Health Assistant: స్వేచ్చ బ్యూరో: నల్గొండ జిల్లాలో హెల్త్ అసిస్టెంట్ కారుణ్య నియామకంలో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అసలు రెగ్యులరైజేషన్ పొందిన ఉద్యోగే నకిలీ అంటూ వైద్యారోగ్యశాఖలో విమర్శలు వస్తున్నాయి. నల్లగొండ డీఎమ్ హెచ్ వో ఆఫీస్ నుంచి కోటిలోని డీహెచ్ కార్యాలయం వరకు ప్రస్తుతం ఇదే హాట్ టాఫిక్ గా మారింది. దాదాపు 20 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ చేసిన ఓ ఉద్యోగికి బీఆర్ ఎస్ ప్రభుత్వం చివర్లో రెగ్యులరైజేషన్ చేసింది. అయితే హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగం పొందేందుకు ఆయన సబ్మిట్ చేసిన టెక్నికల్ కోర్సు సర్టిఫికేట్లే ఫేక్ అంటూ వైద్య యూనియన్లు ప్రచారం చేస్తున్నాయి. సదరు ఉద్యోగి కోర్సు పూర్తి చేసినట్లు పేర్కొన్న ఇనిస్టిట్యూట్ ట్రేస్ కాలేదని ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా ఇచ్చినట్లు వివరించారు.
అంతేగాక పబ్లిక్ హెల్త్, డీఎమ్ హెచ్ వో కార్యాలయం,పారామెడికల్ బోర్డు.. ఈ విభాగాలు కూడా పూర్తి స్థాయిలో స్టడీ రికార్డులను కూడా పరిశీలించకుండానే రెగ్యులరైజేషన్ చేసినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత సదరు ఉద్యోగి మరణం తర్వాత కారుణ్య నియామకం ప్రాసెస్ జరిగింది. ఈ విధానంలోనూ తప్పుడు తేదీలతో డెత్ సర్టిఫికేట్ పెట్టి కారుణ్య నియామకం పొందారనే చర్చ ఉన్నది. అంటే రెగ్యులర్ జాబ్ అంశంలో రెండు సార్లు మిస్టేక్ జరిగినట్లు స్పష్టంగా తేలిపోతుంది. అధికారులు చేస్తున్న నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పైగా ఈ తప్పిదాలకు కొందరు క్రింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు భారీ స్థాయిలో ముడుపులు ముట్టాయనే ప్రచారం కూడా వైద్య వర్గాల్లో జరుగుతుంది.
Also read: ప్రేమ వద్దు కానీ నీతోడు కావాలి.. జెన్ Z కొత్త ట్రెండ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో 2002 నోటిఫికేషన్ ద్వారా నియమితులై కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న ఎంపీహెచ్ ఏ మేల్ ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జీవో నంబర్ 16 ద్వారా క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు.అయితే,ఈ ప్రక్రియలో అసలు కుంభకోణం జరిగిందనే టాక్ ఉన్నది. అర్హత లేని ప్రైవేట్ సంస్థల నుంచి కొందరు బోగస్ సర్టిఫికెట్లతో రెగ్యులరైజేషన్ పొందాలని ప్రయత్నించినట్లు తెలుస్తుంది. వాస్తవానికి కాంట్రాక్ట్ సర్వీస్ రెగ్యులరైజేషన్ తర్వాత ఉద్యోగుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఉద్యోగులు సమర్పించిన డిప్లొమా సర్టిఫికెట్లలో టెక్నికల్ ఇనిస్టిట్యూషన్లు క్షేత్రస్థాయిలో లేవని ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా గతంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయానికి రిపోర్టు రాశారు. కానీ అక్కడి అధికారులు సీరియస్ గా తీసుకోలేదనే చర్చ ఇప్పుడు తెరమీదకు వచ్చింది. దీంతోనే తప్పిదాలు జరిగాయని వైద్య యూనియన్లు పేర్కొంటున్నాయి.
నిబంధనల ప్రకారం ఒక శిక్షణ సంస్థ ఏడాదికి ని సుమారు 60 మందికి మాత్రమే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దొడ్డిదారిన పుట్టుకొచ్చిన కొన్ని సంస్థలు వేల సంఖ్యలో రోల్ నంబర్లు, రిజిస్ట్రేషన్ నంబర్లతో సర్టిఫికెట్లు ముద్రించి విక్రయించాయనే ఆరోపణలున్నాయి. ఒకే సంవత్సరంలో వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తే రోల్ నంబర్లలో భారీ తేడాలు, చేతితో చేసిన మార్పులు, కొట్టివేతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని స్వయంగా వైద్యారోగ్యశాఖలోని కొందరు ఆఫీసర్లే ఆఫ్ ది రికార్డులో తెలిపారు. రెగ్యులరైజేషన్ సమయంలో కొందరి సర్టిఫికేట్లపై అనుమానాలు రాస్తూ కోటితో పాటు జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయాలకూ ఇంటిలిజెన్స్ రిపోర్టులు పంపించారు. కానీ ఉన్నతాధికారులు వాటిని తొక్కి పెట్టి రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ను ముందుకు తీసుకువెళ్లారు. ఈ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ లో లక్షల రూపాయాలు చేతులు మారినట్లు సమాచారం.
Also read: డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు