Kadapa MLA vs Mayor: కడప కార్పొరేషన్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. కార్పొరేటర్‌లను కాపాడుకునే పనిలో వైసీపీ నేతలు నానా పాట్లు పడుతున్నట్లు కనిపిస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లు మరింత మంది టీడీపీ పంచన చేరితే మేయర్ సురేశ్ పదవికే ఎసరు వస్తుంది. అందుకే పట్టు కోల్పోతున్నాం అనే భయంతోనే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కౌన్సిల్ సమావేశంలో పోడియంపై కుర్చీ వేయలేదంట. మరి కుర్చీలాటలో నెగ్గేదెవరు? కడప రెడ్డెమ్మ ను మేయర్ సురేష్ ఆపలేకపోతున్నారా? అందుకే ఆయన్ని పిలిపించుకుని మరీ జగన్ వార్నింగ్ ఇచ్చారా?
కొన్నాళ్లుగా కడప మేయర్‌కు..కడప ఎమ్మెల్యే మాధవికి ఆధిపత్య పోరు కొనసాగుతుంది. కడప కార్పొరేషన్‌లో పట్టు సాధించేందుకు ఇరువురు సై అంటే సై అంటున్నారు. ప్రత్యేక్ష ఆరోపణలు..బహిరంగ సవాళ్లతో ఇద్దరూ తగ్గేదేలే అంటూ… సీమ పౌరుషాన్ని చూపిస్తున్నారు. దీంతో కడప రాజకీయం కాస్త..ఫ్యాక్షన్ రాజకీయంలా మారిపోయింది. కడప కార్పొరేషన్ సమావేశంలో..ఈ వివాదం మరింత ముదిరింది. ఎమ్మెల్యే మాధవీరెడ్డికి తన పక్కన సీటు కేటాయించడానికి.. విముఖత చూపించారు మేయర్ సురేష్‌బాబు. దీంతో ఎమ్మెల్యే..మేయర్ మధ్య వివాదం భగ్గుమంది.
కడప కార్పొరేషన్ సర్వసభ సమావేశానికి ఎక్స్ అఫిషియో మెంబర్‌గా స్థానిక ఎమ్మెల్యే మాధవి రెడ్డి హాజరవుతున్నారు. తాను సభకు హాజరైన ప్రతిసారి అవమానించే విధంగా కడప కౌన్సిల్ హాల్లో మేయర్ పక్కనే సీటు కేటాయించకుండా అవమానానికి గురి చేస్తున్నారని మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తామన్న భయంతోనే కౌన్సిల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండి పడుతున్నారు.
గత నెల 7వ తేదీ జరిగిన కడప కార్పొరేషన్ సర్వసభ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి హాజరు అయినప్పటికీ ఆమెకి మేయర్ పక్కన సీటు కేటాయించకుండా మేయర్ తన పంతాన్ని నెగ్గించుకునే విధంగా పావులు కదిపారు. అయితే ఎమ్మెల్యే అది జీర్ణించుకోలేక కడప కార్పొరేషన్‌పై పట్టు సాధించడానికి వ్యూహాలు రచించి కొద్ది రోజుల క్రితమే వైసీపీ నుండి 8 మంది కార్పొరేటర్‌లని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నారు. మరి కొంతమంది కార్పొరేటర్ లను టిడిపిలోకి చేర్పించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
కడప కార్పొరేషన్ పరిధిలో ఉన్న 50 మంది కార్పొరేటర్లలో ఇప్పటికే కూటమి వైపు ఎనిమిది మంది రాగా .. మరికొంతమంది కూటమి ప్రభుత్వంలో చేరే విధంగా కడప జిల్లా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసులు రెడ్డి పావులు కదుపుతున్నారు. కార్పొరేటర్లు మరో 18 మంది కూటమిలో చేరితే కార్పొరేషన్‌పై వైసీపీ ఫట్టు కోల్పోయే అవకాశం ఎక్కువ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఒకవేళ కార్పొరేషన్‌పై వైసీపీ పట్టుకోల్పోతే .. గత వైసిపి ప్రభుత్వం లో జరిగిన అవినీతి అక్రమాలు అన్ని బయటకు తీసి ఎండగడతారన్న ఆందోళనలో ఉన్నారంట వైసీపీ నేతలు.
Also Read: జగన్‌కు షాక్.. ఏజెన్సీపై జనసేనాని ఫోకస్
దీంతో కడప కార్పొరేషన్ పై వైసీపీ పట్టు కోల్పోకుండా వైసిపి అధిష్టానం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుందంటున్నారు. వైసిపి అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ కడప కార్పొరేషన్ ని చేజార్చుకోకుండా చూసుకోవడానికి మేయర్ సురేష్ బాబు అడుగులు ముందుకు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కౌన్సిల్ హాల్లో సీటు కేటాయించకుండా అవమానపర్చారంట. వ్యూహాత్మకంగానే కౌన్సిల్‌లో ఎక్స్ అఫిషియో నెంబర్ అయిన నియోజకవర్గ ఎమ్మెల్యేని, మరో ఏడు మంది కార్పొరేటర్‌లను సస్పెండ్ చేస్తూ మేయర్ సురేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారంట.
కడప కార్పొరేషన్ లో తన పంతం నెగ్గించుకునే విధంగా మేయర్ పావులు కదుపుతుంటే… ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు సైతం ధీటుగా పావులు కదుపుతున్నారంట. మాధవి రెడ్డి గత ప్రభుత్వ హయాంలో మేయర్ సురేష్ బాబు చేసిన అవినీతి ఆరోపణలను మీడియా ముఖంగా ఎండగడుతూ వైసీపీపై వ్యతిరేకత పెరిగేలా పావులు కదుపుతున్నారు. ఆమె భర్త శ్రీనివాసరెడ్డి వైసీపీ కార్పొరేటర్లతో టచ్‌లో ఉంటూ వారికి పసుపు కండువా కప్పే పనిలో బిజీగా ఉన్నారంట.
టీడీపీ ప్రయత్నాలు పసిగట్టే మేయర్ సురేష్ తాజాగా కౌన్సిల్‌లో అంత గందరగోళానికి కారణమయ్యారంటున్నారు .. మహిళా ఎమ్మెల్యే పట్ల ఆయన అనుసరించిన వైఖరి వైసీపీకి నెగిటివ్ అయిందని ఆ పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. ఆ క్రమంలో కడప జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్.. పార్టీ ముఖ్యనేతలు కడప కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. పులివెందులలోని తన స్వగృహంలో జరిగిన భేటీలో మేయర్ సురేష్‌బాబు సహా పలువురితో ఆయన చర్చించారు. కడప కార్పొరేషన్ సర్వసభ సమావేశంలో జరిగిన ఘటనపై జగన్ ఆరా తీశారు. దీంతోపాటు వైసీపీని వీడి..తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న కార్పొరేటర్ల గురించి అడిగి తెలుసుకున్నారంట. ఆ మీటింగులో మేయర్ సురేశ్‌బాబుపై జగన్ మండిపడినట్లు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్పొరేషన్‌లో పట్టు కోల్పోవద్దని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారంట.
అయితే కౌన్సిల్ మీటింగులో పరిణామాలకు జగన్‌తో తమ మీటింగుకు ఎలాంటి సంబంధం లేదంటూ జగన్ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని మేయర్ సురేశ్ దాటేసే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారిందిప్పుడు .. మరి చూడాలి రాబోయే రోజులలో కడప కార్పొరేషన్ రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయో.