Telangana BJP: తెలంగాణ బీజేపీలో రగడ రచ్చకెక్కుతోందా..? సంస్థాగత ఎన్నికల్లో అడ్డగోలుగా జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం జరిగిందా..? 38 జిల్లాలు ఒకేసారి అధ్యక్షులను ప్రకటిస్తామని ప్రచారం చేసుకున్న బీజేపీ, కేవలం 19 జిల్లాకు మాత్రమే ఎందుకు పరిమితం అయ్యింది..? అన్ని జిల్లాలకు ఒకేసారి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాక 19 జిల్లాలను పెండింగ్ పెట్టడం వెనక లోగుట్టు ఏంటి..? అసలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో ఎందుకు అంత జాప్యం జరుగుతోంది?
అంతన్నారు, ఇంతన్నారు. ఇదిగో అధ్యక్షుడు, అదిగో అధిష్టానం, ఇదిగో ప్రకటన, అదిగో అనౌన్స్ మెంట్ అంటూ ఊడరగొట్టారు తీరా చూస్తే తుస్ మనిపించారు. రాష్ట్రంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికలో ఫర్వాలేదు అనిపించినా, అసెంబ్లీ పర్వంలో మాత్రం బొక్క బోర్లపడింది. ఇక ఆ ఎన్నికల పర్వం తరువాత బీజేపీ సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకుంటోంది. గత ఐదు మాసాల నుంచి సంస్థాగతంగా పోలింగ్ బూత్ నుంచి మండల, జిల్లా, రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తోంది.
నాన్చుడు ధోరణితో పార్టీ శ్రేణుల్లో, ఆశవాహుల్లో అధ్యక్షుల పదవులపై ఉత్కంఠ రేపుతూ వచ్చిన కాషాయ పార్టీ.. ఎట్టకేలకు జిల్లా అధ్యక్షులను ప్రకటించింది, బీజేపీ చెప్పుకుంటున్న 38 జిల్లాలకు ఒకేసారి అధ్యక్షులను ప్రకటించి, పార్టీ శ్రేణుల్లో, నేతల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతుందని అందరు అనుకున్నారు . కానీ అందుకు భిన్నంగా 19 జిల్లాకు మాత్రమే అధ్యక్షులను ప్రకటించి మరో 19 జిల్లాలను పెండింగ్ పెట్టడంపై అసహనాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలో మొత్తం 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించి, మిగతా 19 జిల్లాల అధ్యక్షుల నియామకాన్ని పెండింగ్ లో పెట్టడంతో అధ్యక్షుల నియామకంపై బీజేపీలో రగడ రాజుకుంది. పార్టీలో అసంతృప్తి రాగాలు పీక్ స్టేజికి చేరుకున్నాయి. పాత, కొత్త నేతల మధ్య కిరికిరి బీజేపీ రాష్ట్ర కార్యాలయం మెట్లు నాంపల్లి క్రాస్ రోడ్డుకు చేరుకున్నాయి. పదవి ఆశించి దక్కని వారు నిరాశలో, పదవి దక్కిన వారు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి కాకుండా అడ్డగోలుగా నియామకం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్ష ఎంపిక విషయంలో అన్ని అర్హతలు తమకు ఉన్నా.. అధిష్టానం ఏ ఈక్వేషన్లను క్రైటీరియాగా తీసుకుందో అంతుపట్టడం లేదని ఆశావహులు మండిపడుతున్నారు.
తొలుత ఏకాభిప్రాయం కుదిరిన 27 జిల్లాలను ప్రకటిస్తామని చెప్పిన నాయకత్వం, 19 జిల్లాలను ప్రకటించి మరో 19 జిల్లాలను పెండింగ్ లో పెట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతా ఫైనల్ అని ఫిక్స్ చేసుకున్నాక ప్రకటన చేయకుండా పెండింగ్ పెట్టడం వెనుక మతలబేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దానికి సంబంధించిన కారణాలపై పలువురు ఆశావహులు ఆరా తీస్తూ, మంతనాలు జరుపుకుంటున్నారు. ఎవరైనా కావాలనే అడ్డుకట్ట వేశారా..? అనే చర్చ జరుగుతోంది.
జిల్లా అధ్యక్షుల పేర్లను ఏ జిల్లాకు ఆ జిల్లా ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి పేరిట అనౌన్స్ చేశారు. నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, నల్లగొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజిగిరి సెగ్మెంట్లలో పాటు సెంట్రల్ హైదరాబాద్ జిల్లాల అధ్యక్షుల ఎంపికపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంలో సీనియర్ నేతలంతా ఒక్కటైనట్లు తెలుస్తోంది. వారంతా రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి వ్యతిరేకత ఎదురవుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అంతే కాదు పలు జిల్లాల పార్టీ శ్రేణులు రాష్ట్ర కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. మరికొన్ని జిల్లాల్లో పదవులు దక్కని వారంతా మూటాముల్లె సర్దుకుని పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: ఓటమి భయమా? చీకటి ఒప్పందమా? ఎమ్మెల్సీ బరికి బీఆర్ఎస్ బై బై!
కొందరు నేతల ప్రోద్బలంతో 19 జిల్లాల ప్రెసిడెంట్ల నియామకాన్ని పెండింగ్ పెట్టారన్న టాక్ వినిపిస్తుంది దీని వెనుక చక్రం తిప్పిందెవరనే అంశంపై ఆశావహులు కూపీ లాగా పనిలో పడ్డారంట. ఫైనల్ అయ్యాక కూడా పెండింగ్ పెట్టడంపై రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు మహిళా బిల్లును అమలు చేశామని కాషాయ పార్టీ గొప్పలు చెప్పుకుంటోంది. బీజేపీలో మహిళలకు ప్రాధాన్యమిస్తామని, పార్టీ పదవుల్లోనూ 33 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రగల్భాలు పలికిన కమలనాథులు తొలి విడుతలో ప్రకటించిన 19 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా మహిళకు ఇవ్వకపోవడం గమనార్హం. గత టర్మ్ లో నలుగురు మహిళలు ఉండగా.. ఈసారి ప్రకటించిన 19 జిల్లాల్లో ఒక్కరు లేకపోవడంపై ఆ పార్టీ మహిళా నేతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మిగిలిన 19 జిల్లాల్లో అయినా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తారా..? లేదా..? అన్నది సస్పెన్స్ గా మారింది.
మొత్తం మీద తెలంగాణలో 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించి, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు అర్హత సాధించినట్లయిందని చెప్పుకుంటున్న కమలదళం.. ప్రకటించిన అధ్యక్షుల్లో ఒక్క మహిళా కూడా లేకపోవడం, రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న యాదవ్ సామాజికవర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం తీవ్ర విమర్శల పాలవుతోంది. మరి ఈ విమర్శలకు పార్టీ పెద్దలు ఎలా సమాధానం చెప్తారో చూడాలి.