Bengal Voting: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ అధిక ఓటింగ్ శాతమే నమోదవుతుంది. కానీ, ఈసారి జరిగిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 93 శాతం ఓటింగ్ నమోదవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 1947 తర్వాత ఇదే హయ్యెస్ట్. ఈ అధిక ఓటింగ్ శాతం ఇస్తున్న సిగ్నలేంటి? ఇదే.. ఇప్పుడు ఇండియా అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే, కోవిడ్ మహమ్మారి మధ్య, అధికార టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్రమైన ఘర్షణ పోరు నెలకొన్న 2021 ఎన్నికల్లోనే.. 82 శాతం పోలింగ్ నమోదైంది. ఆరోగ్యపరమైన ఆందోళనలు, అనేక దశల పోలింగ్ ఉన్నప్పటికీ.. ఆ ఎన్నికల్లో టీఎంసీ 213 స్థానాలు గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే.. తొలి దశలో 92.9 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో.. 2021 నాటి గణాంకాలను అధిగమించింది. అయితే.. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్య విషయం.. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. వివాదాలు చుట్టు ముట్టిన సర్ ప్రక్రియ, బెంగాల్ ఓటర్ లిస్టుల్లో నుంచి దాదాపు 91 లక్షల పేర్లను తొలగించింది.
సర్ ప్రక్రియలో బెంగాల్‌లో తొలుత 63 లక్షల పేర్లను తొలగించారు. ఆ తర్వాత వచ్చిన న్యాయపరమైన తీర్పుతో.. అనర్హులుగా ప్రకటించిన మరో 27 లక్షల ఓటర్లను కలిపారు. తొలగింపులతో పాటు తొలి దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో మొత్తం ఏడు లక్షల కొత్త ఓటర్లను చేర్చారు. ఈ కొత్త ఓటర్లలో 3 లక్షల మందికి పైగా తొలి దశలో పోలింగ్‌లో ఉన్నారు. మిగతా 3 లక్షల 88 వేల మంది రెండో దశలో ఓటు హక్కును వినియోగించుకుంటారు. ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాలు, సౌత్ 24 పరగణాలు, మాల్దా, నాడియా సహా అనేక జిల్లాల్లో, అత్యధిక తొలగింపులు నమోదయ్యాయ్. కోల్‌కతాలోని అనేక నియోజకవర్గాల్లో దాదాపు 7 లక్షల మంది ఓటర్లను తొలగించారు.
కోల్‌కతా సిటీలోనూ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ.. ఓవరాల్‌గా బెంగాల్ ఓటర్ల సంఖ్యను 7 కోట్ల 60 లక్షల నుంచి 6 కోట్ల 80 లక్షల ఓటర్లకు తగ్గించింది. ఇప్పుడు 90 శాతం ఓటింగ్ నమోదవడం.. సర్ ప్రక్రియ తొలగింపుల ఫలితమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. దీనికి.. బీహార్ ఎగ్జాంపుల్‌గా కనిపిస్తోంది. అక్కడ.. సర్ తర్వాత.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా పెరిగింది. 2020లో 57 శాతం పోలింగ్ నమోదైతే.. 2025లో 67 శాతానికి పెరిగింది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సవరించి.. చనిపోయిన వారు, వేరే ప్రాంతాల్లో స్థిరపడిన వారు, అనర్హుల ఓట్లు, డూప్లికేట్ ఓట్లవారీగా లక్షలాది పేర్లను తొలగించిన తర్వాత.. పోలింగ్ శాతంలో పెరుగుదల కనిపించింది. అందువల్ల.. బెంగాల్‌లోనూ లక్షల ఓట్లు తొలగించకపోయి ఉంటే, ఇప్పుడు కూడా పోలింగ్ శాతం 83 గానే ఉండేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయ్.
Also read: రెండేళ్లుగా అన్నం తినటం మానేసిన నటుడు.. ఆ సమస్యలే కారణమా?
రీజన్ ఏదైనా ఉండని.. తొలి దశ పోలింగ్‌లో పశ్చిమ బెంగాల్ ప్రజలు చరిత్ర సృష్టించారు. 2011లో బెంగాల్‌లో నమోదైన 84.72 శాతం పోలింగే.. రాష్ట్రంలో ఇప్పటిదాకా అత్యధికం. ఆ తర్వాత.. మళ్లీ స్వతంత్ర భారత చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 93 శాతం పోలింగ్ నమోదైంది. చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగడం కూడా ఇప్పుడు విశేషంగా కనిపిస్తోంది. సర్ కాంట్రవర్శీ, బీజేపీ, టీఎంసీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మధ్య కూడా బెంగాల్‌లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఫస్ట్ ఫేజ్‌లో 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో.. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో భారీ క్యూలు కనిపించాయి. ఎప్పుడూ తక్కువ పోలింగ్ జరిగే మాల్దా, ఝార్‌గ్రామ్, వెస్ట్ మేదినీపుర్‌లోనూ 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవడంపై ప్రధాని మోడీ స్పందించారు. ఓటర్లు పోటెత్తడం మార్పుకు సంకేతమని, తృణమూల్ సిండికేట్‌కు గడువు తీరబోతోందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా.. దీదీ దిగిపోయే టైమ్ వచ్చేసిందన్నారు. తొలి దశ పోలింగ్‌లో 152 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. 110కి పైగా సీట్లు గెలుస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, బెంగాల్ సీఎం మమత కూడా పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యారు. తొలి విడత పోలింగ్‌తోనే టీఎంసీ విక్టరీ ఖాయమైందన్నారు. ఫస్ట్ ఫేజ్‌లో 125కి పైగా స్థానాలు గెలుస్తామన్నారు. మరి.. అత్యధిక ఓటింగ్ శాతం.. అధికార టీఎంసీకి మేలు చేస్తుందా? అధికారం కోసం తహతహలాడుతున్న బీజేపీకి బెనిఫిట్‌గా మారుతుందా?
అత్యధిక ఓటింగ్ శాతానికి.. సాధారణంగా అధికార వ్యతిరేకతే కారణమని భావిస్తారు. 2011లో లెఫ్ట్ ఫ్రంట్‌ని ఓడించి టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పుడు.. పశ్చిమ బెంగాల్‌లో 84 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఇది.. 2006 ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం కంటే 2.36 శాతం ఎక్కువ. అయితే, అత్యధిక ఓటర్ టర్నవుట్.. అధికార పార్టీకి గానీ, ప్రతిపక్ష పార్టీకి గానీ అనుకూలంగా ఉంటుందని కుండబద్దలుకొట్టి చెప్పేందుకు ఎలాంటి ఆధారాల్లేవు. కానీ, సాధారణంగా ఎక్కువ ఓటింగ్ నమోదైతే.. అధికార వ్యతిరేకత ఉంటుందనుకుంటారు. కానీ, గడిచిన పదేళ్లలో అనేక రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం సాధారణంగానే పెరుగుతూ వచ్చింది. దీనివల్ల.. ఒక్కోసారి అధికారంలో ఉన్నవాళ్లు కూడా లాభపడొచ్చనే వాదనలున్నాయ్.
Also read: కవిత కొత్త పార్టీ అజెండా వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..?
మరి.. బెంగాల్‌లో ఇంత భారీ ఓటింగ్ శాతం నమోదు కావడానికి కారణాలేంటి? అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన పాయింట్. అక్కడ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌తో పాటు ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయ్. బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ప్రజలు, తమ పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తారేమోనని, పౌరసత్వాన్ని కూడా కోల్పోతామేమోనన్న భయంతో.. తిరిగి బెంగాల్‌కు వచ్చేశారు. ముఖ్యంగా.. సీఎం మమతా బెనర్జీ ఈ విధమైన భయాన్ని పెంచారు. ఎన్నికల సంఘం, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం.. రాజ్యాంగాన్ని పాటించడం లేదని, ఓటు హక్కును లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని సభల్లో చెప్పారు. సర్‌తో ఓటు లాక్కుంటున్నారని, తర్వాత ఎన్ఆర్‌సీ తీసుకొచ్చి పౌరసత్వాన్ని కూడా లాక్కుంటారని చెప్పారు. దాంతో.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి సిటీలతో పాటు సూరత్, ఖుర్జా లాంటి పారిశ్రామిక కేంద్రాల నుంచి.. ఎన్నికల కోసం ప్రజలు భారీ సంఖ్యలో బెంగాల్‌కు తిరిగి వచ్చారు. ఇంత దూరం ప్రయాణించి వచ్చిన వాళ్లంతా.. సహజంగానే తప్పకుండా ఓటు వేస్తారు. పౌరసత్వం, ఓటు హక్కు కోల్పోతామనే భయాలే.. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవడానికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
ఈసారి బెంగాల్ ఎన్నికల కోసం 2 లక్షల 40 వేల మంది కేంద్ర బలగాలను మోహరించారు. దాంతో.. ఓటర్లు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఓటు వేయగలుగుతున్నారనే చర్చ కూడా ఉంది. అందువల్ల.. ఓటర్లు పోటెత్తడం, సర్ ప్రక్రియ, ఓటు హక్కు కోల్పోతామనే భయం, ఓటు వేసేందుకు సురక్షితమైన వాతావరణం లాంటివన్నీ.. అత్యధిక ఓటింగ్ శాతంపై ప్రభావం చూపాయ్. అయితే, ఇదంతా ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుంది? ఎవరి విజయానికి కారణమవుతుందనేది.. మే 4న తేలిపోతుంది. మహిళా ఓటర్లు మమత వెంటే ఉంటే.. దీదీ మళ్లీ గెలుస్తుంది. అలా కాకుండా, యువత, మార్పు కోరుకునే న్యూట్రల్ ఓటర్లు గట్టిగా డిసైడ్ అయితే.. కాషాయ జెండా రెపరెపలాడుతుంది. కానీ, బెంగాల్ పోరు మాత్రం నెక్ టు నెక్ ఉన్నట్లు కనిపిస్తోంది. మమతా బెనర్జీ ఉనికి కాపాడుకునేందుకు పోరాడుతుంటే, బెంగాల్ కోటపై ఎలాగైనా జెండా ఎగరేసేందుకు.. బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ 93 శాతం ఓటింగ్.. అధికారత వ్యతిరేకతకు సంకేతమా? ప్రభుత్వ అనుకూలతకు సూచనా? అన్నది తెలియాలంటే.. మే 4 వరకు వెయిట్ చేయాల్సిందే!
Also Read: రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. త్వరలోనే 2500 పోస్టులకు నోటిఫికేషన్