సోనియా రాసిన తన ఆత్మకథ ‘బిలాంగింగ్- ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం పై తెలంగాణలోనూ రాజకీయ రచ్చ నడిచింది. అంతటా మొదట బీజేపీ దీనిపై స్పందిస్తే.. ఇక్కడ బీఆర్ఎస్ స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. సోనియా తన ఆత్మకథ పుస్తకంలో కనీసం తెలంగాణ పదాన్ని కూడా రాయలేదని, ఇక్కడి బలిదానాలు ఆమెకు గుర్తు రాలేదా? అని ఏవేవో కామెంట్స్ చేయడం బూమరాంగే అయ్యింది.
తెలంగాణ ఆమె ద్వారానే సాకారమయ్యిందనే మాట్లాడుతూ.. ఆ విషయాన్నిఆ పుస్తకంలో ప్రస్తావిస్తే బాగుండేది! అని ముక్తాయించారాయన. పరోక్షంగా తెలంగాణ గురించి రాయాల్సి వస్తే, కేసీఆర్ ప్రస్తావన కూడా వస్తుండననే భావన కావొచ్చు. కానీ ఆమె పూర్తిగా తన కుటుంబ రాజకీయ వ్యవహారాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్టు ఆ పుస్తకాన్ని చదివితే తెలుస్తుంది.
మరోవైపు.. తెలంగాణ పదం లేదని, ఈ రాష్ట్రం గురించి, ఉద్యమం గురించి తక్కువ చేశారని చెప్పడం ద్వారా కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలనే బీఆర్ఎస్ వ్యూహం తిరగబడిందనే చెప్పాలి. ఎందుకంటే, తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడింది ఆమె వల్లేనని కేసీఆర్ చాలా వేదికల మీద క్లారిటీగా ప్రకటించుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆమె లేకపోతే.. అసలు తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదని, సోనియాకు తెలంగాణ ఎప్పుడూ రుణపడి ఉంటుందనే విధంగా ఆయన కామెంట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత తన కుటుంబాన్ని మొత్తం వెంట బెట్టుకుని ఢిల్లీకి పోయి ఆమెను కలిశారు కూడా. కృతజ్ఞతలు తెలిపారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో తన టీఆరెస్ పార్టీనే కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే ఆలోచన కూడా నడిచింది. దీనికి కేసీఆర్ కమిటయ్యారు కూడా. ఆ తరువాత మాట తప్పింది కేసీఆరేనని చాలా మందికి తెలుసు.
ఆ పుస్తకంలో ఒకవేళ ఆమె తెలంగాణ గురించి రాసి ఉంటే.. ఇక్కడ ప్రజలతో ఆమెకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఉండి ఉంటే.. అది ఇక్కడి కాంగ్రెస్‌కు ఎంతగానో కలిసి వచ్చేది. పార్టీకి బూస్టింగ్ ఇచ్చేది. సోనియా పట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు కృతజ్ఞతాభావంతో ఉంటారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఆమె ఇక్కడికొచ్చి ప్రజలతో పెద్దగా మాట్లాడలేకపోయినా.. ‘ఒక్కసారి అధికారం ఇవ్వండి.. ఇదే నేను మిమ్మల్ని కోరేది!’ అని ఆర్తితో అడిగిన తీరు ప్రజలను కదిలించింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఓసారి కాంగ్రెస్‌కు అధికారం ఇద్దామని జనం డిసైడ్ అయ్యేలా ఆమె మాటలు పనిచేశాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రతీదాన్ని రాజకీయం చేయాలనుకుంటున్న బీఆర్‌ఎస్ సోనియా ఆత్మకథ పుస్తకం విషయంలో జోక్యం చేసుకోవడం తొందరపాటు చర్యగానే చూస్తున్నారు.
కేసీఆర్ ఒకవేళ తన ఆత్మకథ రాసుకుంటే అందులో సోనియా పేరును కచ్చితంగా రాసుకుని తీరాల్సిందే. అది ఆయనకూ తెలుసు. తెలంగాణకు కాంగ్రెస్ వ్యతిరేకం అని చెప్పే క్రమంలో ఆమె పుస్తకంలో తెలంగాణ పదం లేదనే రాజకీయ రచ్చను పురిగొలిపే ప్రయత్నం చేయడం బీఆరెస్ పార్టీకే నష్టం తప్ప.. కాంగ్రెస్ కాదు.
ఈ విషయంలో బీఆర్‌ఎస్ సైలెంట్‌గా ఉంటేనే మేలంటున్నారు. సోనియా పేరును రాజకీయ రచ్చకు వాడుకుందామని బీఆరెస్ భావిస్తే అది ఎదురుతన్నే కార్యక్రమమే తప్ప మేలు చేసేది కాదనే విషయాన్ని ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు.