గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలోని ఓ ఇంట్లో బాంబు పేలి ఇద్దరు గాయపడ్డ ఘటనకు బాధ్యులైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అత్తింటిపై ప్రతీకారంలో భాగంగా నిందితుడు రూపేన్ రావు మరో వ్యక్తితో కలిసి ఈ బాంబు పేలుడుకు కుట్ర పన్నాడని పోలీసులు తాజాగా గుర్తించారు. భారీ స్థాయిలో పేలుడు చేయడానికి అతడు ప్రణాళికలు సిద్ధం చేశాడని వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రూపేన్ రావు (44).. తన భార్య స్నేహితుడు సుఖాడియా, ఆమె తల్లిదండ్రులపై ప్రతీకారానికి ప్లాన్ చేశాడు. తన విడాకులకు కారణమైన వారిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న రూపేన్ బాంబులు లేదా తుపాకీతో సుఖాడియాతో పాటు తన అత్తింటి వారిపై దాడి చేద్దామనుకున్నాడు. ఆన్‌లైన్‌లో చూసి బాంబులు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. ఇక ఘటన జరిగిన రోజు సుఖాడియా ఇంటి వద్దే అనుమానాస్పదంగా తిరుగుతున్న గౌరవ్ గఢావీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టెక్నికల్ సర్వేలెన్స్ ఆధారంగా జరిగిన దర్యాప్తులో రూపేన్ రావు, అతడికి సహాయపడ్డ రోహన్ రావల్‌ను అదే రోజు రాత్రి అరెస్టు చేశారు.
రూపేన్, రోహన్ కలిసి ఈ బాంబు దాడికి దిగారని డీసీపీ భరత్ రాథోడ్ పేర్కొన్నారు. ‘‘తన భార్య మిత్రుడైన సుఖాడియాతో పాటు అత్తారింటిపై దాడి చేయడమే అతడి లక్ష్యం. తన భార్య తరపు వారిని దూరం చేసి ఆమెను ఒంటరిని చేయాలని ప్లాన్ చేశాడు’’ అని తెలిపారు.
Also Read: చిమ్నీలో చిక్కుకున్న క్రిస్మస్ శాంటా క్లాజ్.. పోలీసుల నుంచి తప్పించుకోబోయి..
నిందితులకు చెందిన కారులో బాంబులు, ఓ నాటు తుపాకీ కూడా పోలీసులకు లభించింది. సల్ఫర్ పౌడర్, గన్ పౌడర్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ఉపయోగించి, రిమోట్‌తో పేలేలా నిందితులు బాంబును తయారు చేశారు. నిందితుడి ఇంట్లో తుపాకీ, బుల్లెట్లు, బాంబుల తయారీకి అవసరమైన ముడిపదార్థాలు కూడా పోలీసులకు లభించాయి. బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్స్ బాంబులను జాగ్రత్తగా నిర్వీర్యం చేశాయి.
అత్యధిక నష్టం వాటిల్లేలా నిందితులు బాంబులను సిద్ధం చేసినట్టు డీసీపీ రాథోడ్ పేర్కొన్నారు. రద్దీ ప్రాంతంలో అవి పేలి ఉంటే ప్రాణ నష్టం మరింత భారీగా ఉండేదని పేర్కొన్నారు. విడాకులకు తోడు నిందితుడు ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. తన అనారోగ్యానికి కూడా భార్య, ఆమె కుటుంబసభ్యులే కారణమని భావించాడు. ‘‘ఆనారోగ్యం కారణంగా బలహీనంగా మారాడు. ఒంటరైపోయాడు. దీనంతటికీ కారణం భార్య తన అత్త, మామ, బావ అని భావించే పగబట్టాడు’’ అని డీసీపీ పేర్కొన్నారు.
ఇక ఘటన జరిగిన రోజు రూపెన్.. రోహన్ సహాయంతో బాంబులు ఉన్న పార్శిల్‌ను బాధితుల ఇంటికి పంపించేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో సుఖాడియా లేకపోవడంతో దాడిని మరో రోజుకు వాయిదా వేశాడు. ఇక ప్లాన్ ప్రకారం గఢావీ మరుసటి రోజు డెలివరీ ఏజెంట్‌లా వెళ్లి బాంబు పార్శిల్‌ను డెలివరీ చేసి వచ్చాడు. ఆ తరువాత రావల్ రిమోట్ కంట్రోల్‌తో దాన్ని పేల్చి వేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం రూపేన్ తన అత్తారింటిపై కూడా ఇదే తరహా దాడికి ప్లాన్ సిద్ధం చేసి ఉంచాడని పోలీసులు గుర్తించారు. వారిని అంతమొందించి భార్యను ఒంటరిని చేయాలని తలపోశాడు. ఇంతలో అతడు పోలీసులకు చిక్కడంతో పెను ప్రమాదం తప్పిపోయింది.