Betting Mafia: ఒకర్ని చూసి మరొకరు. ఈజీ మనీ. ప్రమోషన్ చేసేద్దాం, పైసలు పట్టేద్దాం. ఇదీ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఇన్ ఫ్లూయెన్సర్లు వ్యవహరిస్తున్న తీరు. జనం ఏమైపోతే మాకేంటి.. మాకు డబ్బులొస్తున్నాయి చాలు. మేం సంపాదించుకుంటే చాలు. ఎవరు ఎలా మునిగిపోతే మాకేంటి.. చస్తే మాకేంటి అనుకుంటున్నారు. బ్యాన్ ఉన్న బెట్టింగ్ యాప్ లింక్స్ పంపుతూ, గేమ్స్ ఆడిస్తూ, బెట్టింగ్ పెట్టిస్తూ నిలువునా మునిగిపోయేలా ప్రేరేపిస్తున్నారు. కానీ వీరి డర్టీ గేమ్ ఎన్నో రోజులు సాగదు కదా. అందుకే అందరి ఆట కట్టిస్తున్నారు.
స్కాం అలర్ట్.. అలర్ట్..
ఇన్ ఫ్లూయెన్సర్ల మాయలో పడొద్దు..
సోషల్ మీడియాలో చెప్పేవన్నీ నిజాలు కాదు..
చూపించేదంతా సరైంది కాదు..
ప్రమోటెడ్ వీడియోలు నమ్మొద్దు..
మంచి, చెడుల హద్దుల్ని గుర్తించండి..
ఈజీ మనీ, టైంపాస్ కోసం బెట్టింగ్ జోలికి అసలే వెళ్లకండి
ఇదీ గత కొన్ని రోజులుగా అందరినీ పోలీసులు అలర్ట్ చేస్తూ ఇస్తున్న మెసేజ్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సిచ్యువేషన్ చేయిజారిపోయింది. బెట్టింగ్ యాప్ లతో పరిచయం లేకపోయినా తాము ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ఫాలో అయ్యే వారు చెప్పుడు మాటలు విని జేబులు, ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. కొందరైతే అప్పుల పాలై వాటిని కట్టలేక ప్రాణాలు తీసుకున్నారు. ఇంకొందరైతే అప్పుల ఊబి నుంచి బయటపడలేకపోతున్నారు.
సరదాగా మొదలై, వ్యసనంగా మారి చివరికి బలి
సక్సెస్‌కు, సంపాదనకు షార్ట్ కట్స్ అంటూ ఏవీ లేవు. షార్ట్ కట్స్ లో వెళ్తే చివరకు మిగిలేది కష్టాలు, నష్టాలే. డ్రగ్స్, బెట్టింగ్స్ ఒకదానికొకటి ఇంటర్ లింక్. ఎలా ఉందో చూద్దాం అని ఒక్కసారి ముట్టుకుంటే వదిలి పెట్టవు. వ్యసనంగా మారుతాయి. చివరికి బానిసలుగా చేసుకుంటున్నాయి. ఫైనల్ గా నిండా ముంచేస్తాయి. జీవితాన్ని ఆగం చేస్తాయి. చక్కగా సంపాదించుకునే వారు కూడా చిన్న గేమ్ చిటికెలో ఆడేద్దాం, లక్షలు కోట్లు కొల్లగొడుదాం అనుకుంటున్నారు. చివరికి అన్నీ కోల్పోతున్నారు. ఆ భ్రమల నుంచి బయటపడేసరికి ఏమీ లేకుండా చేసుకుంటున్నారు. ఇదీ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ మాయలో పడిన వారి దుస్థితి.
నిషేధిత లింకులు షేర్ చేస్తూ ఆఫర్ల వల
సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి భరతం పడుతున్నారు పోలీసులు. సబ్ స్క్రైబర్లు ఎక్కువగా ఉంటే చాలు.. ఒకరిని చూసి మరొకరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఎవరు ఎటు మునిగితే మాకేంటి అనుకుంటూ వీడియోలు చేశారు. ఏపీ, తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ పై బ్యాన్ ఉంది. కానీ తమ ఫాలోవర్లను తెలివిగా ట్రాప్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో చేరాలని చెప్పి.. అక్కడ నిషేధిత లింకులు వేస్తూ ఇన్ స్టాల్ చేసి ఆడిస్తూ.. డబ్బులు లేకపోతే మొదటగా ప్రమోషన్ గా కొంత ఇప్పిస్తూ రొంపిలోకి దింపి నిలువుదోపిడీ జరిగిపోయేలా చేస్తున్నారు. ఏదో ఒక రోజు పాపం పండుతుంది కదా.. ఇప్పుడు తెలుగు నాట బెట్టింగ్ యాప్స్ ఇష్యూ హాట్ డిబేట్ గా మారింది.
లేటెస్ట్ గా 11 మంది యూట్యూబర్లపై కేసులు
లేటెస్ట్ గా 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అందరి సోషల్ మీడియా అకౌంట్లు చెకింగ్ నడుస్తోంది. డిలీట్ చేసినా సరే యూట్యూబ్, గూగుల్, ఫేస్ బుక్ కంపెనీలతో మాట్లాడి వాటిని రిట్రైవ్ చేయిస్తారు. ఆధారాలన్నీ సేకరించి చర్యలకు రెడీ అవుతున్నారు పోలీసులు. ఇమ్రాన్ ఖాన్ అనే యూట్యూబర్ ఎథిక్స్ లేని చెత్త వీడియోలు చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల ముసుగులో ఏది చేస్తామన్నా కుదరదు అంటున్నారు. ప్రెజెంట్ కొందరు ఫోన్లు స్విఛాఫ్ చేసుకుని పరారయ్యారు. ఇంకొందరు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. కానీ ఎప్పటికైనా బయటకు రావాల్సిందే కదా.
సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్ పై కేసులు
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై మార్చి 17న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ఓ సిటిజన్ ఇచ్చిన కంప్లైంట్ తో ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై 318(4) BNS, 3, 3(A), TSGA, 66D IT Act-2008 కింద కేసు నమోదు చేశారు. టైమ్ బాగుండో, కష్టపడో, సొంత తెలివితేటలతోనో, క్రియేటివిటీతోనో.. సోషల్ మీడియాలో స్టార్లుగా మారిన వారు దాన్ని మరోలా వాడుకుంటున్నారు. బ్యాన్ ఉందని తెలిసినా లక్షలు, కోట్లు వస్తున్నాయని తెలిసి ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. నిజానికి యూట్యూబ్ లో వల్గర్ కంటెంట్, చిల్డ్రన్ కంటెంట్ పోస్ట్ చేస్తూ రెచ్చిపోతూనే.. సైడ్ బిజినెస్ గా ఇలా బెట్టింగ్ దందాలు చేయిస్తున్నారు.
ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ సంపాదించిన వారు జీరో..
అందరూ తెలుసుకోవాల్సిన సింపుల్ లాజిక్ ఏంటంటే.. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ లో ఆడిన వారెవరూ బిల్డింగులు కట్టలేదు. లగ్జరీ కార్లు కొనలేదు. అందరూ దివాళా తీసిన వారే. ఎందుకంటే యాప్ రన్ చేసే వాళ్ల చేతుల్లోనే మాయాజాలం అంతా ఉంటుంది. వారు మొదట్లో ఇచ్చినట్లే ఇచ్చి బానిస అయ్యారని గుర్తించాక.. అసలు గేమ్ రన్ చేస్తారు. పోవడమే గానీ రావడమంటూ ఉండదు. చేసిన అప్పుల్ని తీర్చేందుకు మళ్లీ మళ్లీ ఆడి మొత్తం జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు యూత్. సో… say no to bettings. బీ అలర్ట్.
మొన్నటిదాకా లోన్ యాప్ లు, ఇప్పుడు బెట్టింగ్ యాప్ లు
మొన్నటిదాకా లోన్ యాప్ లు, వేధింపులు, ఆత్మహత్యలు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ల గొడవ. చిన్నా చితకా ఇన్ ఫ్లూయెన్సర్లే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని అనుకున్నారంతా. కానీ డీప్ గా వెళ్తే డీల్స్ అన్నీ డీకోడ్ అవుతున్నాయి. హీరోయిన్లు, సెలబ్రిటీలు, యూట్యూబ్ స్టార్లు ఒక్కరేమిటి చాలా మందికి బెట్టింగ్ మాఫియా లింకులు తెరపైకి వస్తున్నాయి. అంతా ఇల్లీగల్. అయినా సరే డబ్బులకు కక్కుర్తి పడి.. భయం లేకుండా ప్రమోట్ చేసేశారు. కానీ ఇప్పుడు అందరి మ్యాటర్ బయటికొస్తోంది.
పబ్లిక్ డొమైన్ లో లేని వాటిని వివరించే ప్లాన్
సాధారణంగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కామన పబ్లిక్ కు అందుబాటులో ఉండవు. వాటి పేర్లు కూడా చాలామందికి తెలియవు. ఎక్కడుంటాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నవి పబ్లిక్ డొమైన్ లో ఉండవు. apk ఫైల్స్ రూపంలో, సైబర్ సెక్యూరిటీకి దొరక్కుండా ఫోన్లలోకి చొరబడేలా డీల్ చేస్తుంటారు. ఇవన్నీ ఇల్లీగల్ వ్యవహారాలను అరటిపండు ఒలిచినట్టు చెప్పేది ఈ ఘనత వహించిన సోషల్ మీడియా స్టార్లు, సెలబ్రిటీలే. కొందరు యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు రిలీజ్ చేసే వారు కూడా వీడియోకు ముందు ఇలాంటిదే పిచ్చి యాప్ ను పరిచయం చేసి రొంపిలోకి దింపుతుంటారు.
పెద్ద పెద్ద సెలబ్రిటీల సంగతేంటని నెటిజన్ల ప్రశ్నలు
లేటెస్ట్ గా 11 మంది యూట్యూబర్లపై క్రిమినల్ కేసులైతే నమోదయ్యాయి. మరి వీరితో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీల సంగతేంటి? వారి ఆట కూడా కట్టిస్తారా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో దగ్గుబాటి రానా – ప్రకాష్ రాజ్ కలిసి ఆన్ లైన్ రమ్మీ యాడ్ లో నటించారు. ఈ యాడ్ ద్వారా ఈ ఇద్దరూ గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహిస్తున్నారని కోయంబత్తూర్ కు చెందిన ఓ సామాజిక కార్యకర్త కేసు వేశాడు. అంతే కాదు అప్పట్లో ఈ ఇద్దరి తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ తో మరోసారి విమర్శలు పెరుగుతున్నాయి.
మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ ప్రమోషన్స్ పై దుమారం
వీళ్లే కాదు గతంలో మంచు లక్ష్మి, హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ఇష్యూస్ తెరపైకి వస్తున్నాయి. వారందరిపైనా చర్యలు తీసుకోవాల్సిందే అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో యాంకర్ శ్యామల కూడా ఉండడంతో ఆమెను అధికార ప్రతినిధి పోస్ట్ నుంచి వైసీపీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు జనసేన నేత కిరణ్ రాయల్.
ఫోన్లు స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి సోషల్ స్టార్లు
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ పుట్ట పగలడంతో చాలా మంది ఫోన్లు స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంకొందరైతే.. తమకు తెలియకుండా చేశాం.. క్షమించాలంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇంకొందరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసినా చేయలేదని ఇంకా బుకాయించే పరిస్థితిలో ఉన్నారు.
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఫేక్ ప్రమోషన్ చేసిన వారున్నారు. సక్సెస్ స్టోరీలంటూ కబుర్లు చెప్పిన వాళ్లున్నారు. లింకులు ఇచ్చి జాయిన్ అవ్వాలంటారు. ఫేక్ ప్రామిస్ లు కూడా చేస్తుంటారు. డబ్బులు గ్యారెంటీ నాది పూచీ అంటారు. సో ఇవన్నీ బెట్టింగ్ రొంపిలోకి దింపడమే. కేవలం మాటతో చెప్పకుండా అన్నీ ఫేక్ ప్రచారాలతో జనం నిండా మునిగేలా చేసిన వారెందరో. ఇప్పుడు వారందరి భరతం పట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మోసపోయిన వారు, సామాజిక కార్యకర్తలు చాలా మంది కంప్లైంట్లు కూడా చేస్తున్నారు.
బెట్టింగ్, గేమింగ్ కంపెనీలకు సైబర్ సెక్యూరిటీ నోటీసులు
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ ఇన్ ఫ్లూయెన్సర్లది ఒక తప్పైతే.. ఈ గేమింగ్ ను నడిపిస్తున్న వారిది మరో ఇష్యూ. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణలో బ్యాన్ ఉన్నప్పటికీ ఆయా వెబ్‌సైట్ల వినియోగానికి ఇక్కడి ప్రజలను ఎలా అనుమతిస్తున్నారంటూ సంబంధిత వెబ్‌సైట్ల నిర్వాహకులు, ఇంటర్నెట్ ప్రొవైడర్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇటీవలే నిలదీసింది. పలు బెట్టింగ్, గేమింగ్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో నమోదైన ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు, లోకల్ బ్యాంకు ఖాతా ఉన్న వ్యక్తులకు నిషేధిత గేమింగ్ సైట్లలో లాగిన్ అయ్యేందుకు అవకాశం ఎందుకిస్తున్నారని ప్రశ్నలు సంధించారు.
గేమింగ్ సంస్థలు జియో ఫెన్సింగ్ పాటించాల్సిందే..
ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్, పలు గేమింగ్ కంపెనీల సీఈఓలు, ఇంటర్నెట్ సర్వీసు ప్రోవైడర్లు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం ప్రతినిధులతో ఇటీవలే మీటింగ్ కూడా పెట్టి స్ట్రిక్ట్ గా చెప్పేశారు. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌కు బానిసలై పలువురు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. గేమింగ్ సంస్థలు జియో ఫెన్సింగ్ పాటించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నిషేధిత గేమింగ్ యాప్‌ల్లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిపై 1930కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పిలుపునిచ్చింది.