Vijayasai Reddy: రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాను సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, ఇక మీడియా సంస్థ ద్వారా ప్రజాసేవ చేస్తానని ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా, పూర్తి తటస్థంగా వార్తలను అందిస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే ఆయన ఆ ప్రకటన చేసి ప్రజా పక్షాన గొంతెత్తుతానని ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే ఆయన వైఖరి మారింది. ఆయన తాజాగా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులతో తటస్థం అన్నది ఒక ముసుగే అని తెలిపోయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జగన్ ఆడిటర్‌గా, జైల్ మేట్‌గా ఉన్న సాన్నిహిత్యంతో రెండు సార్లు రాజ్యసభ ఎంపీ కూడా అయిన సాయిరెడ్డి ఇక అంతేనా?
మాజీ ఎంపీ వేణుంబిక విజయసాయిరెడ్డి.. అదేనండి వైసీపీకి రిజైన్ చేసి ఏ పార్టీలో చేరకుండా రాజకీయం విరామం ఇచ్చిన సాయిరెడ్డి మళ్లీ వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. సొంతగా టీవీ చానల్ పెడతానని గతంలోనే ప్రకటించిన విజయసాయి.. ఆ సంగతి మర్చిపోయారో ఏమో కాని, సోషల్ మీడియాలో మాత్రం తన రీఎంట్రీకి పాట్లు పడుతున్నట్లు కనిపస్తున్నారు. ఆ క్రమంలో పార్లమెంటులో అమరావతి చట్టబద్దత బిల్లుపై చర్చకు సంబంధించి ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, జగన్‌కు తిరిగి అవ్వడానికే అంటున్నారు. ఒకవైపు అమరావతిపై కమ్మరావతని బురద జల్లుతూ, మరోవైపు వైసీపీ ఎంపీలపై సాయిరెడ్డి ధ్వజమెత్తడం పాత మిత్రుడ్ని ప్రసన్నం చేసుకోవడానికే అన్న అభిప్రాయం వ్యక్తం అయింది.
మరి విజయసాయిరెడ్డి పొలిటికల్ స్ట్రాటజీ ఏంటో కాని.. తాజాగా ఆయన త్వరలో డిజిటల్ మీడియా ప్రారంభిస్తున్నానని ట్వీట్ చేసి మళ్లీ చర్చల్లో వ్యక్తి అయ్యారు. ఆ తర్వాత దశలో తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ కూడా ప్రారంభిస్తానని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. త్వరలోనే ప్లాట్‌ఫామ్ పేరు ప్రకటిస్తానంటున్నారు. ఈ మీడియా సంస్థ ఎవరికి అనుకూలంగా పనిచేయదని.. ప్రజల గొంతుకగా నిలుస్తుందని, వారి సమస్యల్ని వెలుగులోకి తీసుకొస్తుందన్నారు. ఆ క్రమంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ మీడియా రంగంవైపు అడుగులు వేస్తానడం ఆసక్తి రేపుతోంది.
విజయ సాయి రెడ్డి న్యూట్రల్‌గా ఉండే డిజిటల్ చానల్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటూ దీక్ష చేస్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు. రాజధాని అమరావతిలో బీసీలకు 1000 ఎకరాల భూమి, 44 శాతం రిజర్వేషన్లు, బీసీ రక్షణ చట్టం కోసం ఆయన ఆ దీక్ష చేపట్టారు .ఆయనకు మద్దతివ్వడం ద్వారా తానుపాత విజయసాయిరెడ్డినేనని పరోక్షంగా, అన్యాపదేశంగా చాటుకున్నారు. అమరావతి రాజధాని విషయంలో విజయసాయి వైసీపీలో ఉన్న సమయంలో ఏ వైఖరినైతే అవలంబించారో.. ఆ వైఖరికి అనుగుణంగానే ఆయన తాజా వ్యాఖ్యలు కూడా ఉన్నాయంటున్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రభుత్వం ఏం చేసినా వక్రీకరించడమే పనిగా పెట్టుకున్న విజయసాయి.. కియా కంపెనీపై కూడా అప్పట్లో విషం వెళ్లగక్కారు. టీడీపీ ప్రభుత్వం ఏపీకి కార్ల కంపెనీని తీసుకొచ్చిందన్న ఒకేఒక్క కారణంతో.. ట్విట్టర్ సాక్షిగా అక్కసుతో ట్వీట్లు పెట్టారు. కియా కంపెనీపై బురద చల్లే ప్రయత్నం కూడా చేశారు. ‘కార్లు అమ్ముడు పోని కారణంగా కియా మోటార్స్ చైనాలోని అతి పెద్ద ప్లాంటును మూసేసింది. మరి అనంతపూర్లో ఏర్పటవుతున్న ప్లాంట్ సంగతేమిటో? కమిషన్ల కక్కుర్తితో కియా మోటార్స్‌కు చంద్రబాబు రెండు వేల కోట్ల రాయితీలిచ్చాడు. కంపెనీ ఉద్యోగుల్లో స్థానికులు వంద మందికి మించి లేరు.’ అని అప్పట్లో ట్వీట్ చేశారు.
అలాంటి విజయసాయి వైసీపీ అధికారంలో ఉన్నపుడు 2023లో ఎంపీగా మరో పోస్టు పెట్టి తన ద్వంద్వ వైఖరితో నవ్వులపాలయ్యారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో తయారైన కియా కారెన్స్ ‘ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డ్ గెలుచుకోవడం గర్వ కారణం. అనంతపురంలో ఉన్న కియా పరిశ్రమ 2019లో 57,719 కార్లను తయారుచేస్తే, ఈ ఉత్పాదకత 2021 నాటికి 2.27 లక్షల కార్లకు పెరిగిందని చెప్పేందుకు గర్వపడుతున్నాం. ఏపీలో తయారవుతున్న కియా కార్లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి’ అని పోస్టు పెట్టి అదేదో తమ పార్టీ ఘనతలా చాటుకున్నారు.
ఇక విజయసాయిరెడ్డి మీడియా సంస్థ ప్రారంభిస్తున్నానన్న ప్రకటనకు ముందు అమరావతికి చట్టబద్ధత బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందగానే ఆయన కమ్మరావతి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తటస్థ మీడియా సంస్థ ప్రారంభిస్తున్నానని చెప్పిన 24 గంటల వ్యవధిలోనే విజయ సాయి తన జగన్ అనుకూల వైఖరిని వెల్లడించుకుంటూ, రామచంద్రయాదవ్ కు మద్దతు పలుకుతూ చేసిన ట్వీట్లు ఆయన తటస్థతపై అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. తన మీడియా సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ఆయన అనుసరిస్తున్న ఈ వైఖరి.. రానున్న రోజులలో ఆయన మీడియా ఎవరి కోసమే చెప్పకనే చెబుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఆడిటర్ విజయసాయి మళ్లీ జగన్ పట్ల స్వామిభక్తి చాటుకోవడానికే ఫిక్స్ అయ్యారన్న సెటైర్లు పేలుతున్నాయి.
Also Read: గుడ్డు కూర గొడవ.. చున్నీతో వ్యక్తి ప్రాణం తీసిన మహిళ
Story by: Apparao, Big Tv