకుంటూ.. క్రిమినల్ గ్యాంగ్‌లను పెంచి పోషిస్తున్నారు

పరిస్థితులు ఎలా మారినా.. పరిణామాలు ఎలా ఉన్నా.. వెనెజుయెలా ఆర్థిక పతనం, అక్కడి ప్రజల ఆకలి కేకలే.. మదురోని బంధించినందుకు సంబరాలు చేసుకునేలా చేస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. నికోలస్ మదురో పాలనలో.. వెనెజుయెలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఇక్కడే నమోదైంది. కనీస అవసరాలైన ఆహారం, మందులు కొనుగోలు చేయలేని స్థితికి సామాన్య ప్రజలు చేరుకున్నారు. దీనివల్ల 2013 నుంచి 80 లక్షల మంది ప్రజలు దేశం విడిచి వలస వెళ్లాల్సి వచ్చింది. అలా.. వెళ్లిన వారిలో చాలా మంది అక్రమంగా అమెరికాకు వచ్చారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. మదురో ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని.. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. ముఖ్యంగా.. 2024 ఎన్నికల్లో విపక్షాలు గెలిచినట్లు స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ.. మదురో తనని తాను విజేతగా ప్రకటించుకోవడాన్ని వెనెజుయెలా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దీనికోతుడు.. మదురో ప్రభుత్వం డ్రగ్స్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం ద్వారా అక్రమ సంపాదనకు పాల్పడుతోందని.. అమెరికా గతంలోనే అభియోగాలు మోపింది. దేశ సంపదను దోచుకుంటూ.. క్రిమినల్ గ్యాంగ్‌లను పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి కూడా వినిపించాయ్.

నికోలస్ మదురో పై అమెరికా చర్య.. వెనెజుయెలాలో కొత్త ఆశలు

వెనెజుయెలా ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత.. మరియా కొరీనా మచాడో కూడా.. తమ దేశానికి స్వేచ్ఛ తిరిగి వచ్చిందన్నారు. అమెరికా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని చెప్పారు. తమ దేశంతో పాటు ఇతర దేశాల పౌరులపై జరిగిన దారుణమైన నేరాలకు నికోలస్ మదురో ఇప్పుడు శిక్షని అనుభవిస్తున్నారని ట్వీట్ చేశారు. ప్రజా సార్వభౌమాధికారంతో వెనెజుయెలాని పాలించే సమయం ఆసన్నమైందన్నారు మచాడో. రాజకీయ ఖైదీలను విడుదల చేస్తామని, శాంతియుత భవిష్యత్తుని నిర్మించబోతున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యం కోసం సంవత్సరాలు తాను చేసిన పోరాటం ఫలించిందన్నారు. శాంతియుతంగా, ప్రజస్వామ్యబద్ధంగా అధికార మార్పిడికి ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. చావెజ్ రూలింగ్ నుంచి.. 26 ఏళ్లుగా ఒకే తరహా పాలనలో మగ్గిపోతున్న వెనెజుయెలా ప్రజలకు.. ప్రెసిడెంట్ నికోలస్ మదురోని అమెరికా తమ కస్టడీలోకి తీసుకోవడమనేది.. ఓ కొత్త ఆశని చిగురింపజేసింది. మదురో పట్టుబడగానే.. అక్కడి ప్రజలు వీధుల్లోకి వచ్చి స్వేచ్ఛ దొరికిందనే నినాదాలు చేస్తూ.. డ్యాన్సులు చేసిన సీన్లు కనిపించాయ్. దేశం విడిచి వెళ్లిన లక్షలాది మంది వలసదారులు.. తిరిగి తమ స్వదేశానికి వెళ్లి తమ కుటుంబసభ్యులను కలుసుకోవచ్చనే ఆశతో సంబరాలు చేసుకున్నారు. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా.. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌‌ బాధ్యతలు చేపట్టారు. పరిపాలన కొనసాగింపు, దేశ రక్షణని దృష్టిలో పెట్టుకొని.. ఆ దేశ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ.. వెనెజుయెలా భవిష్యత్తుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. నికోలస్ మదురో నిజంగా ఓ నియంతలా వ్యవహరించాడా? అమెరికా, ట్రంప్ ఆరోపణల్లో వాస్తవముందా? వెనెజుయెలా ప్రజలు.. అమెరికా ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా? ఆయిల్ వ్యాపారంలోకి అమెరికా కంపెనీల ఎంట్రీ తర్వాత.. ఆ దేశం ఎలా మారనుంది? నికోలస్ మదురో ఎపిసోడ్‌తో.. మిగతా దేశాధినేతలంతా అర్థం చేసుకోవాల్సింది? నేర్చుకోవాల్సింది ఏంటి?

హాట్ టాపిక్‌గా మారిన వెనెజుయెలా రాజకీయ సంక్షోభం

వెనెజుయెలా రాజకీయ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. నికోలస్ మదురో పతనం, అమెరికా జోక్యం, ఆ దేశ చమురు నిల్వల చుట్టు తిరుగుతున్న రాజకీయాలపైనే.. గ్లోబల్ రేంజ్‌లో డిబేట్ నడుస్తోంది. నికోలస్ మదురో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడి కంటే.. ఎలక్టోరల్ డిక్టేటర్‌గానే ఎక్కువ గుర్తింపు పొందారు. 2018, 2024లో జరిగిన ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని.. ఐక్యరాజ్యసమితి సహా ఇంకొన్ని అంతర్జాతీయ సంస్థలు స్పష్టం చేశాయి. ప్రతిపక్ష అభ్యర్థులను జైల్లో పెట్టడం, అనర్హులుగా ప్రకటించడం ద్వారా మదురో తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. నిరసనకారులపై హింస, రాజకీయ ప్రత్యర్థుల అదృశ్యం, కఠినమైన సెన్సార్‌షిప్.. మదురో పాలనలో సాధారణమైపోయాయ్. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశం.. మదురో హయాంలో ద్రవ్యోల్బణం కోరల్లోకి వెళ్లిపోయింది. 80 లక్షల మంది ప్రజలు ఆకలి, పేదరికం తట్టుకోలేక దేశం విడిచి వలస వెళ్లారంటే.. వెనెజుయెలా పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

వెనెజువెలాలో రష్యా, చైనా ఆధిపత్యానికి అమెరికా బ్రేక్.

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా.. నికోలస్ మదురోని ఓ నార్కో టెర్రరిస్ట్‌గా ఆరోపించారు. ఇందుకో.. కొంత రాజకీయ కోణం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల నివేదికలు కొన్ని వాస్తవాలను రుజువు చేస్తున్నాయ్. మదురో ప్రభుత్వం.. ఇంటర్నేషనల్ డ్రగ్ కార్టెల్స్‌తో సంబంధాలు కలిగి ఉందనే ఆరోపణలపై.. అమెరికా న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయి. అంతేకాదు.. వెనెజుయెలాను రష్యా, చైనా, ఇరాన్ లాంటి దేశాలకు.. వ్యూహాత్మక స్థావరంగా మార్చడం అమెరికాకు అస్సలు నచ్చలేదు. దీనిని.. అడ్డుకోవడమే ట్రంప్ ముందున్న మెయిన్ టార్గెట్. ఈ పరిస్థితుల్లో.. మదురోని బంధించడం అమెరికాకు బిగ్ సక్సెస్. అయితే.. ఈ విషయంలో వెనెజుయెలా సమాజం రెండుగా చీలిపోయింది. మదురో అరాచక పాలనతో విసిగిపోయిన మెజారిటీ ప్రజలు, ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో మద్దతుదారులు.. మార్పు కోసం అమెరికా జోక్యాన్ని ఒక అవసరంగా చూస్తున్నారు. వీళ్లందరికీ.. తమ దేశం మళ్లీ గాడిన పడటమే ముఖ్యం. మరోవైపు.. హ్యూగో చావెజ్ కాలం నుంచి వెనెజుయెలాలో బలమైన సామ్రాజ్యవాద వ్యతిరేకత ఉంది. అమెరికా కేవలం తమ చమురు కోసమే వస్తోందని.. తమ దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతున్నారని భావించే వర్గం కూడా బలంగా ఉంది. ఏదేమైనా.. మెజారిటీ ప్రజలు అమెరికా చర్యని సమర్థిస్తూ వీధుల్లో సంబరాలు చేసుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది.

నియంత పాలన ముగిసింది.. కానీ నేత ఎవరు?

అమెరికా కంపెనీలు వెనెజుయెలా చమురు వ్యాపారంలోకి ప్రవేశిస్తే.. అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. కుప్పకూలిన చమురు మౌలిక సదుపాయాలను బాగు చేయడానికి అమెరికా టెక్నాలజీ, పెట్టుబడులు ఇప్పుడు వెనెజుయెలాకు అవసరం. దీనివల్ల.. ఇంకొన్ని నెలల్లో చమురు ఉత్పత్తి పెరిగి, దేశానికి ఆదాయం వచ్చే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. ట్రంప్ బహిరంగంగానే.. వెనెజుయెలా ఆయిల్‌ని అమెరికా తీసుకుంటుందని ప్రకటించేశారు. దాంతో.. ఆ దేశం కేవలం ఆయిల్ సప్లయర్‌గా మిగిలిపోయే ఆస్కారముంది. వెనెజుయెలా ఆయిల్ మార్కెట్‌లోకి వస్తే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా తగ్గే అవకాశం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయ్. ఇదిలా ఉంటే.. అధికార బదిలీ జరిగేదాకా వెనెజుయెలాని తామే నడిపిస్తామని ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవారికి, అమెరికా ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసే వారికి ఇదో హెచ్చరిక అన్నారు. వెనెజుయెలాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉందని, అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక వసతులను కల్పించి.. దేశం కోసం ఆదాయాన్ని సంపాదిస్తాయన్నారు ట్రంప్‌. అమెరికా సాధించిన విజయాన్ని ప్రపంచంలోని ఏ దేశమూ సాధించలేదని స్పష్టం చేశారు. మదురోకు మద్దతిచ్చే నేతలను కూడా ట్రంప్‌ హెచ్చరించారు. నియంత మదురో వెళ్లిపోవడంతో.. వెనెజువెలా ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. అక్కడి ప్రజలను సంపన్నులుగా మారుస్తామని, స్వతంత్రంగా బతికేలా చేస్తామని తెలిపారు. అధికార బాధ్యతలు అప్పగించే విషయంపైనా డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకురాలైన మచాడోకు బాధ్యతలు అప్పగించే విషయాన్ని తోసిపుచ్చారు. ఆవిడ మంచి మహిళే అయినప్పటికీ.. నాయకురాలిగా ఉండటం కష్టమని భావిస్తున్నట్లు చెప్పారు. వెనెజుయెలాలో ఆమెకు సరైన మద్దతు లేదన్నారు ట్రంప్.

ఆకలి రాజ్యమేలిన చోట.. అధికార గర్వం అణగిపోయింది!

మదురో ఎపిసోడ్ ప్రపంచ నాయకులకు ఓ హెచ్చరిక అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఎంతటి బలవంతుడైనా.. జనం ఆకలిని, అసంతృప్తిని ఎక్కువకాలం అణచివేయలేరని మదురో పతనం నిరూపిస్తోంది. దేశాధ్యక్షుడిని.. మరో దేశం కస్టడీలోకి తీసుకుంటే.. జనం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే.. పాలన ఎంత దుర్భరంగా ఉందో అర్థమవుతోంది. అంతేకాదు.. కేవలం చమురు లాంటి ఒకే వనరు మీద ఆధారపడటం, అవినీతి పెరిగిపోవడం దేశాన్ని ఎలా నాశనం చేస్తాయని చూపడానికి.. నేటి వెనెజుయెలానే బిగ్ ఎగ్జాంపుల్. చిన్న దేశాలు తమ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోకపోతే.. అమెరికా లాంటి అగ్రరాజ్యాలు జోక్యం చేసుకునేందుకు డోర్లు తెరిచినట్లవుతుంది. తమ దేశ సార్వభౌమాధికారం కాపాడుకోవాలంటే.. దేశం లోపల సుస్థిరత ఉండాలి. వెనెజుయెలా ఇప్పుడొక చరిత్రాత్మక మలుపులో ఉంది. అమెరికాకు.. ఆయిల్ సప్లయర్‌గా మారిపోతుందా? నిజమైన ప్రజాస్వామ్యం దేశం దిశగా అడుగులు వేస్తుందా? అనేది కాలమే నిర్ణయించాలి.

Story By Anup, Big TV 

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×