BigTV English

Warangal Congress: చెవిలో గులాబీ పూలా? పనులు చేసేది ఒకరు.. ఘనత మరొకరిదీనా?

Warangal Congress: చెవిలో గులాబీ పూలా? పనులు చేసేది ఒకరు.. ఘనత మరొకరిదీనా?

Warangal Congress: తమ పాలనలో పనులు పూరా పడకేయించి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరుగులు తీయిస్తుంటే.. అదంతా మా వల్లే, మావల్లేనంటూ వీరు చేసే ఈ హడావిడి దేనికి సంకేతం? పనులు చేయించేది ఒకరు- ఆ ఘనత మరొకరిదీనా? ఏంటీ విపరీత ధోరణి.. మా చెవుల్లో గులాబీ పూలు గానీ పెడుతున్నారా? ఇదీ కాంగ్రెస్ శ్రేణులు సంధిస్తోన్న ప్రశ్న. ఇంతకీ ఏ విషయంలో ఇలా జరుగుతోంది? ఆ గులాబీ నేతలు ఎవరెవరు? వారు పడుతున్న పాట్లు ఎలాంటివి?


గులాబీ ఫూల్ అనే కొత్త ఆటకు తెరలేపిన గులాబీ నేతలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకోడానికే ఈ ప్లాన్?మనమంతా ఇప్పటి వరకూ ఏప్రిల్ ఫూల్ గురించి వినే ఉంటాం. ఏప్రిల్ ఫస్ట్ రాగానే ఈ ఆట ఆడే ఉంటాం. కానీ, ఇప్పుడు కొత్తగా గులాబీ ఫూల్ అనే కొత్త ఆట ఆడుతున్నారట గులాబీ నేతలు. ఇందుకు ఏప్రిల్ నెల రావల్సిన అవసరమే లేదట. అన్ని నెలల్లోనూ ఈ ఆట ఆడొచ్చని గట్టిగానే ఫిక్సయ్యారట ఈ పార్టీ లీడర్లు. ఇందుకు ఉదాహరణ ఎలాంటిదో చూస్తే.. గోదావరి నుంచి 38 టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు దేవాదుల ప్రాజెక్టుకు 2004లో శ్రీకారం చుట్టింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.


ఏటూరు నాగారం, గంగారం దగ్గర ప్రాజెక్టు నిర్మాణం

ఏటూరు నాగారం మండలం, గంగారం దగ్గర నిర్మాణమవుతోన్న ఈ ప్రాజెక్టు మొత్తం మూడు దశల్లో పూర్తి కావల్సి ఉంది. ఇది గానీ పూర్తయితే వరంగల్, కరీంనగర్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 6 లక్షల 21 వేల ఎకరాలు నీరందుతుంది. 2014 వరకూ మొదటి రెండు దశల నిర్మాణాలు పూర్తయ్యాయి. మూడో దశ నిర్మాణ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి.

బీఆర్ఎస్ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మూడో దశ పనులు

2015లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సామర్థ్యాన్ని 38 టిఎంసిల నుంచి 65 టిఎంసిలకు పెంచుతూ జీవో జారీ చేసింది. కానీ, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మాత్రం నిధులను కేటాయించలేదు.

దేవాదుల ప్రాజెక్టును సీరియస్ గా తీస్కున్న కాంగ్రెస్ ప్రభుత్వం

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మూడవ దశ దేవాదులపై దృష్టి పెట్టి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేది. దేవాదుల పూర్తయి ఉంటే.. వరంగల్, నల్గొండ ప్రాంతాలు సస్యశ్యామలం అయి ఉండేవి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. దేవాదుల ప్రాజెక్టును సీరియస్ గా తీసుకుంది. మంత్రుల బృందంతో దేవాదుల ప్రాజెక్టును పరిశీలింప చేసి.. వెంటనే నిధులను విడుదల చేసింది.

రామప్ప- ధర్మసాగర్ టన్నెల పనులు పూర్తి

యుద్ధ ప్రాతిపథికన రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు ఉన్న 49 కిలోమీటర్ల టన్నెల్ పనులను పూర్తి చేసింది. దీంతో ఫేజ్ 3లోని, ప్యాకేజీ 3 అందుబాటులోకి వచ్చింది. ఒక పక్క చూస్తే.. ఘన్ పూర్, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలోని పంటలు ఎండి పోతున్నాయి. దీంతో.. దేవాదుల ఫేజ్ 3 లోని దేవన్నపేట దగ్గరున్న ప్యాకేజ్ 3 పంప్ హౌస్ మోటార్లను మరమ్మత్తులు చేసి పంపింగ్ కోసం సర్వం సిద్ధం చేసింది.

తీవ్రంగా శ్రమించిన ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఇక స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గత కొన్నాళ్ల నుంచీ.. దేవాదుల ప్యాకేజీ పూర్తి చేయించేందుకు తీవ్రంగా శ్రమించారు. కాంట్రాక్టర్లు నిర్మాణ సంస్థలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ పనులను స్పీడప్ చేశారు. ఎమ్మెల్యే చొరవతో అధికారులు సైతం ఒక మోటార్ సిద్ధం చేశారు. ఎప్పుడైతే దేవాదుల ప్రాజెక్టు సిద్ధమైందో.. ఆ వెంటనే అలర్టయిన గులాబీ దండు.. తమదైన శైలిలో ఆట మొదలు పెట్టిందట. ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ మొత్తం తమదేనంటూ.. ప్రచారం స్టార్ట్ చేసిందట.

రాజయ్య తీరుపై నారాజ్ అవుతున్న కాంగ్రెస్ శ్రేణులు..

స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒక అడుగు ముందుకేసి.. దేవాదుల నీటి తరలింపు తమ ప్రభుత్వ కృషి వల్లే జరిగిందంటూ ప్రచారం మొదలుపెట్టారట. దేవన్నపేటలోని దేవాదుల పంప్ హౌస్ దగ్గరకెళ్లి.. పూజలు చేసి మరీ జనాల చెవిలో పూవులు పెట్టే యత్నం మొదలెట్టారట.. ఇదంతా తమ పార్టీ వల్లేనంటూ.. ప్రకటనలు గుప్పించారట. దీంతో తాటికొండ రాజయ్య తీరుపై నారాజ్ అవుతున్నారట కాంగ్రెస్ వర్గాల వారు.

ఇన్నాళ్లూ నోరు మెదపని పల్లా.. మంత్రులకు వినతి పత్రాలు

కరువు పీడిత ప్రాంతంగా ఉన్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి దేవాదుల ప్రాజెక్టు వరప్రధాయని లాంటిది. అలాంటి ప్రాజెక్టును గత పదేళ్ల పాటు పక్కనపెట్టి, ఇప్పుడు ప్రాజెక్టు మొదలు కావడంతో.. ఈ క్రెడిట్ మొత్తం తమ సొంతం చేసుకునేందుకు గులాబీ పార్టీ లీడర్లు కుటిల యత్నాలకు పాల్పడుతున్నారంటూ.. మాట్లాడుకుంటున్నారట ఈ ప్రాంత వాసులు.

నీటి తరలింపు మొదలు కాగానే క్రెడిట్ కొట్టేయడానికి అసంబద్ధ ఫిర్యాదులు

మరోవైపు గత పదేళ్లపాటు.. దేవాదుల ప్రాజెక్టు పై కనీసం నోరు మెదపలేదు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. అలాంటి పల్లా.. దేవాదుల నుంచి.. నీటిని తరలించాలని పనిలో పనిగా మంత్రులకు.. వినతి పత్రాలు సమర్పించారట. నీటి తరలింపు ప్రారంభం కావడంతో ఆ క్రెడిట్ కొట్టేయడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారట.

ప్రోటోకాల్ ఉల్లంఘన చేశారంటూ అసెంబ్లీ సెక్రటరీకి కంప్లయింట్

పంప్ హౌస్ మోటార్ల ప్రారంభోత్సవానికి వచ్చి.. నానా హంగామా చేయాలని చూసిన పల్లా.. మంత్రులు తననీ కార్యక్రమానికే పిలవలేదని కంప్లయింట్ చేశారట. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ.. ఏకంగా అసెంబ్లీ సెక్రటరీకే ఫిర్యాదు చేశారట. దేవాదుల పంప్ హౌస్ ఉన్న ప్రాంతం స్టేషన్ ఘన్ పూర్, వర్ణన్న పేట నియోజకవర్గాల పరిధిలో. మరి జనగామ ఎమ్మెల్యేని ఎందుకు ఆహ్వానించాలో మాకు అర్ధం కావడం లేదంటున్నారట కాంగ్రెస్ లీడర్లు.

దేవాదుల పంప్ హౌస్ ఉన్నది ఘన్ పూర్- వర్ధన పేట పరిధిలో..

రైతుల సంక్షేమం కోసం.. యుద్ధ ప్రాతిపథికన.. దేవాదుల ప్రాజెక్టు పనులను పూర్తి చేయిస్తూ.. రేవంత్ సర్కార్ ముందుకెళ్తుంటే.. ఆ క్రెడిట్ మొత్తాన్ని.. తమ ఖాతాలో వేసేందుకు బీఆర్ఎస్ నేతలు తీవ్ర యత్నాలు సాగిస్తున్నారట. ఓరుగల్లులో ఈ అంశంపై గట్టిగానే చర్చ నడుస్తోందట.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకోడానికే ఈ ప్లాన్?

ఇలా ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా.. ఇదంతా తమ కృషి- పట్టుదలేనంటూ గగ్గోలు పెడుతున్నారట సదరు గులాబీ లీడర్లు. అయితే ఇదంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు చేస్తున్న కుయుక్తులని అంచానా వేస్తున్నారట కాంగ్రెస్ లీడర్లు. ఎవరు ఏం చేశారో? ప్రజలకు బాగానే తెలుసు కాబట్టి బేఫికర్ అంటున్నారట వీరు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×