తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న అభ్యర్థులకు మేలు జరిగేలా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెలా ఒక నోటిఫికేషన్ విడుదల చేసేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరగకుండా అభ్యర్థులు తమ ప్రిపరేషన్ సజావుగా సాగించేందుకు కమిషన్ ఈ కసరత్తు చేస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీజీపీఎస్సీ ద్వారా పెండింగ్‌లో ఉన్న ఫలితాలను వేగంగా వెల్లడించింది. సుమారు 26 వేల పోస్టులను ఇప్పటికే భర్తీ చేసిన సర్కార్ గ్రూప్స్ పోస్టుల సంఖ్యను పెంచి అభ్యర్థులకు అండగా నిలిచింది. ప్రస్తుతం అమల్లోకి రానున్న నెలవారీ నోటిఫికేషన్ల విధానం ద్వారా మిగిలిన ఖాళీలను కూడా త్వరితగతిన భర్తీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
ముఖ్యంగా ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన 2,500 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు అలాగే పరీక్షల షెడ్యూల్ రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రాగా ఈ నెల 27 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదే విభాగంలో మరో ఆరు నుండి ఏడు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అడుగులు పడుతున్నాయి. కీలకమైన టౌన్ ప్లానింగ్ అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్లతో పాటు వివిధ శాఖల్లోని అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. విద్యాశాఖలోని డిప్యూటీ ఈఓలు, డైట్ లెక్చరర్లు, బీఈడీ లెక్చరర్ల పోస్టులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆర్టీసీ సివిల్ సప్లై విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
నోటిఫికేషన్ల జారీతో పాటు పరీక్షల నిర్వహణలోనూ కమిషన్ కొత్త పంథాను అనుసరించనుంది. యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీ వంటి జాతీయ స్థాయి పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ రూపొందిస్తారు. దీనివల్ల అభ్యర్థులు ఒకే సమయంలో రెండు వేర్వేరు పరీక్షలు ఎదుర్కోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అన్ని రకాల పోటీ పరీక్షలకు హాజరయ్యే వెసులుబాటు నిరుద్యోగులకు కలుగుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది.
ALSO READ: ఉద్యోగం కోల్పోయారా? పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చు?