తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సిద్దిపేట చుట్టు తిరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఈనెల 19న అక్కడ ప్లాన్ చేసింది కాంగ్రెస్. దీంతో ఈ సిద్దిపేట హాట్ టాపికయ్యింది. ఇప్పటికే సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహించి.. కేటీఆర్ టార్గెట్‌గా రేవంత్ రాజకీయంగా తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పాటు అక్కడ వరాలు జల్లు కూడా కురిపించారు. ఇప్పుడు అక్కడ వందల కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయి.
తరువాత తన టార్గెట్ సిద్దిపేట అని ముందే ప్రకటించి ఉన్నారు రేవంత్. ఈనెల 19న ఇందిరాగాంధీ జయంతి రోజున .. సభ తేదీని ఖరారు చేసింది కాంగ్రెస్ సర్కార్. అదే రోజు ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ అనే పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం. ఇదే వేదికగా హరీశ్‌ను టార్గెట్ చేయనున్నారు. హరీశ్‌తో పాటు.. ఆ వరుస క్రమంలోనే కేటీఆర్, ఆ తరువాత కేసీఆర్‌లపై షరా మామూలుగానే రేవంత్ రాజకీయ విమర్శలు, ఆరోపణలు ఉండనున్నాయి.
దీనిపై అప్పుడే సర్వత్రా చర్చ జరుగుతుంటే మధ్యలో కవిత తీసుకున్న తాజా నిర్ణయం మరో కొత్త చర్చకు తెర తీసింది. ఆమె శుక్రవారం సిద్దిపేట పర్యటనను ఖరారు చేసుకున్నారు. అక్కడే పర్మినెంట్ పార్టీ కార్యాలయ భవనాన్ని నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి శుక్రవారం రోజున శంఖుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ తరువాత ఇప్పుడు టీఆరెస్ పార్టీకి సిద్దిపేటలో కూడా పార్టీ కార్యాలయం ఏర్పాటు కాబోతుందన్న మాట.
సర్వ మత ప్రార్థనలు చేసిన అనంతరం, ఆమె అక్కడే మీడియాతో మాట్లాడనున్నారు. హరీశ్‌ను టార్గెట్ చేయనున్నారు. పనిలోపనిగా పదేండ్ల బీఆర్‌ఎస్ పార్టీ పాలనపైనా విమర్శలు గుప్పించనున్నారు. కేటీఆర్‌ను కూడా ప్రత్యేకంగా విమర్శించే అవకాశం ఉంది. ఇక రేవంత్‌రెడ్డి , రాష్ట్ర పరిపాలన పైనా ఆమె మాట్లాడనున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో సమానంగా టీఆర్‌ఎస్‌ను దూకుడుగా జనం మధ్యలో నిత్యం ఉంచేలా, ఏదో ఒక కార్యక్రమాన్ని ఆమె తీసుకుంటున్నారు.
తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ల ద్వారా పార్టీ తరపున వాయిస్‌ను వినిపిస్తున్నారు. సర్కార్‌పై విమర్శలను ఎక్కుపెడుతూనే, ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్‌ను కూడా వదలడం లేదామె. హరీశ్, కేటీఆర్.. ఇద్దరినీ టార్గెట్ చేస్తున్నారు. బీఆరెస్ పాలనపై చేసే ప్రతి విమర్శా అది పరోక్షంగా కేసీఆర్‌కే తగులుతున్నది.
ఓవైపు రేవంత్, మరోవైపు కవిత.. బీఆరెస్‌పై విమర్శల దాడిని ముమ్మరం చేస్తున్నది. ఇక మేమే రాబోతున్నాము.. ఒక్క ఏడాది ఆగండి..! అని పార్టీ క్యాడర్ కు పాజిటివ్ సిగ్నల్ ఇచ్చేలా కేటీఆర్ పర్యటనలు చేస్తున్నా.. ఏదో విధంగా తన చేష్టలు, విధానాలతో ప్రత్యర్థి పార్టీలకు దొరికిపోతున్నాడు. ఉల్టా వారికి తనే అస్త్రాలను అందించే విధంగానే కేటీఆర్ పొలిటికల్ వ్యవహారం సాగుతోంది.
కవిత ఈ సందర్బాన్ని వాడుకుని రెండు పార్టీలను ఇరుకున పెట్టడం ద్వారా తన పార్టీని జనంలోకి దూకుడుగా తీసుకుపోవాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రధాన పార్టీలకు ధీటుగా తమ పార్టీ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ముందుకు సాగుతుందనే సంకేతాన్ని పొలిటికల్ సర్కిళ్లతో పాటు జనానికి చేరవేయాలనే ఎత్తుగడలో భాగంగానే ఆమె నిర్ణయాలు, ప్రకటనలు ఉంటున్నాయంటున్నారు.