రాష్ట్ర రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. అన్న ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం అవ్వడం. అక్కడ ఓటర్లు అన్నగారిని రెండు సార్లు గెలిపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అది ఫోకస్ అయింది. పేద, బడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారకరాముడు జన్మస్థలం నిమ్మకూరు ఈ నియోజకవర్గంలోనే ఉంది. సినీ హీరోగా ఉన్నప్పుడే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు. నిరుపేద బాధితులను ఆదుకోవడానికి జోలె పట్టి విరాళలు సేకరించిన చరిత్ర ఆయనది.
నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ మరో అంశం ఏమిటంటే.. గత నాలుగు ఎన్నికల్లో ఇక్కడి నుంచి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నాని విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలుపొందిన ఆయన 2014, 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన నియోజకవర్గానికి చేసింది ఏమీ లేకపోయినా బూతు మంత్రిగా బానే ఫోకస్ అయ్యారు. జగన్‌ను ఎవరైనా విమర్శిస్తే మైకు ముందు ప్రత్యక్షమై తిట్ల దండకం ఎత్తుకోవడం ఆయన స్టైల్.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేయడంలో ముందుండే వారు.
గుడివాడలో గెడ్డం బ్యాచ్‌ని పెంచి పోషించి.. విచ్చలవిడిగా దందాలు చేస్తూ ఆ నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్న కొడాలి నాని .. ఇక అక్కడ తనకు ఓటమే ఉండదని ఫీలయ్యాడు. అలాంటి నానిపై టీడీపీ వ్యూహాత్మకంగా ఎన్ఆర్ఐ బిజినెస్ మాన్ వెనిగండ్ల రామును బరిలోకి దింపింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే గుడివాడలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్లారాయన సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. కొడాలి నానిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ఎన్నికల్లో కూటమి వేవ్ అన్ని కలిసి వచ్చి చివరికి రాము గుడివాడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కొడాలి నాని లాంటి నేతని ఓడించి గుడివాడలో 20 ఏళ్ల చరిత్ర తిరగరాశారు.
Also Read: బాధితులను ఆదుకోకుండా విమర్శలేంటి? ఈ పాపం ఎవరిది?
ఎన్నికల ముందు గుడివాడ ప్రజల్లో కలియ తిరిగిన వెనిగండ్ల రాము ఇప్పుడు అదే ప్రజలు కష్టాలు పడుతుంటే కనిపించకుండా పోయారు. హిడెన్ కెమెరాల ఎపిసోడ్‌తో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది గుడివాడ నియోజకవర్గంలోనే.. ఆ కాలేజీ విద్యార్థినులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ఎమ్మెల్యే అటు వైపు కన్నెత్తి చూడలేదు. కృష్ణా జిల్లాలో గత వందేళ్లలో లేనంత వర్షాలు పడి.. జలప్రళయం ముంచెత్తినా వెనిగండ్ల రాము అడ్రస్ లేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ సహాయక చర్చల్లో పాల్గొంటున్నా ఆయన మాత్రం కనిపించడం లేదు.
ఆ క్రమంలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ఎక్కడ ? అని ఎదురుచూస్తున్న గుడివాడ వాసులకు ఆయన పెద్ద షాకే ఇచ్చారు. తన ఓట్లేసిన ప్రజలు కష్టాల్లో ఉంటే అందుబాటులో ఉండకుండా అమెరికాలో ఆయన సంబరాలు చేసుకుంటున్నట్లు తెలిసి నియోజకవర్గం వాసులు తిట్టిపోస్తున్నారు. సతీసమేతంగా అమెరికా వెళ్లిన వెనిగండ్ల రాము.. కొడాలినానిని ఓడించి తాను ఎమ్మెల్యే అయినందుకు అక్కడ నూజెర్సీ, అట్లాంటాల్లో చక్కర్లు కొడుతూ సన్మానాలు చేయించుకుంటున్నారంట.
దాంతో ఇక్కడ జనాలు చస్తుంటే అక్కడ సన్మానాలు ఏంటని ప్రజలు మండి పడుతున్నారు. ఎన్నికల ముందు సామాజిక సేవంటూ తాయిలాలు పంచి.. తీరా ప్రజలకు అవసరమైనప్పుడు ఫారిన్ టూర్లు పెట్టుకోవడం ఆయనకే చెల్లిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ ఆయన షెడ్యూల్ ప్రోగ్రాం ప్రకారం ముందే యూఎస్ వెళ్లినా.. గుడ్లవల్లేరు ఇష్యూ ఫోకస్ అయినప్పుడైనా రియాక్ట్ అవ్వాలి?… కనీసం వరదలు ముంచెత్తినప్పుడైనా నియోజకవర్గానికి తిరిగి రావాలి? అసలు దేనికీ స్పందించకుండా సన్మానాలు చేయించుకుంటూ తిరుగుతుండటంపై తెలుగుతమ్ముళ్లు భగ్గుమంటున్నారు
సమాజమే దేవాలయం అంటూ పార్టీ పెట్టిన అన్నగారి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి.. ఆయన చేస్తున్న నిర్వాకాలపై గుడివాడ జనం సైతం ఈసడించుకుంటున్నారు. కొడాలి నాని గుడివాడ అభివృద్దిని పట్టించుకోవడం మానేస్తే .. కొత్తగా గెలిచిన వెనిగండ్ల రాము అసలు ప్రజల్లే పట్టించుకోవడం మానేశారన్న సెటైర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చూడాలి మరి ఆ ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే రిటర్న్ అయ్యేదెప్పుడో?