Vijayawada floods: ఏపీలో వరద రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆదుకోవాల్సి నేతలు.. విమర్శలకు దిగుతున్నారు. కారణం మీరంటే మీరని ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇంతకీ కారణం ఎవరు? అధికారంలో ఉన్నా పార్టీదా? గతంలో పాలించిన పాలకులదా? లేక ప్రజలదా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ప్రకృతి కన్నెర్ర చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్టు చూశాము. ఎప్పుడు ఏ రూపంలో విరుచుకుపడుతుందో తెలీదు. అందుకు బెజవాడ వరదలే కారణం. బుడమేరు చరిత్రలో రికార్డు స్థాయిలో దాదాపు 40 వేల క్యూసెక్కులు నీరు వచ్చింది. దీనికితోడు విజయవాడ సిటీలో అక్రమ కట్టడాలు ఇవన్నీ కలిసి విజయవాడ సిటీపై గంగమ్మ మహోగ్రరూపం దాల్చింది. దాని ఫలితం మూడు రోజుల పాటు తినడానికి తిండి లేక, తాగడానికి మంచి నీరు లేక పెద్ద, చిన్న అందరూ నీటిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.
ALSO READ: చంద్రబాబు నివాసం, టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. వైసీపీ నేతలకు హైకోర్టు షాక్
ఎవరైనా వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లినవాళ్లు రాజకీయాలు చేస్తారా? వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ అదే చేశారు. బెజవాడ వరదను తన రాజకీయాలకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు. గంగమ్మ సాక్షిగా చంద్రబాబు సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో తప్పుడు ఆరోపణలు చేశారనుకోండి. జగన్ వ్యవహారశైలిని సొంత పార్టీ నేతలే దుమ్మెత్తి పోస్తున్నారు.
ఒక్కసారి వెనక్కి వెళ్దాం.. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే విశాఖను హుద్‌హుద్ తుపాను కుదిపేసింది. 2014, అక్టోబరులో విశాఖ చిగురుటాకులా వణికిపోయింది. ఆ సమయంలో విశాఖలో మకాం వేసిన సీఎం చంద్రబాబు, విద్యుత్ పునరుద్ధరణ జరిగే వరకు అక్కడే ఉన్నారు. మూడునాలుగు రోజులు వాహనంలో గడిపారు. ఇప్పటి మాదిరిగానే అప్పుడూ జగన్ విశాఖ వచ్చి హోటల్‌లో రెస్టు తీసుకుని మరుసటి రోజు బాధితుల వద్దకు వెళ్లారు. అప్పుడు కూడా జగన్ రకరకాల ఆరోపణలు చేశారు. తుపాను పేరుతో టీడీపీ నేతలంతా వ్యాపారాలు చేశారంటూ దుమ్మెత్తిపోసిన విషయం తెల్సిందే.
పాలకులు చేసిన పనిని గుర్తు పెట్టుకున్న ప్రజలు టీడీపీని ఆదరించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా.. విశాఖ సిటీలో ఎమ్మెల్యేలు గెలిచారు. తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సైకిల్ పార్టీ సొంతం చేసుకుంది. ఇక వైసీపీ పాలన విషయానికొద్దాం. జగన్ అధికారంలో ఉండగా వరదలు వచ్చినప్పుడు చూశాం. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటి రాలేదు. అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేసేవారు. తాను వస్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని, అందుకే రాలేదని తీరిగ్గా చెప్పుకొచ్చారు. ఇక తిరుపతి వరదలోనూ అదే జరిగింది. దాని ఫలితమే ఆ పార్టీని ఓటర్లు మొన్నటి ఎన్నికల్లో దూరంగా పెట్టారు.
వరదల సమయంలో ఏ ప్రభుత్వాలు ప్రజలకు వంద శాతం న్యాయం చేయలేవు. ఎంత చేసినా లోపాలు ఉంటాయి. పాలకులు కేవలం అధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. కానీ చేయాల్సిదంతా అధి కారులే. విజయవాడ విషయంలో ఆదివారం నుంచి కలెక్టర్ ఆఫీసులో సీఎం చంద్రబాబు మకాం వేశారు. అర్థరాత్రి బోట్లపై బయలు దేరి బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మీకు అండగా నేనున్నానంటూ చెప్పే ప్రయత్నం చేశారు.
ప్రతీ గంటకు ఒకసారి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు ముఖ్యమంత్రి. సోమ, మంగళవారాల్లో బాధితులు చెప్పినదంతా విన్నారు. ఫుడ్, నీరు అందజేయాలని ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేవారు. అధికారులు, మంత్రులు అందర్నీ మొహరించారు. అధికారులు చేయకపోతే ముఖ్యమంత్రి మాత్రం ఏం చేస్తారు. అయినప్పటికీ ఓ అధికారిపై వేటు వేశారు. పరిపాలనపై పట్టుకున్న సీఎం చంద్రబాబు.. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యిందని అన్నారంటే వ్యవస్థలు ఏ విధంగా తయారయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా లోపాలు సరిదిద్దుకుని శాసన కర్తలు ఒక్కతాటి మీదకు వస్తే.. ప్రజలు మంచి జరుగుతుంది.. బెజవాడ లాంటి పరిణామాలు తప్పవన్నమాట.