BigTV English

Donald Trump: పుతిన్ బాటలో ట్రంప్.. మూడోసారి గద్దెనెక్కడం సాధ్యమేనా? అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?

Donald Trump: పుతిన్ బాటలో ట్రంప్.. మూడోసారి గద్దెనెక్కడం సాధ్యమేనా? అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?

డొనాల్డ్ ట్రంప్ ఆలోచనా తీరు చూస్తుంటే… ప్రపంచంలో అగ్రదేశాలుగా ఉన్న అమెరికా, రష్యా, చైనాలు మూడీంటిని ఏకం చేసే దిశాగా అడుగులేస్తారేమో అనిపిస్తుంది. పద్ధతులు, విధి విధానాల్లో కాకపోయినప్పటికీ… రాజకీయ అధికారాన్ని కొనసాగించడంలో ఈ మూడు దేశాలు కూడబలక్కున్నాయా అనిపిస్తుంది. అందులోనూ, అమెరికా శత్రు దేశాలుగా పేరున్న చైనా, రష్యా అధ్యక్షులతో ట్రంప్ మొదటి టర్మ్‌లో భేటీ అవ్వడం చూస్తే వాళ్లకూ ట్రంప్‌‌కు మధ్య ఎంతో స్నేహం ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక విధంగా, ట్రంప్, పుతిన్ ఇద్దరూ మంచి స్నేహితులనే వాదనకు బలం చేకూర్చే ఉదాహరణలు చాలానే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ 1987 నుండి రష్యాలో వ్యాపార ఒప్పందాలను కొనసాగించారు. అక్కడ వ్యాపార అవకాశాలను పరిశీలించడానికి చాలాసార్లు రష్యాలో పర్యటించారు. రష్యన్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఒప్పందాల నుండి జాయింట్ వెంచర్ల కోసం ప్రయత్నించారు. అయితే, రష్యా రియల్ ఎస్టేట్ ఒప్పందాల్లో ట్రంప్ సక్సెస్ అవ్వనప్పటికీ, రష్యన్లు ట్రంప్ ఆస్తులలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది.


2016 నుంచే రష్యాతో బంధం?

మాస్కోలో ట్రంప్ భవనాన్ని నిర్మించే ప్రయత్నాలు జూన్ 2016 వరకు కొనసాగినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో ట్రంప్ అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ నామినేషన్‌ను పొందారు. జనవరి 2017లో, ట్రంప్-రష్యా డోసియర్ అని పిలిచే సంచలన నివేదిక బయటకొచ్చింది. ఇది ట్రంప్ సహచరులు, రష్యా మధ్య సంబంధాలపై ఆరోపణలు చేసింది. అయితే, ఆ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ స్పందిస్తూ, రష్యాతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని చెప్పారు. ట్రంప్‌కు రష్యాతో ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవని వైట్ హౌస్ కూడా తెలిపింది. గత పది సంవత్సరాలుగా ట్రంప్ రష్యా నుండి ఎలాంటి ఆదాయం పొందలేదని ట్రంప్ న్యాయవాదులు కూడా పేర్కొన్నారు. అయితే, ట్రంప్ పాలనలో ఉన్నంత కాలం ఈ అంశంపై చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి.


పుతిన్‌లా పాతుకుపోయే ప్లాన్

ట్రంప్ రష్యాలో తన వ్యాపారాలను వృద్ధి చేయనప్పటికీ.. రష్యాలో పుతిన్ మాదిరి పర్మనెంట్ అధ్యక్షుడిగా ఉండే ప్లాన్ చేస్తున్నారా అనిపిస్తుంది. దీనికి, గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. ఇక్కడ ట్రంప్ 2024 ఎనికలను దాటి ఎన్ని పర్యాయాలు ప్రస్తావించారో చూద్దాం. ట్రంప్ ధోరణి చూస్తుంటే… ఆయన చెప్పే నంబర్లకు అంతులేదని అర్థమవుతుంది. సరిగ్గా, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఇలాగే చేశారు. రష్యాలో పుతిన్ అధ్యక్షుడిగా అయినప్పటి నుండీ మరో వ్యక్తి అధికార పీఠాన్ని ఎక్కలేకపోయారు. ఎన్నికలు ఎన్ని జరిగినా పదివి మాత్రం పుతిన్‌ను దాటి వెళ్లింది లేదు.

పుతిన్ ప్రస్థానం ఇదే.. 

మాజీ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేసిన పుతిన్… ప్రస్తుతం, నాల్గోసారి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో రష్యాకు రెండవ అధ్యక్షుడిగా 2000 నుండి 2008 వరకు పనిచేశారు. దీనికి ముందు 1999 నుండి 2000 వరకు పుతిన్ రష్యా ప్రధాని మంత్రిగా కూడా పనిచేశారు. మళ్లీ 2008 నుండి 2012 వరకూ మరోసారి గద్దెనెక్కారు. రష్యాలో అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న సోవియట్ నాయకుల్లో జోసెఫ్ స్టాలిన్ తర్వాత పుతినే. 1996లో రాజకీయ పదవి చేపట్టిన పుతిన్…. 1999లో ప్రధానమంత్రిగా ఎంపిక అవ్వడానికి ముందు రష్యా భద్రతా మండలి కార్యదర్శిగా పనిచేశారు. నాటి ప్రెసిడెంట్ బోరిస్ యెల్ట్సిన్ రాజీనామా తర్వాత, పుతిన్ తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. నాలుగు నెలల కంటే తక్కువ వ్యవధి ఉన్న ఆ అధ్యక్ష పదవి తర్వాత 2004లో తిరిగి ఎన్నికయ్యారు. రష్యాలో రెండుసార్లు వరుసగా అధ్యక్ష పదవి చేపడితే తర్వాత అధ్యక్షుడిగా నిలబడలేరు. ఈ రాజ్యాంగ పరిమితుల కారణంగా, పుతిన్ 2008 నుండి 2012 వరకు డిమిత్రి మెద్వెదేవ్ అధ్యక్షతన, రెండోసారి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2012లో తిరిగి ప్రెసిడెంట్‌గా మారారు. ఈ ఎన్నికల్లో భారీగా మోసం జరిగిందని ఆరోపణలు వచ్చాయ్. అయినప్పటికీ, 2018లో పుతిన్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

నియంతృత్వం.. అవినీతి.. మానవ హక్కల ఉల్లంఘన..

ఇక, పుతిన్ నాల్గవ అధ్యక్ష పదవి కాలం 2024తో ముగియాలి. అయితే, ఏప్రిల్ 2021లో, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత , పుతిన్ చట్టానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలపై సంతకం చేశారు. అందులో రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవిని చేపట్టే చట్టాన్ని సవరించి, తన అధ్యక్ష పదవిని 2036 వరకు పొడిగించేలా చేశారు. దీనితో, మార్చి 2024లో పుతిన్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక, పుతిన్ పాలనలో రష్యా రాజకీయ వ్యవస్థ అధికార నియంతృత్వంగా మారింది. పుతిన్ పాలన అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలతో నిండిపోయింది. రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపడం నుండీ రష్యాలో ఇండిపెండెంట్ మీడియాపై బెదిరింపులు, సెన్సార్‌షిప్… న్యాయమైన ఎన్నికలు లేకపోవడం వంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.

జిన్‌పింగ్ కూడా అంతే.. ఏకంగా లైఫ్ టైమ్…

ఇక, చైనా పరిస్థితి కూడా అంతే… ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇంకాస్త ముందుకెళ్లి, జీవితాంతం అధికారంలో కొనసాగేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించారు. అప్పటి వరకూ రెండు సార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టాలనే పరిమితిని తొలగించే చట్టాన్ని ఆమోదింపజేశారు. 1990ల నుంచి చైనాలో రెండు పర్యాయాల పదవి పరిమితి ఉంది. కాగా, 2018లో పార్లమెంటు వార్షిక సమావేశమైన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ద్వారా ఈ రాజ్యాంగ మార్పులు చేశారు. ఈ ఓటును రబ్బర్ స్టాంపింగ్ అంటూ అప్పుడు తీవ్రమైన విమర్శలు వచ్చాయి. 2 వేల 964 కాంగ్రెస్ ఓట్లలో ఇద్దరు ప్రతినిధులు మాత్రమే రాజ్యాంగ సవరణ చేయడానికి వ్యతిరేకంగా ఓటు వేయగా… ఆ ఓటింగ్‌లో ముగ్గురు గైర్హాజరయ్యారు. అంటే, ఐదుగురు మినహా అందరూ రాజ్యాంగాన్ని సవరించడానికి ఓకే చెప్పారు. 2023లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా ప్రెసిడెంట్ జిన్‌పింగ్… మావో తర్వాత తానే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌కు ఏకైక నాయకుడనే విధంగా తిష్టవేసుకొని కూర్చున్నారు.

రాజ్యంగ సవరణకు సిద్ధం?

అమెరికాలో ట్రంప్ వ్యవహారం కూడా సరిగ్గా ఇలాగే కనిపిస్తుంది. పుతిన్‌లా నాలుగు పర్యాయాలే కాదు… జిన్ పింగ్‌లా జీవిత కాలం ప్రెసిడెంట్ సీటు దిగకుండా ఉండటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఉంది. అయితే, ఇది అమెరికా లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యం కావడం అత్యంత కష్టమైన పనే అనాలి. కానీ, ట్రంప్‌ను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఇప్పటికే, రష్యా అధ్యక్షుడి పుతిన్‌లా అమెరికాలోని అత్యంత కీలకమైన శాఖల్లో తన వాళ్లను నియమించుకుంటున్నారు. పుతిన్ స్టైల్లో వాళ్లకు పూర్తి అధికారాలను ఇచ్చినట్లే వ్యవహరిస్తూ మొత్తం నిర్ణయాధికారాన్ని తనను దాటి వెళ్లకుండా ప్లాన్ చేస్తున్నారు. దీనితో, ట్రంప్ రాజ్యాంగ సవరణకు రెడీ అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే, చివరకు అది ఫలిస్తుందా లేదా అన్నది చూడాలి మరి.

ట్రంప్ మనసులో మాట ఇదే.. 

ఒకసారి గెలిచి, మరోసారి ఓడి… రెండోసారి గెలిచిన ట్రంప్.. మూడోసారి కూడా ప్రెసిడెంట్ కావాలనే కోరికను బయటపెట్టారు. తాజాగా తన రిపబ్లికన్‌ పార్టీ నేతలతో సమావేశమైన ట్రంప్… రాజ్యాంగానికి వ్యతిరేకంగా మూడోసారి పదవిలోకి రావచ్చని అన్నారు. తన మనసులోని మాటను ప్రతినిధులు సభకు ఎన్నికైన రిపబ్లికన్‌లతో పంచుకున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశానికి ముందు రాజధాని వాషింగ్టన్ డీసీలోని ఓ హోటల్‌లో రిపబ్లికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటిటీవ్‌లతో భేటీ అయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఆరితేరిన ట్రంప్… “ఎన్నికల్లో విజయం సాధించడం బాగుంది కదా..! మీరు వద్దంటే నేను మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను. నేను మళ్లీ పోటీచేస్తే మీరు అడ్డు చెప్పరని భావిస్తున్నాను” అంటూ కామెడీ టోన్‌లో సీరియస్ వ్యాఖ్యలు చేశారు. “ఆయన మంచివాడు.. మనం ఇంకేదైనా చేయాలి అని మీరు చెబితే తప్ప, నేను మళ్లీ ముందుకెళ్లలేను..”అంటూ తమ పార్టీ నేతలకు హింట్ ఇచ్చారు.

అంత ఈజీ కాదండోయ్.. 

అయితే, అమెరికా రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్‌కు ఒక వ్యక్తి రెండు సార్లకు మించి అధ్యక్షుడు కావడం కుదరదు. ఆ దేశ రాజ్యాంగంలో 22వ సవరణ ద్వారా మూడోసారి అధ్యక్షుడిగా పోటీచేయకుండా గతంలో నిబంధనను తీసుకొచ్చారు. ఒకవేళ, ట్రంప్‌కి పదవీవ్యామోహం తీరక మూడోసారి పోటీ చేయాలంటే మొదట రాజ్యాంగంలో ఈ సవరణను తొలగించాలి. కానీ, అలా చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే, దీనికి అమెరికా కాంగ్రెస్‌తో పాటు రాష్ట్రాల శాసన సభల నుండి భారీస్థాయిలో మద్దతు పొందాలి. ఇది ట్రంప్ సాధించే అవకాశం ససేమిరా లేదంటున్నారు నిపుణులు. అయినప్పటికీ, ట్రంప్ కోరిక కూడా కొట్టి పారేసే పరిస్థితి లేదు. దీనికి కారణం, ట్రంప్ ఈ మాటలు అనడం ఇప్పుడే మొదటిసారి కాదు. ట్రంప్ మొదటి పర్యాయం ప్రెసిడెంట్ పదవి చేపట్టక ముందు నుండీ ఇలాంటి వ్యాఖ్యలు చాలా సార్లు చేశారు. పలు ఇంటర్వ్యూల్లో, బహిరంగ సభల్లో కూడా ట్రంప్ తాను మళ్లీ మళ్లీ ప్రెసిడెంట్ కావాలనే కోరికను బయటపెట్టారు.

అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?

అమెరికా రాజ్యాంగం 22వ సవరణ ప్రకారం.. ఓ వ్యక్తి రెండు సార్లుకు మించి అధ్యక్షుడు కాలేడు. వరుసగా అయినా… లేదంటే, మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత అయినా రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పీఠం ఎక్కే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని 22వ సవరణలోని సెక్షన్ 1 ప్రకారం, “ఎవరూ రెండుసార్లుకు మించి అధ్యక్ష పదవికి ఎన్నుకోబడరు. అధ్యక్ష పదవిని నిర్వహించినా, లేదంటే, అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి అయినా.. అధ్యక్షుడిగా ఎన్నికైన కాలంలో రెండేళ్ల కంటే ఎక్కువ రోజులు పదవిలో ఉన్నా మరోసారి ఎన్నుకోబడతారు. అయితే, ఈ సవరణ ప్రతిపాదించిన సమయంలో కానీ, అమలులోకి వచ్చిన కాలంలో కానీ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న, తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఇక, ఈ సవరణ అమలులోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత రాష్ట్రాల సమ్మతితో ఈ రూల్‌ను తొలగించవచ్చని కూడా అందులో పొందుపరిచారు. అయితే, నాలుగింట మూడోవంతు శాసన సభ్యులు ఆమోదం తెలిపితే, మరోసారి రాజ్యంగ సవరణ చేసి ఈ రూల్‌ను మార్చే అవకాశం ఉంది. దీంతో రెండు సార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన తర్వాత ట్రంప్ మూడోసారి కూడా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే అమెరికా రాజ్యాంగానికి సవరణ చేయాలి. ఇక, ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తే ఈ సవరణ దిశగా ప్రయత్నాలు చేస్తాడని అమెరికా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నాలుగుసార్లు అధ్యక్షుడైన ఏకైక వ్యక్తి ఆయనే.. 

అమెరికాలో ఈ సవరణను 1951లో తీసుకొచ్చారు. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడిగా ఏ వ్యక్తి రెండుసార్లకు మించి పనిచేయకూడదనే సంప్రదాయం ఉండేది. అయితే, ఫ్రాంక్లిన్ డెలావర్ రూజ్‌వెల్డ్ నాలుగుసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. 1945లో పదవిలో ఉండగానే ఆయన మరణించారు. ఆయన మరణానంతరం… ఇక మీదట ఎవ్వరూ రెండుసార్లకు మించి అధ్యక్షుడు కాకుండా 22వ రాజ్యాంగ సవరణ చేపట్టారు. డెమొక్రాట్లు, రిపబ్లికన్‌లు ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడిగా ఈ సవరణ రాజ్యాంగంలో చేర్చారు. సవరణ అనంతరం జరిగిన మొదటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జార్జ్ వాషింగ్టన్.. రెండోసారి అధ్యక్షుడయ్యారు. అప్పటి నుంచి దానినే కొనసాగిస్తున్నారు. ఏ అధ్యక్షుడు మూడో సారి పోటీ చేయాలని అనుకోలేదు. కానీ, ట్రంప్ టెంపరితనం దానికి భిన్నంగా ఆలోచించింది. మూడో సారి గద్దెనెక్కాలనే ఆలోనను బయటపెట్టింది.

కనీసం 67 శాతం మంది అంగీకరించాలి

అమెరికా మొదటి అధ్యక్షుడు, ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అయిన జార్జ్ వాషింగ్టన్ గరిష్టంగా రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేయడం వల్ల, ఇదే తీరును అనుసరించాలనట్లు ఈ సవరణను చేశారు. అయితే, దీన్ని రద్దు చేయడానికి అవకాశం ఉందా అంటే… ఈ రాజ్యాంగ సవరణను అంత సులభంగా రద్దు చేయడం కుదరకపోవచ్చు. అలా చేయాలంటే… అలాంటి ఆర్డర్ కోసం బిల్లును హౌస్‌తో పాటు సెనేట్‌లో కూడా మూడింట రెండు వంతుల మెజారిటీ అంటే, 67 శాతం మంది సభ్యులు అంగీకరించాలి. ప్రస్తుతం, ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులు ఉన్నారు. అందులో కనీసం 290 మంది ఈ సవరణను రద్దు చేయడానికి మద్దతుగా ఓటు వేయాలి. అలాగే, 100 మంది సభ్యులతో కూడిన సెనేట్‌లో, కనీసం 67 మంది దీనిని అంగీకరించాలి.

Also Read: ట్రంప్ కోసం అప్పుడే డ్యూటీ ప్రారంభించిన ఎలన్ మస్క్.. ఇరాన్ అంబాసిడర్‌తో చర్చలు

అది అవ్వదమ్మా.. అంటోన్న రాజకీయ నిపుణులు

ఇక, ఈ బిల్లును హౌస్, సెనేట్ రెండిటిలోనూ ఆమోదించిన తర్వాత, అది యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రతి రాష్ట్రానికీ వెళుతుంది. అక్కడ, దానిని నాలుగింట మూడు వంతుల మెజారిటీతో ఆమోదించాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 50 రాష్ట్రాలు కాబట్టి, వాటిలో 38 రాష్ట్రాలు దానికి అంగీకరిస్తున్నట్లు ఓటు వేయాలి. ఇక, డొనాల్డ్ ట్రంప్‌ మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే ఈ మూడు అడ్డంకులు దాటి, రాజ్యాంగ సవరణ చేయాలి. ఇప్పుడు, అమెరికాలో ఉన్న రాజకీయ ప్రాతినిధ్యాన్ని బట్టి, డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ రెండూ ఒక తాటిపైకి రావడం అనే కుదరని పని. కనుక, డొనాల్డ్ ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి రావడం సంగతి అటుంచి, ప్రెసిడెంట్ కావడం అనేది అసంభవం అని పొలిటికల్ అనలిస్ట్‌లు భావిస్తున్నారు. అయినంత మాత్రాన ట్రంప్ తన ఆశను పక్కన పెట్టేస్తారని అనుకోవడం కూడా అమాయకత్వమే. ఎందుకంటే, చైనాలో, రష్యాలో కూడా ఇలాగే రెండు సార్లకే అధ్యక్ష పదవి చేపట్టాలని ఉంది. కానీ, ఆ దేశా రాజ్యాంగాలను సవరించిన జిన్ పింగ్, పుతిన్‌లు మూడు సార్లకు మించి ఇప్పటికీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×